ఆస్తమించిన హక్కుల సూరీడు

హన్మకొండ, మే 14 : మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బుర్రా రాములు శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న రాములు పరిస్థితి మరింత క్షీణించడంతో హన్మకొండలోని ప్రౖౖెవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం సుమారు 1.20 గంటలకు కన్నుమూశారు. ప్రొఫెసర్ రాములు మరణ వార్త తెలిసి ఆయన అభిమానులు, మానవహక్కుల కార్యకర్తలు, సహాద్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. భోరున విలపించారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

ఓరుగల్లు కోటలో పుట్టి: కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ రాములు స్వస్థలం వరంగల్ పడమర కోట. ఉద్యోగ రీత్యా ఆ యన విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని క్వార్టర్‌లోనే పదేళ్లుగా ఉంటున్నారు. డాక్టర్ రాములుకు భార్య స్వరూప, ఇద్దరు కూతుళ్ళు జన, రణ, తల్లి ఐల మ్మ, ఇద్దరు సోదరులు, అయిదుగురు చెల్లెళ్ళున్నారు. సోదరుడు బుర్రా రమేష్ భోపాల్‌లోని ఎన్‌సిఆర్‌టిలో ప్రొఫెసర్. మరో సోదరుడు భాస్కర్ బ్యాంక్ మేనేజర్.

రాజ్యహింసకు వ్యతిరేకంగా... ప్రొఫెసర్ రాములు తన యావజ్జీవితాన్ని మానవ హక్కుల పరిరక్షణ కోసమే వెచ్చించారు. ఎక్కడ హక్కులకు భంగం కలిగితే అక్కడ వాలేవా రు. నిజనిర్ధారణ జరిపేవారు. బాధితు ల పక్షాన గళం విప్పేవారు. రాజ్యాన్ని ప్రశ్నించేవారు. రాజ్యహింసను నిర్భయంగా నిలదీసేవారు. అణగారిన వర్గాల పక్షాన న్యాయం కోసం పోరాడేవారు. ఫ్రొఫెసర్ బుర్రా రాములు కేయూలో అధ్యాపకుడిగా కన్నా మానవహక్కుల నేతగానే సుపరిచితుడు. మొదట పౌర హక్కుల నాయకుడిగా, ఆ తర్వాత మానవ హక్కుల వేదిక ఫోరం రాష్ట్ర నేతగా ఆయన ప్రస్థానం కొనసాగింది.

అంచెలంచెలుగా 1954 జూన్10వ తేదీన ఖిలా వరంగల్‌లో మధ్య తరగతి కుటుంబం లో జన్మించిన ప్రొఫెసర్ రాములు ఉ న్నత విద్యావేత్తగా అంచెలంచెలుగా ఎదిగారు. తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించడం చిన్నతనం నుంచే అలవర్చుకున్నారు. మానవహక్కుల హరణకు వ్య తిరేకంగా ప్రశ్నించు, నినదించు అని నిత్యం ప్రభోదించారు. పాఠశాల చదు వు ఖిలా వరంగల్‌లోనే సాగింది. 1978లో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి బీఏ, 1980లో ఎంఏ, ఇదే విశ్వవిద్యాలయం నుంచి 1985లో ఎంఫిల్, 1990లో పిహెచ్‌డి పట్టాపుచ్చుకున్నారు. అగ్రికల్చరల్ ఎకనమిక్స్, పొలిటికల్ ఎకనమిక్స్‌లో నిష్ణాతులు. ఆయనకు ఇష్టమైన సబ్జెక్టులు కూడా ఈ రెండే.

విస్తృతంగా పరిశోధనలు విద్యాబోధనతో పాటు మరో ప్రక్క గ్రా మీణ జీవన స్థితిగతులపై పరిశోధనలను కూడా కొనసాగించారు. 1996లో యూజీసీ సహకారంతో తెలంగాణలో గ్రామీణ అనియత మార్కెట్లపై రెండేళ్ళే పరిశోధన చేశా రు. 2000 సంవత్సరంలో కేరళలోని తిరువనంతపురం సీడీసీ ఆర్ధిక సహకారంతో మూడేళ్ళ పాటు గ్రామాల సైద్ధాంతిక పునఃసర్వే-గ్రామీణ జీవనంపై అధ్యయనం అనే అంశంపై పరిశోధన చేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు. పలు పరిశోధనా పత్రాలను సమర్పించారు. 2007 ఆగస్టులో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన సదస్సులో మానవ హక్కుల అభ్యసనానికి భోధనాపరమైన పాఠ్యాంశాల రూపకల్పన పై పరిశోధనా పత్రాన్ని సమర్పించా రు.

అధ్యాపకుడిగా... 1983 నుంచి 1994 వరకు యూనివర్సిటీ అర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1994 నుంచి 2008 వరకు యూనివర్సిటీ కళాశాల, పీజీ కళాశాలలో తన అధ్యాపక వృత్తిని కొనసాగించారు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఎస్‌డీఎల్‌సీ, తెలుగు అకాడెమికి అవసరమైన పాశ్యాంశాలను, పుస్తకాలను, ఇతర మెటీరియల్‌ను సమకూర్చారు. జాతీయ సాక్షరతా మిషన్ కింద సెంటర్ ఫర్ అడల్ట్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అక్టివిటీస్ ప్రొగ్రాం ఆఫీసర్‌గా రెండు సంవత్సరాలు పని చేశారు.

హక్కుల కోసం నిత్యం పోరు విద్యాబోధనతో పాటు చుట్టూ ఉ న్న సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై ఆయన నిత్యం తీవ్రంగా స్పందించేవారు. హ క్కుల హరణను ఆయన ఏనాడు సహించేవారు కాదు. వాటి పరిరక్షణ కు ఎంతటి ప్రతిఘటననైనా, ఒత్తిళ్ళపైనా నిర్భయంగా ఎదుర్కొనేవారు. ఎంత దూరమైన వెళ్ళేవారు. రాజ్యం ఆయనను ఎంతగా భయపెట్టాలని చూసినా అంతకు రెండింతలు దానికే సింహస్వప్నంగా నిలిచారు. మానవహక్కుల రాష్ట్ర అధ్యక్షుడిగా అట్టడుగువర్గాలకు అండగా నిలిచారు. విద్యార్ధి దశలో కళాశాలలో, విశ్వవిద్యాలయంలోనూ విద్యార్ధి ప్రతినిధిగా వారి హక్కుల కోసం డా. రాములు పోరాడారు. అధ్యాపకుడిగా కూడా తన వం తు సేవలను అందించారు.

సాంస్కతిక రంగంలోనూ.. సాంస్కృతిక, క్రీడా తదితర కమిటీల్లో సభ్యునిగా కీలక పాత్రలు పోషించారు. పలు సంస్ధలతో అయనకు అనుబంధం ఉంది. ఇండియన్ పొలిటికల్ ఎకనమి, ఎపిఈఏలలో ప్రొఫెసర్ రాములు సభ్యుడు. మహిళా అధ్యయానాలపై ముద్రించిన కాకతీయ యూనివర్సిటీ జర్నల్‌కు సంపాదకత్వం కూడా వహించారు.

రచయితగా.. ప్రొ.రాములు సామాజిక అంశాలు నేపధ్యంగా పలు పుస్తకాలను రాశారు. 1995లో ఇదో సారాకథ, 2005లో ప్రాచీన భారత రాజకీయ ఆర్ధిక నిర్మాణాలను ప్రతిబింబించిన మహిళల జీవితం, స్వాతంత్య్రానంతర భారత దేశం-స్త్రీల స్థితిగతులు, నమూనా రూపాంతరం- మానవ అభివృద్ధి-జీవితం వీటిలో కొన్ని. మానవ జీవితంతో ముడిపడిన వివిధ అంశాలను స్పృషిస్తూ అయన రాసిన అనేక వ్యాసాలు వివిధ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.

వరంగల్ హక్కుల పెద్దదిక్కు

ఒక ఏడాది ఏడాదిన్నకాలంలో తెలుగునేల మీద హక్కుల ఉద్యమం చాలా విషాదాలు ఎదుర్కోవలసి వచ్చింది. డాక్టర్ సి.ఆర్.రాజగోపాలన్, ఎస్.ఆర్. శంకరన్, కె .జి. కన్నబిరాన్ ఇంచుమించు నిండు జీవితాలు గడిపి పోయారనుకుంటే గొట్టిపాటి నరేంద్రనాథ్, కె.బాలగోపాల్‌లు అర్థాంతరంగా వెళ్ళిపోయారు. ఆ నష్టాల నుంచి కష్టాల నుంచి హక్కుల ఉద్యమం కూడదీసుకుని గ్రీన్ హంట్ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిఘటనోద్యమం బలం పుంజుకుంటున్న తరుణంలో ఇప్పుడు బుర్రా రాములు పోయారు.

డాక్టర్ బుర్రా రాములు మానవ హక్కుల సంఘం మొదటి అధ్యక్షుడు. ప్రస్తుత ఉపాధ్యక్షుడు. బాల్‌గోపాల్, బుర్రా రాములు ఇద్దరూ ఒకే వయసులో 57వ ఏట పోయారు. 1953లో కాళోజీ 'నా గొడవ' ఆవిష్కరిస్తూ శ్రీ శ్రీ ఆయనను లూయీ ఆరగాన్‌తో పోల్చారు. రెండో ప్రపంచయుద్ధకాలంలో ఫ్రాన్స్‌లో కవులందరూ యుద్దరంగానికి దూరంగా ఉంటే అరగాన్ ఒ క్కడూ నిలిచి పోరాడాడు. 1985లో రామనాథం హత్య తర్వాత ఇంచుమించు ఒక దశాబ్దంపాటు కొనసాగిన నిర్బంధంలో వరంగల్‌లో హక్కుల ఉద్యమంలో నిలబడి కలబడినవాడు బుర్రా రాములు. కాళోజీ ఉన్నంత కాలం ఆయనతోపాటు నిలబడినారు.

1989-90 నాటికి నర్రా ప్రభాకర్ రెడ్డి సాహసించి పౌరహక్కుల రంగంలోకి అభిమన్యునివలె దూకగానే ఆయనకు వెన్నుదన్నుగా నిలబడినాడు. టాడా వంటి దారుణ అణచివేత చట్టాలతో పోరాడుతూ నర్రా ప్రభాకర్ రెడ్డి పద్మవ్యూహంలో దూరిన అభిమన్యుని వలె నే అమరుడయ్యాడు. రాజ్య హత్యకు డాక్టర్ రామనాథం, జాపా లక్ష్మారెడ్డిల వలెనే గురయ్యాడు. అప్పుడు హక్కుల కాడిని బుర్రారాములే ఎత్తు కోవాల్సి వచ్చింది.

పైగా యువ కార్యకర్తలెవరూ వరంగల్ వంటిచోట రాజ్యం కన్నెర్రకు గురయితే నిలదొక్కుకోవడం క ష్టం గనుక బాలగోపాల్ నాయకత్వ బాధ్యతలు బుర్రా రాములుపైననే మోపుతుండేవాడు. ముఖ్యంగా కాళోజీ కూడా కన్నుమూసిన తర్వాత వరంగల్‌లో హక్కుల ఉద్యమానికి మిగిలిన పెద్ద దిక్కు బుర్రా రాములే అయ్యాడు. ఆ లోటు ఒక లాటిన్ అమెరికా నగరాన్ని తలపించే వరంగల్‌తో నాలుగు దశాబ్దాల సన్నిహిత పరిచయం చేయటమే తప్ప ఎంత పూడ్చుకోలేనిదో పోల్చుకోలేం.

బుర్రా రాములు వరంగల్‌లో పుట్టి అక్కడ సామాజిక ఉద్యమాలతో ఎదిగాడు. 1974లో ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ స్టూండెంట్స్ యూనియన్ ఏర్పడినప్పుడు దానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సికెఎం కాలేజి విద్యార్థి సత్యనారాయణరావు ఎన్నికయ్యాడు. అప్పటికే సత్యనారాయణరావుతో వరంగల్ ప్రజాస్వామిక విప్లవ విద్యార్థి ఉద్యమాల్లో చరుకుగా పాల్గొంటున్న బుర్రా రాములు పీడిఎస్‌యు జిల్లా నాయకుడయ్యాడు. 1980 నాటికే ఆయన పిడిఎస్‌యు రాష్ట్రస్థాయి నాయకత్వంలోకి వచ్చాడు. 1978 నుంచి 84 వరకు వరుసగా కాకతీయ యూనివర్సిటీలో విప్లవ విద్యార్థి సంఘాల ఐక్య సంఘటనయే ఎన్నికల్లో గెలిచింది.

1982లో బుర్రా రాములు అధ్యక్షుడుగా, పులి అంజయ్య ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కెయు విద్యార్థి సంఘం బహుశా యూనివర్సిటీ చరిత్రలో విప్లవ అక్షరాలతో లిఖించ దగినది. పులి అంజయ్య, గోపగాని ఐలయ్య, లింగమూర్తి వంటి విప్లవ విద్యార్థుల సాహచర్యంలో బుర్రా రాములు ఆర్ఎస్‌యు, పిడిఎస్‌యుల సైద్ధాంతిక, మిత్ర వైరుధ్యాలను పరిష్కరించుకుంటూ కూడా ఉజ్వలమైన ప్రజాస్వామిక విద్యార్థి ఉద్యమాన్ని క్యాంపస్‌లో నిర్మాణం చేయడానికి దోహదం చేసినాడు.

బుర్రా రాములు అర్థ శాస్త్రంలో ఎంఏ చేసి ప్రొఫెసర్ శివరామకృష్ణ రావు దగ్గర పిహెచ్‌డి చేసి కాకతీయ అర్థశాస్త్ర విభాగంలోనే అధ్యాపకుడుగా చేది ప్రొఫెసర్ అయ్యాడు. పుట్టిన ఊళ్ళో జ్ఞానం తెలిసిన దగ్గర్నుంచీ చుట్టూ ఉన్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ చదువుతూ, సమాజాన్ని చదువుతూ పోరాడుతూ ఉన్నత విద్యలు పొందడమే కాకుండా నిరంతరం ఆ విద్యను సమాజపరం చేస్తూ తన ఊరికి, ప్రజలకు సేవ చేయడం కేంద్రంగా పెట్టుకొని దేశమంతా విస్తరించడం ఒక సార్థక జీవితం.

బాలగోపాల్ తర్వాత హక్కుల సంఘాల్లో అంతే విస్తృతంగా తిరిగిన హక్కుల కార్యకర్తలు చాల తక్కువగా ఉంటారు. కాశ్మీరు, మణిపూర్, ఛత్తీస్‌గడ్‌లలో ఎక్కడ రాజ్యహింస తన దమన నగ్న రూపంతో విరుచుకుపడితే అక్కడికి నిజనిర్ధారణ సంఘాల్లోనూ, పోరాట సంఘీభావ పర్యటనల్లోనూ రాములు వెళ్ళేవారు. అక్కడ ప్రజలపై రాజ్యహింసను ఇక్కడ వివరించి ఒక సమన్వయాన్ని, సంఘటన సంఘీభావాన్ని నిర్మించడానికి కృషి చేసిన హక్కుల ఉద్యమ నాయకుల్లో బుర్రా రాములు ఒకరు. రాములు ప్రయత్నపూర్వకంగా ప్రజల భాషలో ప్రజలతో మాట్లాడే పద్ధతిని అలవర్చుకున్నాడు.

ప్రజలకు సులభమయ్యే పద్ధతిలో, ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజలకు అర్థమయ్యే ఉపన్యాస ధోరణిని ఆలవోకగా అందిపుచ్చుకున్నాడు. బుర్రా రాములు సాహిత్య రంగంలో కూడా అరుదయిన కృషి చేశాడు. ఇటీవలి కాలంలో చాల కథలు రాసాడు. సైద్ధాంతిక, విశ్లేషణ వ్యాసాలు రాశాడు. రావిశాస్త్రి ఆరు సారా కథలకు కొనసాగింపుగా ఆయన రాసిన 'ఏడో సారా కథ' ఎంతో చర్చితమై ప్రచారాన్ని పొందింది. సాహిత్య సమవాకారం పేరుతో తేన్నేటి సూరి, స్వర్గంలో పాణిగ్రాహి పేదుతో శివసాగర్ రాసిన ఫ్యాంటసీల తర్వాత బుర్రా రాములు రాసిన ఏడో సారా కథయేనని బాలగోపాల్‌వంటి సాహిత్య విమర్శకులు అభిప్రాయపడ్డారు.

బుర్రా రాములు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఒక ప్రజాస్వామిక హక్కుల ఉద్యమంగా భావించి అందులో వరంగల్ జిల్లావరకు విస్తృతంగా పర్యటించాడు. వరంగల్ బయట చాలా ముఖ్యమైన మానవ హక్కుల వేదిక కార్యకలాపాలు లేని సమయమంతా ఆయన తెలంగాణ ఉద్యమానికే కేటాయించాడు.

పెదముప్పారంలో జరిగిన అటువంటి సభలో నాకు కూడా ఆయనతో పాటు పాల్గొనే అవకాశం కలిగింది. మిట్టుపల్లి సరేందర్ 'శంకరా' అని ఒక అమరునిపై రాసిన పాట అడిగి పాడించుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రజలకోసం ముప్ఫై ఏళ్లుగా విద్యార్థి రంగంలో, హక్కుల రంగంలో కృషి చేస్తున్నా బుర్రా రాములు ఏకాకిగా తన కుటుంబపరంగా ఎంతో ప్రయాసను, కష్టాలను అనుభవించాల్సి వచ్చింది.

ఆయన సహచరి ఏడాది క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయి నెలల తరబడి హైదరాబాదు ఆసుపత్రిలో చికిత్స పొందవలసి వచ్చింది. అమె ఇంకా కోలుకోకుండానే జనవరి నెలలో బుర్రా రాములుకు క్యాన్సర్ అని బయటపడింది. క్యాన్సర్ వ్యవస్థతో పోరాడుతున్న వ్యక్తి బుర్రా రాములు తన అనారోగ్యాన్ని చాలా ధైర్యంతో ఎదుర్కొన్నాడు.

కానీ చాలా వేగంగా ఆయన శిథిలమవుతూ పోయాడు. మే 10వ తేదీన సికిందరాబాదు యశోదా ఆసుపత్రిలో ఆయనను ఆఖరి సారిగా చూడాలని వెళ్ళినపుడు శరీరం నిండా బంధనాలతో, కృత్రిమ శ్వాసతో ఉన్న ఆయనను 'గుర్తు పట్టారా?' అని అడిగాను. 'అయ్యో?!' అన్న ఆయన వ్యక్తీకరణ - అదేం ప్రశ్న అన్న ఆయన అలర్ట్‌నెస్-అదే ఆయన హక్కుల ఉద్యమంలో చూపిన అనవరత ప్రజాస్వామిక జాగరూకత! చిరకాల మిత్రునికి కన్నీటి వీడ్కోలు...

-వరవరరావు

ఆకలితో ఎవరూ చనిపోరాదు

  • 150 పేద జిల్లాలకు అదనపు ఆహార ధాన్యాలు
  • కేంద్రానికి సుప్రీం ఆదేశం
  • బిపిఎల్‌ నిబంధనల సవరణకు సూచన
దేశంలో ఎవరూ ఆకలితో చనిపోరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. తాము నియమించే కమిటీ పర్యవేక్షణలో దేశంలోని 150 పేద జిల్లాలకు అదనంగా 50 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. జస్టిస్‌ డిపి వాద్వా కమిటీ మార్గదర్శకంలో సమాజంలోని పేదలకు ఈ వేసవిలో అదనంగా ఆహార ధాన్యాలు పంచాలని జస్టిస్‌ దల్వీర్‌ భండారి, దీపక్‌ వర్మతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ఈ కమిటీ కేంద్రంతో చర్చించి, బలహీన సెక్షన్ల ప్రజలను గుర్తిస్తుందని, లక్ష్యిత లబ్ధిదారులకు ఆహార ధాన్యాలను సిఫార్సు చేస్తుందని కూడా ధర్మాసనం చెప్పింది. కేంద్రం తమకు కేటాయించిన ఆహార ధాన్యాలను ముందుగా వినియోగించుకోవాలని, తర్వాత అదనంగా కేటాయించిన వాటిని పంపిణీ చేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కూడా కోర్టు ఆదేశించింది. ఆకలి చావులతో దేశంలో ఎక్కువ మంది మరణించడంపై ఈ నెల 10న కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చే రెండు వారాల్లో 50 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. గోదాములు నిండిపోతే లేదా ఆహార ధాన్యాలు పాడైపోతుంటే దారిద్య్రరేఖకు దిగువనున్న (బిపిఎల్‌) కుటుంబాలకు, అంత్యోదయ అన్న యోజన (ఎఎవై) కుటుంబాలకు వాటిని సబ్సిడీ ధరలకు ఎందుకు పంపిణీ చేయడం లేదని కోర్టు మరోసారి కేంద్రాన్ని ప్రశ్నించింది. పంజాబ్‌లో తరచూ భారీ సంఖ్యలో ఆహార ధాన్యాలు పాడైపోతున్నాయని పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పియుసిఎల్‌) అనే సంస్థ చేసిన ఫిర్యాదుపై కోర్టు తీవ్రంగా స్పందించింది. 'పేదలకు వాటిని సబ్సిడీ ధరలపై ఎందుకు సరఫరా చేయకూడదు' అని సొలిసిటర్‌ జనరల్‌ను ప్రశ్నించింది. 'మేము మిమ్మల్ని మళ్లీ కోరుతున్నాం. వాటిని పంపిణీ చేయండి. భారీ ఖర్చుతో మీరు ఆహార ధాన్యాలను సేకరిస్తున్నారు. అయితే కొత్త పంటల ద్వారా వచ్చే ధాన్యాన్ని నిల్వ చేయడానికి మీకు తగిన సామర్థ్యం లేదు. పంటల దిగుబడి బాగా వచ్చిన ప్రతిసారీ ఇలాంటి సందర్భాలే ఎదురవుతున్నాయి. దేశంలో మూడు వేల మంది ఆకలితో చనిపోయి ఉండొచ్చు. మూడు వేలు కాదు, మనలాంటి దేశంలో ఆకలితో కనీసం ముగ్గురు చనిపోయినా అది తీవ్ర ఆందోళనకరం' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
బిపిఎల్‌ నిబంధనలు సవరించాలి..
దారిద్య్రరేఖకు దిగువనున్న (బిపిఎల్‌) వారిని నిర్ణయించేందుకు ప్రస్తుతమున్న తలసరి నిబంధనలను సవరించాల్సిందిగా ప్రణాళిక సంఘానికి అత్యున్నత న్యాయస్థానం సూచించింది. మార్చి 2011 లేదా తదనంతర తేదీలను పరిగణనలోకి తీసుకొని నిబం ధనల్లో మార్పులు చేయాలని సూచించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ క్రమబద్ధీకరణకు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా దల్వీర్‌ భండారి, దీపక్‌ వర్మ నేతృత్వంలోని ధర్మాసనం పలు అంశాలను ప్రస్తావించింది. ప్రణాళిక సంఘం ప్రకారం రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో తలసరి ఆదాయం రూ.15, పట్టణ ప్రాంతాల్లో తలసరి ఆదాయం రూ.20. 'బిపిఎల్‌కు దిగువనున్న వారెవరు?' అనే దానికి కొలబద్ద ఇదేనా అని ధర్మాసనం ప్రశ్నించింది. గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీలు, పట్టణ ప్రాంతాల్లో 2100 కేలరీల దినసరి తలసరి ఆహారం కంటే తక్కువ తినేవారు బిపిఎల్‌ పరిధిలోకి వస్తారని నిర్వచించారు. దీన్ని ప్రస్తావిస్తూ .. టెండూల్కర్‌ కమిటీ ప్రకారం 2011 ధరలను బట్టిచూస్తే గ్రామాల్లో రూ.15కు 2100 కేలరీలు, పట్టణాల్లో రూ.20కు 2400 కేలరీల ఆహారం లభించడం అసాధ్యమని సుప్రీం పేర్కొంది. పట్టణాల్లో రూ.20 కంటే ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్లు, గ్రామాల్లో రూ.15 కంటే ఎక్కువ దినసరి ఆదాయం వచ్చే వాళ్లలో చాలా మంది సబ్సిడీ ధరలకు ఆహారాన్ని పొందేందుకు అర్హులని సుప్రీం తెలిపింది.