చంటిబిడ్డ కెవ్వుమంటే చాలు, కన్నపేగు కదిలిపోతుంది. చిన్నారి కేరుమంటే చాలు, తల్లిమనసు తుళ్లిపడుతుంది. ఎక్కడున్నా ఒక్క క్షణంలో బిడ్డముందు వాలి అక్కున జేర్చుకుంటుంది. అలాంటి అమ్మే తన బిడ్డను కాదనుకుని చేతులారా మరో చేతికి అందించిందంటే? అందుకు కారణం ఆ కన్నతల్లి కర్కశురాలా, కారుణ్యం లేనిదా, కాఠిన్యురాలా? బిడ్డ చిరునవ్వు చూసి లోకాన్ని మరచిపోయే తల్లుల్ని చూశాం. పసికందుకోసం కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదురీదే అమ్మల్ని చూశాం. అమ్మతనపు కమ్మదనం సాక్షిగా, మమతల మాధుర్యం తోడుగా ప్రపంచాన్ని ఎదుర్కొనే కడుపుతీపిని చూశాం. కానీ మంచాల మండలంలోని తల్లులు తమ ప్రేమాప్యాయతలకన్నా, ముద్దుమురిపాలకన్నా బిడ్డ కడుపు నిండటమే ముఖ్యమనుకున్నారు. తమవద్ద ఉండి పస్తులుండేకన్నా ఎక్కడున్నా తమ బిడ్డలు సుఖంగా ఉంటే చాలనుకునే నిస్సహాయస్థితిలో వారున్నారు. పిల్లల భవితవ్యంకోసం గత్యంతరంలేక అనురాగాన్ని గుండెలోతుల్లో అదుముకున్న మాతృమూర్తులు వారు! పేదరికంముందు ఓడిపోయిన పేగుబంధపు దీనగాథలు వారివి.



అది మంచాల మండలం. అవి పచ్చని పర్వతాల మధ్య ఒద్దిగ్గా ఒదిగిపోయిన గిరిజన తండాలు. కొండలమధ్య కొలువుతీరిన చిన్న చిన్న కమతాలు. అక్కడంతా వర్షాధారిత పంటలు. కూలిపని, కాకుంటే చిట్టడవుల్లో కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముకోవడం, లేకుంటే ఉపాధి హామీ పథకం... ఇవే వారి జీవనాధారం. ఒకరికొకరు సాయంగా, కష్టసుఖాలు పంచుకోవడం వారికెవరూ ప్రత్యేకంగా నేర్పనక్కర్లేదు. అపరిచితులైనా ఆదరంగా మాట్లాడటమే కాదు, ఉన్నంతలో కడుపునింపడమూ వారికి తెలుసు. రాజధాని నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్నా నగరజీవనానికి దూరంగా ఉన్నట్లే ఉంటుంది అక్కడి అభివృద్ధి, ఆ ప్రజల జీవనరీతి. అయితే నేడు ఆ తండాల గురించి పదిమందీ చర్చించుకుంటున్నారు. ఒకటికి పదిసార్లు అక్కడికి పరామర్శిస్తున్నారు. కారణం అక్కడ అమ్మాయి పుడితే మరొకరికి పెంపకానికి ఇస్తున్నారు. అదికూడా చాటుగా కాకుండా శిశువిహార్‌కు వెళ్లి మరీ తమ బిడ్డల్ని అందజేస్తున్నారు. కొండొకచో అమ్ముకుంటున్నారు. ఇది న్యాయమా, అన్యాయమా అని నిర్ణయించేముందు మా స్థితిగతులను ఓసారి పరిశీలించండి అంటున్న ఆ తండావాసుల మాటల్లో న్యాయం ఉంది. వారిది దిక్కుతోచని దయనీయ స్థితి. ఏ కష్టంచేసి పిల్లల కడుపునింపాలో తెలియని దుస్థితి. కంటికెదురుగా కనిపించే అపరిమిత ఆడసంతతి. ఇల్లాలి కంటికొసల్లో నిత్యం జాలువారే కన్నీరే వారికున్న ఏకైక ఆస్థి. ఈ పరిస్థితుల్లో వారికి కనిపిస్తోంది ఒకటే మార్గం! అమ్మాయిని పెంపకానికి ఇవ్వడం!



కారణం తెలుసుకోండి!



ఇందుకు కారణం అడిగితే, ''ఏం చేయమంటారు చెప్పండి? మేమెలాగూ పస్తులుంటున్నాం. మా బిడ్డలూ అదే రీతిన బతకాల్నా? ఎక్కడున్నా మా బిడ్డ కడుపునిండా తింటే మాకంతకన్నా ఇంకేం కావాలి?'' అంటున్న రవాత్‌ వరంగ కొర్రవాని తండాకు చెందిన యువతి. మొదటి భార్యకు సంతానం లేదని ఆమె భర్త 20 యేళ్ల తరువాత వరంగను పెళ్లాడాడు. వారికి సూదిమొనంత పొలం లేదు. రోజు కూలిమీద ఆధారపడి బతకాల్సిందే! వరంగకు వరుసగా ఐదుగురు ఆడపిల్లలు. ఉన్న బిడ్డలకే పిడికెడు బువ్వ పెట్టలేని తమకు ఐదో సంతానం కూడా 'ఆడదే' కావడంతో వారికేం చేయాలో తోచలేదు. అందుకే అంగన్‌వాడీ సభ్యురాలిని సంప్రదించి బిడ్డను శిశువిహార్‌లో అప్పగించారు.



ఆంబోతుతండాకు చెందిన లలితకు రెండో సంతానంగా ఆడపిల్ల పుట్టింది. కలోగంజో తిని కడుపునింపుకునే వారికి మళ్లీ ఆడపిల్ల అనేసరికి గుండెల్లో వణుకు మొదలైంది. మొదటి సంతానానికి పుట్టినరోజు వేడుకలు సంబరంగా చేసినవారు కాస్తా... రెండో సంతానాన్ని మరొకరికి ఇచ్చేయాలనుకున్నారు. ఆలోచన రావడం ఆలస్యం ఆ పనిచేశారు కూడా! కానీ మీడియాలో విషయం పొక్కేసరికి అధికారులు లలిత ఇంటికొచ్చారు. బంగారుబొమ్మలాంటి ఆ బిడ్డను తిరిగి తల్లిఒడికి చేర్చారు. లలిత, ''మా కష్టాలు మీకేం తెలుసు. తినడానికే గతి లేదు కానీ, వీళ్లనెలా సాదాలి, చదివించాలి, లక్షలు(వారికీ కట్నాలు లక్షల్లోనే ఉన్నాయి!) కట్నంపోసి పెళ్లిచేయాలి?'' అంటోంది. ''అదే మగబిడ్డయితే సాదేదానివిగా?'' అంటే, ''అవును! వాడికి కట్నం వస్తుంది. వాడు సంపాదిస్తే అదంతా మాకే మిగులుతుంది'' అని సమాధానం చెబుతోంది. సమాజ దుష్పరిణామాలు మనిషి ఎక్కడున్నా, ఏ మూలనున్నా తమ పరిధిలోకి లాక్కుంటాయి. అన్నెంపున్నెం యెరుగని ప్రజలపై తన ప్రభావం చూపుతాయి. వారి స్థితిగతులనే కాదు, మనిషి ఆలోచనాస్థాయిని దిగజారుస్తాయనడానికి ఇంతకన్నా మరో తార్కాణం ఉందా?



ఇది కొత్తగా వచ్చిన మార్పు





వీరి ప్రపంచం పూర్వమిలా ఉండేది కాదు. మొదట్లో ఆ తండాల్లో అమ్మాయి పుట్టిందంటే పండుగే! అమ్మాయిని పెళ్లి చేసుకోవడంకోసం 'ఓలి' మేమిస్తామంటే మేమిస్తామంటూ అబ్బాయిలు పోటీపడేవాళ్లు! అలాంటిది చుట్టూ ప్రపంచాన్ని చూసి 'ఓలి' కాస్తా 'వరకట్నం'గా రూపుదాల్చుకుంది. అప్పుడే... మగబిడ్డ పుడితే చాలు, కాసులు రాలతాయనే ఆశకు బీజంపడింది. ఆశ దురాశ కావడం ఎంతసేపు? ఆ దురాశ ఆడపిల్ల పుట్టగానే చంపడానికి దారితీసింది. అబార్షన్లు వారికి తెలియవు, తెలిసినా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే బిడ్డ నోట్లో వడ్లగింజవేయడం, సర్ఫునీటిలో ముంచి చంపడం. రానురాను బిడ్డను మట్టుబెట్టడం తప్పని ఈ తరానికి అర్థమైంది. అందుకే బిడ్డను చంపకుండా బిడ్డను పెంచుకోవడానికి ఇస్తున్నారు. గొడవలురాకుండా అంగన్‌వాడీ సభ్యులద్వారా శిశువిహార్‌లో అందిస్తున్నారు. తరచిచూస్తే చుట్టుపక్కల తండాల్లో ఇలాంటి ఉదాహరణలు మరెన్నో!



