దళితులు, గిరిజనులకు దక్కని భూములు

దళితులు, గిరిజనులకు దక్కని భూములు

  • ఏళ్ల తరబడి కూలీ బతుకులే
  • పరిశ్రమలకు ప్రభుత్వ భూముల కేటాయింపు
  • ఐదు విడతల్లో పంచింది 24 వేల ఎకరాలే
  • అందులో దళితులకిచ్చింది 12 వేల ఎకరాలే
  • హక్కు పత్రాలతోనే సరి... భూములు చూపని వైనం
  • 22న అసెంబ్లీ ముట్టడి
జిల్లాలో ఐదు విడతల భూ పంపిణీ... దళితులకు ఇచ్చిన వివరాలు...
విడత ఎస్సీలు భూమి ఎస్టీలు భూమి మొత్తం లబ్ధిదారులు భూమి
మొదటి విడత 2939 2428.25 1010 1279.06 6736 6177,08
రెండో విడత 1222 1358.05 1513 1917.00 4752 5796.03
మూడో ,, 1289 1262.13 864 1053.10 3802 4349.22
నాల్గో ,, 1083 1043.19 1134 1513.28 3765 4206.10
ఐదో ,, 1193 1171.00 796 1279.06 3821 4401.19
మొత్తం 7726 7263.22 5317 7042.10 22876 24930.22

జిల్లాలో దళితులు, గిరిజనుల్ని పాలకులు సాగు భూములకు దూరం చేశారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూముల్నీ లాకున్నారు. పైగా ఓట్ల కోసం భూ పంపిణీ చేస్తున్నామని చెబుతున్నారు. సంపద పోగవడానికి ఆధారమైన భూమి దళితుల చేతుల్లో లేదు. ఏళ్ల తరబడి కూలీ బతుకులను వెల్లదీస్తున్నారు. జిల్లాలో లక్షల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వీటిలో సగానికి పైగా పెత్తందారులు, సంపన్నులు ఆక్రమించి అనుభవిస్తున్నారు. ప్రభుత్వం దళితులు, గిరిజనులకు ఇచ్చిన ఇనాం భూముల్ని సైతం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఆరేళ్ల కాంగ్రెస్‌ పాలనలో చేపట్టిన ఐదు విడతల భూ పంపిణీలో సైతం దళితులు, గిరిజనులకు ఇచ్చింది ఏమీ లేదు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకే హక్కు కల్పించారు. కొన్ని చోట్ల పత్రాలిచ్చిన భూముల్ని ఇంత వరకూ అప్పగించలేదు. ఇవన్నీ పెత్తందారులు, కంపెనీ యజమానులు, భూస్వాముల అనుభవిస్తున్న పరిస్థితి ఉంది. అసైన్డ్‌, ఇనాం, బంజరాయి, దేవాలయ, వక్ఫ్‌ భూముల్ని పేదలకు పంపిణీ చేయాల్సి ఉన్నపట్పికీ ఎక్కడా అమలు చేయలేదు. పైగా దళితులు, గిరిజనులు, పేదలు కబ్జాలో ఉండి సాగు చేసుకుంటే భూమిపై హక్కులు లేవంటూ ఖాళీ చేయిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమం కాగితాల్లోనే అమలవుతోంది. గుంటెడు భూమికి నోచుకోని దళితులు, గిరిజనులకు రెక్కలే ఆస్తులుగా మిగిలాయి. తరతరాలుగా కూలీ బతుకుల్ని వెల్లదీస్తున్న దళితులు, గిరిజనులు సామాజిక వెనుకబాటుతో పాటు రాజకీయ, ఆర్థికంగా కూడా వెనకబడే ఉన్నారు. దళితులు, గిరిజనుల్ని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్న పాలకులు అధికారంలోకి వచ్చాక మాత్రం కప్ప దాటు ధోరణి ప్రదర్శిస్తున్నాయి. వామపక్షాల పోరాటాల ఫలితంగా రెక్కల కష్టంపైనే బతికే దళితులకు జాతీయ ఉపాధి హామీ పథకం భరోస ఇస్తుందని ఆశపడ్డారు. ఇప్పుడు ఉపాధి హామీపై కూడా భూస్వాములు, పెత్తందార్ల, కాంట్రాక్టర్లు కన్నేసి దోపిడీ చేసేందుకు దారులు వెతుకుతున్నారు. దళితులు, గిరిజనులకు భూములపై హక్కు కాదు కదా.! వాటిల్లో కూలీ చేద్దామన్నా భద్రత లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడుకోవడంతో పాటు సమస్యల పరిష్కారం కోసం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, రాష్ట్ర నాయకులు ఎస్‌. వీరయ్య, జి.