Thursday, July 22, 2010
కీ.శే.నాగప్పగారి సుందర్రాజు 10 వ వర్థంతి కార్యక్రమ విశేషాలు
తేది: 17-7-2010,
సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతం,
డా.బి.ఆర్.అంబేద్కర్ ఆడిటోరియం,
హైదరాబాదు విశ్వవిద్యాలయం క్యాంపస్.
సరిగ్గా పదేళ్ళ క్రితం, ఇదే రోజు కీ.శే.నాగప్పగారి సుందర్‌రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. చరిత్రలో జూలై 17కి ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంది. కారంచేడు ప్రాంతంలో దళితులపై సామూహికదాడి జరిగిన రోజు. నేటికి ఇరవై ఐదేళ్ళైంది. సెంట్రల్ యూనివర్సిటీ ( హైదరాబాదు విశ్వవిద్యాలయం ) లో ప్రస్తుతం అడ్మిషన్స్ జరుగుతున్న హడావిడిలో నిమగ్నమై కూడా, ఒక బాధ్యతగా ఇదే రోజు దళిత స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు వర్థంతి కార్యమ్రాన్ని నిర్వహించడం అభినందనీయం.
కీ.శే.నాగప్పగారి సుందర్ రాజు రాసిన కవితలను సభ ప్రారంభానికి ముందుగా చంద్రయ్య, ఉదయభాను భావయుక్తంగా, చక్కని ఉచ్చారణతో చదివి వినిపించారు. వీటితో పాటు కీ.శే.నాగప్పగారి సుందర్ రాజు చాలా ఇష్టపడే నాయకుడు శివసాగర్ రాసిన పాట చంద్రయ్య గొంతులో మరోసారి అందర్నీ అలోచింపజేసింది. దళిత స్టూడెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సురేష్ వక్తలను వేదికపైకి ఆహ్వానించి, సభ ప్రాధాన్యతను వివరించారు. సభాధ్యక్షత వహించిన పరిశోధక విద్యార్థిని కుమారి డి.హేమలత మాట్లాడుతూ కీ.శే.నాగప్పగారి సుందర్ రాజు జీవిత విశేషాల్ని కొండను అద్దంలో చూపించినట్లు సంక్షిప్తంగా, సమగ్రంగా వివరించారు.
హైదరాబాదు విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ డా. శ్రీపతి రాముడు మాట్లాడుతూ కీ.శే.నాగప్పగారి సుందర్ రాజుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. వ్యక్తిగతసంబంధాలు చెడిపోకుండా, ఉద్యమాన్ని ఎలా ముందుకి తీసుకెళ్ళాలో సుందర్ రాజుని చూసి తెలుసుకోవాల్సినవెన్నో ఉన్నాయన్నారు. ప్రముఖకవి, రచయిత డా. కదిరె కృష్ణ మాట్లాడుతూ కీ.శే.నాగప్పగారి సుందర్ రాజు బ్రాహ్మణీయ సంస్క ృతికి ప్రత్యామ్నాయాన్ని చూపే ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు. సుందర్ రాజుతో తనకెంతో సన్నిహిత సంబంధాలున్నాయని వాటిని వివరించారు. కీ.శే.నాగప్పగారి సుందర్ రాజు చనిపోయినప్పుడు తాను రాసిన కవితను చదివి వినిపించారు. ఉద్వేగంతో డా. కదిరె కృష్ణ చేసిన ప్రసంగం సభను ఆకట్టుకుంది.
