ఈ ఆగస్టు 15తో దేశ స్వాతంత్య్రానికి 64 ఏళ్లు నిండాయి. మనల్ని మనమే పరిపాలించుకోవడంలో 65వ యేట అడుగుపెట్టాం. బ్రిటీష్ సామ్రాజ్య వాదులను ఎదిరించి 1857 ప్రధమ స్వాతంత్య్ర పోరాటకాలాన్ని ఒక లెక్కగా తీసుకుంటే 1947 నాటికి 90 సంవత్సరాల కాలం అవిశ్రాంతంగా పోరాడి సాధించిన స్వరాజ్యమిది. కోట్లాది మంది పీడితులు, తాడితులు తమ బతుకుల బాగు కోసం స్వరాజ్య సాధనలో నాయకులు ఇచ్చిన పిలుపులన్నింటా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పాల్గొన్న ఫలితమిది. భరతజాతి విముక్తి కోసం తెల్లదొరలను తరిమి కొట్టాలని విశాల భారతి స్వప్నాలు, విప్లవ జ్యోతుల కిరణాలు అభిలషించి బలిదానం చేసి సాధించిన స్వేచ్ఛ ఇది. ఆనాడు స్వాతంత్య్రకాంక్ష అందరిదీ. దాని ఫలితాలూ అందరివీ కావాలన్నది నాటి లక్ష్యం. కానీ నేడు వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. గల్లీ నుండి ఢిల్లీ దాకా ఎగురుతున్న మువ్వన్నెల జెండా నేడు తన చిరునామా వెదుక్కుంటోంది. ఏయే రంగాల్లో తానేం సాధించిందో నెమరేసుకుంటోంది.
స్వతంత్య్ర భారతావనికి ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, సామాజిక న్యాయం లక్ష్యాలు పునాదిరాళ్లు. ఈ పునాదులను అంచెలంచెలుగా కదలించి బలహీనం చేయడంలో ఇన్నేళ్లు పాలించిన పాలకవర్గాలు ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఒకనాడు సార్వభౌమత్వం కోసం సామ్రాజ్యవాదంతో ఢకొీన్న వైనాన్ని చరిత్ర పాఠంగా మిగిల్చి వర్తమానంలో మళ్లీ ఆ సామ్రాజ్యవాదుల పిడికిళ్లకే దేశాన్ని అప్ప జెప్పే చర్యలు ముమ్మరమౌతున్నాయి. వారి పెత్తనానికి ఆటంకాలు లేకుండా ఎన్నో ఒప్పందాల్లో పార్లమెంటును ప్రధానమంత్రీ తప్పుదోవ పట్టించడానికి వెనుకాడటం లేదు. అమెరికాతో అణు ఒప్పందం విషయంలో ఉన్న వాటిని దాచిపెట్టి ఇటీవల పార్లమెంటులో ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటన దీనికి తాజా ఉదాహరణ. మన ఆర్థిక సార్వభౌమత్వాన్ని హరించే ప్రపంచీకరణ శక్తులకు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు రెడ్‌కార్పెట్ పరిచే అనేక విధానాలు నేడు చూస్తున్నాం. వీటి జోక్యం, పెత్తనంతో లాభపడుతున్నవారు ఒక వైపు నేడు సంబరాల్లో ఉన్నారు. ఒకనాటి రైతును కూలీగా మార్చి, ఎందరి కడుపులనో మాడుస్తున్న పాలకుల విధానాలు ఎవరి వికాసం కోసమంటూ నిలదీస్తున్న జనం మరోవైపు పోరాడక తప్పని స్థితిలో ఉన్నారు. అందుకే నేడొక వైపు దేశం వెలిగిపోతుంటే మరోవైపు నలిగిపోతోంది.
వ్యవ'సాయం' ఏదీ...?
