మూగ బోయిన ధిక్కార స్వరం

మూగ బోయిన ధిక్కార స్వరం
వరంగల్, ఆగస్టు 20 : 'అయ్యా..! అందరూ 'శాంతి..శాంతి' అని ఎన్నో ఏళ్లుగా మాట్లాడుతున్నారే. ఈ మంత్రం ఎప్పుడో జపించి ఆచరిస్తే మా తెలంగాణ పల్లెల్లో ఊరికో స్మారక స్థూపం ఉండేది కాదు. మా పోరగాండ్లు స్మారక స్థూపాల మీద ఎరుపై చీకటి అయ్యేవారు కాదు కదయ్యా..

' అని నిక్కచ్చిగా ప్రకటించిన ధీశాలి ఆయన. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న అనేక అస్థిత్వ ఉద్యమాలతో మమేకమై పనిచేసిన చిత్తశుద్ధిగల కార్యకర్తా ఆయన. విద్యార్థి రాజకీయ ఉద్యమాల్లో ఎర్రబావుటా మనసునిండా ఉన్నా, అన్నిరకాల సంఘాలతో మమేకమై కలిసి నడిచిన వ్యక్తిబావుటా ఆయన. ఆయనే ప్రొఫెసర్ కేసరాజు కుమార్. అసలు పేరు కేసరాజు కొమురయ్య.

కలం పేరు కొమ్రన్న. మెదడుకు సంబంధించిన వ్యాధితో ఆయన శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మృతితో కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ తరువాత అంతటి వాగ్దాటి కలిగిన ఒక మంచి అధ్యాపకుడిని కోల్పోయినట్లయింది.

విద్యార్థి దశ నుంచే..
కొమ్రన్న విద్యార్థి దశ నుంచే విద్యార్థి రాజకీయాల పట్ల ఒక విలక్షణ, పరిణతి చెందిన వ్యక్తిగా వ్యవహరించేవాడని ఆయన సహచరులు నెమరేసుకుంటున్నారు. విద్యార్థులకు రాజకీయాలుండాలి. అవి సమాజానికి అనువైనవిగా, ఆచరణీయమైనవిగా ఉండాలి అని ఆయన విద్యార్థి దశ నుంచే తన సహచరులకు చెప్పడమే కాకుండా ఆచరించేవాడని వారు గుర్తు చేసుకుంటున్నారు. పరకాల మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, అనిశెట్టి రజిత, పొట్లపల్లి శ్రీనివాసరావు, ఎన్.వేణుగోపాల్ (వీక్షణం ఎడిటర్) వీరిది ఆర్ట్స్ కాలేజీలో ఒక బ్యాచ్.

ఈ బ్యాచ్‌కు కొమ్రన్నే దాదాపుగా లీడర్. విద్యార్థి సాహిత్య ఉద్యమాలకు, విద్యార్థులకు ఒక సామాజిక, రాజకీయ దృక్పథం ఉండాలని నమ్మిన సిద్ధాంతాన్ని అధ్యాకుడిగా ఆచరించిన మృధుస్వభావి అని పోతరాజు సారయ్య, పొట్లపల్లి శ్రీనివాసరావు కేసరాజు వ్యక్తిత్వాన్ని గుర్తుచేసుకున్నారు. గోరా శాస్త్రి సంపాదక వ్యాసాలను చదవాలని తమకు పదేపదే చెప్పేవాడని, ఆయన తమ కుటుంబానికి ఎంతో సన్నిహితుడని పోతరాజు కేసరాజుతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు.

ఆయనకు లెప్టిస్ట్ భావజాలం పట్ల ఆసక్తి ఉన్నా, అభినివేశం ఉన్నా ఇతరుల వ్యక్తిగత నిర్ణయాలను కాదనేవారు కాదనీ పోతరాజు పేర్కొన్నారు. కేసరాజు చాలా మృధు స్వభావిగానే కాకుండా తన నిర్ణయాలపట్ల నిర్మొహమాటంగా ఉండేవాడని ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన ఆ కాలంలోనే దాశరథి కృష్ణమాచార్యను ఆర్ట్స్ కళాశాలకు తీసుకొచ్చి ఉపన్యాసాలిప్పించిన సాహితీ ప్రేమికుడని ఆయన పేర్కొన్నారు.

నిత్య అక్షర ప్రేమికుడు
కేసరాజు కుమార్ నిత్యపఠకుడే కాదు. నిరంతర అక్షర ప్రేమికుడు. ఆయన వృత్తిరీత్యా అధ్యాపకుడే అయినా తెలుగులో చక్కటి శిల్పం ఉన్న సాహితీకారుడు. ఆయనకు ఇంగ్లీషులో ఎంటి పట్టుందో తెలుగులోనూ అంతేస్థాయిలో రచనలు చేశారు. విద్యార్థి దశ నుంచే ఆయన కాలేజీ మ్యాగజైన్‌కు సంపాదకుడిగా పనిచేశారు.

ఆయన కాకతీయ విశ్వవిద్యాలయం స్టూటెండ్ వెల్ఫేర్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేసిన కాలంలో విద్యార్థులకు ఇవ్వాళ తెలంగాణ మాగాణంలో అగ్రభాగాన ఉన్న గాయకులుగా, రచయితలుగా ప్రసిద్ధులైన గోరటి వెంకన్న, అందెశ్రీ, సుద్దాల అశోక్‌తేజ వంటి వారిని యూనివర్సిటీలోకి తొలిసారిగా తీసుకొచ్చి విద్యార్థులకు వారి ద్వారా స్ఫూర్తి కలిగించిన అక్షర ప్రేమికుడు. ఆయన దగ్గర ఇద్దరు పీహెచ్‌డీ, నలుగురు విద్యార్థులు ఎంఫిల్ పూర్తిచేశారు. ఆయన ఆంధ్రజ్యోతి 'వివిధ' (సాహితీ పేజీ), ఎడిట్ పేజీకి సహ పలు పత్రికలకు వ్యాసాలు రాశారు. తెలంగాణలో మరో ధిక్కార స్వరం ప్రొఫెసర్ కొమ్రన్న రూపంలో అస్తమించడం విషాదకరం అని కవి అన్వర్ పేర్కొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు ప్రముఖ చెందిన కవి డాక్టర్ దామెర రాములు రాసిన 'జయహో తెలంగాణ' పుస్తకాన్ని ఆంగ్లంలోకి సంవత్సరం క్రితమే అనువదించారు. అయితే అది ఇంకా ప్రజల చేతిలోకి రావాల్సి ఉన్నది. తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య పేర్వారం జగన్నాథం కూర్చిన సంకలనం 'మోర్దొపు దున్న' కవిత్వాన్ని ధిక్కరిస్తూ కొమ్రన్న 'మా బోనులోకి మరో సింహం' అనే పుస్తకానికి సంపాదకత్వం వహించారు.

స్పష్టమైన వైఖరి..
విద్యార్థి దశ నుంచి అధ్యాపక జీవితం దాకా ఆయనకున్న రాజకీయ దృక్పథం నుంచి ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. దొరల తెలంగాణ మాకొద్దు. ప్రజల తెలంగాణ కావాలని గట్టిగా నినదించిన ఒక స్పష్టమైన స్వరం కొమ్రన్నది. అందులో భాగంగానే తాను చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో మేధోవర్గంలో ఒకస్థాయిలో కీలక భూమికనే పోషించాడు. సామాజిక తెలంగాణ అన్న తన మనసుకు,

వాస్తవ పరిస్థితికి దగ్గరగా ఉందని ప్రజారాజ్యంతో మమేకమైన ఆయన చిరంజీవి అసలు రంగు బయటపడటంతో ఆ పార్టీ కార్యకలాపాల నుంచీ దూరమయ్యారు. అంబేడ్కర్, పూలే, గాంధీ, మదర్ థెరిస్సా పేర్లతో ముందుకు వచ్చిన ప్రజారాజ్యం చివరికి ప్రజలులేని రాజ్యానికి కొమ్ముకాస్తుందని తాను బయటికి వచ్చానని స్పష్టం చేశారు.

చిట్యాల ఐలమ్మ (చాకలి ఐలమ్మ) వారసునిగా తనకు తాను పరిచయం చేసుకున్న కొమ్రన్న అప్పట్లో పతాక స్థాయిలో అందరి నోళ్లలో నానారు. 'మా ఊళ్లలో తిరిగే పోరగాండ్లు ఊరి నడి చావడిలో స్మారక స్థూపాలుగా ఎందుకు అయ్యారు' అని జాతికి కొత్తసవాలు విసిరిన కొమ్రన్న... తన చివరి కోరిక అయిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పాలకుర్తిలో నాటకుండానే కాలం చేయడం విధి వైపరీత్యం.
http://www.andhrajyothy.com/districtnewsshow.asp?qry=2010/aug/21/districts/wgl/21wgl6&more=2010/aug/21/districts/wgl/wgl&date=8/21/2010
Posted by డా.దార్ల at 1:42 PM 2 comments
Labels: ఆంధ్రజ్యోతి, మాదిగలపై పరిశోధన
Tuesday, January 05, 2010
ఎన్నో ప్రశ్నల్ని సంధించిన 'కైతునకల దండెం' ( ఆంధ్ర జ్యోతి సండే లో)

( ఆంధ్రజ్యోతి సండే సౌజన్యంతో )

ఉపకుల అస్తిత్వ పోరాటాల్లో మాదిగల పోరాటం మౌలికమైనది. దాదాపు ఐదువేల పైచిలుకు కులాలున్న ఈ దేశంలో అతి పెద్ద కుల సమూహం మాదిగలు. వారి గురించి వారు, ఇతరులు రాసిన కవితల సంకలనమే 'కైతునకల దండెం'. జూపాక సుభద్ర, పొనుగోటి కృపాకర్‌ మాదిగలు సంపాదకులుగా ఉన్న ఈ పుస్తకం సభ్యసమాజంపైకి పలు ప్రశ్నలు సంధిస్తుంది.

సింధులోయ నాగరికతను చిందేసి చూపించే సిందు మాదిగలను ఆశ్రిత కులాలుగా ఈసడించి బిచ్చగాళ్లుగా మార్చి చరిత్ర పోగొట్టుకున్న వైనాన్ని నిరసిస్తారు ఇందులోని కవులు. గొంతును, డప్పును, శరీరాలను ప్రచార సాధనాలుగా మార్చిన తొలి కమ్యూనికేషన్‌ ఇంజనీర్లయిన మాదిగల అస్తిత్వం పరాయీకరణ చెంది, ప్రశ్నార్థకమైనప్పుడు ఉద్యమమొక్కటే మార్గమంటారు వాళ్లు. మాదిగ వారసత్వాన్ని దళిత బహుజనుల అకౌంట్లో వేసుకోవటాన్ని ప్రతిఘటిస్తున్నారు వాళ్లు.

ఇప్పుడు భారతదేశం రోగ-యోగ సిండ్రోమ్‌లో ఉంది. ఇంత వెజిటేరియన్‌ టెర్రరిజంలో గొడ్డు మాంసం ప్రస్తావన, ప్రాశస్త్యం ఒక మకుటంగా మలచి మన ముందుకొచ్చిన కృపాకర్‌, సుభద్ర మాదిగల ఆత్మవిశ్వాసం విస్మయం కల్గిస్తుంది. వేదకాలంలో సుష్టుగా లేగ దూడలను యాగవిందులో అనుభవించిన వారి సంతతులకు ఈ నీసువాసనలిప్పుడు వాంతి తెప్పిస్తున్నాయి. జీవహింసే పరమావధిగా, జంతు కళేబరాలను పీక్కుతినే వారుగా వారికి మాదిగలు కన్పిస్తున్నారు. మాంసాహారులను సంస్కృతి హీనులుగా చూపుతుంది నియో బ్రాహ్మినిజం. ఈ ఈసడింపులకు బలమైన సమాధానాలు ఇందులోని కవితల్లో మెండుగా ఉన్నాయి.

ఈ సంకలనంలోని మొత్తం 92 కవితల్లో 65 కవితలు మాదిగలు, మిగతా 19 కవితలు మాదిగలతో సహానుభూతిగల కవులు రాసినవి. "నెత్తురోడుస్తూ వేళ్లాడే టోళ్లం మేము/ ఏ మురికి గుంటల్లోనో కలిసిపోవలసిన / చచ్చుపుచ్చు బతుకులు మావి/ కొత్త జన్మయెత్తి మీ పాదాలకు కవచాలయ్యాం'' అని జ్ఞానపీఠుడైన సినారే మాదిగ జ్ఞానంలో ఓలలాడాడు. మాదిగ డప్పును ప్రస్తుతిస్తూ ఆచార్య ఎన్‌.గోపి డప్పు "వాయింపు సరళిలోనే/ న్యాయాన్యాయాలు ధ్వనించేవి/ కొమరయ్య డప్పు/ కొమరయ్య చెప్పు/ ఇదే మా బాల్యం/ ఇదే మా కమూల్యం'' అంటాడు. తరతరాలుగా అణిచివేయబడుతూ ఒక సాంస్కృతిక వికలాంగత్వం ఆవహించిన మాదిగల నుద్దేశించి, "మూగవాడికీ మాట్లాడే హక్కుంది/ నత్తివాడికీ మాట్లాడే హక్కుంది/ గుడ్డీ, చెవిటీ, ఎడ్డివారికీ అభివ్యక్తి చేసే హక్కుంది'' అంటాడు కవి కె. శివారెడ్డి. అందుకే ఇపుడు వాళ్లకోసం వాళ్లు వెర్రిగొంతుకలిచ్చి మోయాలని హెచ్చరిస్తాడు. కవి కంచె ఐలయ్య చెప్పులకు పట్టాభిషేకాన్ని కాంక్షిస్తూ "ఇపుడు కాలం కూడా గజగజ లాడుతోంది / అబ్బో! మాదిగ రాజ్యమెచ్చింది'' అని ప్రకటిస్తాడు.

సంకలనంలోని తొలి కవితలో ఎండ్లూరి సుధాకర్‌ "సప్త సముద్రాల మీద/ చర్మాన్ని నానబెట్టిన నీకు / ఆ సూర్యచంద్రులు / చెరో చెప్పు కావలసిందే'' అని ఆదేశిస్తాడు. "వాకిట్లో వదిలి పోయిన చెప్పులు/ నట్టింట్లో పూజలు అందుకున్న గోమాత'' అని వర్తమాన అవతారంలోని మర్మాన్ని తెలుసుకోవాలంటాడు ఆచార్య కొలకలూరి ఇనాక్‌. ప్రముఖ నవలాకారుడు వేముల ఎల్లయ్య 'మాతంగి'లో "పొలికోసం బయలుదేరింది/ మనువా!/ నీ కంచంనిండా కండల నైవేద్యం అంటుంది''. పొనుగోటి రవి 'దున్నకూర'లో "వాడలో ఏ మాదిగ పిల్లోన్ని కొట్టమన్నా వైనంగా తెగుద్ది దున్నతల/ దున్నని పడేయటం మాదిగోడికి మూలుగుతో పెట్టిన విద్య'' అంటాడు. మాదిగ కులానికున్న దైన్యాన్ని నిరసిస్తూ పసునూరి రవీందర్‌ "తోలు తెగకుండ గొడ్డును కోసెటోళ్లం/ జరపైలం/ కట్టలు తెగనియ్యకుండ్రి'' అనే వార్నింగ్‌ జారీ చేస్తాడు.

డప్పు, చెప్పులతో బాటు ఈ దేశపు శాస్త్రీయ సంగీతాలకు శ్రావ్యతనిచ్చే పరికరాల్ని కనిపెట్టిన సౌండు ఇంజనీర్లు కాలం చేసిన కనికట్టు లేక చరిత్ర బలిపీఠంపై ఉండికూడా ఇప్పటికీ చరిత్ర సృష్టిస్తామనే ఆశతో ఉన్నారు. ఆదిశంకరుని అవుపోసన పట్టిన నాలుగు వేటకుక్కల చండాలురై కసితో నాలుగు అక్షరాలు నేర్చుకుంటున్నారు. కోత వారసత్వం నుండి రాత వారసత్వంలోకి రావాలనుకుంటున్నారు. ఇంత రాజ్యాంగ వెసులుబాటు ఉన్నా దరిద్రాన్ని దాటలేక మెజారిటీ ప్రజలుంటే, శక్తినంత కూడగట్టుకొని చదువుకున్న కొద్దిమంది కులానికి కొత్త శక్తి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. చెప్పులు అల్లినంత అలవోకగా కవితలు కావ్యాలు అల్లుతున్నారు.

భూమి చీల్చుకు వచ్చిన పచ్చని మొక్కవలె మాదిగ అస్తిత్వవాదం ముందుకొస్తోంది. ఈ విశాల సాహితీ సంద్రంలో సగం మందైనా సహకారాన్నిస్తే వారు అందరికన్నా ముందుంటారు. అయినా అత్యాశకాని వాళ్లు ఎందుకు ఇస్తారు?

- కొమ్రన్న
కైతునకల దండెం (మాదిగ కవిత్వం)
సంపాదకులు : కృపాకర్‌ మాదిగ, జూపాక సుభద్ర,
పేజీలు : 170, వెల: రూ. 80/-,
ప్రతులకు : పి. కృపాకర్‌, 13-6-462/ఎ/27
భగవాన్‌దాస్‌ బాగ్‌, తాళ్లగడ్డ, హైదరాబాద్‌ - 67

No comments: