ఈ నవలపై సమీక్ష వ్యాసాన్ని రాస్తూ ఎన్. వేణుగోపాల్ ఇలా అన్నారు. “ నూట ఇరవైఏళ్ళ తెలుగు నవలా చరిత్రలో వస్తు వైవిధ్యంలో, సంక్లిష్ట సామాజిక సంచలనాలకు అద్దం పట్టడంలో, వ్యక్తి జీవితానికీ సమాజ జీవితానికీ మధ్య ఉన్న సంబంధాన్న సరిగ్గా వ్యక్తీకరించడంలో పంచమం అగ్రస్థానంలో నిలుస్తుంది.
“ నిజానికి పంచమం నవల ఇతివృత్తం గా దేవపుత్ర ఎంచుకున్న వస్తువు చాలా మామూలుగా కనిపిస్తుంది. ఒక దళిత యువకుడి జీవితంలో ఇంటర్మీడియెట్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి అతను ఎ.పి.పి.ఎస్.సి. గ్రూప్ వన్ పరీక్ష పాసై ఆర్.డి.వో. అయి తన గ్రామానికీ, తన కులం లాంటి అణగారిన కులాలకీ మేలు చేయాలనుకుని భూస్వాముల కుట్రల్లో ఉద్యోగం పోగొట్టుకునే దాకా కథ సాగుతుంది. సరిగ్గా దీనికి సమాంతరంగా నవలా ప్రారంభంలో భూస్వాముల నుంచి స్వాధీనం చేసుకున్న మిగులు భూమిని పంపిణీ చేస్తామనే ప్రకటన నుంచి ముగింపులో ఆ భూమిని వెనక్కి తీసుకుని భూస్వామికి అప్పజెపుతున్నామనే ప్రకటన దాకా సాగుతుంది కథ.
“ ఈ రెండు సమాంతర ప్రారంభాలకీ, ముగింపులకూ మధ్య 1990 ల తొలి రోజుల నుంచి అయిదారేళ్ళ పాటు తెలుగు సీమ లో జరిగిన ఘటనలన్నింటి ప్రతిఫలనాలూ ఉంటాయి
.
( ఎన్. వేణుగోపాల్, సమగ్ర దృష్టే పంచమం స్వరం బలం, (వ్యాసం) ఆంధ్రప్రభ,15-5-2000)
వేణుగోపాల్ గారి అభిప్రాయాల ప్రకారం ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దళిత ఉద్యమాన్ని ప్రతిఫలించిన నవల. అది కూడా 1990 ల తర్వాత వచ్చిన తెలుగు దళిత ఉద్యమాలను గుర్తించే దిశగా సాగిందని అర్థమవుతుంది. అంటే, 1985 జూలై 16న జరిగిన కారంచేడులో మాదిగలపై జరిగిన హత్యాకాండను ఈ నవల ప్రతిఫలించడం లేదని ఆ అభిప్రాయాన్ని బట్టి స్పష్టమవుతుంది.
కారంచేడు సంఘటన తొలి నాటి పరిస్థితులను పంచమం నవల వర్ణించకపోయినా, ఆ సంఘటనతో దళితమహాసభ ఏర్పడటం, దానిపై దళితులు జిల్లా, రాష్ట్ర కోర్టుల చుట్టూ తిరగడంలో మాదిగలనే కాకుండా యావత్తు దళితులను సాధ్యమైనంత ఐక్య ఉద్యమంగా చేయగలిగింది. అది చుండూరు దళిత హత్యాకాండ నాటికి బలమైన దళిత ఉద్యమంగా మారింది. చుండూరు సంఘటన 1991 ఆగష్టు 6 వ తేదీన జరిగింది. కారంచేడులో మాదిగలపైనా, చుండూరులో మాలలపైనా మారణకాండ జరిగింది. రెండు సంఘటనల్లోనూ హత్యకావింపబడిన వాళ్ళు మాదిగలా? మాలలా? అని చూడకుండా తామంతా దళితులుగానే భావించి, ఉమ్మడిగానే దళితులు తమ పోరాటాలను సాగించారు. వీటిని నవలలో ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా సూచించారు.
హైదరాబాదు బుక్ ట్రష్ట్ వాళ్ళు 2009 లో ముద్రించిన పంచమం నవలలో వేణుగోపాల్ గారి వ్యాసాన్ని ప్రచురించారు. మొదటి ముద్రణను బహుమతి ఇచ్చిన ఆటా వాళ్ళే 1998 లోనే ప్రచురించారు. హైదరాబాదు బుక్ ట్రష్ట్ వాళ్ళు ప్రచురించిన నవలలో రచయిత “ మీతో కాసేపు..” అంటూ తన అంగీకారాన్ని కూడా తెలిపారు. అంటే రచయితా, ముద్రణా సంస్థ వాళ్ళూ కూడా ఈ నవల 1990 తర్వాత వచ్చిన దళిత ఉద్యమాన్ని చిత్రించిన నవలగానే అంగీకరిస్తున్నట్లుగానే భావించాలా? అలా అయితే, ముఖచిత్రంపై “ ఉద్యమాల నేపథ్యంలో తొలి దళిత నవల “ అని ప్రకటించుకోవడం సరైందే అవుతుందా? ఆలోచించవలసిందే!
ఆచార్య రాచపాళెం చంద్ర శేఖర రెడ్డి, డా//కె, లక్ష్మీనారాయణ గార్ల సంకలనం, సంపాదకత్వంలో ”1980 తర్వాత తెలుగు దళిత నవల” పేరుతో వచ్చిన వ్యాససంకలనం (2003) లో కూడా “ పాతికేళ్ళ దళిత జీవిత దృశ్యం” పేరుతో పంచమం నవలపై డా// కె.లక్ష్మీనారాయణ రాసిన వ్యాసం ( పుటలు : 47-54) ఉంది. ఇంకా దీనిపై ముందుమాటలో సంపాదకుల వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకానికి “నేపథ్యం” పేరుతో రాసిన సంపాదకీయంలో ఈ నవల గురించి రాస్తూ…”ఇది 1975- 1998 వరకూ ఆంధ్రప్రదేశ్ లో దళిత ఉద్యమాల చారిత్రక నేపథ్యంగా వచ్చిన నవల. గత శతాబ్ది ఎనిమిదో దశకానికి ముందట భూ సంస్కరణలు మొదలుకొని కొత్త ఉత్పత్తి సంబంధాలు, చుండూరు, కారంచేడు సంఘటనలు, నక్సలిజం విజృంభణ, దళిత యువత ఉద్యమించడం, దళితులు సంపన్న వర్గాలుగా కుల వివక్షకు గురై, అగ్ర వర్ణాల చేతుల్లో కీలుబొమ్మలు కావడం, దండోరా, మాల మహానాడు, రిజర్వేషన్ల వర్గీకరణ లాంటి రెండు దశాబ్దాల చారిత్రక సంఘటనలను రికార్డు చేసిన నవల” అని అంచెనా వేశారు.
డా// కె.లక్ష్మీనారాయణ రాసిన వ్యాసంలోనే ఇంకా ఇలా వ్యాఖ్యానించారు. “ పంచమం దళిత ఉద్యమ ప్రభావంతో వచ్చిన నవల. చిలుకూరి దేవపుత్ర తన ఉద్యోగ జీవితంలో చవిచూసిన యధార్థ సంఘటనకు, తన ఉద్యోగం చేస్తున్న రెవెన్యూ వ్యవస్థలోని అధికారుల లంచగొండితనాన్ని, నడుస్తున్న దళిత ఉద్యమాలనూ జోడించి రాసిన నవల ఇది. ….
“ఆంధ్ర దేశంలో ప్రభుత్వం భూసంస్కరణలను ప్రవేశపెట్టడం, గ్రామాలలో మిగులు భూములు పంపిణీ, దళితులు, వెనుకబడిన తరగతుల వారు భూములు పొందడం, గ్రామాల్లో భూస్వాములు తమ భూములను అధికార పలుకుబడితో రీకన్వే చేయించుకోవడం, రెవెన్యూ శాఖ అవినీతి, కొత్త ఉత్పత్తి సంబంధాలు, దళితులు భూస్వాముల మధ్య అంతరాలు, భూస్వాముల దౌర్జన్యాలు, లైంగిక వేధింపులు కారంచేడు, చుండూరు లాంటి సంఘటనలు, దళిత యువత ఉద్యమించడం, నక్సలిజం విజృంభణ, 1989 శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, కోనేరు రంగారావు ఉపముఖ్యమంత్రి కావడం, దళితులు ఉన్నత పదవుల్లో ఎన్నిక కావడం, సవర్ణుల చేతుల్లో కీలు బొమ్మ కావడం, సంపన్నవర్గంలో చేరిపోవడం, డా.బి,ఆర్,అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రామ్ ల జయంతులు వర్థంతులు జరపడం, రాష్ట్రంలో బహుజన సమాజ్ వాది పార్టీ ఎన్నికల్లో దిగడం ఓటమి చెందడం, పౌరహక్కుల సంఘాలు , సమకాలీన ఉద్యమాలు బలోపేతం కావడం, చలపతి విజయవర్థనరావుల ఉరిశిక్ష కేసు, భారతీయ జనతా పార్టీ బలపడటం, దండోరా, మాల మహానాడులు ఏర్పడడం, లాకప్ మరణాలు వంటి రెండున్నర దశాభ్దాల సంఘటనల నేపథ్యంగా
” ఈ నవల నడిచిందని కూడా లోతుగా విశ్లేషించారు.
ఈ అభిప్రాయాల్లోని ఒక అభిప్రాయాన్ని ఇంచుమించు యథా తధంగా తీసుకొని కూడా, అనేక మందికి చెప్పిన కృతఙ్ఞతల్లో నైనా ఎక్కడా ఆ విషయాన్ని పేర్కొనక పోవడం గమనించవలసి ఉంది. పోనీ, ఈ అభిప్రాయం, రచయిత లేదా ప్రచురణ కర్తలో రాశారని అనుకుందాం. ఈనవలపై వచ్చిన అన్ని సమీక్షలు లేదా వ్యాసాలను, పరిశోధనలను రచయిత గానీ, దాన్ని మరలా మరలా ప్రచురించే ప్రచురణ కర్తలు గానీ చూడాలనేమీ లేదుకదా! అని కూడా కాసేపు అనుకుందాం. అలాంటప్పుడు పంచమం నవల కంటే ముందు దళిత సమస్యలను, ఉద్యమాలను వర్ణిస్తూ అనేక నవలలు వచ్చాయి. వాటి గురించి కూడా రచయిత, ప్రచురణ కర్తలకు తెలియదని అనుకోగలమా? మరి తెలిసి కూడా పంచమం నవల ముఖచిత్రం పై రాసుకున్న ప్రకటన సమంజసమైనది అవుతుందా? పోనీ ఆ ప్రకటనను సమర్థస్తూ ఎక్కడైనా ఆ పుస్తకంలో గానీ, తర్వాత గానీ ఒక వ్యాసమైనా రాశారా? ఒక వేళ నిజంగా వేణుగోపాల్ గారి అభిప్రాయాన్నే స్థిరీకరించుకున్నా, 1990 తర్వాత సంఘటనలను వర్ణించినట్లైతే “ఉద్యమాల నేపథ్యంలో తొలి దళిత నవల” ఎలా అవుతుంది?
అంతేకాకుండా రచయిత తన ముందుమాటలో ఈ నవల రాయడానికి గల నేపథ్యాన్ని చెప్పుకున్నారు. పంచమం నవల రాయడానికి చిన్న సంఘటన మాత్రమే ప్రేరణ అని రాసుకున్నారు. రచయిత ఉద్యోగ రీత్యా మండల రెవెన్యూ ఇన్సెక్టర్ గా పని చేశారు.అప్పుడు ఒక సంఘటన జరిగింది. ల్యాండ్ సీలింగ్ కింది ప్రభుత్వం తీసుకుని దళితులకు, వెనుకబడిన తరగతుల వాళ్లకు పంచుతుంది. తర్వాత భూమి కోల్పోయిన భూస్వామి తన పలుకు బడితో తన భూమిని తనకు వచ్చేటట్లు రీకన్వే చేయించుకొంటాడు. ఆ సందర్భంలో వచ్చినట్లే వచ్చిన భూమి ని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, అసలు యజమానికి ఇచ్చేయాలని దండోరా వేయిస్తుంది. అలా దండోరా వేసే వ్యక్తి కి కూడా ఆ భూమిని కోల్పోవలసి వస్తుంది, అది తాను నిజంగా చూసిన, చలించి పోయిన సంఘటనగా రచయిత చెప్పారు. అలా వచ్చినట్లే వచ్చిన భూమి, తానెంతో పంట పండించుకోవాలనీ, తానూ ఎంతో కొంత భూమికి యజమానిని అయ్యానని ఆశ పడి , ఆ బంజరునంతా బాగు చేసి, విడదీయరాని అనుబంధాన్ని పెనవేసుకున్న వెట్టి వాని దుఃఖం, మానసిక స్థితికి కదిలిపోయి ఈ నవలను రాశానని చెప్పుకున్నారు.
