దళిత మహాప్రస్థానం

దళిత మహాప్రస్థానం
-చుక్కా రామయ్య

ఇప్పటివరకు గడిచిన చరిత్రంతా అగ్రకులాల కిందనే నలుగు తూ వచ్చింది. కులం గోడలు కూలగొడతూ కులస్వామ్యా న్ని కూలదోయడానికి నూతన శక్తులు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ జిల్లాల్లో దొర గడీలను కూల్చిన చేతులతోనే కులం గోడలు కూల్చటానికి సన్నధమై సాగుతున్నారు. ఊరుబైట వాడ ల మూలుగుల్ని వినని చరిత్ర చరిత్రేనా? వెలివాడల్ని పట్టించుకోని సమాజం ఏదైనా అది అగ్రవర్ణ ఆధిపత్య కుల సమాజమే అవుతుంది. అగ్రకుల భావజలం పోవాలి. శరీరాన్ని నాలుగు ముక్కలు చేసిన మను వ్యవస్థ మసైపోవాలి.

దళితులు మరో ముందడుగు వేశారు. చరిత్ర రచనను ఆధిపత్యం ఆక్రమించుకుంటే ఎవరి చరిత్రను వారే లిఖించుకుంటా రు. ప్రజా ఉద్యమాలు లేకుండా ఇతరుల లిబరల్ ఔట్‌లుక్‌తో రాజ్యాంగంలో ఎన్నో అ«ధికరణలు వచ్చాయి.14వ అధికరణ అన గా చట్టం ముందు అందరూ సమానులే. 17 వ అధికరణ సకల వివక్షల పైన నిషేధం. 16వ అధికరణ ప్రభుత్వోద్యోగాల్లో సమానావకాశాలు. 17వ అధికరణ అంటరానితనంపై నిషేధం.

18వ అధికరణ భావప్రకటనా స్వేచ్ఛ. 21వ అధికరణ వ్యక్తిగత స్వేచ్ఛ. 23 వ అధికరణ బలవంతపు చాకిరీ రద్దు. 24వ అధికరణ 14 ఏళ్ళలోపు పిల్లలను ప్రమాదకరమైన పను ల్లో నియమించడంపై ఆంక్షలు. 39 వ అధికరణ స్త్రీ పురుషులకు సమాన వేతనం, ఆస్తిపై హక్కు. 49వ అధికరణ గౌరవ ప్రదమైన జీవితం. 45వ అధికరణ పిల్లలందరికీ ఉచిత విద్య. 46 వ అధికరణ ప్రత్యేక కమిషన్‌ను నియమించటం. 243 (డి) ద్వారా తరతరాలుగా అణచివేతకు గురైన వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి.

330, 332 అధికరణలు చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించటం. 345 అధికరణం ద్వారా ప్రభుత్వ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఇచ్చిన హామీలు 60 సంవత్సరాలు గడిచినా అమలుకు నోచుకోకపోవటం ఈ దేశంలో అతిపెద్ద విషాదం. రాజకీయమైన సంకల్పం ఉంటేనే సరిపోదు. దానికి కావల్సిన రాజకీయ కల్చర్ కూడా ఉండాలి. ప్రజాస్వామిక సంస్కృతి లేకుంటే ఏళ్ళ తరబడి ఉన్న ఆధిపత్య సంస్కృతే అధికారం చెలాయిస్తుంది. అదే జరిగింది. ఏళ్ల తరబడి ఎదురుచూసీ చూసీ కళ్లు కాయలు కాసినాయి.

తమ కోసం తామే ఉద్యమించక తప్పదని దళితులు ఉద్యమించారు. పాలకుల కళ్ళు తెరిపించారు. కానీ కుల వ్యవస్థ ఆధిపత్యం చాపకింద నీరులాగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం చుట్టూ ఉద్యమకంప మాదిరిగా సమాజం చుట్టూ కులం చుట్టబడింది. నడిచేందుకు సిమెంట్ రోడ్ కనిపిస్తుంది కానీ నడవలేని బాటగా అది మారుతుంది. ఆ విధంగా ఏళ్ళు గడిచాయి.

ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు చెందిన విద్యార్థులే చైతన్యంతో ప్రశ్నించడమే కాదు, ఉద్యమాలు నిర్మించుకున్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. అర్ధ పెట్టుబడిదారీ సమాజంలో ఉద్యమాలు నిర్మించటంలో పేద వర్గాలు ఎన్ని వ్యయప్రయాసలకు గురౌతున్నారో కళ్లారా చూస్తున్నారు. లాకప్‌లో చిత్రహింసలు, ఎన్‌కౌంటర్లకు గురయ్యారు. ఉపవాస దీక్షలు చేశారు. కానీ ప్రభుత్వ చక్రాలకు ఎదురు తిరిగి అడ్డుపడ్డ వారిని అణచటమే తెలుసు కానీ కదలటం మాత్రం ఈ మొద్దు పాలకులకు తెలియదు.

ప్రతి రాజకీయ పార్టీ దళిత గిరిజనులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఉపన్యాసాలు ఇస్తారు. వాగ్దానాలు చేస్తారు. కానీ తరతరాలుగా అనుభవిస్తున్న రాజకీయ తాత్త్విక సాంస్కృతిక ఆధిపత్యం వదులుకోవటానికి మాత్రం సిద్ధపడరు. ఈ రథ చక్రాలను కదిలించటానికై తామే పూనుకుని దళిత శక్తులు ముందుకొచ్చాయి. ఇది ఏ రాజకీయ పార్టీ తలపెట్టలేదు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యం లో రంగారెడ్డి జిల్లాలో బృహత్తర కార్యక్రమం తీసుకుంది. దేవాలయాల్లోకి దళితుల ప్రవేశం కోసం పెనుగులాట జరిగింది. బి.వి.రాఘవులు నేతృత్వంలో సైకిల్ యాత్ర చేయటం జరిగింది. ఆ జిల్లాలో రెండు గ్లాసుల పద్ధతిపై ఉద్యమించటం జరిగింది.

అదే కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో 30 మంది సైకిల్ యాత్ర చేయటం జరిగింది. మా సమస్యలపై మీరు ముందుకు రావాలని దళితులు అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఇందుకు నేనే నాయకత్వం వహిస్తానని తమ్మినేని వీరభద్రం ముందుకు వచ్చారు. 76 రోజులు ఖమ్మం జిల్లాలో సైకిల్‌యాత్ర నిర్వహించా రు.

దళితులకు అండగా నిలిచినా ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు ఈ సైకిల్ యాత్రను సమర్థించారు. ఆయనే ప్రారంభ జెండా వూపారు. జిల్లాలో మొత్తంగా 2291 కిలో మీట ర్లు, 30 మండలాలు, 8 పట్టణాలను సైకిల్ యాత్రలో చుట్టి వచ్చారు. 628 దళిత వాడల గుండా తమ్మినేని దళిత సైకిల్ యాత్ర కొనసాగింది. ఇది మార్పుకు సంకేతం. ఇది కొత్త సంకే తం.

అన్యాయాలు ఇక సాగవని, మా దళిత వాటా మాకిస్తారా? మా వాటాను మేం గుంజుకోమంటారా? అని పెత్తందారీ సమాజాన్ని తమ చైతన్యపు పలుగులతో పొడిచారు. ఇది మహా ఉద్యమమే. అగ్రకుల ఆధిపత్య సమాజం ఇకనైనా మెట్టుదిగి వచ్చి ఆ దళిత చైతన్యాన్ని కౌగిలించుకోవాలి. మాటలు, చేతలు కావాలంటే వేలాది చేతులు కలవాలి. అదే ఆరంభమైంది.

ఈ దళిత ప్రస్థానం కొనసాగాలి. ఆధిపత్య సంస్కృతి కూలిపోవాలి. దళితులు అమాయకులు అనుకుని వారికి కేటాయించిన నిధులను ఇతరత్రాలకు మళ్ళిస్తే వూరుకోమని రాజకీయ నాయకులకు, పాలకులకు ఈ సైకిల్ యాత్ర ఓ హెచ్చరిక చేసింది. దిక్కుమొక్కులేని దళిత జనం ఒక్కసారి గర్జిస్తే ఆధిపత్య కోటలు కూలిపోతాయని చెప్పారు.

దొర గడీలను కూలగొట్టాం. గడీల ముందు పోరుకేకలు పెట్టాం. ఆక్రమించుకున్న దొర గడీలు పగిలి అవి దళితులకు అందుతాయని అనుకున్నాం. ఊరి వెలుపల మూలుగులే మిగిలాయి. ఇప్పుడు దొర గడీలు ఆధునిక ఆధిపత్య కోటలుగా మారిపోయాయి.

దళితులకు కోటా ప్రకారం బియ్యమే మిగిల్చారు. దళితుల వాటా దళితులకు ఇచ్చేంతవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరికగా ఆ దళిత సైకిల్ యాత్ర ముందుకు సాగింది. అదే మరో దళిత మహాప్రస్థానం. అందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు , అది నా నల్గొండ నియోజకవర్గం నుంచే బయలుదేరినందుకు గర్విస్తున్నాను. మనిషి జీవితాలు ఉద్యమాలతో పవిత్రమౌతాయి. మనమందరం పవిత్రులవుదాం రండి. ప్రజా ఉద్యమాలలో పాలు పంచుకుందాం. పదండి ముందుకు....

-చుక్కా రామయ్య
శాసన మండలి సభ్యులు

పేదల పట్ల ప్రభుత్వానికెందుకింత ఏహ్యభావం?

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ రైతుల కోసం ఎంతో చేస్తున్నట్లు గొప్పగా చెబుతున్నారు. కొందరయితే, 2011-12 బడ్జెట్‌ను సామాన్యుడి బడ్జెట్‌ (ఆమ్‌ ఆద్మీ)గా పేర్కొన్నారు. అయితే సవివరమైన విశ్లేషణను చూస్తే ఈ బడ్జెట్‌, పరిశ్రమలో, మౌలికవసతుల కల్పనలో, పెట్టు బడుల మార్కెట్లో, సేవల రంగంలో, గృహ నిర్మా ణంలో పెట్టుబడుల అవకాశాలను పెంచే ఉద్దే శంతో రూపొందించినట్లు అర్థమౌతుంది. వ్యవ సాయంపై కొద్దిపాటి సానుకూల ప్రభావం చూపించే అవకాశం వుంది. బడ్జెట్‌లో కేంద్రీకర ణపై అసమతౌల్యం కారణంగా ధరల పెరుగు దలకు ద్రవ్యోల్బణ ధోరణులకు దారితీసి గ్రామీణ పేదలను ఇబ్బందులలోకి నెట్టేయడం జరుగుతుంది.
వ్యవసాయానికి ఎప్పుడూ జరిగేలాగున ఒక విధాయకంగా కేటాయింపులు జరిగాయి. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజనకు రు 7,860 కోట్లు, తూర్పుప్రాంతంలో హరిత విప్లవానికి రు 400 కోట్లు, పప్పులు, ఆయిల్‌ పాం, పట్టణ శివారు ప్రాంతాల్లో కూరగాయల పెంపకం, ముతక ధాన్యాలు, పశుదాణా ప్రోటీన్‌ అనుబంధ ఆహారం కోసం నూతన జాతీయ మిషన్‌కు ఒక్కొక్కదానికి రు 300 కోట్లు చొప్పున ఈ కేటాయింపు లున్నాయి. దేశంలోని 6,00,000 రెవెన్యూ గ్రామాలలోని 75 కోట్ల మంది రైతుల ప్రయోజ నాలు నెరవేర్చేందుకు ఈ కేటాయింపులు నామ మాత్రం.
తక్కువ వడ్డీ రేటుపై రైతులను ఆర్థికంగా కలుపుకొని పోవడంపై పెద్ద పెద్ద హామీలైతే యివ్వ డం జరిగింది. పంట రుణాల వడ్డీపై ప్రభుత్వం అందజేసే 3శాతం ప్రభుత్వ ఆర్థిక సహాయం, రైతులకు చాలావరకు ప్రయోజనకారి అని ఆర్థిక మంత్రి అంటున్నారు. అయితే ఆయనో విషయం తెలుసుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలకు గురైన సుమారు 5 కోట్ల మంది చెరకు పండించే రైతు లకు ఈ స్కీం వల్ల ఎటువంటి ప్రయోజనం లభించటం లేదు. చెరకు అన్నది 11 నుండి 18 మాసాల పంట. ఫ్యాక్టరీలు రైతులకు డబ్బును ఆలస్యంగా చెల్లిస్తూ ఉంటాయి. అందువల్ల రైతులు వడ్డీపై ప్రభుత్వం సహాయక పథకం వల్ల ప్రయో జనం పొందేందుకు, ఒక సంవత్సరంలోగా రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితి ఉండదు. అందు వల్ల పంట రుణాలను తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం కనీసం రెండేళ్ళ వ్యవధినివ్వాలి.
