అణగారిన అస్తిత్వాల్ని అణగదొక్కడమే మార్క్సిజమా?
రంగనాయకమ్మ వేసుకున్న ప్రశ్నలు చెప్పుకున్న జవాబుల గురించి మాట్లాడే ముందు 'ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక' నేపథ్యం వివరించాల్సిన అవసరముంది. జనవరి 2009లో విశాఖలో నిర్వహించిన సభలో దళిత బీసి మైనారిటీ అస్తిత్వాల రచయిత్రులు కొన్ని ప్రతిపాదనలు, చర్చలు లేవదీయడం జరిగింది. లక్ష్యాలు కూడా రూపొందించడం జరిగింది.
పురాణాల నుంచి ఆధునిక స్త్రీవాద సాహిత్యం దాకా అణగారిన జాతుల (దళిత బహుజన మైనారిటీ ఆదివాసీ) స్త్రీలను మరుగుపర్చడం జరిగింది. ఈ సాహిత్యాలేవీ వీరి స్థితిగతుల్ని సమస్యల్ని కుల, శ్రమ దోపిడీని, సంస్కృతిని పట్టించుకోలేదు. చర్చించలేదు. సమాజానికి ఉత్పత్తి శ్రమనందించే అణగారిన స్త్రీలను సాహిత్యంలో భాగం చేయలేదు. వీరిని వూరిలో అంటరానోల్లని చేసినట్లే సాహిత్యంలోనూ దూరముంచారనే అవగాహనని సభ ముందుంచాము.
సమాజంలో స్త్రీలు కూడా కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా దొరసానులుగా, కూలీలుగా వున్నారు. వారి జెండర్ సమస్యలు ఒకే మూసగా లేవు. అణగారిన జాతుల స్త్రీల సమస్యలు, గడపదాటని దొరసాండ్ల సమస్యలు ఒక్కటి కావు. ఇలాంటప్పుడు స్త్రీలంతా ఒక్కటే అని చెప్పడంద్వారా అణగారిన జాతుల స్త్రీల సమస్యల్ని చర్చించే అవకాశం లేకుండాపోతుంది.
పురుషాధిక్యత నుండి విముక్తే స్త్రీలందరి విముక్తిగా ఆధిపత్య కులాల మహిళలు చెప్పడం యితర స్త్రీల చుట్టూత వున్న రాజకీయ ఆర్థిక సాంఘిక శ్రమ కుల సమస్యల్ని మగ పెత్తనాల సమస్యల్ని వెలుగులోకి రానివ్వకుండా అణచివేయడమేనన్న విషయాల్ని సభ అంగీకరించింది.
స్త్రీవాద సాహిత్యం ప్రధానంగా కోస్తాంధ్ర ఆధిపత్య కులాల స్త్రీల నుంచే వచ్చింది. ఈ సాహిత్య ఉధృతి, ఉత్పత్తి పెరిగినా, తరిగినా మెజారిటీ స్త్రీలైన దళిత బహుజన మైనారిటీ ఆదివాసీ స్త్రీలకు ఒరిదింది, తగ్గింది ఏమీలేదు. ఈ అస్తిత్వాల స్త్రీలకు కులం ప్రాంతం మతం మగాధిపత్యం, ఆసామి అజమాయిషి, దొర్సాని పెత్తనాలు అంటరానితనం అణచివేతలున్నాయి.
ఈ అణచివేతల నుండి వీళ్లు విముక్తి కావలసివుంది. 'స్త్రీవాదం' అనే పదం యిన్నాల్లు కోస్తాంధ్ర ఆధిపత్య కులాల స్త్రీల సమస్యలకే పరిమితమైవుంది. ఉమ్మడి వేదికకి ఈ పదం యిమడదని అనగా విస్తృత అస్తిత్వాలుగా వున్న అణగారిన స్త్రీలకు సరిపోదు అనే అభిప్రాయాన్ని సభ ఆమోదించింది.
అయితే మా ఈ చర్చల్ని, ప్రతిపాదనల్ని, ఆమోదాల్ని, దానికి సంబంధించిన రిపోర్టును పక్కనబెట్టి సభలో వీగిపోయిన శ్రమ సంబంధాల స్త్రీల సాహిత్య, శ్రమ తప్ప వేరే అస్తిత్వాలు లేవనే వాదన రిపోర్టు పత్రికల్లో రావడం జరిగింది. సభా నిర్వాహకులు ప్రత్యక్షంగా వ్యతిరేకించకపోగా పరోక్షంగా అనుకూలతను వెలిబుచ్చడం జరిగింది. సభా చర్చలు ఆమోదాలు ఎక్కడా వెలుగు చూడలేదు. యిలాంటి అణగదొక్కే అనుభవాల అవమానాల్తో వీరి ద్వంద్వ నీతికి వ్యతిరేకంగా అణగారిన అస్తిత్వాల రచయిత్రులు 'మట్టిపూలు'గా సంఘటితమయ్యారు.
ఒకవైపు దళిత బహుజన మైనారిటీ రచయిత్రుల అభిప్రాయాల్ని అతి దారుణంగా అణచివేసి యిప్పుడు 'ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక' అని పెట్టుకున్న ఆధిపత్య కులాల రచయిత్రులు మరోవైపు తమ అనుకూలురైన అణగారిన కులాల రచయిత్రుల్ని వేదికలో పెద్దపీటలేసి తమ ఆధిపత్య జెండర్ ప్రయోజనాల్ని కొనసాగించే పనిలో పడ్డారు. తద్వారా అణగారిన జాతుల స్త్రీలను అణచివేసే కార్యక్రమం పెట్టుకున్నారు. విశాఖ సభలో ఓడిపోయిన, కాలం చెల్లిన వాదనలు అణగారిన స్త్రీల భిన్న అస్తిత్వాల పుటంలో బూడిదైన వాదాన్ని రంగనాయకమ్మ మార్క్సిస్టు పుటంలో పెట్టి వూదుకుంటున్నారు.
నిజానికి ఈ చర్చా పాఠం సందర్భం స్త్రీల భిన్న అస్తిత్వాల మీద జరగాల్సినది. స్త్రీల భిన్న అస్తిత్వాల చుట్టూ అల్లుకుపోయిన దోపిడీ కుల రాజకీయాల గురించి జరగాల్సిన చర్చ. కాని రంగనాయకమ్మ చాలా పకడ్బందీగా ఆ ప్రస్థావనే లేకుండా, లేవదీయకుండా జాగ్రత్త పడింది. అస్తిత్వమంటే ఏమిటి? అని ప్రశ్న వేసుకొని జాతుల్లో కులాల్లో మతాల్లో తేడాలున్నాయని జవాబు చెప్పుకుని స్త్రీలల్లో వున్న ఎక్కువ తక్కువల వూసుగాని, ప్రస్థావన గాని చేయకపోవడం ద్వారా ఆధిపత్య కుల దొర్సానితనాన్నే ప్రదర్శించింది. అణగారిన స్త్రీల అస్తిత్వాల్ని తొక్కేసింది.
కులమనేది శ్రమవిభజనే కాదు శ్రామికుల మధ్య విభజన కూడా సృష్టించిందని అంబేద్కర్ చెప్పాడు. నేడు సమాజంలో వున్న భిన్న అస్తిత్వాల మీద చర్చ నడుస్తున్నది. కాని భిన్న అస్తిత్వాలతో వున్న మహిళలకు సంబంధించిన అస్తిత్వాల చర్చకు మాత్రం అవకాశం యివ్వడం ఆధిపత్య కుల స్త్రీలకు యిష్టంలేదు. మా సమస్యలు వేదిక లెక్కడం లేదు. వెలుగు చూడ్డంలేదు.
సాహిత్యంలోనూ అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నాం. మా సమస్యల్ని ఆధిపత్య కుల మార్క్సిస్టు రచయిత్రి అర్థం చేసుకోగలదా? అస్తిత్వాలు అర్థం కావాలంటే కులవ్యవస్థను అర్థం చేసుకోవాలి. కుల సమాజంలో పుట్టి ఉత్పత్తి శక్తుల్ని, ఉత్పత్తి సంబంధాల్ని మానవ సంబంధాల్ని నియంత్రించేది, నిర్దేశించేది కులం కాదు అని ఎట్లా చెప్పగలము.
