కుల దురహంకార హత్యలు


రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలూ, అమానుషాలూ, దాడులూ, దౌర్జన్యాలూ ప్రతి ఒక్కరి మనసునూ కదిలించేలా వున్నాయి. కారణాలు-కాలాలు, ప్రాంతాలు-పాత్రలు వేరైనా ఈ దారుణ దృశ్యాలన్నిట్లోను బాలికలు, మహిళలే సమిధలు కావడం విషాదం. పురుష దురహంకారము, కుల క్రౌర్యమూ వేయి చేతులు చాచి అమాయక మహిళలను బలితీసుకోవడం నవ నాగరిక సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన చర్య. ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఖండనలకు, ప్రకటనలకు మాత్రమే పరిమితం కావడం బాధ్యతారాహిత్యానికి, రాజకీయ చిత్తశుద్ధి లేమికి నిదర్శనం మినహా మరోటి కాదు. అపురూపంగా చూసుకోవాల్సిన ఆడపిల్లలు, మహిళల ప్రాణాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, పురుషాహంకారానికి, కుల దురహంకారానికి గాల్లో దీపాల్లా కొండెక్కిపోతున్నాయి. సర్కారు వైద్యుల నిర్లక్ష్యమూ, అత్యవసర ఔషధాలను అందుబాటులో వుంచాల్సిన ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమూ ర్యాబిస్‌ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అనూష ప్రాణాలను బలిగొంది. 'కాపాడలేవా అమ్మా' అన్నట్టు తననే దీనంగా చూస్తూ కానరాని లోకాలకు వెళ్లిపోయిన కూతురును మరవలేని ఆ నిరుపేద తల్లి ఆవేదన అర్థమయ్యేదెందరికి? తననే ప్రేమించాలని, పెళ్లాడాలని వేధించి, నిరాకరించిన పాపానికి పాఠశాల ఉపాధ్యాయిని సుందరమ్మ ప్రాణాలు తీశాడో విశాఖ మృగాడు. ప్రేమించడానికి అవసరం లేని కట్నం పెళ్లి చేసుకోడానికి మాత్రం తప్పనిసరట! ఇదెక్కడి న్యాయమని అడిగితే కట్నమే పరిష్కారమని తెగేసి చెప్పాడో ఆదిలాబాదీ. నాడు తియ్యతియ్యటి ప్రేమ పాఠాలు వల్లించి వలలో వేసుకుని నేడు తిరస్కరణ అస్త్రాన్ని సంధించేసరికి తట్టుకోలేక ఆరిపోయిందో అమాయక జ్యోతి. చట్టాన్ని, న్యాయాన్ని అనుక్షణం కాపాడాల్సిన కానిస్టేబులే ప్రేమ పేర వంచించి మరో యువతిని పెళ్లాడాడు. పెద్దల ఆశీస్సులతో అతగాడి జీవితం సెటిలై పోయినా...సూటిపోటి మాటలతో కాకుల్లా పొడుచుకుతినే లోకుల మధ్య ఒంటరైంది మాత్రం ఒక మహిళే. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న యువతకు ముఖ్యంగా మహిళలకు ఎదురయ్యే కష్టనష్టాలు, చేదు అనుభవాలు ఎన్నెన్నో?! తక్కువ కులాల వారిని పెళ్లాడిన అమ్మాయిలకు మన రాష్ట్రంలోనూ ఈ భూమ్మీద నూకలు చెల్లిపోతున్నాయి. కని, పెంచి, పెద్దచేసిన అమ్మానాన్నలే కుటుంబ గౌరవం పేరిట యమకింకరుల అవతారమెత్తి ప్రాణాలు హరించడం కలవరపెడుతోంది. మహబూబ్‌నగర్‌ మాధవి, శ్రీకాకుళం లల్లి చేసిన నేరమల్లా దళిత యువకులను ప్రేమించడమే. నిర్దయగా కన్నవారే వారిద్దరినీ కాటికి సాగనంపేశారు. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడాన్ని పరువు తక్కువగా భావించిన ఓ తండ్రి ఏకంగా గోదావరిలో దూకి ప్రాణాలు తీసుకోవడం వంటి దృశ్యాలు నోట మాట రాకుండా చేస్తున్నాయి. సామాజిక అసహనం ఇప్పటికే మన రాష్ట్రంలో ఎంతలా విభ్రాంతి కలిగించే స్థాయిలో వుందో తెలుస్తోంది. ఇక్కడ కూడా మొదటగా బలవుతోంది మహిళలే.
పరువు పేరిట కుల దురహంకారంతో మహిళలను మట్టి చేసే సంస్కృతి ఉత్తరాదికే పరిమితమని ఎవరైనా భావిస్తుంటే ఈ దారుణ ఉదంతాలు వారికి కనువిప్పు కల్గించాలి. ఉత్తరాది రాష్ట్రాల్లో పరువుహత్యలపై జరిగే క్రతువును ఖండించడానికి ప్రజాప్రతినిధులు సైతం ముందుకు రారు. ఓట్లకోసం చూసీచూడనట్టు నటిస్తుంటారు. మన రాష్ట్రంలో ఈ విషయంలో ఏవైనా భిన్న పరిస్థితులున్నాయా? అని ప్రశ్నించుకుంటే ఒళ్లు గగుర్పొడిచే సమాధానమే లభిస్తుంది. మహిళాసంఘాలు, అభ్యుదయకాముక శక్తులు అరచిగీపెట్టినా, పార్లమెంటులో చర్చ లేవదీసినా ప్రయోజనం స్వల్పం. వామపక్షాలు మరీ ముఖ్యంగా సిపిఎం మినహా మరెవరూ ఈ సమస్య పరిష్కారానికి, చర్చకు, చట్టరూపకల్పనకు కదలలా! కంఠం విప్పలా! ప్రస్తుతం కుల రాజకీయాలు క్రియాశీలమౌతున్న మన రాష్ట్రంలో కులదురహంకార హత్యలు పెరిగిపోతున్నాయి. కులాంతర వివాహాలకు యువతీ యువకులు ముందుకు రావడం సంతోషకరం. అయితే అలాంటి పెళ్లిళ్లు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నిలదొక్కు కోవాలంటే దళితులు, ఇతర కిందికులాల ఆర్థిక స్థితిలోనూ మార్పు రావాలి. ప్రభుత్వాలు ఇందుకు పూనుకోవాలి. పూనుకొనేలా చేసే ఉద్యమాలు రావాలి. కుల దురహంకారంతో జరిగే హత్యలను హానర్‌ కిల్లింగ్స్‌గా ఇంగ్లీషు మీడియా అభివర్ణించడం కూడా విస్మయం కలిగించేదే. తెలుగులో కిల్లింగ్‌ను హత్యగా పేర్కొనడం సముచితమే. అయితే దురహంకారాన్ని పరువుగా పేర్కొనడ మెందుకన్నది ఓ ప్రశ్న. పరువుప్రతిష్టలే ప్రాణంగా భావించిన తల్లిదండ్రులు తమ పిల్లలు తక్కువ కులం వారిని వివాహమాడ్డాన్ని తట్టుకోలేక బలితీసుకున్నట్టు అభివర్ణించే ధోరణి నిస్సందేహంగా తప్పుడు ధోరణే. కులదురహంకారంతో జరిగే హత్యలను అరికట్టడంపై మన ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించాలి. ఈ హత్యాకాండలో పాల్పడినవారికి కఠినశిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి