కదం తొక్కిన బడుగు

  • మండుటెండలో మహాప్రదర్శన
  • నిర్బంధాలనెదిరించి తరలొచ్చిన జనం
  • కొన్ని డిమాండ్లపై సర్కార్‌ స్పష్టమైన హామీ
  • జనం సమక్షంలో దీక్ష విరమించిన నేతలు
  • సిగ్గు మాలిన ప్రభుత్వం : బృందా కరత్‌
  • భవిష్యత్తు ఉద్యమాలకు స్ఫూర్తి : బి వి రాఘవులు
బడుగు జీవులు భాగ్యనగరంలో కదంతొక్కారు. మండుటెండను లెక్కజేయక మహాప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా, ప్రజాసంఘాల నేతలను ముందస్తు అరెస్టులు చేసినా చలో హైదరాబాద్‌కు జనం భారీగా తరలొచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సుందరయ్య పార్క్‌ నుంచి మహా ప్రదర్శన ప్రారంభమైంది. పేదల నినాదాలు రాజధానిలో మిన్నంటాయి. ప్రదర్శన అనంతరం ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగసభ జరిగింది. దళితులు, గిరిజనులు, పట్టణ పేదలు, కౌలుదార్లు, అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న సిపిఎం నేతలు బివి రాఘవులు, జి నాగయ్య, ఎస్‌ వీరయ్య, మిడియం బాబూరావుతో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు చర్చించారు. గాంధీ ఆసుపత్రిలో జరిగిన ఈ చర్చల్లో కొన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని, మరికొన్నింటిని చర్చించి పరిష్కరిస్తామని మంత్రులు చెప్పడంతో దీక్షలను విరమించడానికి నేతలు అంగీకరించారు. గాంధీ ఆసుపత్రికి వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఆరోగ్య కారణాల రీత్యా దీక్ష విరమిస్తే మంచిదని, ప్రజాక్షేత్రంలో పోరాడి సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఇందిరా పార్కు దగ్గర జరిగిన సభలో ఐద్వా అఖిల భారత ఉపాధ్యక్షురాలు బృందాకరత్‌ ప్రజల సమక్షంలో నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.

దళిత, గిరిజనులకు సంబంధించిన సొమ్మును దారిమళ్లించడం సిగ్గు చేటని బృందా కరత్‌ అన్నారు. శ్రామిక విముక్తి పోరాటాలకు ఆంధ్రప్రదేశ్‌ ఎల్లప్పుడు దిక్సూచిగా ఉంటుందని తెలిపారు. ప్రజా సంఘాలు ప్రస్తుతం సాధించింది పాక్షిక విజయం మాత్రమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. ప్రజలిచ్చిన ఈ స్ఫూర్తితో మున్ముందు మరిన్ని ఉద్యమాలను చేపడతామని చెప్పారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, సంస్థలు, శక్తులు, వ్యక్తులతో కలిపి ఒక విశాల వేదికను నిర్మించటానికి కృషి చేస్తామని చెప్పారు. అసెంబ్లీలో దళిత, గిరిజన సమస్యలు చర్చకు వచ్చాయి. ఎస్సీ,ఎస్టీల సమస్యల పై ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించడంతో సిపిఎం, సిపిఐ సభ్యులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. పోడియంలోకి వెళ్లి భైఠాయించారు.. తెలుగుదేశం సభ్యుల మద్దతు కూడా వీరికి లభించింది. ఎస్సీ,ఎస్టీల సమస్యలపై సిపిఎం లేవనెత్తిన డిమాండ్లను పరిశీలిస్తామని, బివి రాఘవులతో పాటు, ఇతర నేతలు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలను విరమించాలని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.