ఇక్కడి యువత ఎక్కువశాతం నగరానికొచ్చి ఆటోలు నడుపుతారు. లేదంటే మూకుమ్మడిగా 'దేశం' వెళ్లి అంతాఇంతో ఆర్జిస్తారు(ఆ కాంట్రాక్టర్లు వీరిని దోచుకోవడం వేరే విషయం!). ఆపై తండాకొచ్చి 'సంపాదిస్తున్నాం. కనుక కట్నం ఇవ్వండి' అంటూ ప్రకటిస్తారు. ఇవన్నీ చూస్తూ ఎవరైనా 'మగబిడ్డ'ను కాక ఆడపిల్లను మనసారా ఎలా స్వాగతిస్తారు? అంతేకాదు, వీరి వివాహరీతులూ మారిపోయాయి. తమ పద్ధతులు మానేసి హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అంటే, తమ రీతి రివాజులను వదిలేసి చుట్టుపక్కల సంస్కృతిని అలవర్చుకుంటున్నారు. ప్రతి అంశంలోనూ చాపకింద నీరులా పాకుతున్న మార్పులు వారి అస్థిత్వానికే ప్రశ్నార్థకంగా మారాయి.



ప్రభుత్వం ఏర్పాటుచేసిన వసతిగృహాలు, రిజర్వేషన్ల గురించి వీరికి తెలిసింది తక్కువ. వినియోగించుకోవడంపై అవగాహన తక్కువ. ఆర్థిక స్థితిగతులకు తోడు అవగాహనారాహిత్యం, నిరక్ష్యరాస్యత, సదుపాయాల లేమి, ప్రభుత్వ నిర్లక్ష్యం వీరిని మరింత అట్టడుగుకు లాక్కెళ్తున్నాయి.



తప్పు వారిది కాదు!



ఆ తండావాసులు పిల్లలను మరొకరికి ఇవ్వడాన్ని గురించి విని, చదివి అమ్మతనంపై మచ్చ, మానవత్వంలేని మనుషులు, పాషాణ హృదయాలు అనుకోక... కన్నపేగు బంధాన్నే ఛిద్రంచేస్తున్న అంశాలను అర్థంచేసుకోవాలి. పసిపిల్లల బోసినవ్వులు, అల్లరిచేష్టలు ఎవరికి మాత్రం చేదు? పిల్లల ముద్దుమురిపాలకు మురిసిపోని తల్లులుండరు. అలాంటి వెన్నలాంటి మాతృహృదయం బండరాయిగా మారిందంటే? దాని వెనుక వారిని పరోక్షంగా ప్రేరేపిస్తున్న స్థితిగతులను తప్పు పట్టాలనిపిస్తుంది తప్ప తప్పు వీరిది అనిపించదు. వీరిని నిందించడానికి మనసు ఒప్పదు. డబ్బు, లోకంపోకడలు, జరుగుతున్న పరిణామాలు, ప్రపంచీకరణ... ఇవన్నీ నాగరిక జీవితానికి దూరంగా... సుదూరంగా జీవనం సాగిస్తున్నా ఈ గిరిజన తండాలపై పడుతోంది. ఏమూల దాగున్నా మనిషిపై తన కోరలు ఎలా చాపుతుందో చెప్పడానికి ఇంతకన్నా బలమైన సాక్ష్యాలేం కావాలి? బైటి ప్రపంచప్రభావం తండావాసుల పాలిట యమపాశమై... వారి ప్రేమపాశాన్నే శాసిస్తోందనడానికి ఇంతకంటే రుజువులేం కావాలి?!



పెళ్లికన్నా చదువే మిన్న!



పల్లవి పదహారేళ్ల అమ్మాయి. ఆ పొరుగింట్లోని నలభైఐదేళ్ల వ్యక్తికి మొదటి వివాహం చేసుకుంటే వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. అతనికి పల్లవిపై కన్నుపడింది. ఇది తల్లిదండ్రులకూ ఇష్టమేనని గ్రహించిన పల్లవి ఇంటినుండి పారిపోయింది. తన పెళ్లి ప్రయత్నాలు మానేస్తామని తల్లిదండ్రులు మాటిచ్చిన తరువాతే తిరిగి తండాకు చేరింది. చదువుకోవాలన్న ఆశ ఆమెను అలా ప్రేరేపించింది.



చదువుకన్నా ఇంటిపనులే మిన్న!



మౌనిక చూడచక్కని అమ్మాయి. ఆ వయసులో ఎవరైనా చదువుకోడానికి బడికెళ్తారు. కానీ మౌనిక లేచింది మొదలు, ఇంటిపని, వంటపని చేస్తుంది. తల్లిదండ్రులు కూలికెళ్లగా చిన్నారి తమ్ముడిని చూసుకుంటూ కాలక్షేపం చేస్తుంది. ఇంటిని చక్కదిద్దుతున్నాను అనుకుంటుంది తప్పచదువుకోవాలన్న ఆలోచనే ఆ అమ్మాయికి రాదు.

స్వాతంత్రమా ఏదీ నీ చిరునామా...?

ఈ ఆగస్టు 15తో దేశ స్వాతంత్య్రానికి 64 ఏళ్లు నిండాయి. మనల్ని మనమే పరిపాలించుకోవడంలో 65వ యేట అడుగుపెట్టాం. బ్రిటీష్‌ సామ్రాజ్య వాదులను ఎదిరించి 1857 ప్రధమ స్వాతంత్య్ర పోరాటకాలాన్ని ఒక లెక్కగా తీసుకుంటే 1947 నాటికి 90 సంవత్సరాల కాలం అవిశ్రాంతంగా పోరాడి సాధించిన స్వరాజ్యమిది. కోట్లాది మంది పీడితులు, తాడితులు తమ బతుకుల బాగు కోసం స్వరాజ్య సాధనలో నాయకులు ఇచ్చిన పిలుపులన్నింటా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పాల్గొన్న ఫలితమిది. భరతజాతి విముక్తి కోసం తెల్లదొరలను తరిమి కొట్టాలని విశాల భారతి స్వప్నాలు, విప్లవ జ్యోతుల కిరణాలు అభిలషించి బలిదానం చేసి సాధించిన స్వేచ్ఛ ఇది. ఆనాడు స్వాతంత్య్రకాంక్ష అందరిదీ. దాని ఫలితాలూ అందరివీ కావాలన్నది నాటి లక్ష్యం. కానీ నేడు వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. గల్లీ నుండి ఢిల్లీ దాకా ఎగురుతున్న మువ్వన్నెల జెండా నేడు తన చిరునామా వెదుక్కుంటోంది. ఏయే రంగాల్లో తానేం సాధించిందో నెమరేసుకుంటోంది.

స్వతంత్య్ర భారతావనికి ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, సామాజిక న్యాయం లక్ష్యాలు పునాదిరాళ్లు. ఈ పునాదులను అంచెలంచెలుగా కదలించి బలహీనం చేయడంలో ఇన్నేళ్లు పాలించిన పాలకవర్గాలు ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఒకనాడు సార్వభౌమత్వం కోసం సామ్రాజ్యవాదంతో ఢకొీన్న వైనాన్ని చరిత్ర పాఠంగా మిగిల్చి వర్తమానంలో మళ్లీ ఆ సామ్రాజ్యవాదుల పిడికిళ్లకే దేశాన్ని అప్ప జెప్పే చర్యలు ముమ్మరమౌతున్నాయి. వారి పెత్తనానికి ఆటంకాలు లేకుండా ఎన్నో ఒప్పందాల్లో పార్లమెంటును ప్రధానమంత్రీ తప్పుదోవ పట్టించడానికి వెనుకాడటం లేదు. అమెరికాతో అణు ఒప్పందం విషయంలో ఉన్న వాటిని దాచిపెట్టి ఇటీవల పార్లమెంటులో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన ప్రకటన దీనికి తాజా ఉదాహరణ. మన ఆర్థిక సార్వభౌమత్వాన్ని హరించే ప్రపంచీకరణ శక్తులకు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు రెడ్‌కార్పెట్‌ పరిచే అనేక విధానాలు నేడు చూస్తున్నాం. వీటి జోక్యం, పెత్తనంతో లాభపడుతున్నవారు ఒక వైపు నేడు సంబరాల్లో ఉన్నారు. ఒకనాటి రైతును కూలీగా మార్చి, ఎందరి కడుపులనో మాడుస్తున్న పాలకుల విధానాలు ఎవరి వికాసం కోసమంటూ నిలదీస్తున్న జనం మరోవైపు పోరాడక తప్పని స్థితిలో ఉన్నారు. అందుకే నేడొక వైపు దేశం వెలిగిపోతుంటే మరోవైపు నలిగిపోతోంది.

వ్యవ'సాయం' ఏదీ...?