ఆహారధాన్యాలు, నిత్యావసర వస్తువులు మనమే ఉత్పత్తి చేసుకోవాలనుకున్నాం. వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేసి.... ఇబ్బడిముబ్బడిగా పండించి ఎగుమతులు లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఆశయం ఘనమే కానీ ఆచరణ ఏమిటన్నది ప్రశ్న. 1951లో మన జనాభా 36.32 కోట్లు. ఆనాడు 4.81 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తయ్యేది. ఆనాటికీ నేటికీ ఈ విస్తీర్ణంలో పెద్ద మార్పు లేదు. కానీ టెక్నాలజీ ప్రవేశం, హరిత విప్లవం వంటి పలు మార్పుల రీత్యా ఆహారధాన్యాల ఉత్పత్తి ఐదు రెట్లు పెరిగింది. నేడు 23 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తవుతున్నాయి. జనాభా 121 కోట్లకు చేరింది. 64 ఏళ్ల స్వతంత్య్ర భారతావనిలో 46 శాతం పిల్లలు పోషకాహారలోపంతో ఉన్నారు. అంటే ప్రపంచంలోని మూడోవంతు వీరు. అంటే వినియోగంలో వాటాలు మారిపోయాయి. 1965-85 సంవత్సరాలలో వచ్చిన హరిత విప్లవం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల కనపడినా తర్వాతి కాలంలో స్తబ్దత నెలకొంది. ఈ కాలంలో స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం వాటా 15 శాతానికి పడిపోయింది. దీనిని ఆదుకునేందుకివ్వాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధులూ, బ్యాంకు రుణాలూ తగ్గిపోయాయి. సాగుభూమి ప్రతి ఏడాది 0.25 శాతం చొప్పున తగ్గిపోతూ వస్తోంది. వ్యవసాయ రుణాలను పారిశ్రామిక, రియల్ ఎస్టేట్, వాణిజ్య అవసరాలకు మళ్లించడం పెరిగింది. కష్టాల సాగులో కన్నీళ్లే మిగిలే వ్యవసాయం పట్ల రైతు ఆసక్తి కోల్పోయే పరిస్థితులు పాలకులే సృష్టిస్తున్నారు. తరతరాల వృత్తిని కొత్త బతుకు తెరువు అన్వేషణలో వదిలేస్తున్నా పాలకుల్లో స్పందనలేదు. క్రమంగా ఈ కాలంలో భూమి ఒక వైపు కేంద్రీకృతం అవుతుండగా మరో వైపు భూమిలేని గ్రామీణ పేదల సంఖ్య 38 నుండి 48 శాతానికి పెరిగింది.
1947లో విదేశీపాలన నుండి విముక్తి కాకముందున్న స్థితి మళ్లీ కనపడుతోంది. కార్పొరేట్ వ్యవసాయం పేరుతో పేద, మధ్య తరగతి రైతుల భూములను లాగేసుకుంటున్నారు. సాగునీటి రంగంలో నీటి బొట్టుకు రేటు కట్టే విధానాలకు వెళుతున్నారు. రైతు వద్ద పంట ఉన్నప్పుడు ధర ఉండటం లేదు. చేజారాక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కర్ణుడి చావుకి ఎన్నో కారణాలన్నట్టు అన్నింటినీ సంస్కరణల పేరిట ఉరితాళ్లుగా పేర్చి ఈ ప్రభుత్వం రైతుల మెడకు చుడుతోంది. ఈ నిర్వాకంలో దీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్, బిజెపి దొందూ దొందే. ఎవరి బాగు కోసం 1991లో వ్యవసాయం సంస్కరణలు అంటూ పాలకులు ఊదరగొట్టారో ఆ రైతులు ఇప్పటికే రెండు లక్షల మంది నిలువునా ప్రాణాలు తీసుకున్నారు. ఈ రంగంలో మనమెంత అభివృధ్ధిలో ఉన్నామో చెప్పడానికి అరగంటకో అన్నదాత ఆత్మహత్యే ఉదాహరణ.
