కూతుళ్లను చంపిన కుల దురహంకారం
- తెలుగు గడ్డపై రెండు హత్యలు
- సజీవ దహనం చేసిన తల్లి, మేనమామలు
- మరో కేసులో గొంతు నులిమిన తండ్రి
- దళితులను ప్రేమించటం, పెళ్లి చేసుకోవడమే కారణం
తమను కాదని... దళిత యువకున్ని పెళ్లాడిన కన్న బిడ్డను కాల్చి చంపిన కసాయిమూకల ఘోరకలి మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బాలానగర్ మండలం రాజాపూర్ (జాతీయ రహదారి పక్కనున్న గ్రామం)లో గొర్రెల పెంపకందారుల సామాజిక తరగతికి చెందిన మాధవి(18), కేశంపేట మండలం కాకునూరు గ్రామానికి చెందిన దళితుడు లింగం గత ఏడాది నవంబర్‌లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దళితున్ని పెళ్లి చేసుకోవడం మింగుడు పడని మాధవి తల్లి శంకరమ్మ తన బిడ్డకు మైనార్టీ తీరలేదని, లింగం కిడ్నాప్ చేశాడనే ఆరోపణతో బాలానగర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు లింగంను రిమాండ్‌కు పంపి మాధవిని స్టేట్ హోమ్‌లో ఉంచారు. అనంతరం రెండు నెలల్లోనే జడ్చర్ల మున్సిఫ్ మెజిస్ట్రేట్, మాధవి మైనార్టీ తీరిందని చెప్పి హోమ్ నుండి తీసుకొచ్చారు. అక్కడి నుండి నేరుగా భర్త లింగం దగ్గరకు మాధవి వెళ్లింది. మాధవి అక్కడికి వెళ్లడాన్ని జీర్ణించుకోలేని తల్లి, మేనమామలు గురువారం ఉదయం ఆరు గంటలకు కాకునూరు గ్రామానికి వెళ్లారు. 'నువ్వు గర్భవతివి కదా.. మనింటికి పోదాం బిడ్డా'' అని మాధవికి కల్లబొల్లి కబుర్లు చెప్పారు. ఆ సమయంలో లింగం ఇంట్లో కూడా లేడు. ఎంతకూ పుట్టింటికి వెళ్లడానికి ఇష్టపడని మాధవిని బంధువులంతా బలవంతంగా ఆటోలో తీసుకెళ్లారు. పెద్దరేవల్లి ఏడు గుట్టల మధ్య చుట్టూ ముళ్ల కంపలు, రాళ్లూ పేరుకుపోయిన ప్రదేశానికి మాధవిని తీసుకెళ్లి రాళ్లతో కొట్టి, పెట్రోలు పోసి సజీవ దహనం చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కాకునూరుకు, సంఘటన జరిగిన పెద్దరేవల్లి గ్రామాలకూ ఎలాంటి సంబంధం లేదు. అటువంటి మారుమూల ప్రాంతానికి మాధవిని తీసుకెళ్లి చంపేశారు. ఈ విషయాన్ని పెద్దరేవల్లి గ్రామస్తులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పోలీసులు లింగం సొంత ఊరికి వెళ్లి విచారించగా, చుట్టుపక్కల వాళ్లు మాధవిని ఆమె బంధువులే బలవంతంగా ఆటోలో తీసుకెళ్లడం చూశామని చెప్పారు. నిందితులైన తల్లి శంకరమ్మ, మేనమామలుగా భావిస్తున్న కోడె ముత్యాలు, కోడె రాములు, మరో ఇద్దరు బంధువులు కుంచె రామయ్య, చెన్నయ్య పరారీలో ఉన్నారు. ఇదిలా ఉండగా... ఉదయం బయటికెళ్లిన మాధవి భర్త లింగం సాయంత్రం వరకు భార్య కోసం వెదుకుతూనే ఉన్నాడని, పోలీసు స్టేషన్లో తమ రక్షణలోనే అతను ఉన్నాడని షాద్‌నగర్ సిఐ షాకీర్ హుస్సేన్, బాలానగర్ ఎస్‌ఐ శంకర్ పత్రికల వారికి తెలిపారు. లింగం ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. మాధవి దళితున్ని వివాహం చేసుకున్నందునే తల్లిదండ్రులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని, నిందితులను తక్షణం అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కెవిపిఎస్ షాద్‌నగర్ డివిజిన్ కార్యదర్శి బుద్దుల జంగయ్య డిమాండ్ చేశారు.
దళితున్ని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పిన కూతుర్ని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఓ కసాయి తండ్రి ఉదంతమిది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం రట్టిణికి చెందిన లలిత్ కుంటియా, గొల్లపు కుంటియా ఉపాధి కోసం చెన్నై వలసవెళ్లారు. వారి కుమార్తె లల్లి కుంటియా (19) అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. ఒడిషాలోని ఒడ్రు కులానికి చెందిన ఆమె దళిత కులానికి చెందిన అలజండి మోహనరావును ప్రేమించింది. ఈ నెల 20న టిటిడి ఆధ్వర్యాన నిర్వహించనున్న కల్యాణమస్తులో వివాహం చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అందుకోసం తన సర్టిఫికెట్లు, బంగారం, డబ్బులు ఇవ్వాలని లల్లి కుంటియా బుధవారం ఇంటికి వచ్చి తల్లిదండ్రులను అడిగింది. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి లలిత్ కుంటియా బుధవారం రాత్రి గొడవపడి, పీక నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని గురువారం గ్రామస్తులకు చెప్పాడు. విషయం తెలుసుకున్న పాలకొండ డిఎస్పీ బిడివి సాగర్ ఆధ్వర్యాన పాతపట్నం, రాజాం సిఐలు ఎ.రవికుమార్, ఎస్.శశిభూషణరావు సంఘటనా స్థలానికి చేరుకుని, తల్లిదండ్రులను ప్రశ్నించారు. దళిత యువకున్ని పెళ్లి చేసుకుంటుందని తానే కుమార్తెను హత్య చేశానని లలిత్ అంగీకరించాడు. మెళియాపుట్టి ఎస్‌ఐ సూరినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.