ఆహారధాన్యాలు, నిత్యావసర వస్తువులు మనమే ఉత్పత్తి చేసుకోవాలనుకున్నాం. వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేసి.... ఇబ్బడిముబ్బడిగా పండించి ఎగుమతులు లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఆశయం ఘనమే కానీ ఆచరణ ఏమిటన్నది ప్రశ్న. 1951లో మన జనాభా 36.32 కోట్లు. ఆనాడు 4.81 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తయ్యేది. ఆనాటికీ నేటికీ ఈ విస్తీర్ణంలో పెద్ద మార్పు లేదు. కానీ టెక్నాలజీ ప్రవేశం, హరిత విప్లవం వంటి పలు మార్పుల రీత్యా ఆహారధాన్యాల ఉత్పత్తి ఐదు రెట్లు పెరిగింది. నేడు 23 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తవుతున్నాయి. జనాభా 121 కోట్లకు చేరింది. 64 ఏళ్ల స్వతంత్య్ర భారతావనిలో 46 శాతం పిల్లలు పోషకాహారలోపంతో ఉన్నారు. అంటే ప్రపంచంలోని మూడోవంతు వీరు. అంటే వినియోగంలో వాటాలు మారిపోయాయి. 1965-85 సంవత్సరాలలో వచ్చిన హరిత విప్లవం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల కనపడినా తర్వాతి కాలంలో స్తబ్దత నెలకొంది. ఈ కాలంలో స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం వాటా 15 శాతానికి పడిపోయింది. దీనిని ఆదుకునేందుకివ్వాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధులూ, బ్యాంకు రుణాలూ తగ్గిపోయాయి. సాగుభూమి ప్రతి ఏడాది 0.25 శాతం చొప్పున తగ్గిపోతూ వస్తోంది. వ్యవసాయ రుణాలను పారిశ్రామిక, రియల్‌ ఎస్టేట్‌, వాణిజ్య అవసరాలకు మళ్లించడం పెరిగింది. కష్టాల సాగులో కన్నీళ్లే మిగిలే వ్యవసాయం పట్ల రైతు ఆసక్తి కోల్పోయే పరిస్థితులు పాలకులే సృష్టిస్తున్నారు. తరతరాల వృత్తిని కొత్త బతుకు తెరువు అన్వేషణలో వదిలేస్తున్నా పాలకుల్లో స్పందనలేదు. క్రమంగా ఈ కాలంలో భూమి ఒక వైపు కేంద్రీకృతం అవుతుండగా మరో వైపు భూమిలేని గ్రామీణ పేదల సంఖ్య 38 నుండి 48 శాతానికి పెరిగింది.

1947లో విదేశీపాలన నుండి విముక్తి కాకముందున్న స్థితి మళ్లీ కనపడుతోంది. కార్పొరేట్‌ వ్యవసాయం పేరుతో పేద, మధ్య తరగతి రైతుల భూములను లాగేసుకుంటున్నారు. సాగునీటి రంగంలో నీటి బొట్టుకు రేటు కట్టే విధానాలకు వెళుతున్నారు. రైతు వద్ద పంట ఉన్నప్పుడు ధర ఉండటం లేదు. చేజారాక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కర్ణుడి చావుకి ఎన్నో కారణాలన్నట్టు అన్నింటినీ సంస్కరణల పేరిట ఉరితాళ్లుగా పేర్చి ఈ ప్రభుత్వం రైతుల మెడకు చుడుతోంది. ఈ నిర్వాకంలో దీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్‌, బిజెపి దొందూ దొందే. ఎవరి బాగు కోసం 1991లో వ్యవసాయం సంస్కరణలు అంటూ పాలకులు ఊదరగొట్టారో ఆ రైతులు ఇప్పటికే రెండు లక్షల మంది నిలువునా ప్రాణాలు తీసుకున్నారు. ఈ రంగంలో మనమెంత అభివృధ్ధిలో ఉన్నామో చెప్పడానికి అరగంటకో అన్నదాత ఆత్మహత్యే ఉదాహరణ.

మన పారిశ్రామికాభివృద్ధి దిశ, దశ, ఎటువైపు:

స్వావలంబన దిశగా సాగాలని, అటు వ్యవసాయాన్ని, ఇటు పరిశ్రమలను సంధానించి జోడెడ్లతో ఈ దేశాన్ని పారిశ్రామికంగా పరుగులెట్టించాలని స్వాతంత్య్రానికి పూర్వం తలపోశాం. ఇందుకు పంచవర్ష ప్రణాళికలు రచించుకున్నాం. మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించుకున్నాం. ఆనాడు పరిశ్రమల స్థాపనకవసరమైన ఆర్థిక, ఇతర అంశాలకు అప్పుడప్పుడే అడుగులు నేర్చుకుంటున్న పెట్టుబడిదారులకు ప్రభుత్వ రంగం చేయూతైంది. వారికి నేడు ఆ ప్రభుత్వ రంగమే అడ్డుగా కనపడుతోంది. ప్రపంచంలోని ప్రతి వంద మంది ధనికుల్లో ఆరుగురు భారతీయులే. దేశంలో 55 మంది శతకోటీశ్వరుల చేతుల్లో జాతీయ సంపదలో 26 శాతం పోగుపడి ఉంది. 25 కోట్ల రూపాయలకు మించిన ఆస్తులు కలిగిన 62 వేల కుటుంబాలున్నాయి. వారి చేతిలో ఇప్పటికే 45 లక్షల కోట్ల రూపాయలున్నాయి. వీరుపోగా మిగిలిన 120 కోట్లపై చిలుకు జనాభా సంగతేంటి? ప్రపంచ తలసరి ఆదాయంలో మనం 129వ స్థానరలో ఉన్నాం. ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి లెక్కల్లో 134వ స్థానంలో ఉన్నాం. ప్రపంచంలోని నిరుపేదల్లో 40 శాతం మన దేశంలోనే ఉన్నారు. 70 శాతం మందికి కనీసం రోజుకు 20 రూపాయల ఆదాయం కూడాలేదు.

కనీసం కాళ్లకు చెప్పుల్లేని వారు 20 శాతం ఉన్నాం. చెప్పుకుంటే సిగ్గుచేటు 40 కోట్ల మందికి కనీసం బహిర్భూమి సౌకర్యం లేదు. ఇక ఇళ్ల సంగతి ఏం ఆలోచిస్తాం? 24 శాతం మంది పట్టణాల్లో మురిక్కాలువల పక్కన బతుకీడుస్తున్నారు. గరీభీహఠావోలు, రోటీకపడా మకాన్‌లు, ఆమ్‌ ఆద్మీలు ఎంత బాగా పని చేశాయో వేరే లెక్కలు అవసరం లేదు. మన సొమ్ముతో ప్రారంభించిన ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, లేదా కారు చౌకగా అనుయాయులకు కట్టబెట్టి నిరుద్యోగితను, ఉపాధిరహిత అభివృద్ధిని పాలకులు ఘనంగా చెబుతున్నారు. 1970, 1980 దశకాల్లో స్థాపించిన కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఒక్కొక్కటీ మూతపడిపోయాయి. ఈ సంస్థలను పాడి ఆవుల్లా భావించి, తమ సొంత జాగీర్లుగా మలచుకుని పాలక పార్టీలుగా వెలగబెట్టిన కాంగ్రెస్‌, బిజెపిలు పోటీ పడి మరీ తమ పార్టీ అనుయాయులకు కట్టబెట్టాయి. స్థానిక వనరులు, వ్యవసాయోత్పత్తులు ఖనిజ సంపద ఆధారంగా పరిశ్రమల స్థాపనకు ప్రాముఖ్యత నివ్వాలని 1960లోనే కమిటీ సిఫార్సులు చేసింది. అది నేటికీ బూజుపట్టే ఉంది. కార్పొరేట్‌ సంస్థలు, బహుళజాతి సంస్థలు గ్రామాల్లో భూములను కొని కాంట్రాక్టు సేద్యం పేరుతో సన్నచిన్న కారు రైతులను వారి భూముల్లోనే వారిని కూలీలుగా మారుస్తున్నాయి. అంటే దేశాన్ని పరాయి పాలన నుండి విముక్తి చేసుకున్న మనం మన వ్యవసాయాన్ని పరాధీనం చేసుకుంటున్నాం. మనది వ్యవసాయిక దేశం కనుక మన పారిశ్రామికీకరణ విధానాల్లోనూ ఈ భూమిక తప్పని సరి.

కానీ నేడది లేదు. కోరలు చాచిన మల్టీ నేషనల్‌ కంపెనీల లాభాల వేటకు మన పాలకులూ ద్వారాలు బార్లా తెరిచారు. అలా తెరిచేట్టు చేయడంలో దేశ పెట్టుబడిదారుల ఆసక్తులున్నాయి. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నామంటున్న పాలనా వ్యవస్థలో కీలక పాత్ర నేడు పెట్టుబడిదారులది. పెట్టుబడిదారుల కోసం పెట్టుబడి దారులే విధానాలు రూపొందించుకుటున్నారు. అమలు జరుగుతోన్న ఆర్థిక సంస్కరణల వల్ల వినిమయవ్యయం. వ్యక్తి వాదం, అభద్రతాభావం పెరుగుతున్నాయి. వ్యాపారం, రాజకీయ మిళితమైనాయి. ఎన్నికలను, రాజకీయాలను డబ్బుతో శాశించి ప్రజాప్రతినిధులుగా గెలిచి, వచ్చిన పదవులతో మళ్లీ డబ్బు రాబట్టుకోవడం పెరిగింది. పారిశ్రామీకరణ అంటే నిర్వచనాలే మార్చేస్తున్నారు. ఉదాహరణకు మన రాష్ట్రాన్నే చూద్దాం. ప్రజోపయోగం కోసం ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకోవచ్చని 1890 నాటి చట్టంలో ఉంది. ఈ క్లాజు కింద మన రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను పెట్టుబడిదార్లకు కారుచౌకగా కట్టబెట్టారు. అటవీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు మన సర్కారు పడరాని పాట్లు పడుతోంది. ఇందుకు హత్యలకూ తెగబడుతోంది. గంగవరం పోర్టు, సోంపేట కాల్పుల ఘటనలే ఇందుకు తాజా ఉదాహరణలు. బడాబాబులకు కట్టబెట్టడమనే ఏక సూత్ర కార్యాచరణే కనపడుతోంది. భద్రతలేని ఉపాధితో జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఒకవైపు ప్రభుత్వరంగం కుదించుకుపోతోంది. ప్రైవేటు రంగానికి బడుగుల బాధలు పట్టవు. సంఘటిత రంగం క్రమంగా తగ్గుతోంది. అసంఘటిత కార్మికులు పెరుగుతున్నారు. అభద్రత, నిరుద్యోగం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తోంది. మరోవైపు పెట్టుబడిదారులకు అనుకూల విధానాలతో పాలకులు వారి ఆస్తులను పదిరెట్లు పెంచే విధానాలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వరంగ కుదింపు, ప్రైవేటు రంగ విశృంఖలత్వం వెరసి జనం మూలుగలు పిప్పవుతున్నాయి.

