ప్రజాస్వామ్యం పరిఢవిల్లాల్సిన రాష్ట్ర శాసనసభ దౌర్జన్యాలకు, భౌతిక దాడులకు, దొమ్మీలకు వేదిక కావడం ఆందోళనకరం. సంయుక్త అసెంబ్లీలో గవర్నర్‌కు అవమానం, శాసనసభ ఆవరణలో ఎమ్మెల్యేపై దాడి ఘటనలు మరవక ముందే సోమవారం ఒక మంత్రి నిండు శాసనసభలో ప్రతిపక్ష సభ్యులపై చేయి చేసుకోవడం గర్హనీయం. ఈ దుర్మార్గాన్ని ఖండించడానికి మాటలు చాలవు. వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అమాంతం టిడిపి సభ్యుల వద్దకు దూసుకెళ్లి వారి చేతుల్లోని ప్లకార్డులను చించిపారేసి ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి చేశారు. మీసం మెలేసి తొడగొట్టారు. టిడిపి సభ్యులపై తిట్ల దండకం ఎత్తుకున్నారు. పరుష పదజాలంతో వీరంగం వేశారు. సభలో రౌడీయిజం చేసిన వివేకాను మంత్రి, ఎమ్మెల్సీ పదవుల నుండి బర్తరఫ్ చేయాలంటూ ప్రతిపక్షాల నుండి నిరసనలు మిన్నంటడంతో విధిలేక ప్రభుత్వం దిగొచ్చింది. నా ఆవేశానికి మన్నించండి అంటూ రాతపూర్వక ప్రకటనను వివేకా చదవాల్సి వచ్చింది. మంత్రే దౌర్జన్యం చేయడంతో విధిలేక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం క్షమాపణ చెప్పారు. వివేకా 'ప్రాయశ్చిత్త' ప్రకటనపై టిడిపి అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఉపసభాపతి సమక్షంలో జరిగిన ఫ్లోర్ లీడర్ల సమావేశంలో అధికార, ప్రతిపక్షాల మధ్య పరస్పర అంగీకారం మేరకు వివేకా ప్రకటనతో సమస్య సద్దుమణిగింది. ఇప్పటికి సమస్య సమసిపోయినట్లు కనబడినా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న, చట్టసభలను తమ దౌర్జన్యాలకు వేదికలుగా చేసుకుంటున్న ప్రజా ప్రతినిధుల ప్రవర్తనను చూసి ప్రతి ప్రజాతంత్ర వాదీ తలదించుకోవాల్సి వస్తోంది. ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలు, ప్రజోపయోగ శాసనాలు చేయాల్సిన సభలో ఇలాంటి వికృత చేష్టలకు అధికార పక్షమే దిగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. చట్ట సభలంటే ప్రజల్లో విశ్వాసం క్రమంగా అంతరించిపోతోంది. సభల పరువు అడుగంటుతోంది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుండి ఏ రోజు ఏం జరుగుతుందో గుండెలదిమి పట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికే చట్టసభలన్నా, నేతలన్నా, ప్రజాస్వామ్యమన్నా, ఎన్నికలన్నా ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఏహ్యాభావం అలముకుంటోంది. తమ గురించి ఆలోచించని వారికి ఓట్లెందుకు వేయాలన్న ప్రశ్నలు ప్రజల నుండి వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో చట్ట సభల్లో జరుగుతున్న విపత్కర సంఘటనలు వారిని మరింతగా అసహ్యం కలిగిస్తున్నాయి. ఫిబ్రవరి 17న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్‌కు జరిగిన అమర్యాద, జెపిపై ఎమ్మెల్యేల దాడిని అన్ని పార్టీలూ, అందరు సభ్యులూ ఖండించారు. అంతలోనే శాసనసభలో మంత్రి వివేకా వీరంగం చోటు చేసుకుంది. వివేకానందరెడ్డికి చట్టసభలు, సంప్రదాయాలు కొత్త కాదు. గత పాతిక ముప్పై ఏళ్లుగా ఎమ్మెల్యే, ఎంపి, ఎమ్మెల్సీ పదవులను వెలగబెట్టారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర కేబినెట్ మంత్రి. అంతేకాదు శాసనమండలిలో అధికార పక్షానికి ఫ్లోర్‌లీడర్. శానసభలో ముఖ్యమంత్రి ఎలాగో మండలిలో వివేకా హోదా అలాంటిది. తన స్థాయిని ఆయన మర్చిపోయి ప్రవర్తించారు. శాసనసభ విలువలకు నిలువెత్తు పాతరేశారు. ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాల్జేశారు. మంత్రులు అసెంబ్లీలో ఇంత ఇలా ప్రవర్తిస్తారా అని ప్రజలు విస్తుపోయేటట్లు చేశారు. ఎక్కడో సీమ సందుల్లో ఫ్యాక్షనిస్టులు తొడలు గొట్టడం తెలుగు సినిమాల్లో చూస్తున్నార. ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో మంత్రే అందుకు పూనుకోవడం చూపడం ప్రజాస్వామిక వాదులు జీర్ణించుకోలేని వైపరీత్యం. పదేళ్లకో పదిహేనళ్లకో ఒక రోజు ప్రజాస్వామ్యానికి బ్లాక్‌డే, చీకటి దినం, గొడ్డలిపెట్టు వంటి పదాలు వినేవాళ్లం. ప్రస్తుతం ప్రతి రోజూ దాదాపు బ్లాక్‌డేలే అవుతుంటే తెలుగు నిఘంటువులో కొత్త పదాలు వెతకాల్సి ఉంది.
సభలో దొమ్మీకి పాల్పడిన మంత్రి వివేకా తన పశ్చాత్తాప ప్రకటనలోనూ రాజకీయం చేశారు. తన అన్న వైఎస్సార్‌ను అనరాని మాటలంటే ఆవేశం వచ్చిందని, టిడిపి మొదటి నుండి ప్రతి పథకాన్నీ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. కొందరు కాంగ్రెస్ నేతలు, మంత్రులు వైఎస్‌ను అదే పనిగా తిడుతుండగా రాని కోపం టిడిపి వాళ్లు ప్లకార్డులు చూపిస్తే ఎందుకొచ్చిందో వివేకా సమాధానం చెపాల్సి ఉంది. ప్రతిపక్షాలు ఏ సమస్య లేవనెత్తినా ప్రభుత్వం అసహనానికి లోనవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ప్రభుత్వ పక్ష సభ్యులు ప్రతిపక్షాలపై కాలు దువ్వడం రివాజైంది. సంయమనం పాటించాల్సిన ప్రభుత్వ పక్షం ఎదురుదాడి చేయడం, ప్లకార్డులతో గోల చేయడం కొత్త తరహా వ్యూహం. సభను సజావుగా నడిపించాల్సిన అధికారపక్షం ప్రజా సమస్యలపై చర్చలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అసెంబ్లీ సంప్రదాయాలను, విలువలను మంటగలుపుతున్న ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. జయప్రకాశ్ నారాయణ్‌పై జరిగిన దాడిపట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో తెలిసి పోతూనే ఉంది. ప్రజా సమస్యలపై సభల్లోని సభ్యులందరూ దృష్టి పెడితే తమను ఎన్నుకున్నవారికి న్యాయం చేసినవారవుతారు. లేదంటే చట్ట సభల శేష ప్రతిష్ట కూడా మంటగలుస్తుంది.