నాగయ్య, మిడియం బాబురావులు 17 నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వం ముందుంచిన 48 డిమాండ్లలో భూ పంపిణీ కూడా ప్రధాన సమస్యగా పేర్కొనబడింది. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా సైకిల్‌ యాత్రలు నిర్వహించిన సిపిఎం, కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 22న చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ఈ సందర్భంగా జిల్లాలో భూ పంపిణీ... దళితులు, గిరిజనుల సమస్యలపై ప్రజాశక్తి ప్రత్యేక కథనం...!
జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం 5.75 లక్షల మంది దళితులున్నారు. 3.42 లక్షల గిరిజనులున్నారు. ఈ పదేళ్ల కాలంలో పెరిగిన జనాభాను కలుపుకుంటే సుమారు ఎస్సీ, ఎస్టీల జనాభా 12 లక్షల మేరకు పెరిగిందని అంచనా వేస్తున్నారు. వీరిలో లక్ష కుటుంబాలకు సొంత ఇళ్లు లేవు. వీరందరికీ ఇందిరమ్మ పథకంలో పక్కా ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పటి వరకూ పావొంతు ఇళ్లు కూడా నిర్మాణం పూర్తి కాలేదు. 60 వేల కుటుంబాలు ఇళ్లు కట్టుకోలేక పూరిగుడిసెలు, రేకుల గదుల్లోనే కాపురాలు వెల్లదీస్తున్నారు. సొంత ఇళ్లే కాదు గుంటెడు సాగు భూమీ లేని కుటుంబాల సంఖ్య లక్షల్లో ఉంది. జిల్లాలో బంజరాయి, ఇనాం, అసైన్డ్‌, దేవాలయ పొరంబోకు, కుంట శిఖం, అటవీ ప్రాంత భూములు లక్షల ఎకరాల్లో ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ఓట్ల కోసం భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. అక్కడక్కడ పదైదు గుంటల మేరకు పంపిణీ చేసి లక్షల ఎకరాలు పంపిణీ చేసినట్లుగా కాగితాల్లో చూపుతుంది. జిల్లాలో మిగులు భూములు లక్షల ఎకరాల్లో ఉండగా ప్రభుత్వం మాత్రం అరకొర భూముల్ని పంచింది. జిల్లాలో 5 లక్షలా 69 వేలా 659 ఎకరాల బంజరాయి భూములున్నట్లు రికార్డుల్లో నమోదై ఉంది. ఇందులో లక్షా 66 వేలా 659 ఎకరాలే సాగుకు యోగ్యమైనట్లుగా అధికారులు గుర్తించారు. అదే విధంగా 42 వేలా 716 ఎకరాల సీలింగ్‌ భూములుండగా 34 వేలా 553 ఎకరాలను ప్రభుత్వమే గతంలోనే స్వాధీనం చేసుకుంది. మిగిలిన 8,183 ఎకరాలకు గాను 5,268 ఎకరాల భూమి కోర్టు వివాదాల్లో ఉంది. 561 పంచాయతీల పరిధిలో 13 వేలా 268 ఎకరాల దేవాలయ భూములుండగా ఇందులో 4 వేలా 227 ఎకరాలను మాత్రమే కౌలుకిచ్చారు. మిగతా 9 వేలా 41 ఎకరాలను భూస్వాములు, రాజకీయ నాయకులు, పూజారులు ఆక్రమించి అక్రమంగా అనుభవిస్తున్నారు.
