మార్చి 10న పదిలక్షల మందితో హైదరాబాద్ దిగ్బంధానికి
పిలుపునిచ్చిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ 
 హైదరాబాద్, ఫిబ్రవరి 26 : ప్రత్యేక తెలంగాణ వచ్చే వరకు ఉద్యోగుల సహాయ  నిరాకరణ ఆగదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు పేర్కొన్నారు.  అందుకోసం అందరూ ఒకే తాటిపై ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఆయన  పిలుపునిచ్చారు. మార్చి 10వ తేదీన 10 లక్షల మందితో హైదరాబాద్‌ను  దిగ్బంధిస్తామని, రోడ్లపైనే వంటా వార్పు నిర్వహిస్తామని, ఆరోజు ఒక్క వాహనం  తిరగకూడదని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద లెక్చరర్లు చేపట్టిన రిలే దీక్షకు సంఘీభావం  తెలియజేసేందుకు శనివారం మధ్యాహ్నం శిబిరం వద్దకు వచ్చిన కేసీఆర్ మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తామని   కేసీఆర్  ప్రకటించారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ  ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడితే సార్వత్రిక సమ్మెకు  దిగుతామని, ప్రభుత్వానికి హెచ్చరిక చేశామని ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య, శాంతియుత పద్ధతిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికోసం  మార్చి 10వ తేదీన తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు అందరం రోడ్డుపైకి వద్దాం, 10  లక్షల మందితో హైదరాబాద్ దిగ్బంధంతో 'మిలియన్ మార్చ్' కార్యక్రమాన్ని  చేపడదామని కేసీఆర్ పిలుపిచ్చారు.                
 
 