మన పారిశ్రామికాభివృద్ధి దిశ, దశ, ఎటువైపు:
స్వావలంబన దిశగా సాగాలని, అటు వ్యవసాయాన్ని, ఇటు పరిశ్రమలను సంధానించి జోడెడ్లతో ఈ దేశాన్ని పారిశ్రామికంగా పరుగులెట్టించాలని స్వాతంత్య్రానికి పూర్వం తలపోశాం. ఇందుకు పంచవర్ష ప్రణాళికలు రచించుకున్నాం. మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించుకున్నాం. ఆనాడు పరిశ్రమల స్థాపనకవసరమైన ఆర్థిక, ఇతర అంశాలకు అప్పుడప్పుడే అడుగులు నేర్చుకుంటున్న పెట్టుబడిదారులకు ప్రభుత్వ రంగం చేయూతైంది. వారికి నేడు ఆ ప్రభుత్వ రంగమే అడ్డుగా కనపడుతోంది. ప్రపంచంలోని ప్రతి వంద మంది ధనికుల్లో ఆరుగురు భారతీయులే. దేశంలో 55 మంది శతకోటీశ్వరుల చేతుల్లో జాతీయ సంపదలో 26 శాతం పోగుపడి ఉంది. 25 కోట్ల రూపాయలకు మించిన ఆస్తులు కలిగిన 62 వేల కుటుంబాలున్నాయి. వారి చేతిలో ఇప్పటికే 45 లక్షల కోట్ల రూపాయలున్నాయి. వీరుపోగా మిగిలిన 120 కోట్లపై చిలుకు జనాభా సంగతేంటి? ప్రపంచ తలసరి ఆదాయంలో మనం 129వ స్థానరలో ఉన్నాం. ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి లెక్కల్లో 134వ స్థానంలో ఉన్నాం. ప్రపంచంలోని నిరుపేదల్లో 40 శాతం మన దేశంలోనే ఉన్నారు. 70 శాతం మందికి కనీసం రోజుకు 20 రూపాయల ఆదాయం కూడాలేదు.
కనీసం కాళ్లకు చెప్పుల్లేని వారు 20 శాతం ఉన్నాం. చెప్పుకుంటే సిగ్గుచేటు 40 కోట్ల మందికి కనీసం బహిర్భూమి సౌకర్యం లేదు. ఇక ఇళ్ల సంగతి ఏం ఆలోచిస్తాం? 24 శాతం మంది పట్టణాల్లో మురిక్కాలువల పక్కన బతుకీడుస్తున్నారు. గరీభీహఠావోలు, రోటీకపడా మకాన్‌లు, ఆమ్ ఆద్మీలు ఎంత బాగా పని చేశాయో వేరే లెక్కలు అవసరం లేదు. మన సొమ్ముతో ప్రారంభించిన ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి, లేదా కారు చౌకగా అనుయాయులకు కట్టబెట్టి నిరుద్యోగితను, ఉపాధిరహిత అభివృద్ధిని పాలకులు ఘనంగా చెబుతున్నారు. 1970, 1980 దశకాల్లో స్థాపించిన కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఒక్కొక్కటీ మూతపడిపోయాయి. ఈ సంస్థలను పాడి ఆవుల్లా భావించి, తమ సొంత జాగీర్లుగా మలచుకుని పాలక పార్టీలుగా వెలగబెట్టిన కాంగ్రెస్, బిజెపిలు పోటీ పడి మరీ తమ పార్టీ అనుయాయులకు కట్టబెట్టాయి. స్థానిక వనరులు, వ్యవసాయోత్పత్తులు ఖనిజ సంపద ఆధారంగా పరిశ్రమల స్థాపనకు ప్రాముఖ్యత నివ్వాలని 1960లోనే కమిటీ సిఫార్సులు చేసింది. అది నేటికీ బూజుపట్టే ఉంది. కార్పొరేట్ సంస్థలు, బహుళజాతి సంస్థలు గ్రామాల్లో భూములను కొని కాంట్రాక్టు సేద్యం పేరుతో సన్నచిన్న కారు రైతులను వారి భూముల్లోనే వారిని కూలీలుగా మారుస్తున్నాయి. అంటే దేశాన్ని పరాయి పాలన నుండి విముక్తి చేసుకున్న మనం మన వ్యవసాయాన్ని పరాధీనం చేసుకుంటున్నాం. మనది వ్యవసాయిక దేశం కనుక మన పారిశ్రామికీకరణ విధానాల్లోనూ ఈ భూమిక తప్పని సరి.
కానీ నేడది లేదు. కోరలు చాచిన మల్టీ నేషనల్ కంపెనీల లాభాల వేటకు మన పాలకులూ ద్వారాలు బార్లా తెరిచారు. అలా తెరిచేట్టు చేయడంలో దేశ పెట్టుబడిదారుల ఆసక్తులున్నాయి. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నామంటున్న పాలనా వ్యవస్థలో కీలక పాత్ర నేడు పెట్టుబడిదారులది. పెట్టుబడిదారుల కోసం పెట్టుబడి దారులే విధానాలు రూపొందించుకుటున్నారు. అమలు జరుగుతోన్న ఆర్థిక సంస్కరణల వల్ల వినిమయవ్యయం. వ్యక్తి వాదం, అభద్రతాభావం పెరుగుతున్నాయి. వ్యాపారం, రాజకీయ మిళితమైనాయి. ఎన్నికలను, రాజకీయాలను డబ్బుతో శాశించి ప్రజాప్రతినిధులుగా గెలిచి, వచ్చిన పదవులతో మళ్లీ డబ్బు రాబట్టుకోవడం పెరిగింది. పారిశ్రామీకరణ అంటే నిర్వచనాలే మార్చేస్తున్నారు. ఉదాహరణకు మన రాష్ట్రాన్నే చూద్దాం. ప్రజోపయోగం కోసం ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకోవచ్చని 1890 నాటి చట్టంలో ఉంది. ఈ క్లాజు కింద మన రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను పెట్టుబడిదార్లకు కారుచౌకగా కట్టబెట్టారు. అటవీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు మన సర్కారు పడరాని పాట్లు పడుతోంది. ఇందుకు హత్యలకూ తెగబడుతోంది. గంగవరం పోర్టు, సోంపేట కాల్పుల ఘటనలే ఇందుకు తాజా ఉదాహరణలు. బడాబాబులకు కట్టబెట్టడమనే ఏక సూత్ర కార్యాచరణే కనపడుతోంది. భద్రతలేని ఉపాధితో జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఒకవైపు ప్రభుత్వరంగం కుదించుకుపోతోంది. ప్రైవేటు రంగానికి బడుగుల బాధలు పట్టవు. సంఘటిత రంగం క్రమంగా తగ్గుతోంది. అసంఘటిత కార్మికులు పెరుగుతున్నారు. అభద్రత, నిరుద్యోగం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తోంది. మరోవైపు పెట్టుబడిదారులకు అనుకూల విధానాలతో పాలకులు వారి ఆస్తులను పదిరెట్లు పెంచే విధానాలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వరంగ కుదింపు, ప్రైవేటు రంగ విశృంఖలత్వం వెరసి జనం మూలుగలు పిప్పవుతున్నాయి.
అవినీతి పెనుభూతం: ఏ విషయంలోనైనా మనం చివర్లో ఉన్నాంగానీ అవినీతిలో మాత్రం ముందున్నాం. స్వాతంత్య్రానంతరం మన పాలకుల అవినీతి చిట్టాల మొత్తం వింటే కళ్లు బైర్లుగమ్మాల్సిందే. అక్షరాలా 9 కోట్ల 12 లక్షల 89 వేల 123 కోట్ల రూపాయలని ఒక లెక్క. స్వతంత్ర భారతదేశం కోల్పోయిన సొమ్ము ఇది. ఇది చాలదన్నట్టు గనుల వంటి ప్రకృతి వనరులు కూడా లూటీ అవుతున్నాయి. ఈ మొత్తాన్నీ కలిపితే ఎంతవుతుందో ఊహించుకోవాల్సిందే. పార్టీలలో అస్థిరత్వాలు, పార్టీల మధ్య తేడాలు ఉన్నా అవినీతి చేయడంలో మాత్రం వామపక్షాలు మినహా మిగిలినవన్నీ స్థిరంగా దృఢంగా ఉన్నాయి. దేశంలో 1948లో జీప్‌ల కుంభకోణం నుండి ఈ ఏడాదిలో పెద్ద మొత్తంలో నమోదైన 2జి స్ప్రెక్ట్రమ్ (1.76 ల.కో) అంత్రిక్ష్ దేవాస్ ఒప్పందం (రూ.2 లక్షల కోట్లు) వరకు కుంభకోణాల్లో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది. ఈ కుంభకోణాలను లెక్కించడం కన్నా జనగణన సులభమంటూ ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ ఒక వ్యాసంలో రాసిన మాట నిష్టురసత్యం. పెట్టుబడిదారులతో రాజకీయవేత్తలకున్న లింకు ఈ అవినీతికి మూలం. పైకి అవినీతిని పారదోలేందుకు కంకణం కట్టుకుని ఉన్నట్టు మాట్లాడే పాలకులు అవినీతి మూలాలపై నోరు మెదపరు.కోరలు తీసిన లోక్‌పాల్‌ను కాంగ్రెస్ ప్రతిపాదిస్తోంది. ఆయా కుంభకోణాల్లో ఇరుక్కున్న వారిని వారి వారి పదవుల్లోనే ఉంచి, విచారణ చేస్తున్నామని చెబితే ఏం న్యాయం జరుగుతుంది? ఎన్నికల్లో సంస్కరణలు రానివ్వకుండా, డబ్బు నియంత్రించకుండా ఉంటే అది పెట్టుబడి సాధనంగా కాక మరేమౌతుంది? రాజకీయ, వ్యాపార వర్గాల మధ్య సంబంధాలు బహిర్గతం కాకపోతే ఒప్పందాలు ఎలా వెలికివస్తాయి? డబ్బులు చేతులు మారడ మొక్కటే అవినీతా?
లంచం ఇవ్వజూపడం, ప్రభావితం చేయడం, ఆశ్రిత పక్షపాతం, అనర్హులను అందలమెక్కించడం, ముడుపులివ్వడం, నేరాల్లో భాగస్వామ్యం వంటి వన్నీ ఈ అవినీతి భాగోతంలోని అష్టావక్రులే. వామపక్షాలు ప్రస్తావించిన ఈ ఎనిమిది అంశాల ఆధారంగా మన అవినీతిని లెక్కిస్తే బహుశా సంఖ్యాశాస్త్రం పరిధి చాలదేమో! దోచుకున్నది దాచుకునే విషయంలోనూ మన వాళ్ళు బాగా ఆరితేరిపోయారు. స్విస్ నేషనల్ బ్యాంకు (ఎస్‌ఎన్‌బి) ఇటీవల మొదటిసారిగా వెల్లడించిన వివరాల ప్రకారం స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న మొత్తం డబ్బు 250 కోట్ల డాలర్లు. చాలామంది విశ్లేషకులు ఈ అంచనాతో విభేదిస్తున్నారు. కొండంత నల్లధనాన్ని ఎస్‌ఎన్‌బి గోరంతగా చెబుతోందన్నది వారి అభిప్రాయం. 2002-2006 మధ్య అయిదేళ్ల కాలంలో ఏటా దేశం నుండి తరలిపోయిన మొత్తం సగటున 272 కోట్ల డాలర్లని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ ఫైనాన్షియర్ ఇంటిగ్రిటీ అనే సంస్థ వెల్లడించింది. ఆ సంస్థలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేవ్‌కర్ 1948 నుంచి 2008 మధ్య కాలంలో దేశం నుంచి మొత్తం 4620 కోట్ల డాలర్ల మేర నల్లధనం తరలిపోయిందని అంచనా వేశారు. దేశంలో పోగుపడుతున్న అక్రమాస్తుల్లో 72 శాతం నల్లధనం రూపంలో విదేశాలకు తరలుతోందని ఓ అంచనా. ఇంత తీవ్రమైన విషయంపై, కనీసం అక్రమార్కులపేర్లు వెల్లడిపై కాంగ్రెస్ సర్కారు నోరు మెదపడం లేదు. పేదల నడ్డి విరిచే భారాలకు 'అణు' మాత్రం ఆలోచించని ఈ పెద్దలు అవినీతి కట్టడికి మాత్రం సుదీర్ఘ మంతనాలతో ఒక్కంగుళం పరిష్కారాన్ని చూడటం లేదు. బడుగుల బాగులో ఎక్కడున్నాం : జనాల్లో అసంతృప్తి పెల్లుబుకుతున్నప్పుడంతా ఏదో ఒక విధంగా విభజించి పాలించే సూత్రాన్ని మన పాలకులు బ్రిటీష్ వారి నుండి బాగా నేర్చుకున్నారు.
