|                                                                                                                                                                                                                                            |  |                                                                                                                                                                    | తినడానికి తిండికే లేక కటకటలాడే పేద పిల్లలకు  ఉన్నత విద్య  అంటే ఒకప్పుడు పగటి కల.  అలాంటిది ‘పెద్ద చదువులు పేదల హక్కు’ అని దివంగత  నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలుగెత్తి చాటారు. డబ్బులు లేని  కారణంగా ఏ  విద్యార్థీ పెద్ద చదువులకు దూరం కారాదని ఆయన భావించారు. అందుకే విద్యార్థుల  ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారు. ఫలితంగా 25 లక్షల మంది ఎస్సీ,  ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులకు పెద్ద చదువులు చదివే  అవకాశాలు లభించాయి. మధ్యాహ్నం మంచి నీళ్లతోనే కడుపు నింపుకునే పిల్లలు కూడా  ఆ పథకం భరోసాతోనే కళాశాలలలో చేరి పెద్ద చదువులు చదువుతున్నారు. తాము  కూలినాలి చేసుకు బతుకుతున్నా, తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉన్నదన్న  ఆనందంతో వారి తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు. మహానేత వైఎస్ మరణంతో పరిస్థితి  అంతా తల్లకిందులైపోయింది. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధిలోనూ   ప్రజాసంక్షేమంలోనూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఇప్పుడు  అట్టడుగు స్థాయికి దిగజారి పోతోంది. 
 ఫీజు రీయింబర్స్‌మెంట్  ఎగవేతకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో లక్షలాది మంది  విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. అతి కష్టంమీద  బతుకునెట్టుకొస్తున్న పేద తల్లిదండ్రులను ఫీజులను కక్కమంటే, ఎక్కడి నుంచి  తెస్తారన్న ఇంగితమైనా లేకుండా సర్కారు పూర్తి బాధ్యతారహితంగా  ప్రవర్తిస్తోంది. చదువులు కొనసాగించలేక,  మానుకోలేక  విద్యార్థులు ఎంతటి  మానసిక క్షోభను అనుభవిస్తున్నారో, వారిని చూసి తల్లిదండ్రులు ఎంతగా  కుమిలిపోతున్నారో ప్రభుత్వానికి పట్టడంలేదు.
 
 ఫీజు  రీయింబర్స్‌మెంటునే నమ్ముకున్న విద్యార్థులను నట్టేట ముంచడానికి కమిటీలు,  ఆదాయ ధ్రువీకరణలు, నోటరీలు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు అంటూ సవాలక్ష  అడ్డంకులను, సాకులను వెదుకుతోంది.  కోర్టు తీర్పులకు, చీవాట్లకు కూడా  చలించకుండా ‘పేదోళ్లకు పెద్ద చదువులు ఎందుకు?’ అన్నట్టుగా వ్యవహరిస్తోంది.  సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల శ్రేయస్సే ధ్యేయంగా చెబుతున్న  కాంగ్రెస్ ప్రభుత్వం, వారి సంక్షేమానికి ఉద్దేశించిన ప్రతి పథకానికీ ఎగనామం  పెట్టాలని చూస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే కాదు, మహిళలకు పావలా  వడ్డీ, ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య ిపింఛన్లు, రూ. 2కు కిలో బియ్యం, రైతులకు  ఉచిత విద్యుత్తు వంటి వైఎస్ పథకాలన్నిటికీ ఉద్వాసన తప్పదని వినవస్తోంది.
 
 అదే  నిజమైతే, ఈ ప్రభుత్వానికి ఒక్క క్షణమైనా అధికారంలో ఉండే  నైతిక హక్కు  ఉండదు. ప్రజల ఆగ్రహం కట్ట్టలు తెంచుకోకముందే, పథకాలన్నిటి కొనసాగింపుకు  సరిపడేలా బడ్జెట్లో పూర్తి నిధులను కేటాయించాలి. రీయింబర్స్‌మెంట్ వ్యయంలో  50 శాతాన్ని భరించడానికి కేంద్రాన్ని ఒప్పించాలి. ప్రభుత్వ నిర్వాకానికి  ఇప్పటికే ఒక విద్యార్థిని బలి అయిపోయింది. మరింతమంది విద్యార్థినీ  విద్యార్థులను బలిగోరకుండా ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించాలని,  రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నిటినీ తక్షణమే చెల్లించాలని కోరుతున్నాను.
 శ్రీనివాస్ పోతుల, తాటిపాక మఠం, పెదలంక గ్రామం, తూర్పు గోదావరి జిల్లా సాక్షి news soujanyamutho
 
 |                                                                                    |