వీటన్నింటినీ పరిశీలించినప్పుడు, ఈ నవలలో దళిత ఉద్యమానికి సంబంధించిన అనేక కోణాలు ఉన్నాయి. మాదిగ యువకుడిని ఈడిగ పద్మ ఇష్టపడి పెళ్ళి చేసుకోమని చేప్పినా, అది అంత సులువుగా జరగదని చెప్తాడు. అయినా మనసు పొరల్లో ఆమె పై ప్రేమ ఉంటుంది. అలాగే బ్రాహ్మణ యువతి , తెలివైనదీ, కలివిడి గలదీ, కుల పట్టింపులు లేని విద్య పట్ల కూడా కాస్తంత మనసు పారేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయినా, సమాజంలో ఒక మాదిగ యువకుడికి కావలసిన అత్యంత ముఖ్యమైనది ఉద్యోగంగానే భావించాడు. ఆర్.డి.ఓ అయ్యాడు. కానీ, పరిస్ఠితులు సహకరించేలా లేవు. మరొక వైపు మాల వర్గానికి చెందిన సురేష్ స్వచ్చంద సంస్థలో పనిచేస్తూనే గ్రామంలోని దళితులను చైతన్యవంతం చేయడానికి ప్రయత్నించాడు, వివక్షను తాను పనిచేస్తున్న సంస్థలో ఉన్నా సహించలేని వ్యక్తిత్తం గల వానిగా సురేష్ కనిపిస్తాడు. చివరికి తిరుగుబాటు ద్వారానే తాను అనుకున్నది సాధించవచ్చని రహస్యోధ్యమంలోకి వెళ్ళిపోతాడు.
వెనుకబడిన తరగతుల్లో చాకలి ఓబన్న, ఒక గ్రామ పెత్తందారీ కమ్మ కులస్థుల అమ్మాయి రుక్మిణి ని ప్రేమించి దొంగ చాటుగా పెళ్ళిచేసుకుంటారు. ఆ ఊరు విడిచి పారిపోతారు. అది తెలిసి అమ్మాయి తరపువాళ్ళు అమ్మాయికి ఏమాత్రం హాని జరగకుండానే, ఆ అబ్బాయిని హత్య చేయిస్తారు.
చాకలి ఓబన్న హత్య గురించి రెడ్డి కులస్థుడైన పురుషోత్తం హక్కుల సమితి వాళ్ళతో కలిసి పోరాడి కేసు కట్టించి, శవాన్ని రప్పించి, పోలీసుల చేత కేసు రాయించగలుగుతాడు. కానీ, హత్యకు మూల కారమైన వాళ్ళు కాకుండా , సాధనంగా ఉపయోగపడిన వాళ్ళని తమ పలుకుబడితొ దానిలో ఇరికిస్తారు,
చివరికి మాదిగ యువకుడు ఉన్నత చదువులు చదివి తన విధులు సక్రమంగా నిర్వహించాలని ప్రయత్నించినా, గ్రామ పెత్తందార్లు అడ్డంకులు కలిగించడమే కాకుండా అక్రమంగా అవినీతి కేసులో ఇరికించి ఉద్యోగం లో ఉండకుండా సస్పెండ్ చేయిస్తారు.
ఒక వైపు దళితులు రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను పొందుతూ ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించినా, భూమి, రాజకీయాధికారం లేకపోవడంతో ఆ ఉద్యోగాలు కూడా చేయలేని పరిస్థితి కనిపిస్తుందని ప్రజాస్వామ్యంలో కనిపించని ఒక వర్గ స్వభావాన్ని గుర్తించవలసి ఉందని చెప్తాడు రచయిత,
నవలలో సమకాలీన దళితుల పీడనలో బ్రాహ్మణలు సహృదయంతోనే మెలుగుతున్న స్థితిని కృష్ణ శాస్త్రి, విద్య, వాళ్ళ కుటుంబంలో శివయ్యకు గల సంబంధాల ద్వారా రచయిత సూచనామాత్రంగా చెప్పగలిగారు.