అవినీతి పెనుభూతం: ఏ విషయంలోనైనా మనం చివర్లో ఉన్నాంగానీ అవినీతిలో మాత్రం ముందున్నాం. స్వాతంత్య్రానంతరం మన పాలకుల అవినీతి చిట్టాల మొత్తం వింటే కళ్లు బైర్లుగమ్మాల్సిందే. అక్షరాలా 9 కోట్ల 12 లక్షల 89 వేల 123 కోట్ల రూపాయలని ఒక లెక్క. స్వతంత్ర భారతదేశం కోల్పోయిన సొమ్ము ఇది. ఇది చాలదన్నట్టు గనుల వంటి ప్రకృతి వనరులు కూడా లూటీ అవుతున్నాయి. ఈ మొత్తాన్నీ కలిపితే ఎంతవుతుందో ఊహించుకోవాల్సిందే. పార్టీలలో అస్థిరత్వాలు, పార్టీల మధ్య తేడాలు ఉన్నా అవినీతి చేయడంలో మాత్రం వామపక్షాలు మినహా మిగిలినవన్నీ స్థిరంగా దృఢంగా ఉన్నాయి. దేశంలో 1948లో జీప్‌ల కుంభకోణం నుండి ఈ ఏడాదిలో పెద్ద మొత్తంలో నమోదైన 2జి స్ప్రెక్ట్రమ్‌ (1.76 ల.కో) అంత్రిక్ష్‌ దేవాస్‌ ఒప్పందం (రూ.2 లక్షల కోట్లు) వరకు కుంభకోణాల్లో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది. ఈ కుంభకోణాలను లెక్కించడం కన్నా జనగణన సులభమంటూ ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌ ఒక వ్యాసంలో రాసిన మాట నిష్టురసత్యం. పెట్టుబడిదారులతో రాజకీయవేత్తలకున్న లింకు ఈ అవినీతికి మూలం. పైకి అవినీతిని పారదోలేందుకు కంకణం కట్టుకుని ఉన్నట్టు మాట్లాడే పాలకులు అవినీతి మూలాలపై నోరు మెదపరు.కోరలు తీసిన లోక్‌పాల్‌ను కాంగ్రెస్‌ ప్రతిపాదిస్తోంది. ఆయా కుంభకోణాల్లో ఇరుక్కున్న వారిని వారి వారి పదవుల్లోనే ఉంచి, విచారణ చేస్తున్నామని చెబితే ఏం న్యాయం జరుగుతుంది? ఎన్నికల్లో సంస్కరణలు రానివ్వకుండా, డబ్బు నియంత్రించకుండా ఉంటే అది పెట్టుబడి సాధనంగా కాక మరేమౌతుంది? రాజకీయ, వ్యాపార వర్గాల మధ్య సంబంధాలు బహిర్గతం కాకపోతే ఒప్పందాలు ఎలా వెలికివస్తాయి? డబ్బులు చేతులు మారడ మొక్కటే అవినీతా?

లంచం ఇవ్వజూపడం, ప్రభావితం చేయడం, ఆశ్రిత పక్షపాతం, అనర్హులను అందలమెక్కించడం, ముడుపులివ్వడం, నేరాల్లో భాగస్వామ్యం వంటి వన్నీ ఈ అవినీతి భాగోతంలోని అష్టావక్రులే. వామపక్షాలు ప్రస్తావించిన ఈ ఎనిమిది అంశాల ఆధారంగా మన అవినీతిని లెక్కిస్తే బహుశా సంఖ్యాశాస్త్రం పరిధి చాలదేమో! దోచుకున్నది దాచుకునే విషయంలోనూ మన వాళ్ళు బాగా ఆరితేరిపోయారు. స్విస్‌ నేషనల్‌ బ్యాంకు (ఎస్‌ఎన్‌బి) ఇటీవల మొదటిసారిగా వెల్లడించిన వివరాల ప్రకారం స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న మొత్తం డబ్బు 250 కోట్ల డాలర్లు. చాలామంది విశ్లేషకులు ఈ అంచనాతో విభేదిస్తున్నారు. కొండంత నల్లధనాన్ని ఎస్‌ఎన్‌బి గోరంతగా చెబుతోందన్నది వారి అభిప్రాయం. 2002-2006 మధ్య అయిదేళ్ల కాలంలో ఏటా దేశం నుండి తరలిపోయిన మొత్తం సగటున 272 కోట్ల డాలర్లని వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్‌ ఫైనాన్షియర్‌ ఇంటిగ్రిటీ అనే సంస్థ వెల్లడించింది. ఆ సంస్థలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేవ్‌కర్‌ 1948 నుంచి 2008 మధ్య కాలంలో దేశం నుంచి మొత్తం 4620 కోట్ల డాలర్ల మేర నల్లధనం తరలిపోయిందని అంచనా వేశారు. దేశంలో పోగుపడుతున్న అక్రమాస్తుల్లో 72 శాతం నల్లధనం రూపంలో విదేశాలకు తరలుతోందని ఓ అంచనా. ఇంత తీవ్రమైన విషయంపై, కనీసం అక్రమార్కులపేర్లు వెల్లడిపై కాంగ్రెస్‌ సర్కారు నోరు మెదపడం లేదు. పేదల నడ్డి విరిచే భారాలకు 'అణు' మాత్రం ఆలోచించని ఈ పెద్దలు అవినీతి కట్టడికి మాత్రం సుదీర్ఘ మంతనాలతో ఒక్కంగుళం పరిష్కారాన్ని చూడటం లేదు. బడుగుల బాగులో ఎక్కడున్నాం : జనాల్లో అసంతృప్తి పెల్లుబుకుతున్నప్పుడంతా ఏదో ఒక విధంగా విభజించి పాలించే సూత్రాన్ని మన పాలకులు బ్రిటీష్‌ వారి నుండి బాగా నేర్చుకున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే ఫలితం అనుకుంటే ఆ పని చేసేయడం, కుల మత వివాదాలు సృష్టిస్తే లాభమనుకుంటే అదే కానివ్వడం ఇన్నేళ్ల కాలంలో ఎన్నోసార్లు చూశాం. లౌకిక తత్వానికి విఘాతం కలిగినా, ఉగ్రవాద సంస్థలు పెచ్చరిల్లినా, మత సామరస్యానికి దెబ్బ తగిలినా, ఇవి ఏ తరహా రూపం తీసుకున్నా మధ్యలో నలిగిపోయేది బడుగులే. ఏ లక్ష్యాల కోసం నాడు బలహీనవర్గాలకు చెందిన వారు స్వాతంత్య్రాన్ని అభిలషించారో అది మాత్రం ఆమడదూరంలో ఉంది. స్వాతంత్య్రం ధనికులకే తప్ప దళిత, గిరిజన, ఇతర బలహీన వర్గాలకు దగ్గరగా లేదు. వీరు చేసిన త్యాగాలు సైతం వెలికిరానివిగా మిగిలిపోయాయి. ఆదివాసీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. 1972 వన్యమృగ సంరక్షణ చట్టం ప్రకారం జంతు రక్షణకు నడుం కట్టామన్నారు. తుపాకులకు లైసెన్సు లిచ్చి వేటకు అంగీకరించారు. ఆదివాసులకు కరెంటివ్వాలంటే అడవి పాడైపోతుంది అంటూ అడ్డు చెబుతున్నారు. పరస్పర విరుద్ధమైన ఈ విషయాల ద్వారా అర్థమయ్యేదొకటే. ఈ పాలకులకు సాటి మనుషులపై కనికరం లేదు. ఏదో ఒక పేరుతో మైనింగ్‌ మాఫియాలకు అడవులప్పచెప్పడమే జరుగుతోంది. మన్య పోరాటాలు లేకుండానే మనకు స్వరాజ్యమొచ్చిందా? అంటరానితనం, కుల వివక్షతతో ప్రపంచం ముందు తలదించుకోవాల్సిన కుల వ్యవస్థ కొనసాగుతోంది. దళితులపై అత్యాచారాలూ, అమానుషాలూ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ స్వాతంత్య్ర దినానికి మూడ్రోజుల ముందే పత్రికల్లో రెండు వార్తలొచ్చాయి. దళితుడిని ప్రేమించినందుకు ఓ తండ్రి కూతుర్ని చంపాడు. అగ్రకుల అమ్మాయిని ప్రేమించిన నేరానికి దళిత అబ్బాయి తల్లిని కాల్చేందుకు ప్రయత్నించారు. వీరి పరిస్థితెలా ఉందో ఈ ఉదాహరణలు చాలు.