యోగివేమన విశ్వవిద్యాలయంలో అసిస్టెంటు ప్రొఫెసరు, దళిత స్టూడెంట్స్ యూనియన్ పూర్వ అధ్యక్షుడు డా.సతీష్‌బాబు మాట్లాడుతూ కీ.శే.నాగప్పగారి సుందర్ రాజు రెండు ప్రధాన మార్గాల్లో కృషి చేశాడని అది ఒకటి సాహిత్యంలోను, రెండవది సామాజికంగానూ సాధించాడని అన్నారు. సాహిత్యంలో దళిత సాహిత్యం ప్రత్యామ్నాయ సంస్కృతిని ఎలా సృజనీకరించాలో తన రచనల ద్వారా నిరూపించాడని, అలాగే కేవలం రచనలతో ఆగిపోకుండా దాన్ని సమాజంలో వివిధ ఉద్యమాల రూపంలో ముందుకి తీసుకెళ్ళాలని దాన్ని సాధించడానికి కీ.శే.నాగప్పగారి సుందర్ రాజు ఎంతో శ్రమించాడని కొనియాడారు.
డా. దార్ల వెంకటేశ్వరరావు ప్రసంగం
సభలో నేను (డా. దార్ల వెంకటేశ్వరరావు) మాట్లాడుతూ కీ.శే.నాగప్పగారి సుందర్ రాజుతో నాకున్న సన్నిహిత సంబంధాలను, అతని సామాజిక, సాహిత్య ఉద్యమ తత్వాన్ని వివరించాను. అతను చనిపోయినప్పుడు యూనివర్సిటీ విద్యార్థులం చాలా మందిమి అనంతపురం వెళ్ళి, దహన సంస్కారాలు పూర్తైయ్యేవరకూ ఉన్నామనీ, తర్వాత అతని తమ్ముడు ఆనందరాజుకి ఉద్యోగం ఇస్తానని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షురాలు ఆచార్య సరస్వతీరావుగారు హామీ ఇచ్చారని నాటి వివరాలను వివరించాను. సుందర్‌రాజు తమ్ముడు ప్రస్తుతం అక్కడే ఉద్యోగం చేస్తున్నాడనీ అతనిని ఒక ఫోను కాల్ (9441244332) చేసి పరామర్శించగలిగితే ఆ కుటుంబానికి గొప్ప ఓదార్పునిచ్చిన వాళ్ళవవుతారని, తద్వారా ఉద్యమకారులు చనిపోయినా వాళ్ళకెంతో గౌరవం ఉందనే సత్యాన్ని నిరూపించాలని చెప్పాను. నా ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలను కింద వివరిస్తున్నాను.
కారంచేడు సంఘటన ` సుందర్ రాజు ఆత్మహత్య
‘‘ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేకపోయాను. ఒక ఉద్యమకారుడు ఇలా హఠాన్మరణం చెందుతాడని కీ.శే.నాగప్పగారి సుందర్ రాజు గురించి నేనెప్పుడూ అనుకోలేదు. ఆయన మరణం గురించి నేనే మాట్లాడవలసి వస్తుందనీ నేనెప్పుడూ అనుకోలేదు. నేటికి సుందర్ రాజు చనిపోయి సరిగ్గా పదేళ్ళైయ్యింది. అలాగే నేటికి కారంచేడులో దళితులపై దమనకాండ జరిగ ఇరవైఅయిదేళ్ళైంది. కారంచేడు సంఘటన జరిగిన రోజే సుందర్ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు సంఘటనలకీ మధ్యేమైనా సంబంధం ఉందో లేదో నాకప్పుటికి స్ఫురించలేదు.నేను సుందర్ రాజు గురించి రాసిన పుస్తకంలోను దీన్ని ప్రస్తావించలేదు. బహుశా సమస్యని కేవలం అతని వ్యక్తిగత కోణం నుండే ఆలోచించాము తప్ప, ఈ దృష్టితోనూ అన్వేషించాల్సిన అవసరం ఉందేమో.
కదిలించిన సుందర్ రాజు కవిత
‘‘యూనివర్సిటీలో సుందర్ రాజు నాకంటే సీనియర్.అతను పిహెచ్.డి.,లో ఉండగా నేను ఎం.ఎ.లో చేరాను. అతను రాసిన ‘‘ ఔను నేను దేశద్రోహినే’’ అనే కవిత చదివి ఆయనకు దగ్గరయ్యాను. ఎం.ఎ. అయిన వెంటనే జె.ఆర్.ఎఫ్., వచ్చినా తనకి పిహెచ్.డి., సీటు ఇవ్వనందుకు నిదర్శనంగా కవిత రాశాడు. యూనివర్శిటీ గోడలమీద అతికించాడు. కవులకున్న బలహీనతో, బలమో తమకి ఆనందం కలిగినా, దుఖ్ఖంగా వచ్చినా వెంటనే కలం తీస్తారు. కవితో కథో రాస్తారు. వాటిని బయట పెడతారు. అక్షరం రగులుకుంటుంది. మహాకవి కాళోజీ అభివర్ణించినట్లు అక్షర రూపం దాల్చిన సిరాచుక్క వేయి మెదళ్ళకు కదలిక అవుతుంది. సుందర్ రాజు రాసిన కవిత చదివిన విద్యార్ధులు కదిలారు. సీటు సాధించుకున్నాడు. ఆ తర్వాత వికలాంగుల కోసం, యూనివర్సిటీలోని ఇతర సమస్యల పరిష్కారానికి జరిగే ఆందోళనల్లో పాల్గోనేవాడు. కేవలం దళితుల గురించే కాకుండా ఇతరుల సమస్యల గురించి కూడా స్పందించిన వ్యక్తి గురించి గుర్తు చేసుకోవడమంటే సామాజిక న్యాయం కోసం జరుగుతున్న ఉద్యమాలకి ఊతమివ్వడమే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా అలాంటి కార్యక్రమంలో భాగస్వాములైనట్లే. కనుక మీరంతా అభినందనీయులు. మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
సుందర్ రాజు - సమన్యాయం పోరాటం
‘‘ సుందర్ రాజు సమన్యాయం కోసం పోరాడాడు.అతడు మాదిగ కనుక, మాదిగల వైపు నుండి తన వాదనను వినిపించాడు. ఈ మధ్య నేను జి.కళ్యాణరావుగారి నవల ‘ అంటరాని వసంతం’ పై ఒక వ్యాసం రాశాను. చాలా మంది దాన్ని వ్యక్తి గత ద్వేషంగా అపోహ పడ్డారు. ఆ నవలా రచయిత నాతో మాట్లాడుతూ ‘అంటరాని వసంతం’ మొదటి భాగం కాదనీ, మొదటి భాగమంతా మీరు ఆశించిన మాదిగల గురించే ఉందనీ, అయితే దాన్ని మరొకరు రాసేశారని, అది అంత ప్రాచుర్యంలోకి రాలేదనీ, అయినా నా మూడవ భాగంగా వచ్చే నవలలో మాదిగల సంస్క ృతి పూర్తిగా ఉంటుందనీ నాతో అన్నారు. అఅదే మాట ఎక్కడైనా ఆయనే రాస్తే బాగుంటుందనేది నా వాదన. అయితే ఈ సందర్భంలో మనం దాన్ని మరోలా కూడా విశ్లేషించుకోవచ్చు.
ఇంతవరకూ ఉన్న తెలుగు సాహిత్యమంతా, అది దళితులు రాసినా, దళితేతరులు రాసినా, తెలిసో తెలియకో అత్యధిక శాతం మాదిగల గురించే రాశారు. కానీ, దాన్ని అందరూ ఒకేలా అవగాహన చేసుకోలేకపోయారు. ఈ రెండు ప్రధాన ఉపకులాల మధ్య దళితేతరులకు అవగాహన లేకపోవడం కూడా వారి వారి సంస్క ృతిని సరైన రీతిలో సృజనీకరించలేకపోయారు. ఆ ప్రయత్నం ఈ నవలలో మాలల కేంద్రంగా జరిగిందని మరో వాదన చేయవచ్చు కానీ, నా వాదన ఒకటే. చరిత్ర శ్రమ కులాల చరిత్రను విస్మరించింది. కనుక, చరిత్రను పునర్మించుకునే ప్రయత్నం అవసరమనే దృక్పథం గల వాళ్ళు రాసే చరిత్ర కూడా వక్రీకరణకు గురైతే ఎలా? అందుకే నా వ్యాసాన్ని అలా రాయవలసి వచ్చింది. కానీ, సుందర్రాజు తన రచనల్లో మాదిగల్నే కేంద్రంగా చేసుకున్నా, చాలా వాటిలో కేవలం అవి మాదిగలకు మాత్రమే చెందినవి కాదు. యావత్తు దళితులందరికీ అన్వయమయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. బ్రాహ్మణీయ సంస్క ృతిని తమదైన దృష్టికోణంతో నిరసించేటప్పుడు, విమర్శించేటప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి.సుందర్ రాజు రచనలను ఈ దృష్టితో చూసినప్పుడు అన్యాయాన్ని ఎదుర్కొనే దిశగా తన రచనలు కొనసాగాయని అర్ధమవుతుంది. అన్యాయాన్ని నిరసించడమంటే, న్యాయాన్ని తమ హక్కుల కోసం తాము ఉద్యమించకపోతే ఇతరులెవరో తమ హక్కుల్ని సాధించిపెడతారని ఆశించడం కేవలం అవకాశవాదమవుతుంది. అందు వల్ల సుందర్‌రాజు అవకాశవాదిగా మిగిలిపోలేదు. సమ న్యాయం కోసం పోరాడాడు. సమన్యాయం కోసం రాశాడు.
రాబోయేది ఓ.బి.సి.ల వర్గీకరణ మహోధ్యమం
‘‘ సుందర్ రాజుని దగ్గర నుండి చూసిన వ్యక్తిగా నేను గమనించిన అంశాలు. అతను కేవలం మాదిగల కోసమే పోరాడలేదు. క్యాంపస్‌లో అందరికీ న్యాయం జరగాలని ఆరాటపడ్డాడు. ముఖ్యంగా క్యాంపస్‌లో వికలాంగుల రిజర్వేషన్ అమలులో, వికలాంగులకు వెన్నుదన్నుగా నిలిచాడు. సుందర్ రాజు ఎస్సీ వర్గీకరణ వల్ల న్యాయం జరుగుతుందని ఆశించినట్లే, ప్రస్తుతం రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల వారికి ఎ.బి.సి.డి.లుగా వర్గీరణ ఉండటం వల్ల వారికి చాలా వరకూ న్యాయం జరుగుతుంది. అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఓబిసి రిజర్వేషన్స్ రూపంలో అమలులోకొచ్చింది. కానీ, 27 శాతం రిజర్వేషన్లు అందులోని కొన్ని ఉపకులాల వారికే దక్కుతున్నాయి. ఇది ఎంతవరకూ న్యాయబద్దమైన పంపిణీ అవుతుందనే ప్రశ్న రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. బహుశా రెండు మూడేళ్ళలో ఓ.బి.సి.ల వర్గీకరణ మహోధ్యమం చూడబోతున్నాం. అది న్యాయబద్దమైన పోరాటం కూడా అవుతుంది. లేకపోతే సామాజిక న్యాయం పేరుతో కొన్ని కులాల వారికే సామాజిక ఫలాలు అందుతాయి. మరికొంతమంది నష్టపోతారు. అది సమాజానికి మంచిది కాదు. సామాజిక అసమానతలకు, మరికొన్ని కులాల విద్వేషానికీ కారణమవుతుంది. సమాజసమతుల్యత దెబ్బతింటుంది. ఇలాంటి మహోన్నతమైన లక్ష్యాలు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ఉన్నాయి. వాటిని సుందర్‌రాజు సామాజిక ఉద్యమాల ద్వారాను, సాహిత్యం ద్వారాను ప్రజలముందుకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు.
సుందర్‌రాజు మరణించిన చోటే ఆనందరాజు ఉద్యోగం
సుందర్‌రాజు ఏవో కారణాల వల్ల చనిపోయాడు. అతడు కారంచేడు సంఘటన గురించి చాలా బాధ పడుతుండేవాడు. అతని మరణాన్ని అప్పుడు ఆకోణంతో చూడలేకపోయాం. కానీ, ఇప్పటికి సరిగ్గా కారంచేడు సంఘటన జరిగి నేటికి 25 ఏళ్ళైంది. సుందర్‌రాజు చనిపోయి నేటికి పదేళ్ళైంది. అతను చనిపోయిన రోజు యాదృచ్చికం కాదేమోనిని అనిపిస్తుంది. నిజానికి నేనా విషయాలన్నీ మాట్లాడదామనుకున్నాను. కానీ నా గొంగుమూగవోయింది. మాట్లాడలేకపోతున్నాను. అతనితో నాకున్న సంబంధం అంతగాఢమైంది.అతను చనిపోయిన తర్వాత మన సెంట్రల్‌యూనివర్సిటీ నుండి ఒక బస్సు వేసుకొని వెళ్ళాం. దహన సంస్కారాలయ్యే వరకూ ఉన్నాం. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సంతాపసభ జరిగింది.దానికి నాటి వి.సి. ఆచార్య సరస్వతీరావు కూడా వచ్చారు. సభలో నేనూ మాట్లాడాను. సభానంతరం వి.సి. చాంబర్‌లో చర్చలు జరిగాయి. సుందర్ రాజు పేరుతో యూనివర్సిటీలో ప్రతి ఏడాదీ జరిగేలా ఒక ఎండోమెంట్ లెక్షర్ పెట్టమని అడిగాం. కానీ, అది ఆచరణ సాధ్యం కాదనీ, మరేదైనా కోరుకోమనీ సూచించారు. సుందర్‌రాజు తమ్ముడు ఆనందరాజు అప్పటికి పి.జి.చేస్తున్నాడనుకుంటున్నాను. అతనికి తగిన ఉద్యోగం ఇప్పించమని కోరాం. దానికిఒప్పుకున్నారు.నేడు ఆనందరాజు అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. మీలో ఎవరైనా అతన్ని ఒకఫోను కాల్ చేసి పరామర్శిస్తే ఎంతో ఉపశమనం పొందుతాడు. పరామర్శ చాలా ఓదార్పునిస్తుంది. అది నాకిటీవలే అనుభవపూర్వకంగా తెలిసింది. మా నాన్నగారు చనిపోయినప్పుడు నాకు తెలిసింది. అతని ఫోను నెంబరు నా దగ్గరుంది. నా గొంతు సరిగ్గా వినిపించడం లేదు. ఇదిగో సోదరి హేమలత చెబుతుంది రాసుకోండి...9441244332.
ఒక ఉద్యమకారుణ్ణి మరిచిపోకుండా మీరీ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక వైపు అడ్మిషన్స్ జరగుతున్నా, మరోవైపు ఇంకా హాస్టల్ లో మెస్ లేకపోయి సమస్మల్లో ఉన్నా, ఉన్నంతలో అంకితభావంతో ఈ వర్థంతి కార్యక్రమాన్ని సుందర్ రాజు చనిపోయిన రోజునే నిర్వహించిన మీ సంకల్పం గొప్పది. మీలోని ఉద్యమస్ఫూర్తికి నిదర్శనం. మీ అందరినీ పేరు పేరునా అభినందిస్తునాను.
Posted by డా.దార్ల at 12:44 PM 1 comments
Labels: కదిరి కృష్ణ, డా.దార్ల వెంకటేశ్వరరావు, మాదిగ సమాచారం
No comments:
Post a Comment