దళితులను పీడించే కుల, వర్గ స్వభావాల్లో వచ్చిన మార్పులు ఈ నవలలో వాస్తవిక దృష్టితోనే పట్టుకోగలిగారు. కారంచేడు, చుండూరు తదితర సంఘటనలకు కారకులెవరో, ఏకులస్థులో గుర్తించవలసి ఉంది. ప్రతి దానీకీ బ్రాహ్మణులనే లక్ష్యం చేసి బ్రాహ్మణత్వ వంటి పదాలను ప్రయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరాన్ని ఈ నవల తెలియ చెప్తుంది. మాల- మాదిగల వర్గీకరణ సమస్యను కూడా చర్చించింది,
దళిత ఉద్యమం కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే రాలేదు. అది మొత్తం భారత దేశ వ్యాప్తంగా కనిపిస్తుంది. అది ఒక్కసారిగా కూడా ఎగిసిపడిరాలేదు. అస్పృశ్యత, అణచివేత, వాటిని తరతరాలుగా అనుభవిస్తున్న కులాల వారి నిరసనలు, తిరుగుబాట్ల బాటలో తమనీ మానవులుగా గుర్తించమని కోరే చారిత్రక సందర్భాలన్నీ దళిత ఉద్యమ ప్రారంభాన్నే తెలుపుతున్నాయి. కానీ, ఒక చారిత్రక క్రమంలో చూసినప్పుడు మాత్రం భారతదేశంలో బ్రిటీషు వాళ్ళు ప్రవేశించిన తర్వాత దశ, మతాంతరీకరణ దశగా, ఈ రెండింటి కంటే ముందు దశ, తర్వాత స్వాత్రంత్ర్యానంతరం ఏక కాలంలో సాగిన గాంధీ సంస్కరణోద్యమ, అంబేద్కర్ కులనిర్మూలన దశలుగా దళిత ఉద్యమం వివిధ పరిణామాల్లో కనిపిస్తుంది. దీని తర్వాత వచ్చిన ఆత్మగౌరవ పోరాటాలు, కుల అస్తిత్త్వ ఉద్యమాలుగా దళిత ఉద్యమం వికాసం చెందింది. అందుకనే సామాజిక ఉద్యమాల పై పరిశోధన చేసిన వాళ్ళు దళిత ఉద్యమ చరిత్రను పరిగణనలోకి తీసుకొనేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలని అంటున్నారు. ఈ నేపథ్యంతో చిలుకూరి దేవపుత్ర పంచమం నవలను చూసినప్పుడు తారీఖులు స్పష్టంగా కనిపించకపోయినా, భారతదేశంలో జరిగిన అనేక దళిత ఉద్యమ రూపాలను కూడా ప్రతిఫలించిందని చెప్పవచ్చు.
మొత్తం మీద సమకాలీన దళిత ఉద్యమాన్ని వాస్తవిక దృష్టితో విశ్లేషించింది. దళిత ఉద్యమాన్ని వర్ణించిన నవలగా చెప్పుకోవడంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు, కానీ తొలి దళిత ఉద్యమ నవల అనడం సమంజసం కాదని దళిత నవలలను పరిశీలించిన వారికి తెలుస్తుంది.

ఆధార గ్రంథాలు:
చంద్రశేఖరరెడ్డి, రాచపాళెం, కె.లక్ష్మీనారాయణ, (సంపాదకులు), 1980 తర్వాత తెలుగు దళిత నవల, రమా పబ్లికేషన్స్, అనంతపురం, 2003.
వేణుగోపాల్, ఎన్. సమగ్ర దృష్టే పంచమం స్వరం బలం, (వ్యాసం) ఆంధ్రప్రభ,15-5-2000), పంచమం నవల పునర్ముద్రణ ( 2009) నుండి స్వీకరణ.
వెంకటేశ్వరరావు, దార్ల, తెలుగు సాహిత్యం - మాదిగ జీవిత ప్రతిఫలనం ( వ్యాసం), తెలుగు వైఙ్ఞానిక త్రైమాసిక పత్రిక, సంపుటి: 37, సంచిక: 4, అక్టోబర్ – డిసెంబర్ 2008, పుటలు: 32-46. తెలుగు అకాడమి, హైదరాబాదు,