అందరికీ స్వాతంత్య్రం, సమానత్వం వచ్చి ఉంటే ఇలాంటి సామాజిక వివక్షలు కొనసాగవు కదా! గిరిజనులనూ ఉన్న ప్రాంతాల నుండి తరిమేసే యత్నాలు జరుగుతున్నాయి. వారు నివసించే కొండకోనల్లో ఏ నిక్షేపాలు బయటపడ్డా వారికి మూడినట్లే. ప్రకృతి సంపదను అడ్డగోలుగా బడా బాబులకు దోచిపెడుతున్న ప్రభుత్వం దళిత, గిరిజన, ఆదివాసీ, నిధులను కూడా దారి మళ్లిస్తోంది. వీరి నిధులను కామన్వెల్త్‌ ఆటలకు ఖర్చు పెట్టి దిగమింగారంటే వేరే ఉదాహరణెందుకు? అర్థరాత్రి మహిళ ఒంటరిగా నిర్భయంగా సంచరించిన రోజు స్వరాజ్య మొచ్చినట్టని గాంధీ అన్నారు. ఆ లెక్కనైతే మనకింకా స్వతంత్రం రానట్టే. ఎందుకంటే అర్థరాత్రి కాదుకదా పట్టపగలు, వందలాది మంది సమక్షంలోనూ నేడు రక్షణ లేదు. 20 ఏళ్ల కాలంలో 10 మిలియన్‌ల ఆడపిల్లల్ని పిండదశలోనే చంపేసేంతగా మనువాద భావజాలం వ్యాపించింది. ఇంతకన్నా ఏం కీర్తించుకోగలం? ఎక్కడా అభివృద్ధి లేదనడమూ సరికాదు. కార్లు బోలెడున్నాయి. ఎవరి చేతిలో చూసినా సెల్‌ఫోనే. ఇంకా ఎన్నో అంటూ చెప్పేవారున్నారు. కాదనలేం. దేశం అభివృద్ధి అయింది. సంపద పెరిగింది. కానీ అది అతి కొద్దిమంది చేతుల్లో పోగుపడింది. అందుకే అసమానతలూ పెరిగాయి. అవినీతీ పెరిగింది. ఒకశాతం హైపర్‌కార్లలో తిరుగుతుంటే చెప్పుల్లేని వారు 20 శాతం మంది. పట్టెడన్నం కోసం జనం పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ గోదాముల్లో బియ్యం ముక్కిపోతున్నాయి. కొనే శక్తి పేదలకు లేదు. ఉచితంగా ఇచ్చే భావం ప్రభుత్వానికి లేదు. పరాయిపాలన నుండి ఏ లక్ష్యాలనాశించి స్వాతంత్య్రాన్ని సాధించామో వాటికే నేడు ముప్పొస్తోంది. మన దేశ స్వాతంత్య్రం పట్ల శ్రద్ధ కలిగిన వారెవరైనా ప్రస్తుత పరిణామాలకు ఆందోళన చెందక తప్పదు. కర్రు కాల్చి వాత పెట్టే ప్రజాందోళన లేకపోయి ఉంటే ఈ పాలకవర్గాలింకా రెచ్చిపోయి దేశాన్ని టోకున అమ్మేసేవి. ప్రజాస్వామిక శక్తుల కృతనిశ్చయం, త్యాగాలకు వెరవని వాటి దీక్ష కొంతవరకైనా ఇంతవరకూ కాపాడాయి. ఆ శక్తులు బలం పుంజుకోవాలని స్వాతంత్య్ర స్ఫూర్తితో కోరుకుందాం.

డిప్యూటీ రాజా
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ
సీఎం సిఫారసు...గవర్నర్ ఆమోదం

దాదాపు 20 ఏళ్లకు మళ్లీ 'డిప్యూటీ' సీఎం
హోం శాఖ కూడా ఆయనకే?
పదువుల భర్తీలో అధిష్ఠానం బిజీబిజీ
తెలంగాణకు,పదవులకు సంబంధం లేదు
నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటా
నాకూ కులం ,ప్రాంతం,ప్రజల సెంటిమెంట్ ఉంది
'ప్రత్యేక' పరిష్కారంలో కిరణ్‌కు సహకరిస్తా
ఎస్సీ వర్గీకరణకు మా సోదరులకు ఒప్పిస్తా
'ఆన్‌లైన్'తో రాజనర్సింహ
కాంగ్రెస్‌లో రాజకీయం వేగంగా రంగులు మార్చుకుంటోంది. ఇన్నాళ్లూ ఒక సామాజిక వర్గానికే పెద్ద పీట వేసిన ఆ పార్టీ.. ఇప్పుడు 'సామాజిక న్యాయానికి' జై అంటోంది. అన్ని వర్గాలనూ దగ్గర చేసుకొనే దిశగా ప్రయాణం ప్రారంభించింది. పార్టీకి దూరమైన.. ఇన్నాళ్లూ దూరంగా ఉండిపోయిన వర్గాలను అక్కున చేర్చుకోవడమే లక్ష్యంగా పదవుల పంపిణీకి తెర తీసింది. ఒక్కో నియామకం జరుగుతున్న కొద్దీ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అధిష్ఠానం మార్కు సామాజిక రాజకీయ వ్యూహం తేటతెల్లమవుతోంది. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌పై గురిపెట్టి.. త్వరలో అసలైన 'పునర్వ్యవస్థీకరణ'కు తెర తీయబోతోందన్నది తాజా సమాచారం!!

హైదరాబాద్, జూన్ 10 : దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రాష్ట్రానికి మళ్లీ ఉప ముఖ్యమంత్రి వచ్చారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సిలరాపు దామోదర రాజనర్సింహను ఈ పదవి వరించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్ సిఫారసుకు గవర్నర్ నరసింహన్ శుక్రవారం రాజముద్ర వేశారు. 'ఆపరేషన్ ఏపీ'లో భాగంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఈ కీలక పదవి భర్తీకి పచ్చ జెండా ఊపింది.

ముఖ్యమంత్రిగా కిరణ్.. పీసీసీ చీఫ్‌గా బొత్స సత్యనారాయణ.. స్పీకర్‌గా నాదెండ్ల మనోహర్.. డిప్యూటీ స్పీకర్‌గా మల్లు భట్టివిక్రమార్క! తాజాగా, డిప్యూటీ సీఎంగా దామోదర రాజనర్సింహ!! కీలక నియామకాల ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానం తన వైఖరిని స్పష్టం చేస్తూ వస్తోంది. యువ రక్తం.. కుల సమీకరణం.. ప్రత్యామ్నాయ నాయకత్వమే తన విధానమని తేటతెల్లం చేస్తోంది. ఇక, ప్రత్యేకవాదిగా భావిస్తున్న.. ఉత్తరాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణను పీసీసీ చీఫ్‌గా నియమిస్తే.. సమైక్యవాదిగా ముద్ర పడిన తెలంగాణకు చెందిన రాజనర్సింహను డిప్యూటీ సీఎంగా ఎంపిక చేసింది.

అలాగే, సీఎం కిరణ్ తండ్రి అమర్‌నాథ్‌రెడ్డి, దామోదర్ తండ్రి రాజనర్సింహ కూడా రాష్ట్రంలో గతంలో మంత్రులుగా పనిచేసిన వారే కావడం మరో విశేషం. వాస్తవానికి, ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సమయంలోనే, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎస్సీ నేతను ఉప ముఖ్యమంత్రిగా నియమించనున్నారంటూ 'ఆంధ్రజ్యోతి' కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ పదవి రేసులో గీతారెడ్డి, రాజనర్సింహ పేర్లు ప్రధానంగా వినిపిస్తూ వచ్చినా.. తొలి నుంచి రాజనర్సింహ ముందు వరుసలోనే ఉన్నారు.

ఇటీవల ఢిల్లీ వెళ్లిన మంత్రి గీతారెడ్డి.. డిప్యూటీ సీఎం పదవికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ అధిష్ఠానం పెద్దలకు విజ్ఞప్తి చేశారు. అయినా, అధిష్ఠానం మాత్రం రాజనర్సింహ పేరునే ఖరారు చేసింది. దీంతో, కీలకమైన పదవులన్నింటినీ చకచకా అధిష్ఠానం భర్తీ చేసినట్లు అయింది. వాస్తవానికి, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే .. తెలంగాణ ప్రాంత నేతకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న సంప్రదాయం 1992 వరకూ కొనసాగింది.

1992 నుంచి 1994 వరకూ కోనేరు రంగారావు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఈ పదవి నియామకం జరగలేదు. మళ్లీ 17 ఏళ్ల తర్వాత రాజనర్సింహ ఆ పదవిలో నియమితులయ్యారు. ఆయన తెలంగాణ ప్రాంతానికే చెందినా.. సమైక్యవాదిగా ముద్ర పడ్డారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడిన 1969లో దామోదర్ రాజనర్సింహ తండ్రి రాజనర్సింహ కూడా ఇదే పంథాలో పయనించారు. అప్పట్లో ఆయనకు మంత్రి పదవి లభిస్తే.. ఇప్పుడు రాజనర్సింహను ఏకంగా డిప్యూటీ సీఎం పదవే వరించింది.

ఆనవాయితీ ప్రకారం.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలోనో.. ఆ లోగానో రాజనర్సింహకు హోం మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రితో సమానంగా ప్రోటోకాల్ దక్కేందుకు వీలుగా హోం శాఖను డిప్యూటీ సీఎంకు అప్పగించడం సంప్రదాయంగా వస్తోంది.

పదవులకు, తెలంగాణకు సంబంధం లేదు: రాజనర్సింహ
ప్రత్యేక రాష్ట్రానికి, పదవులకు సంబంధం లేదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. తెలంగాణ అంశం ప్రత్యేకమైనదని.. ప్రజాకాంక్షకు అనుగుణంగా యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్ఠానం తగిన నిర్ణయం తీసుకుంటాయన్న సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎంగా నియమితులైన తర్వాత శుక్రవారం రాత్రి ఆయన తన తల్లితో కలిసి బేగంపేటలోని కట్టమైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు, 'ఆన్‌లైన్'తో ప్రత్యేకంగా మాట్లాడారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించే అరుదైన అవకాశాన్ని అధిష్ఠానం తనకు ఇచ్చిందని చెబుతూ.. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్, సీఎం కిరణ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "వ్యక్తిగతంగా నాకు కొంత సామాజిక చిత్తశుద్ధి ఎక్కువ. ఏ పదవి వచ్చినా సేవ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తాను. నా ప్రజలకు, నా ప్రాంతానికి, ప్రభుత్వానికి సేవలందిస్తాను. మా నాయకులతో కలిసి 'టీమ్ వర్క్'తో ముందుకు సాగుతాను. కిరణ్ నాయకత్వంలో సమష్టితత్వంతో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తా. నాపై సమైక్య వాదినని, మరొకటని రకరకాల ముద్రలు ఉండవచ్చు.. కానీ, నేను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండేవాడిని. నాకు కూడా ప్రాంతం, కులం, నా ప్రజలపై సెంటిమెంట్ ఉంది.

నా సామాజిక వర్గానికి మేలు చేయాలన్న కాంక్ష కూడా ఎక్కువే'' అని వివరించారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తోందని, అది తీసుకునే నిర్ణయం ప్రజా విశ్వాసం పొందుతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి ఉపకరిస్తుందని స్పష్టం చేశారు. ఒక ప్రత్యేక పరిస్థితిలో తనకు ఇచ్చిన డిప్యూటీ సీఎం పదవిని.. ఈ ప్రత్యేక పరిస్థితుల పరిష్కారంలో సీఎం కిరణ్‌కు సహకరిస్తూ ముందుకు తీసుకెళతానని వివరించారు. ఉప ముఖ్యమంత్రి పదవి అలంకారమేమీ కాదని.. తాను 30 రోజులో.. 100 రోజులో పరిపాలన చేశాక అలంకారప్రాయమో కాదో చెప్పాలని విమర్శకులకు సూచించారు.

తాను తెలంగాణ ఏర్పాటుకు అనుకూలం కాకపోయినా ఆ ప్రాంతానికి చెందినవాడిగా డిప్యూటీ సీఎం పదవిని చేపట్టానన్న వాదన సరికాదన్నారు. తనకూ ప్రాంతీయ, సామాజిక, కుల అభిమానాలు ఉంటాయని చెప్పారు. ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా తనకూ తెలంగాణపై అభిమానం ఉందని రాజనర్సింహ చెప్పారు. తెలంగాణ ఎంత ప్రత్యేకమైనదో ఎస్సీ వర్గీకరణ అంశం కూడా అంతే ప్రత్యేకమైనదని చెప్పారు. ఈ రెండూ తీవ్రమైన అంశాలేనన్నారు. ఈ రెండింటినీ కాంగ్రెస్ అధిష్ఠానం పరిష్కరిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు తమ సోదరులను ఒప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పారు.

విలక్షణ నర్సింహ
మెదక్ జిల్లా ఆంథోల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దామోదర రాజనర్సింహది విలక్షణ వ్యక్తిత్వం. తన తండ్రి దివంగత మాజీ మంత్రి రాజనర్సింహ వారసునిగా 1989లో ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు.

పేరు: సిలారపు దామోదర్ రాజనర్సింహ
సన్నిహితులు పిలిచే పేరు: 'దాము'
తల్లిదండ్రులు: జనాబాయి, రాజనర్సింహ
భార్య : పద్మిని, కూతురు : త్రిష
పుట్టిన తేదీ : 05-12-1958
విద్యార్హతలు: బీఈ సివిల్ (ఉస్మానియా)
విద్యాభ్యాసం: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, న్యూసైన్స్ కాలేజి, ఉస్మానియా వర్సిటీ.
నిర్వహించిన పదవులు: 1989-94 వరకు ఎమ్మెల్యే, 1991-94 మధ్య రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, 2004లో ఎమ్మెల్యే, అసెంబ్లీ అండర్ టేకింగ్ కమిటీ సభ్యుడు, 2007లో ప్రాథమిక విద్యా శాఖ మంత్రి. 2009లో తిరిగి ఎన్నిక. వైఎస్, రోశయ్యల మంత్రివర్గాల్లో మార్కెటింగ్, గిడ్డంగుల మంత్రి, కిరణ్ కేబినెట్‌లో ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ మంత్రి. అదనంగా వ్యవసాయ శాఖ. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా నియామకం.

ఇష్టమైన ఆటలు: క్రికెట్, ఫుట్‌బాల్, చెస్
రాజకీయ బలం: నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో గ్రామస్థులను పేర్లతో గుర్తుంచుకుని పిలిచే సాన్నిహిత్యం. జిల్లాలో బలమైన గ్రూపునకు (పవర్ గ్రూప్) నాయకత్వం, ఎప్పుడు ఎవరిని ఎలా పైకి తేవాలో, ఎవరిని ఎక్కడ తొక్కాలో తెలిసిన అపర చాణక్యం, నియోజకవర్గంలో బలమైన ప్రత్యర్థులు లేకుండా ఏకఛత్రాధిపత్యం వహించడం.

విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్‌ కళాశాలలు

హైదరాబాద్‌(వి.వి.) : రాష్ట్రంలోని కార్పొరేట్‌ కళాశాలలు విద్యను వ్యాపారం చేస్తున్నాయని ఇబిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి ఆరోపించారు. వీటిపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తున్నాయన్నారు. ఇంటర్మీడియట్‌కు 30 నుండి లక్ష రూపాయల వరకూ అవకాశాన్నిబట్టి ఫీజులను వసూలు చేస్తున్నామని చెప్పారు. ఈ విధంగా అడ్డుఅదుపూ లేకుండా కార్పొరేట్‌ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను దోచుకుంటు న్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలు ఉన్నా, కోట్ల రూపాయలను ఖర్చుచేస్తున్నప్పటికీ ప్రభుత్వ విధానాలతో వాటికి ఆదరణ లభించడం లేదన్నారు. పేరెన్నికగ కార్పొరేట్‌ కళాశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించి అధికమొత్తం లో ఫీజులను గుంజుతున్నాయన్నారు. దీంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు మాత్రం కార్పొరేట్‌ విద్య మిద్యగా మారిందన్నారు. దీనికితగినట్లుగా అనుమతులు లేకుండానే గల్లీగల్లీలో బ్రాంచీలను ప్రారంభిస్తూ, లెక్కకుమించిన విద్యారు ్థలను చేర్చుకుంటున్నాయని చెప్పారు. కార్పొరేట్‌ కళాశాలలతో ప్రభుత్వం లాలూచీ పడడంతో వాటి అక్రమాలపై నిఘా, నియంత్రణ లేకపోతోందన్నారు.పలు కళాశాలల్లో మౌళిక వసతులు, తగినంత బోధనా సిబ్బంది, ఆటస్థలం లేకపోయినా భారీస్థాయిలో విద్యార్థుల నుండి ముక్కుపిండి మరీ ఫీజులను వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లుతెరిచి కార్పొరేట్‌కళాశాలల్లో ఫీజులను నియంత్రించి వాటి అక్రమాలు, దోపిడీలకు అడ్డుకట్ట వేయాలని రవీందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.
విద్యాహక్కు చట్టం అమలు ‘బడిబాట’ లో విద్యాభివృద్ధి పనులు
హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : ఈ నెల 13 నుంచి ప్రారంభం కావాల్సిన ‘బడిబాట’ కార్యక్రమంలో పలు విద్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి పాఠశాల విద్యా శాఖ అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసింది. అందులో విద్యా హక్కు చట్టం అమలు, ఎన్‌రోల్‌ మెంట్‌ పెంచడం, అక్షర అభ్యాసం, ఉచిత దుస్తులు పంపిణి వంటి అనేక కార్య క్రమాలు చేపట్టుతున్నారు. అయితే విద్యా వారోత్సవాల పేరుతో 13 నుంచి 18 వర కు నిర్వహించనున్న బడిబాటలో భాగంగా ఏ రోజు ఏయే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందనే షెడ్యూల్‌ను విద్యా శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ కార్యక్రమా లను తేదీల వారిగా అమలు చేయాలని ఆయా జిల్లాల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మండల విద్యాధికారులు, హెడ్‌ మాస్టర్లు ఈ కార్యక్రమ నిర్వ హణకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి...
జూన్‌ 13న:- విద్యా హక్కు చట్టం అమలతో పాటు ఎన్‌రోల్‌మెంట్‌ పెంచడం, అక్షరాభ్యాసం చేపించడం ఉచిత దుస్తుల పంపిణీ చేయడం. అలాగే పేద విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాల పంపిణీ తీరు తెన్నులు. మధ్యాహ్న భోజన పథ కం అవగాహన కార్యక్రమాలు. అందులో భాగంగానే స్థానిక ప్రజలు, పెద్దలు. తల్లి దండ్రులు కూడా పాల్గొనే చర్యలు తీసుకోవడం. అన్ని స్కూళ్ళలో మంచి రుచికరమైన ఆహారాన్ని అందించడం.

జూన్‌ 14న:- మాధ్యమిక విద్య పటిష్ట పరచడానికి 1000 హైస్కూళ్ళలో అందు కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులుచేత కాంపెక్స్‌లు ప్రారంభించడం. 500 హైస్కూళ్ళలో కాంప్లెక్స్‌ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం. తొమ్మిదవ తరగతి చదువుతున్న వారికి భవిష్యతు ఉపాధి, ఉన్నత చదువుల గురించి విద్యావేత్తలతో, ఎంప్లాయిమెంట్‌ అధికారులతో కౌన్సెలింగ్‌ ఇప్పించడం.

జూన్‌ 15న:- ‘సబల’ పథకాన్ని ప్రారంభించడం. వారికి స్కాలర్‌ షిప్‌లు మంజూ రు చేయించడం. కస్తూరిభా గాంధీ విద్యాలయాలలో ప్రత్యేకమైన ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ను నిర్వహించడం. మండల విద్యాధికారులు, హెడ్‌మాస్టర్లు స్థానిక కెజిబివీలలో పిల్లల ఎన్‌రోల్‌మెంట్‌ గుర్తించడం.

జూన్‌ 16న:- ప్రాథమిక విద్య పటిష్ట పరచడం కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం.

జూన్‌ 17న :- ప్రజా ప్రతినిధులతో రాష్ట్రంలో 355 మోడల్‌ స్కూళ్ళ ఏర్పాటుకు శంకుస్థాపనలు. అందుకోసం కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయడం.

జూన్‌ 18న :- పదవ తరగతి పరీక్షలో అధిక ఉత్తీర్ణత శాతం సాధించడానికి కృషి చేసిన టీచర్లను విద్యార్థులు, తల్లిదండ్రుల సమక్షంలో గౌరవించడం. మెరుగైన ఫలి తాలు సాధించడంలో ఒకరి అభిప్రాయాలను మరోకరు పంచుకోవడం. 6వ తరగతి నుంచి 10వ తరగతి నుంచి మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించడం. మంచి మార్కులు సాధించిన విద్యార్థుల చేత మిగితా విద్యార్థులకు తమ అభిప్రాయాలు తెలియజేసే విధంగా చర్యలు చేపట్టడం.

ఏబీసీడీ రానట్టే!
కోల్డ్ స్టోరేజీలోకి ఎస్సీ వర్గీకరణ
రాజ్యాంగ సవరణ యోచన విరమణ
రాష్ట్రాలతో సంప్రదింపులకు కేంద్రం నిర్ణయం!

ఇక ప్రతి రాష్ట్రంలో కమిషన్‌లు,అధ్యయనాలు తప్పనిసరి
అసెంబ్లీలూ తీర్మానాలు చేయాల్సిందే
రెండింట మూడొంతల రాష్ట్రాల అంగీకారం కావాలి
ఇదంతా జరగడం దాదాపు అసాధ్యం
ఓటు బ్యాంకు చేజారొద్దనే ఈ జాగ్రత్త !!
దళితుల్లో వెనుకబాటు గుర్తించండి
అభ్యున్నతికి చర్యలు చేపట్టండి
ఎస్సీ కమిషన్ తాజా యోజన
ఎస్సీ వర్గీకరణ అంశం అటకెక్కనుందా? ఇక 'ఏ, బీ, సీ, డీ'లు రానట్టేనా? ఎన్నాళ్లుగానో ఇదిగో అదిగో అంటున్న రాజ్యాంగ సవరణ కొండెక్కినట్టేనా? మొత్తం వర్గీకరణ ప్రక్రియే కోల్డ్ స్టోరేజీలోకి పోబోతోందా? ..కేంద్ర సామాజిక న్యాయ శాఖ తాజా వైఖరి చూస్తే వీటన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది.

హైదరాబాద్, మే 26 : ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ విషయంలో రాష్ట్రాలతో సుదీర్ఘ సంప్రదింపుల ప్రక్రియకు తెర తీయాలని కేంద్రం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారాన్ని చేజార్చుకున్న కాంగ్రెస్.. దళిత సమస్యలతో ఇకపై దాగుడుమూతలు ఆడరాదని, కొత్తగా మరిన్ని సమస్యలు కొని తెచ్చుకోరాదన్న నిశ్చయించుకున్నట్టు సమాచారం. దీంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్లను, అభిప్రాయ సేకరణ పేరిట, పూర్తిగా పక్కనపెట్టాలని కేంద్ర సామాజిక న్యాయశాఖ నిర్ణయించినట్టు తెలిసింది.

ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనకు వచ్చిన డిమాండ్లతో పాటు, కొత్తగా వచ్చే వాటిని సైతం రాష్ట్రాల మీదికే తోసేసి, చేతులు దులుపుకోవాలని అది భావిస్తోంది. ఇదే జరిగితే.. గడచిన మూడేళ్లుగా మాదిగలు, ఇతర ఎస్సీ ఉప కులాల ప్రజలు ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణ బిల్లు.. పూర్తిగా కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లినట్లే. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్ఆర్‌పీఎస్) పోరాట ఫలితంగా 2000 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమల్లోకి తీసుకొచ్చింది.

మాలలు ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ వారికి ప్రతికూల తీర్పు రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2004లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదే సంవత్సరం సుప్రీంకోర్టు మాలల పిటిషన్లను విచారించి, ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ కొట్టివేసింది. అనంతరం ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర అసెంబ్లీ మరోసారి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. మాదిగల పోరాట ఫలితంగా.. నాటి ముఖ్యమంత్రి వైఎస్ ఒత్తిడితో ఎస్సీ వర్గీకరణపై అధ్యయనానికి జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది.

దాని నివేదిక అనంతరం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, వర్గీకరణ కోసం రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర సామాజిక న్యాయ శాఖ ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదన గడచిన మూడేళ్లుగా ఏ దశలోనూ కేంద్ర మంత్రివర్గం ముందు చర్చకు రాలేదు. కేంద్ర స్థాయిలో లోతైన చర్చ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరగలేదు. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ అనేక పర్యాయాలు ఆమరణ దీక్షలకు దిగారు. జాతీయ పార్టీల నేతలను కలిసి వర్గీకరణకు మద్దతుగా లేఖలు సంపాదించారు. వాటిని ప్రధానికి అందించారు. వీటిపైనా కేంద్రం స్పందించలేదు.

ఇకపై ఇలా..
కాంగ్రెస్ రాజకీయ ఆలోచనలకు అనుగుణంగా.. ఎస్సీ వర్గీకరణ అంశంపై సామాజిక న్యాయ శాఖ హఠాత్తుగా నిర్ణయం మార్చుకుందన్నది విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం. మన రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కోరుతున్న మాదిగలు.. ఇతర రాష్ట్రాల్లో పైచేయిగా ఉన్నారు. చమర్లుగా పిలిచే ఈ వర్గం వారు ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల్లో బలమైన సామాజిక వర్గంగాను, గణనీయమైన ఓటు బ్యాంకుగాను ఉన్నారు. ఈ వర్గానికి చెందిన బడా నేతలు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి ఆగ్రహానికి గురికాకుండా చూసుకునే లక్ష్యంతో.. వ్యవహారాన్ని తెర వెనక్కి పంపుతున్నారు.

సంప్రదింపులు అంటే..
ఎస్సీ వర్గీకరణపై అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు అంటే.. వర్గీకరణ డిమాండ్‌ను కనీసం మరో పదేళ్లపాటు కోల్డ్ స్టోరే జీలో పెట్టడమేనని నిపుణులు చెబుతున్నారు. ఎస్సీ వ ర్గీకరణ డిమాండ్ ఆంధ్రప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోనే ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయంతో అన్నిచోట్లా వర్గీకరణ అమలు రద్దయింది. సామాజిక న్యాయ శాఖ తాజా నిర్ణయం ప్రకారం చూస్తే.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అంశంపై ఆయా ప్రభుత్వాలు చర్చించాలి. అంటే వర్గీకరణ అవసరం ఉందా లేదా అనే అంశపై అధ్యయనం చేయించాలి.

అవసరమైతే కమిషన్‌లు ఏర్పాటు చేసి పరిశీలన జరిపించాలి. అంటే.. ప్రతీ రాష్ట్రానికి ఉషా మెహ్రా లాంటి కమిషన్ ఏర్పాటు చేయాలన్న మాట! ఆ తర్వాత ఆ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా.. అసెంబ్లీలో వర్గీకరణ అంశంపై తీర్మానం చేయాలి. ఎస్సీ వర్గీకరణ చేయాలని దేశంలో మూడింట రెండొంతుల మెజారిటీతో అసెంబ్లీలు తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. అప్పుడు మాత్రమే కేంద్రం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కోల్డ్ స్టోరేజీ నుంచి బయటకు తీయగలదు.

ఒకవేళ.. ఎక్కువ రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ అవసరం లేదని తీర్మానం చేస్తే, వర్గీకరణ అంతే! పునియా మాట ఇదీ! ఇదంతా ఒక ఎత్తైతే జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పి.ఎల్.పునియా కూడా ఎస్సీ వర్గీకరణపై దేశంలోని అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. దళితుల్లో వెనుకబాటుతనాన్ని గుర్తించి, దాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించినట్లు సమాచారం.

కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతాం: ఎమ్మార్పీఎస్
ఎస్సీ వర్గీకరణకు రాజ్యాంగ సవరణ చేయడం ఇష్టం లేకనే కాంగ్రెస్ సర్కారు సంప్రదింపుల ప్రక్రియను చేపడుతోందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ ఆరోపించారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో మాదిగలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
కార్మిక చట్టాల అమలకు దేశ స్థాయిలో ఉద్యమం !
విజయనగరం,మేజర్‌న్యూస్‌ః కార్మిక చట్టాల అమలకు 5లక్షల మందితో ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నామని రాష్ట్ర ఏఐటీయూసీ కార్యదర్శి టి.నరసింహన్‌ తెలియజేశారు.ఆదివారం స్థానిక అమర్‌ భవన్‌లో జరిగిన పీఏసీఎస్‌ సిబ్బంది యూనియన్‌ జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.దేశవ్యాప్తంగా పీఏసీఎస్‌ సిబ్బంది సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.కార్మిక చట్టాల 150కి పైగా ఉన్నప్పటికీ అవేవీ అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వాలు ధరలు అదుపు చెయ్యడంలేదన్నారు.కార్మిక చట్టాలను అమలు చెయ్యడంలో తాత్సారం చేస్తున్నాయన్నారు. జట్లు,ముఠాల పేరుతో 46 కోట్ల మంది కార్మికులు దయనీయంగా జీవితాలు నెట్టుకొస్తున్నారన్నారు.2004 నుంచి పింఛన్లు ప్రభుత్వాలు రద్దు చేశాయన్నారు.పింఛను ప్రతీ ఒక్కరికీ వర్తింపజేయాలని తాము పోరాటం చేస్తున్నామన్నారు.46 కోట్లలో 40 కోట్ల మంది అసంఘటిత రంగాలలో కార్మికులగా ఉన్నారన్నారు.కాంట్రాక్టు ప్రాతిపధికన పనిచేస్తున్న ఉద్యోగులు కూడా కార్మికులగానే ఉద్యోగ,సామాజిక భద్రత కోల్పోయారన్నారు.

మన రాష్ట్రంలో 5లక్షల మంది అసంఘటిత రంగంలో కార్మికులగా ఉన్నారన్నారు. ఈ వ్యవస్థను రూపు మాపి సామాజిక భద్రత కల్పించాలని తాము అన్ని కార్మిక సంఘాలతో కలిసి ప్రభుత్వాలను డిమాండు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ వాటాలు అధికంగా ఉన్న, లాభాలు ఆర్జించే బీహెచ్‌ఈఎల్‌ లాంటి సంస్థలను ప్రభుత్వం ప్రైవేటు పరం చెయ్యడానికి సిద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు. ఆర్థికంగా ఆదుకునే పెట్రో ఉత్పత్తుల కంపెనీలను ప్రైవేటు రంగానికి అప్పజెప్పి నేడు ప్రైవేటు రంగాలు చెప్పిన మాటను జవదాటలేని కేంద్ర ప్రభుత్వం తొమిది నెలల్లో ఎనిమిది దఫాలు ధరలు పెంచిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బేరల్‌ ధర 34 శాతం ఉంటే మన ప్రభుత్వాలు 75 శాతం ధరలు పెంచి మధ్య, సామాన్య తరగతులు జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. నెలకు రూ. కోటి తీసుకున్న జీతగాళ్ళు ప్రైవేటు ఆర్గనైజేషన్లలో ఉన్నారన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు ప్రస్తుతం నెలకు రూ. లక్ష గౌరవ వేతనంగా పొందుతున్న నేపథ్యంలో సామాన్యునికి కనీసం రూ. 10వేలు జీతంగా చెల్లించలేని దౌర్భాగ్య ప్రభుత్వాలు కొనసాగుతున్నాయన్నారు.

వీటిపై ప్రజలు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల్లో అవగాహన కల్పించి ఉద్యమాలను తీవ్రతరం చేసి కార్మిక చట్టాలు అమలకు ముందుకెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నామన్నామని ఆయన విలేకరులకు వివరించారు.
జీఓ 151 యధాతదంగా అమలు చెయ్యాలి ః రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2009 జూన్‌ నెలలో చేసిన 151 జీఓ నేటికీ అమలు కాకపోవడంపట్ల ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యగా జీఓలు ప్రటించడం ఆ తరువాత వాటిని అమలు చెయ్యకపోవడం జరుగుతోందన్నారు. దీంతో ఉద్యోగులు, కార్మికులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమన్నారు. ఈ జీఓ చేసి మూడేళ్ళు అయినప్పటికీ ఏదో ఒక వంకపెట్టి పీఏసీఎస్‌ సిబ్బందిని ప్రభుత్వం ఇరకాటంలో పెట్టి వారి జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. సొసైటీలకు వచ్చిన లాభాలపై వీరి జీతాలు ఇవ్వాలని నాబార్డు నిర్ణయించడం ఎంతవరకు సబబు అన్నారు.

ఒకపక్క రైతుల రుణాలు మాఫీ చేస్తూ, సబ్సీడీలు ప్రకటిస్తూ, ఉచిత విద్యుత్తు ఇస్తూవుంటే ఏ విధంగా సొసైటీలకు లాభాలు వస్తాయని ఆయన ఎదురుప్రశ్న వేశారు. ఇచ్చిన రుణాలు రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేసే సత్తా ప్రభుత్వానికి ఉండాలన్నారు. సొసైటీలకు వచ్చే లాభాలతో సిబ్బంది జీతాలకు ముడిపెట్టడం సమంజసం కాదన్నారు.ఆధాయంతో వీరి జీతాలకు ముడిపెట్టినట్లైతే.. ఆదాయం రాని పాఠశాలలు, పోలీసు, మెడికల్‌ తదితర శాఖలు ఏమి లాభాలు ఆర్జించిపెడుతున్నాయి.. వీరికి నెలయ్యేసరికి జీతాలు ఖజానాల ద్వారా అందజేయడం లేదా అని ఆయన నిలదీశారు. నేడు పీఏసీఎస్‌లలో పనిచేస్తున్న సిబ్బంది రూ. 1000, రూ. 1,500లు, రూ. 2000లు జీతంతో మండుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో కుటుంబాలను ఎలా నెట్టుకొస్తున్నారో అనేది సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న దేశంలో యూపీఏ, ఇక్కడ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదన్నారు.

రాష్ట్రంలో పీఏసీఎస్‌లలో 10వేల మందికి పైబడి సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. 20 ఏళ్ళుగా వీరు అరకొర జీతాలతో జీవితాలు సాగిస్తున్నప్పటికీ ప్రభుత్వం జీఓలమీద జీఓలు చెయ్యడమే తప్ప అమలు చెయ్యడం లేదని ఆయన విమర్శించారు. గత నెలలో పీఏసీఎస్‌ సిబ్బంది యూనియన్‌ రాష్ట ప్రధాన కార్యదర్శి వి. కృష్ణంరాజు నిరాహార దీక్షకు పూనుకోగా.. ఆ శాఖ కార్యదర్శి, మినిస్టర్‌ కాసు కృష్ణారెడ్డి తదితరులు వచ్చి రాజీమంత్రంతో దీక్షను విరమింపజేశారన్నారు. నాబార్డు, ఆప్కాబ్‌ స్టేట్‌, కో ఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌లతో సమీక్షించి జీఓను అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా ఇంతవరకు అమలు కాలేదన్నారు. ఇటీవల సహకార శాఖలో ఉద్యోగాల భర్తీ చెయ్యాలని ప్రభుత్వం తలచిందన్నారు.

ఈ భర్తీలో ఇంతవరకు ఎన్నో ఆర్థిక ఒడుదొడుకులకు, ఒత్తిళ్ళకు సతమతమై పనిచేస్తున్న సిబ్బందిలో సీనియర్లను, అర్హత ప్రాతిపదికగా ఈ ఉద్యోగాల్లో భర్తీ చెయ్యాలని తమ యూనియన్‌ డిమాండు చేస్తోందన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించని పక్షంలో మిగిలిన సంఘాలతో కలిసి సమ్మెకు ఉపక్రమిస్తామని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశం అనంతరం జిల్లా పీఏసీఎస్‌ సిబ్బంది తో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీఏసీఎస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. కృష్ణంరాజు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం. మురళీధరరావు, ఉపాధ్యక్షుడు సాగి రంగరాజు, పీఏసీఎస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు బి. రామునాయుడు, కార్యదర్శి వర్రి. సన్యాసిరావు, ఉపాధ్యక్షుడు బి. బాస్కరరావు, ఏఐబీఈఏ కోఆర్డినేషన్‌ కమిటీ కార్యదర్శి నల్లా బాబాజీ, పీఏసీఎస్‌ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.