పేరుకే భూ పంపిణీ
ప్రభుత్వం చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమం కాగితాల్లోనే అమలైంది. 2005 జనవరి 26న మొదటి విడత మొదలుకుని 2010 ఏప్రిల్‌లో చేపట్టిన ఐదో విడత వరకు జిల్లాలో 24 వేలా 930.22 ఎకరాల భూముల్ని 22 వేలా 876 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు అధికారుల గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇందులో దళితులకు మాత్రం దక్కింది తక్కువే. జిల్లా వ్యాప్తంగా ఐదు విడతల్లో కలిపి 7 వేలా 726 మంది దళితులకు గాను 7 వేలా 263.22 ఎకరాలను పంపిణీ చేసినట్లు చూపారు. అదే విధంగా 5317 మంది గిరిజనులకు 7042.10 ఎకరాల భూముల్ని పంపిణీ చేశారు. అయితే జిల్లాలో అటవీ హక్కుల చట్టం కింద 35 వేల మంది గిరిజనులు భూముల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 9 వేల ఎకరాలు పంపిణీ చేయాలని నిర్ణయించినా ఇంకా చేతికందలేదు.
ఇచ్చిన భూములు లాక్కున్నారు
జిల్లాలో పేదలకు పంపిణీ చేసిన ఇనాం, అసైన్డ్‌ భూముల్ని తిరిగా లాక్కున్నారు. జిల్లాలో ఉన్న లక్షా 894 ఎకరాల ఇనాం భూములకు గాను గతంలో 94 వేలా 982 ఎకరాలను దళితులతో పాటు ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన పేదలకు పంపిణీ చేశారు. వీటికి పట్టాలు కూడా ఇచ్చారు. ఇప్పటి వరకూ భూముల్ని పేదలకు అప్పగించలేదు. ఇంకా భూస్వాములు, పెత్తందార్లే అనుభవిస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం అసైన్డ్‌మెంట్‌ చట్టం సవరణ చేసిన తర్వాత కూడా దళితులకు భూములు దక్కలేదు. జిల్లాలో 15 వేల ఎకరాల భూముల్ని సంపన్నుల నుంచి స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని గుర్తించారు. ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదు. 2 వేల ఎకరాల సీలింగ్‌ భూముల్లో ఎలాంటి వివాదాలూ లేనందున పేదలకు పంపిణీ చేయవచ్చని కోర్టు చెప్పినా ఇంత వరకూ పేదలకు ఇచ్చింది లేదు.
భూ పోరాటాల ఫలితమే
జిల్లాలో ఐదు విడతల్లో పంపిణీ చేసిన భూములన్నీ సిపిఎం, వ్యకాస, కెవిపిఎస్‌, గిరిజన సంఘం పోరాటాల ఫలితంగా పేదలకు దక్కాయని ఆ సంఘాల జిల్లా కార్యదర్శులు నంద్యాల నర్సింహారెడ్డి, నారి ఐలయ్య, కొండమడుగు నర్సింహా, రవినాయక్‌లు పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ భూముల్ని దళితులు, గిరిజనులు, పేదలైన బిసిలకు పంపిణీ చేయాలని జిల్లా వ్యాప్తంగా అనేక ఉద్యమాలు నిర్వహించామన్నారు. క్షేత్ర స్థాయిలో పేదలు కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న భూములకు కూడా అధికారులు పట్టాలివ్వడంలేదన్నారు. అనేక గ్రామాల్లో పెత్తందార్లు ఆక్రమిస్తే వారి నుంచి ఇప్పటికీ స్వాధీనం చేసుకోలేదన్నారు. పైగా దళితుల్ని సాగు భూముల నుంచి ఖాళీ చేయిస్తున్న పరిస్థితి ఉందన్నారు. 22న చలో అసెంబ్లీ ముట్టడి నిర్వహించనున్నందున దళితులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.praja sakthi soujanyamutho nalagonda