తెలంగాణ సంఘర్షణ పతాక కదిరె కృష్ణ కవిత్వం

తెలంగాణ సంఘర్షణ పతాక కదిరె కృష్ణ కవిత్వం
తెలంగాణ సంఘర్షణ పతాక కదిరె కృష్ణ కవిత్వం

-డా//దార్ల వెంకటేశ్వరరావు



తెలంగాణా ప్రాంతం వెనుకబడిందా? తెలంగాణా ప్రజలు వెనుకబడి ఉన్నారా? తెలంగాణా ప్రజల్నివెనక్కి నెట్టి వేశారా? అనే ప్రశ్నలు వేసుకుంటే అనేక రాజకీయ కారణాల వల్ల తెలంగాణా ప్రాంతం వెనకబడి పోయిందని ఆ చారిత్రక ఆధారాలు ఎన్నో వివరిస్తున్నాయి. నిజాం పాలన దానికొక కారణంగా చాలా మంది చెప్తున్నారు. తెలంగాణాలోని అత్యధికులు, కింది వర్గాలకు చెందిన ప్రజలు ఆర్ధికంగా వెనుకబడ్డారు. వెట్టితో నలిగిపోయారు. పోరాటాలు చేసి చేసి అలసి పోయారని చెప్పలేం గానీ, మరింత రాటుదేలారు. లేకపోతే ప్రపంచంలో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అని పిలిచే 1857 నాటి తిరుగుబాటు, తర్వాత అంత శక్తివంతమైన పోరాటం తెలంగాణాలోనే జరిగిందని విమర్శకులు వ్యాఖ్యానిస్తారా? కనుక ప్రజలు 'పోరాటం' చేయడంలో వెనుకబడి లేరు. వెనక్కి నెట్టబడుతున్నారు. పోరాటాల్ని నిజంగా' గుర్తించని వాళ్ళు పాలకులుగా చెలామణి అవుతున్నారు. అందుకనే ఒకప్పుడు వెట్టి నిర్మూలన నిరంకుశ పాలనను వ్యతిరేకించి సాయుధ పోరాటం చేసి అనేక మంది ప్రాణాల్ని త్యాగం చేసి, విశాలాంధ్ర పేరుతో మళ్ళీ మోసపోతుంటే అది మోసమని ఘోషిస్తుంటే పోరాడుతుంటే ఆ పోరాటాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు నేటి పాలక వర్గమనీ చాలామంది భావిస్తున్నారు. పాలకులు ప్రత్యేక తెలంగాణ ఇవ్వకుండా రక రకాల సాకుతో కాలాన్ని వెళ్ళదీస్తున్నారు. వీటన్నింటిని తెలంగాణా ప్రాంతం మీద అభిమానం, అవగాహన, చైతన్యం ఉన్న కవులు, రచయితలు తమ రచనల్లో రాస్తూనే ఉన్నారు. అలా వచ్చినదే కదిరె కృష్ణ కవిత్వం''బలగం"
మాతృత్వం పైన, మాతృ భూమి పైన మమకారంతో కవిత్వం రాస్తున్నాడు కదిరె కృష్ణ. మత కల్లోలాపై ఆగ్రహం, ఆ కల్లోలాల వెనుక బలైపోయే దళితుల పట్ల ప్రేమ అతని కవిత్వంలో ఉంది. ప్రపంచీకరణ ప్రభావంతో అన్నీ మారుతున్న 'కులం' మాత్రం మాసిపోవడం లేదనే ఆవేదన ఉంది. తెలంగాణ ప్రాంతంలో దళితులు జీవించటమే కష్టమైన పరిస్థితుల్లో, ఒక దళిత మహిళ, అందులోనూ ఒక మాదిగ మహిళ దేశ రాజకీయాల్లో కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాడం అసమాన్యమని కీర్తిస్తాడు. దళితుల్లోని అంతర్వివక్షనూ ప్రశ్నిస్తూనే మాదిగల గొప్పతనాన్ని వెల్లడిస్తాడు. స్త్రీలను గౌరవిస్తామంటూనే, ఫ్యాషన్స్‌ పేరుతో జరుగుతున్నవ్యాపారం, వ్యభిచారం కూపంలోకి దింపేస్తున్న ఆడపిల్లల్ని చూసి కవి చలించిపోతాడు. ప్రత్యేక తెలంగాణ పట్ల మాదిగల దృక్పథంగా తన అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా వివరిస్తున్నాడు. మాదిగల్ని చైతన్య పరిచే సాహిత్యం సృష్టించిన కవుల్ని, కళాకారుల్ని ఉత్తేజ పరుస్తున్నాడు. ఇవన్నీ కదిరె కృష్ణ రాసిన 'బలగం'(2007) కవితా సంపుటిలో బలంగా కనిపించే సమకాలీన సమాజం సంఘర్షణాత్మక కవితా చిత్రాలు.