ఆమె ఏకరువు పెట్టిన కార్మికులు, పెట్టిబడిదారులు కూడా కుల వ్యవస్థ పునాదుల్లోనే వున్నారని తెలవదా! ఇక్కడ సమాజిక సాంస్కృతిక రూపం నిర్ణాయక మౌళిక అస్తిత్వం కులమే అని అనుభవంలోకి రావాలంటే అణగారిన కులాల్లో స్త్రీగా పుడితేనే తెలుస్తుంది. అణగారిన కులాలవాళ్లే శ్రమ చేసేవాళ్లుగా, ఆధిపత్యకులాలవాళ్లే శ్రమని దోచేవాళ్లుగా వ్యవస్థీకృతంగా ఎందుకు కొనసాగుతున్నారో చర్చ చేయండి. ఆ చర్చకోసం ప్రశ్నలు వేసుకోండి.. యింకా అస్తిత్వాలు బాగా అర్థం అవుతాయి.
రోడ్లూడ్చే, పాకీ, పారిశుధ్య శ్రమలో ఆధిపత్య కులాలవాళ్లు ఎందుకు లేరు? దళిత కులాలవాళ్లే ఎందుకున్నారు? యిది శ్రమ విభజనా? కుల విభజనా? కులం సృష్టించే మానవ, ఉత్పత్తి సంబంధాల్ని, సంస్కృతుల్ని వివక్షల్ని మార్క్సిజం వంటి సిద్ధాంతాలు ప్రశ్నించలేవు, పరిష్కరించలేవు. ఈ విషయాలు లేవనెత్తిన కులాల్ని బహుజన ప్రయోజనాల్ని దెబ్బతీసే వాదాల్తో అణచివేస్తున్నాయి. మార్క్సిజంని వ్యక్తిగత ఆస్తిగా చూసే రంగనాయకమ్మ కూడా తన చర్చా ప్రశ్నల్లో మూసేసింది. ఆధిపత్య దోపిడీ గురించి మాట్లాడే యీ రచయిత్రి అణగారిన స్త్రీలపై వుండే ఆధిపత్యాలపట్ల మౌనం వహించి మరుగున పడేసింది.
సామాజిక అసమానతల్నుంచే అస్తిత్వాలేర్పడ్డాయని, అసమానతలు పోయిన్నాడే అస్తిత్వాలు పోతాయని యీ రచయిత్రికి తెలవ దా? అస్తిత్వాలంటే హక్కులు సాధించుకునేందుకు సాధనాలుగా వున్నాయని అస్తిత్వాల్ని చులకన చేసి అవమానించడం ఆధిపత్య కుల అహంకారానికి నిదర్శనం. అస్తిత్వ పోరాటాలు అస్తిత్వాల్ని మోయడానిక్కాదు, నిర్మూలించడానికే.
హక్కులు, అవకాశాలు, స్వేచ్ఛ ఉన్న కులాలకు అవి సాధించుకోవాల్సిన అవసరం లేదు. అవి సాధించుకోడానికి అస్తిత్వాలుగా కదులుతున్నారంటేనే వాళ్లెంతగా హక్కులు కోల్పోయారో, ఎంతగా హక్కులు కొల్లగొట్టబడినారో అర్థం చేసుకోవచ్చు. కులం వల్ల అన్నీ అమరిన వాళ్లకేం అర్థమవుతాయి హక్కుల్లేని అస్తిత్వాలు! మొత్తానికి ఆధిపత్య కుల మార్క్సిస్టు రచయిత్రి మేమెదుర్కొంటున్న ఎన్నోరకాల అణచివేతలకు సంబం ధించిన అణగారిన స్త్రీ అస్తిత్వాల్ని చర్చ చేయకుండా తొక్కేసింది.
పురుషాధిపత్యం పోవాల ని కోరుకుంటున్న ఆధిపత్య కులాల స్త్రీలు అణగారిన స్త్రీల అస్తిత్వాల్ని అణగదొక్కడం, పూడ్చేయడం ప్రజాస్వామికం కాదు, ఆధిపత్య కుల మార్క్సిజమే.
అణగారిన కులాల స్త్రీలపై ఆధిపత్య కులాలు చేసే అన్ని రకాల అణచివేత రాజకీయాల్ని ఎదించడానికి దళిత బహుజన ఆదివాసీ మైనారిటీ రచయిత్రులంతా సంఘటితం కావాలి.
- జూపాక సుభద్ర