అవకాశాలకు దూరంగా ఉన్నవారికి, అల్పా దాయ గ్రూపులకు భరించగలిగే ఖర్చుపై ఆర్థిక (బ్యాంకింగ్‌) సేవలు అందించే కార్యక్రమాన్ని (సమ్మిళిత ఆర్థిక వృద్ధి) రైతులకు వర్తింపజేసే టప్పుడు జాగ్రత్తగా రూపొందించాలి. ఆ విధంగా రుణగ్రస్తులైన రైతులు తాము పెట్టిన పెట్టుబడు లకు గిట్టుబాటైన రాబడులను పొందుతూ రుణాలను తేలికగా తిరిగి చెల్లించే స్థితిలో ఉండ గలరు. అయితే ఈ దేశంలో పరిస్థితి దీనికి భిన్నంగా వుంది. ఇక్కడ రుణగ్రస్తుడైన రైతు రుణ భారం పెరిగిపోయి తనకు, తన కుటుంబానికి జీవనోపాధిని నిలబెట్టుకునేందుకు సరిపడు రాబడులను సమకూర్చుకోలేకపోతున్నాడు. ఇది అతనిని నిరంతరం అప్పుల ఊబిలోకి నెట్టేసేలా చేసి, అంతిమంగా ఆత్మహత్యకు పురిగొల్పుతోంది. అందువల్ల ప్రభుత్వం ముందున్న ప్రధాన సమస్య-తనను తన కుటుంబాన్ని నిర్వహించు కొనేలా సరిపడు రాబడులను రైతుకు లభించేలా చూడడం. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) లో ప్రభుత్వం చేసే మెరుగుదలలు సేద్యం చేయడంలో పెరిగిపోతున్న ఉత్పాదకాల ఖర్చులు తట్టుకునేం దుకు, సానుకూలమైన రాబడి పొందేందుకు ఏమాత్రం సరిపడా ఉండడం లేదు.
అయితే ఆర్థికమంత్రికి ఒక మంచి ఆలోచన వచ్చింది. అధికాధికంగా రసాయన సేద్యం వల్ల భూసారపరిస్థితి నానాటికీ క్షీణించిపోతోందని ఆయన అంగీకరించారు. అందువల్ల సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత వుంది. దిగజారిపోతున్న భూసారం, ఉత్పాదకత, ఉత్పత్తి పెంపుదలకు అవరోధంగా వుంది. అంతే గాక, వ్యవసాయంలో సాంప్రదాయక సేంద్రీయ వ్యవసాయ భూసారాన్ని పునరుద్దరించడమేగాక, అదేసాపేక్షకంగా రసాయన సేద్యం కంటే చౌక.
సేంద్రీయ ఉత్పత్తులకు 3వేల కోట్ల డాలర్ల ప్రపంచ మార్కెట్‌ పరిమాణం వుంది. దీని ధ్రువీ కరణ వ్యయం హెచ్చుగా ఉండడంతో మనరైతులు ఆ ప్రయోజనం పొందలేకపోతున్నారు. విడివిడిగా రైతులకు సేంద్రీయ ధ్రువీకరణ ఖర్చును ప్రభుత్వం సబ్సిడీగా చెల్లిస్తూ, అతని సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే అది వివేకవంతమైన చర్య అవుతుంది. రైతులకు ఎరువుల సబ్సిడీని నేరుగా అందజేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గ చర్య. అయితే ఎరువుల సబ్సిడీని దారిద్య్రరేఖకు దిగువన జీవించే రైతులకు మాత్రమే అందజేయా లని ప్రభుత్వం యోచిస్తోంది. ఎరువుల