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే ఫలితం అనుకుంటే ఆ పని చేసేయడం, కుల మత వివాదాలు సృష్టిస్తే లాభమనుకుంటే అదే కానివ్వడం ఇన్నేళ్ల కాలంలో ఎన్నోసార్లు చూశాం. లౌకిక తత్వానికి విఘాతం కలిగినా, ఉగ్రవాద సంస్థలు పెచ్చరిల్లినా, మత సామరస్యానికి దెబ్బ తగిలినా, ఇవి ఏ తరహా రూపం తీసుకున్నా మధ్యలో నలిగిపోయేది బడుగులే. ఏ లక్ష్యాల కోసం నాడు బలహీనవర్గాలకు చెందిన వారు స్వాతంత్య్రాన్ని అభిలషించారో అది మాత్రం ఆమడదూరంలో ఉంది. స్వాతంత్య్రం ధనికులకే తప్ప దళిత, గిరిజన, ఇతర బలహీన వర్గాలకు దగ్గరగా లేదు. వీరు చేసిన త్యాగాలు సైతం వెలికిరానివిగా మిగిలిపోయాయి. ఆదివాసీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. 1972 వన్యమృగ సంరక్షణ చట్టం ప్రకారం జంతు రక్షణకు నడుం కట్టామన్నారు. తుపాకులకు లైసెన్సు లిచ్చి వేటకు అంగీకరించారు. ఆదివాసులకు కరెంటివ్వాలంటే అడవి పాడైపోతుంది అంటూ అడ్డు చెబుతున్నారు. పరస్పర విరుద్ధమైన ఈ విషయాల ద్వారా అర్థమయ్యేదొకటే. ఈ పాలకులకు సాటి మనుషులపై కనికరం లేదు. ఏదో ఒక పేరుతో మైనింగ్ మాఫియాలకు అడవులప్పచెప్పడమే జరుగుతోంది. మన్య పోరాటాలు లేకుండానే మనకు స్వరాజ్యమొచ్చిందా? అంటరానితనం, కుల వివక్షతతో ప్రపంచం ముందు తలదించుకోవాల్సిన కుల వ్యవస్థ కొనసాగుతోంది. దళితులపై అత్యాచారాలూ, అమానుషాలూ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ స్వాతంత్య్ర దినానికి మూడ్రోజుల ముందే పత్రికల్లో రెండు వార్తలొచ్చాయి. దళితుడిని ప్రేమించినందుకు ఓ తండ్రి కూతుర్ని చంపాడు. అగ్రకుల అమ్మాయిని ప్రేమించిన నేరానికి దళిత అబ్బాయి తల్లిని కాల్చేందుకు ప్రయత్నించారు. వీరి పరిస్థితెలా ఉందో ఈ ఉదాహరణలు చాలు.