ఢిల్లీ, మార్చి 8 : మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో నెలకు కనీసం రూ.100 చొప్పున కూడా కేటాయించలేదని టీడీపీ ఎంపీ గుండు సుధారాణి విమర్శించారు. మంగళవారం రాజ్యసభలో ఆమె మహిళా సాధికారతపై మాట్లాడారు. బడ్జెట్‌లో మహిళలకు రూ.67,749 కోట్లు కేటాయించారని, మహిళా జనాభా ప్రకారం ఈ మొత్తం ఒక్కొక్కరికీ రూ.1190 కేటాయించినట్లయిందని చెప్పారు. అంటే కనీసం నెలకు రూ.100 కూడా లేదన్నారు. దీనిని నెలకు ఒక్కో మహిళలకు రూ.3 వేలు ఉండేలా చూడాలన్నారు. మహిళా సాధికారతకు పది సూచనలు చేశారు.
రైల్వే బడ్జెట్‌పై తొలి ప్రసంగం
రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికైన తర్వాత గుండు సుధారాణి మంగళవారం తొలి ప్రసంగం చేశారు. తనకు ఎంపీగా అవకాశం కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ఎమ్మెల్యేలు, వరంగల్ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా వెనకబడ్డ తెలంగాణకు రాబోయే రైల్వే బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
వరంగల్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల రద్దీ పెరిగినందున రాకపోకలకు మరో రెండు మార్గాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఖాజీపేటను ప్రత్యేక రీజియన్‌గా గుర్తించాలని, కరిమాబాద్‌లో రైల్ ఓవర్ బ్రిడ్జిని, శివానగర్‌లో రైల్ అండ్ బ్రిడ్జిలను నిర్మించాలని సుధారాణి కోరారు.