సబ్సిడీని రైతులందరికీ అందజేయాలి. సబ్సిడీ పరిమాణం భూకమతాన్ని అనుసరించి నిర్ణయించాలి. ఈ మొత్తాన్ని వ్యవసాయదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. రైతులందరికీ సబ్సిడీ అవసరం వుంది. అందువల్ల భూకమతాల పరిమితిపై దేశమంతటా ఎటువంటి తేడాలు లేకుండా ఎలా అమలు పరచబడిందో సబ్సిడీ కూడా అలాగే అందజేయాలి. సబ్సిడీని ఎలా వినియోగించా లన్నది రైతు స్వేచ్ఛకే వదిలివేయాలి. అది రసా యన సేద్యం కావచ్చు. సేంద్రియ వ్యవసాయం కావచ్చు. ప్రభుత్వం గనుక సేంద్రీయ వ్యవ సాయాన్ని ప్రోత్సహించాలని భావిస్తే సేంద్రీయ ధ్రువీకరణకు సంబంధించిన హెచ్చు ఖర్చును కూడా కలుపుకుంటూ అదనపు సబ్సిడీని అంద జేయాల్సి ఉంటుంది.
ఇంధనం, ఎరువులు, ఆహారం పై ప్రధాన సబ్సిడీలు 2010-11లో ఖర్చు చేసిన దానికంటే (సవరించిన అంచనా) 2011-12 బడ్జెట్‌లో భారీ స్థాయిలో రు 20,000 కోట్ల కోత విధించబడింది. ఆహార సబ్సిడీలో విధించిన రు 27 కోట్ల కోతతో ఆహారభద్రత, రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వాని కున్న చిత్తశుద్ధి అర్థమౌతుంది. ప్రభుత్వం డీజిల్‌ సబ్సిడీని రైతులకు నేరుగా అందజేయాల్సి ఉం టుంది. ఎరువుల సబ్సిడీలో తగ్గింపు ప్రభుత్వ రైతు వ్యతిరేక స్వభావాన్ని వెల్లడిస్తోంది.
మెగాఫుడ్‌ పార్క్స్‌ ఏర్పాటు చేసే బదులు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగయువకులు చిన్న చిన్న వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి, విలువ జోడింపు యూనిట్లను నెలకొల్పుకునేందుకు ప్రభుత్వం సహాయం అందించాలి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు తోడ్పడుతుంది. గ్రామీణ నిరుద్యోగాన్ని పరిష్కరిస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలసలను నిరోధిస్తుంది. ఈ బడ్జెట్‌ అటవీ వ్యవసాయ దారులు, కొండ ప్రాంత వ్యవసాయదారుల పట్ల ఏమాత్రం దృష్టి పెట్టలేదు. సాగునీటి సమస్యకు అవసరమైన శ్రద్ధ ఈ బడ్జెట్‌లో కనబడలేదు.
వదులుకున్న రెవెన్యూకు సంబంధించిన స్టేట్‌మెంట్‌ ప్రకారం 2010-11లో మొత్తం పన్ను రాయితీలు రు 5,00,000 కోట్లకు పైగా వున్నాయి. కార్పొరేట్‌ పన్ను మినహాయింపులు రు 88,000 కోట్లకు పైగా వున్నాయి. ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు ఇలా భారీ ప్రయోజనాలు అందజేస్తున్న పరిస్థితుల్లో రైతుల పట్ల ఎందుకు పిసినారిలా వ్యవహరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సంరక్షణ, విద్య, భరించగలిగే రేట్లపై సరిపడు సౌకర్యాలను అందజేయడంలో ప్రభుత్వ వైఫల్యం పేదల పట్ల ప్రభుత్వానికున్న ఏహ్యభావాన్ని వెల్లడిస్తోంది.

ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతికి చట్టం అవసరం

హైదరాబాద్‌ (వివి) : షెడ్యూల్డు కులాలు,షెడ్యూల్డు తెగల ఉప ప్రణాళిక (ఎస్‌సిఎస్‌పి) బిల్లును చట్టంగా రూపొందించి ఆ వర్గాలకు నాణ్యమైన ఉన్నతవిద్య అందించాలని, ఆర్థిక సాధికారతకై జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి, అవి దారి మళ్లకుండా పర్యవేక్షక కమిటీలను గ్రామస్థాయిలో పనిచేసేలా చూడాలని వక్తలు ముక్తకంఠంతో ఉద్ఘాటించారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ ఏర్పాటు చేసిన చర్చలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి, ఎస్‌సి, ఎస్‌టి, బిసిల సబ్‌ కమిటీ చైర్మన్‌, జస్టిస్‌ కె.రామస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించారు. దీనికై అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు కలిసి రావాలని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్‌సిఎస్‌పి కేటాయించిన నిధులలో రూ.21వేల కోట్లు ఇతర శాఖలకు దారి మళ్లాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఎస్‌సి సబ్‌ప్లాన్‌ పేర తాను ముసాయిదా బిల్లును రూపొందించి యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీకి అందించానని, ఆమె సూచించినా కేంద్రప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోలేదని జస్టిస్‌ రామస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌సిఎస్‌పికి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని, జాతీయ అభివృద్ధి మండలి ఈ వర్గాల అభ్యున్నతినే సూచించినట్లు తెలిపారు. ఈ నిధులను గ్రామస్థాయిలో సద్వినియోగంకై వేసే పర్యవేక్షక కమిటీలో ఎన్‌జిఒలు, స్థానిక నాయకులు అర్హత గల ఇతరులను సభ్యులుగా చేయాలని కోరారు. నిధులు దారిమళ్లినా, సద్వినియోగం కాకపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించి సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఫలితంగా సంబంధిత అధికారులు జవాబుదారీతనంతో పనిచేస్తారని పేర్కొన్నారు. లేకుంటే ప్రభుత్వం బాధ్యత వహించి వారిపై కఠినశిక్ష తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీస్‌ పేర అధికారులపై చర్యలు తీసుకునే వీలుంది తప్ప మంత్రులపై చర్యలు తీసుకోలేమని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంనర్సింహారావు మాట్లాడుతూ, ముసాయిదా బిల్లుకు చట్టబద్ధత కల్పించి నిమ్నవర్గాల అభ్యున్నతికి, ఆర్థిక సాధికారతకు కృషి చేయాలని సూచించారు. రాజ్యాంగపు 21, 46 అధికరణల ప్రకారం ఎస్‌సి, ఎస్‌టిలకు నాణ్యమైన విద్య అందించాలని పేర్కొన్నారని చెప్పారు. సామాజిక న్యాయం జరగాలని చెబుతూ, జస్టిస్‌ రామస్వామి రూపొందించిన ముసాయిదా బిల్లుకు పూర్తి మద్దతు పలికారు. ఎస్‌సిఎస్‌పి నిధుల సద్వినియోగం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి పనిచేయాల్సి ఉందని సూచించారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై.వి.రావు మాట్లాడుతూ, ఉప ప్రణాళిక బిల్లును చట్టం చేయాలని, నోడల్‌ వ్యవస్థ ద్వారా దానిని అమలు చేయాలని కోరారు. దళిత వర్గాల అభివృద్ధికి తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు. ఇదే విషయమై తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు నిరాహారదీక్ష చేశారని గుర్తు చేశారు. దీనికై చేసిన 50 డిమాండ్లలో తొలి డిమాండ్‌ ఎస్‌సిల అభివృద్ధి, ఆర్థిక సాధికారత, సమాజంలో అభివృద్ధే అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ మాట్లాడుతూ, బిల్లుకు రాష్ట్రస్థాయిలో చట్టబద్ధత కల్పిస్తే సరిపోదని కేంద్రస్థాయిలో చట్టబద్ధత అవసరమన్నారు. అన్ని పార్టీల నాయకులు అసెంబ్లీ, పార్లమెంట్‌లో దీనిపై గట్టిగా స్వరాన్ని వినిపించాలని, కొందరు అధికారుల నిర్లక్ష్యంవల్ల నిధుల మళ్లింపు జరుగుతోందన్నారు. బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, దీనిపై ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సామాజిక దోపిడీ, అసమానతలు పోవాలంటే బిల్లుకు చట్టబద్ధత అవసరమన్నారు. ఎస్‌సిల జనాభా 15 నుంచి 18 శాతం, ఎస్‌టిల జనాభా 7 నుంచి 9 శాతానికి పెరిగిందని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలన్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి కో-కన్వీనర్‌ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ, బిల్లుకు చట్టబద్ధత కల్పించడం ద్వారా నిధుల మళ్లింపు ఆపవచ్చన్నారు. ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. సిడిఎస్‌ చైర్మన్‌ డా.సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం మాని సమాజంలో దళితుల అభివృద్ధి, సాధికారతకు తోడ్పడాలని సూచించారు. సిడిఎస్‌కు చెందిన ఆంజనేయులు తదితరులు మాట్లాడారు