ప్రపంచీకరణ ప్రభావం వల్ల గ్రామీణ సంస్కృతిలో వచ్చిన మార్పుల్ని వర్ణిస్తూ ........., "పట్ట పగలే/పల్లెనెవడో దోచుకుంటున్నాడు/నిర్భీతిగా/పొట్టలో తలదూర్చి/ నెత్తురు జుర్రేస్తున్నాడు/ గ్లోబల్ దొంగ / రంగు రంగుల ఛానళ్ళ కులాల దొంగ /మళ్ళీ సమధుల్లోకే పయనం..../................................./కళకళలాడిన పల్లె / కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్న / "క్రౌంచ మిధునం"...... (బలగం, 2007 : 2) అనడంలో వలసలు పోతున్న జీవితాల్లో చెలరేగే సంఘర్షణను కవిత్వీకరిస్తున్నాడు కవి. ప్రేమానురాగాలతో కలిసి మెలిసి జీవించనివ్వని వలసల్ని, భార్యా భర్తల మధ్య అనివార్యమవుతున్న వియోగాన్ని "క్రౌంచ మిధునం" అనే భావం చేత కవిత్వీకరించాడు. వాల్మీక రామాయణం రావడానికి శోకం నుండి శ్లోకం అప్రయత్నంగా పుట్టడం కారణమని ఒక కథ ప్రచారంలో ఉంది. క్రౌంచ పక్షుల జంటను ఒక బోయ వాడు కొడితే, దానిలోని ఒక పక్షికి బాణం తగిలి, అది నేలపై పడి విలవిలలాడుతూ ప్రాణం విడుస్తుంది. తనకు దూరమైన పోతున్న పక్షి చుట్టూ తిరుగుతూ మరో పక్షి విలవిలలాడిపోతుంది. అలా గ్రామం వలసలతో భార్యాభర్తలు విడిచి ఉండలేక, విడవకపోతే బతకలేక మనోవ్యధకు గురవతన్నారని వర్ణిస్తున్నాడు కవి.
నాగప్పగారి సుందర్రాజు మరణించిన తర్వాత చాలా మంది స్మృతి కవితల్ని రాశారు. కదిరె కృష్ణ, నాగప్పగారి సుందర్రాజు పేరుతో సంభాషణాత్మక శిల్పంతో కవిత రాశాడు. చనిపోయిన సుందర్రాజుతో మాట్లాడుతున్నట్లు రాశాడు కవి. సుందర్రాజు స్థాపించిన "మాదిగ సాహిత్య వేదిక" ఆగిపోయినా, ఆ స్పూర్తితో మాదిగ కళాకారుల వేదికను కొనసాగిస్తున్నట్లు చెప్తాడు కవి. ఆ స్పూర్తి కొనసాగుతుండడం వల్లనే నగర వీధుల్లో డప్పులతో మాదిగలు తమ సంస్కృతిని విస్తరిస్తున్నారంటాడు కవి. ఈ కవితలో మూడు అంశాలున్నాయి.
1. వర్గీకరణ విషయాన్ని కోర్టు కొట్టేయడంతో మాల వర్గానికి చెందిన వారంతా సంతోషంగా ఉన్నారు.
2. అయినా వర్గీకరణ సాధన కోసం, దానితో పాటు మాదిగ చరిత్ర, సంస్కృతులను కొనసాగించే సంస్థలు కొత్త కొత్తగా పుడుతూనే ఉన్నాయని, మాదిగ చైతన్యం కొనసాగుతుందనే హామీ కనిపిస్తుంది.
3. దళిత, మాదిగల భావజాలాన్ని నిరంతరం ప్రశ్నించుకోవటం కూడా జరుగుతుందనే విషయాన్ని, సుందర్రాజుతో అక్కడి విషయాల్ని తెలుసుకోవడంలో వర్ణించగలిగాడు. బ్రహ్మ, విష్ణు, రంభ, ఊర్వశిలనే హిందూ భావజాలంలో కనిపించే స్వర్గ నరకాలేవి లేవనీ, అవన్నీ అభూతకల్పనలనే భౌతికవాదిగా సుందర్రాజు భావజాలాన్ని వివరించగలిగాడు కదిరె కృష్ణ. ఆ కవితలోని కొంత భాగాన్ని కింద పరిశీలించవచ్చు…
"ఏం బ్రదర్! సోదరులు రెచ్చిపోతుండ్రంట!"/ …………..
…………… "మాదిగ చైతన్య వేదికను/మజ్జెల్నే ఆపిండ్రంటా!/ "అయితేందన్నా…!/మాదిగ కవుల కళాకారుల వేదిక /బెట్నెం!/'డప్పుల మోత'తో దద్దరిల్లుతోంది పట్నం" (బలగం: 2007 : 12)
ఈ కవితా ఖండికల్లో శిల్ప వైవిధ్యాన్ని ప్రదర్శించగలిగాడు.
స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్ళు దాటుతున్నా, ప్రజాస్వామ్య దేశంలో అందరికీ హక్కులున్నా, వాటిని అందుకోలేని వాళ్ళలో దళితులే ముందున్నారు. ఈ విషయాన్ని వర్ణిస్తూ కవి…
"కలకటేరు బాబు కారుకు వేలాడుతున్న /మూడు రంగుల జెండా సాక్షిగా/ఆ బావి నీళ్ళు తోడడానికి అనర్హుడనని
ఊరు ఊరంతా గర్జిస్తే, పాలిపోయిన మొఖం వేసుకొని /మాటలొచ్చిన మూగదయ్యింది రాజ్యాంగం" (బలగం: 2007 : 18) అని చెప్పడంలో 'రాజ్యాంగం' హక్కులిస్తున్నా, వాటినింకా ఎంతోమంది దళితులు అందుకోలేక పోతున్నారనే సత్యాన్ని చెప్పాడు.
బంద్, సమ్మెలు వంటివేమి జరిగినా నష్టపోయేది దళితులేనని చెప్తూ కవి…
"అప్పుడప్పుడు /నగరం చిందులేస్తుంది/ఎలక్షన్ల సొల్లు మత్తు మత్తుగా చిత్తు చిత్తుగా తాగి /నలుగురు దళితుల్ని మింగి /ప్రశాంతంగా /హాయిగా త్రేనుస్తుంది/
………../దీని కడుపులో మనువు రాచపుండు " (బలగం: 2007 : 18) ఉందనీ, దాన్ని ఆపరేషన్‌ చేయడానికి దళితులంతా 'వైద్యులై' కదలవలసిన అవసరం ఉందంటాడు. బంద్, సమ్మెల వంటివి జరిగేటప్పుడు దళితులెంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరిస్తున్నాడు కవి.
మాదిగవాడిగా కుంగిపోకుండా, ఆ కులంలో ఉంటూనే ఆత్మగౌరవాన్ని ప్రకటిస్తున్న మంచి కవిత "నే నెవరో చెప్తుంది…"
"ఏవడ్రా ననుమించిన / ఇంజనీరు/ ఏదిరా నా చెప్పుల్ని మించిన/ మిషనేరు/ గూటం నా కుల గురువు/తంగేడు చెట్టు నా కల్పవృక్షం/కత్తికి కదనం నేర్పినోన్ని/ నెత్తుటి ముద్దలతో/దేశం సరిహద్దులు గీసినోన్ని/ మాదిగోన్ని" (బలగం: 2007 : 56)
మాదిగల కులవృత్తి, ఆ సాధనాలు, ఆ పనితనం, ఆ నైపుణ్యం వంటివన్ని ఈ కవితలో చెప్పటంలో ఆత్మగౌరవాన్ని వ్యక్తీకరిస్తున్నాడు కవి. వాటితోనే జీవితాంతం కొనసాగిస్తానని ఎక్కడా ప్రకటించలేదు. వృత్తులకన్నింటికీ గౌరవం కల్పించాలనే డిమాండ్ కనిపిస్తుంది. సమాజానికి మాదిగలు చేస్తున్న కృషిని గుర్తించమనే, కొందరి సేవనే గొప్పగా గుర్తించడం సరికాదనీ వివరిస్తున్నాడు కవి.
అన్నీ మారుతున్నా, 'కులం' మాత్రం పోవట్లేదని చెప్తూ "దీని దినం జెయ్య!" అనే కవితను రాశాడు కవి కదిరె కృష్ణ.
డొంకదారి, రేల పూత బంగారంలా మెరుస్తుంది. గ్రామాల్లో ల్యాండ్ ఫోన్స్‌ స్థానంలో సెల్‌ఫోన్స్‌, ఫోర్టబుల్ స్థానంలో ప్లాస్మా టీ.వీ.లు వస్తున్నాయి. ప్రత్యక్ష ప్రసారాలతో అన్ని సెకన్ల కాలంలో తెలిసిపోతున్నాయి. వైద్య రంగంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి.
"ఇరవై నాల్గు గంటల ప్రసారం/గుండు సూదుల్తో పెద్దాపరేషన్‌..." అన్నీ జరుగుతున్నాయి.
"మంచిదే! అన్ని మారినైగాని/మా ఊళ్ళె.../కులం మాత్రం/ మారలె.../దీని దినంజెయ్య! (బలగం: 2007 : 66)
ప్రపంచీకరణ ప్రభావంతో అన్ని మారుతున్నా కులం మాత్రం మారడంలేదనేది అనుభవ సత్యంగా చెప్తున్నాడు కవి.
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం ఈ ప్రాంత ప్రజలంతా పోరాడుతున్నారని చెప్తూ నైజాము నవాబుల్ని మట్టి కరిపించిన వీరుల్ని స్మరిస్తాడు కవి. సమకాలీన నాయకుల మీసాల్ని గుర్తిస్తున్నామంటాడు. మాదిగలు కూడా తెలంగాణా పోరాటాన్ని సమర్ధిస్తున్నారంటూ...
"డప్పు గూడ మోగుతున్నది / కన కన /రావాలని తెలంగాణ" (బలగం: 2007 : 71) అని ప్రకటించాడు కవి.తెలంగాణా కవులు అత్యధికులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరుకుంటున్నారు. ఈ ప్రాంత దళిత కవులూ అలాగే కోరుకుంటున్నా, వారికవిత్వంలో కుల నిర్మూలన కావాలనే ఆకాంక్ష బలంగా కనిపిస్తుంది. సమకాలీన సమస్యల్ని శక్తి వంతంగా కవిత్వీకరిస్త్నున్న కదిరె కృష్ణను అభినందించవలసిందే!

No comments: