- 150 పేద జిల్లాలకు అదనపు ఆహార ధాన్యాలు
- కేంద్రానికి సుప్రీం ఆదేశం
- బిపిఎల్ నిబంధనల సవరణకు సూచన
దేశంలో ఎవరూ ఆకలితో చనిపోరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. తాము నియమించే కమిటీ పర్యవేక్షణలో దేశంలోని 150 పేద జిల్లాలకు అదనంగా 50 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. జస్టిస్ డిపి వాద్వా కమిటీ మార్గదర్శకంలో సమాజంలోని పేదలకు ఈ వేసవిలో అదనంగా ఆహార ధాన్యాలు పంచాలని జస్టిస్ దల్వీర్ భండారి, దీపక్ వర్మతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ఈ కమిటీ కేంద్రంతో చర్చించి, బలహీన సెక్షన్ల ప్రజలను గుర్తిస్తుందని, లక్ష్యిత లబ్ధిదారులకు ఆహార ధాన్యాలను సిఫార్సు చేస్తుందని కూడా ధర్మాసనం చెప్పింది. కేంద్రం తమకు కేటాయించిన ఆహార ధాన్యాలను ముందుగా వినియోగించుకోవాలని, తర్వాత అదనంగా కేటాయించిన వాటిని పంపిణీ చేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కూడా కోర్టు ఆదేశించింది. ఆకలి చావులతో దేశంలో ఎక్కువ మంది మరణించడంపై ఈ నెల 10న కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చే రెండు వారాల్లో 50 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. గోదాములు నిండిపోతే లేదా ఆహార ధాన్యాలు పాడైపోతుంటే దారిద్య్రరేఖకు దిగువనున్న (బిపిఎల్) కుటుంబాలకు, అంత్యోదయ అన్న యోజన (ఎఎవై) కుటుంబాలకు వాటిని సబ్సిడీ ధరలకు ఎందుకు పంపిణీ చేయడం లేదని కోర్టు మరోసారి కేంద్రాన్ని ప్రశ్నించింది. పంజాబ్‌లో తరచూ భారీ సంఖ్యలో ఆహార ధాన్యాలు పాడైపోతున్నాయని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పియుసిఎల్) అనే సంస్థ చేసిన ఫిర్యాదుపై కోర్టు తీవ్రంగా స్పందించింది. 'పేదలకు వాటిని సబ్సిడీ ధరలపై ఎందుకు సరఫరా చేయకూడదు' అని సొలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించింది. 'మేము మిమ్మల్ని మళ్లీ కోరుతున్నాం. వాటిని పంపిణీ చేయండి. భారీ ఖర్చుతో మీరు ఆహార ధాన్యాలను సేకరిస్తున్నారు. అయితే కొత్త పంటల ద్వారా వచ్చే ధాన్యాన్ని నిల్వ చేయడానికి మీకు తగిన సామర్థ్యం లేదు. పంటల దిగుబడి బాగా వచ్చిన ప్రతిసారీ ఇలాంటి సందర్భాలే ఎదురవుతున్నాయి. దేశంలో మూడు వేల మంది ఆకలితో చనిపోయి ఉండొచ్చు. మూడు వేలు కాదు, మనలాంటి దేశంలో ఆకలితో కనీసం ముగ్గురు చనిపోయినా అది తీవ్ర ఆందోళనకరం' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
బిపిఎల్ నిబంధనలు సవరించాలి..
దారిద్య్రరేఖకు దిగువనున్న (బిపిఎల్) వారిని నిర్ణయించేందుకు ప్రస్తుతమున్న తలసరి నిబంధనలను సవరించాల్సిందిగా ప్రణాళిక సంఘానికి అత్యున్నత న్యాయస్థానం సూచించింది. మార్చి 2011 లేదా తదనంతర తేదీలను పరిగణనలోకి తీసుకొని నిబం ధనల్లో మార్పులు చేయాలని సూచించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ క్రమబద్ధీకరణకు సంబంధించిన ఓ కేసు విచారణ సందర్భంగా దల్వీర్ భండారి, దీపక్ వర్మ నేతృత్వంలోని ధర్మాసనం పలు అంశాలను ప్రస్తావించింది. ప్రణాళిక సంఘం ప్రకారం రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో తలసరి ఆదాయం రూ.15, పట్టణ ప్రాంతాల్లో తలసరి ఆదాయం రూ.20. 'బిపిఎల్‌కు దిగువనున్న వారెవరు?' అనే దానికి కొలబద్ద ఇదేనా అని ధర్మాసనం ప్రశ్నించింది. గ్రామీణ ప్రాంతాల్లో 2400 కేలరీలు, పట్టణ ప్రాంతాల్లో 2100 కేలరీల దినసరి తలసరి ఆహారం కంటే తక్కువ తినేవారు బిపిఎల్ పరిధిలోకి వస్తారని నిర్వచించారు. దీన్ని ప్రస్తావిస్తూ .. టెండూల్కర్ కమిటీ ప్రకారం 2011 ధరలను బట్టిచూస్తే గ్రామాల్లో రూ.15కు 2100 కేలరీలు, పట్టణాల్లో రూ.20కు 2400 కేలరీల ఆహారం లభించడం అసాధ్యమని సుప్రీం పేర్కొంది. పట్టణాల్లో రూ.20 కంటే ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్లు, గ్రామాల్లో రూ.15 కంటే ఎక్కువ దినసరి ఆదాయం వచ్చే వాళ్లలో చాలా మంది సబ్సిడీ ధరలకు ఆహారాన్ని పొందేందుకు అర్హులని సుప్రీం తెలిపింది.