బడుగుల్ని చీలించి పాలిస్తున్న పాల‘కుల’ కుట్ర

బడుగుల్ని చీలించి పాలిస్తున్న పాల‘కుల’ కుట్ర
- వర్గీకరణ ఉద్యమంతో అగ్రకుల పార్టీల క్రీడ
- పాలక పార్టీలకు వరంగా మాల, మాదిగల విభజన
- ఎవరికీ లేని క్రీమీలేయర్‌ బీసీలకే ఎందుకు?
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఐక్యతతో రాజ్యాధికారం

రాష్ట్రంలోని రెండు పాలక అగ్రకుల రాజకీయ పక్షాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఐక్యం కాకుండా, వారినుంచి తమ రాజ్యాధికారానికి భంగం కలుగకుండా వారిని విభజించి పాలించే ఎత్తుగలను చేపడుతున్నాయి. ఎస్సీల వర్గీకరణ అంశం సుమారు గత 15 సంవత్సరాలనుంచీ ఎస్సీలను తీవ్ర విభజ నలకు గురిచేస్తోంది! రాష్ట్రంలో ఎస్సీల జాబితాలోని 61 కులాలలో క్రమ సంఖ్య 32లో మాదిగ కులం, 35లో మాల కులం ఉన్నాయి. ఈ రెండు కులా లు ఎక్కువ జనాభా కలిగిన కులాలు. మిగతా 59 కులాలు సంఖ్యాపరంగా చిన్న కులాలు. దక్షిణ భారతదేశంలో మాల కులం, మాదిగ కులం కంటే కొంత సంఖ్యాపరంగా తక్కువ, అలాగే ఉత్తర భారతదేశంలో కూడా మాదిగలు సంఖ్యాపరంగా ఎక్కువ, మాలలు తక్కువ. కానీ దక్షిణ భారతంలో మాలలలో ఎక్కువ మంది మేధావులు, ఐ.ఎ.ఎస్‌., ఐ.పి. ఎస్‌. ఆఫీసర్లు, ఇతరత్రా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉండడంతో, వారిలో అక్షరాస్యత పెరిగి రిజర్వేషన్ల ఫలితాలను ఎక్కువగా పొందడం జరిగింది.

అలాగే శాసనసభ్యులు, లోక్‌ సభ సభ్యులు కూడా ఎక్కువ సంఖ్యలో రిజర్వేషన్ల ద్వారా ఎన్నికవుతూ, మంత్రివర్గంలో కూడా ప్రాధా న్యం పొందుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో మాలలు తక్కువ సంఖ్యలో ఉన్నా విద్యాధికులు అధికంగా నున్నందున, అన్ని రంగాలలో మాదిగల కంటే అభివృద్ధి పథంలో ఉన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు రిజర్వేషన్‌ ఫలాలు అందాల్సి ఉంటే, తక్కువ సంఖ్యలోఉన్న మాలలు ఎక్కువ రిజర్వేషన్‌ ఫలాలు పొందుతున్న దిశలో ‘జనాభా ప్రాతిపదికన’ అనే సామాజిక న్యాయానికి తూట్లుపడ్డాయి. ఫలితంగా సంఖ్యాబ లమున్న మాదిగలకు అన్యాయం జరుగుతోంది. తెలుగు దేశం అధినేత చంద్రబా బు ఈ విషయాన్ని గమనించి, మెజారిటీ ఎస్సీలు కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుగా స్థిరపడిపోయినందున, వారిని చీల్చి అధిక సంఖ్యాబలమున్న వర్గాన్ని తమ పార్టీకి మద్దతుగా చేసుకోవాలని భావించారు! మాదిగలను వ్యూహాత్మకంగా తమ ఓటు బ్యాంకుగా మార్చుకొనడం సాధ్యమని భావించి, వారితో మంతనాలు ప్రారంభించారు.

1920లో గురుస్వామి మాదిగ, అత్యధిక సంఖ్యాబలం కలిగిన మాదిగలు రిజర్వేషన్ల ద్వారా రావలసిన విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రావలసిన ఫలాలు దక్కక సామాజిక అన్యాయానికి గురవుతున్నారని గమనించి ‘అరుంధతీయ మహాసభ’ను స్థాపించారు. ఆ మహాసభ అంచలంచలుగా ఎదిగి మందా జగన్నాథం వంటి నేతలను కూడ ఆకర్షించింది! కాన్షీరాం బహుజన్‌ సమాజ్‌ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాదిగలు కూడా ఆకర్షితులవుతున్న నేపథ్యంలో, అందుకు విరుగుడుగా 1994లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో మాదిగలు ఒకపెద్ద బహిరంగసభ జరిపారు. సంఖ్యాపరంగా ఎస్సీలందరికీ అభివృద్ధి ఫలాలు- రిజర్వేషన్లు దక్కాలనీ, కానీ ఎస్సీ జాబితాలోని అప్పటి 59 కులాలలో ఒకే ఒక్క కులం ‘మాల’ అత్యధిక ఫలాలను పొందుతోందనే వాస్తవాన్ని వివరించడంలో విజయవంతం అయ్యారు!

ఆ సభకు మందకృష్ణ కూడా హాజరయ్యారు. ఈ దిశలోనే కనకారావు మాదిగ ఆధ్వర్యంలో1994 జూలై7న ‘మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి’ ఊపిరిపోసుకుంది. అక్కడ సమావేశమైన మాదిగ యువకులు మంద కృష్ణను నాయకుడిగా ఎంచు కొన్నారు. అదే సమయంలో తెలుగు దేశం అధినేత చంద్రబా బు కూడా ఈ సమస్య మీద మం తనాలు జరుపుతున్న నేపథ్యం లో మందకృష్ణ- చంద్రబాబును కలవడం, చంద్రబాబు మంద కృష్ణలోని నాయకత్వ లక్షణాలను గుర్తించడం జరిగింది. తెలుగు దేశంలోని కడియం శ్రీహరి, మందా జగన్నాథం వంటి నాయకులు మాదిగ వర్గానికి చెందిన వారయినందున, ఎస్సీలలో మాదిగలకు సామాజిక న్యాయం అనే నినాదంతో ఎస్సీలను బీసీల మాదిరిగానే 4 భాగాలుగా ఎ,బి,సి,డి గ్రూపులుగా విభజిస్తూ 1997 జూన్‌లో ప్రభుత్వ ఉత్తర్వులు నెం.68, 69లను విడుదలయ్యాయి.

ఈ చర్యతో మాదిగలు పూర్తిగా చంద్రబాబుకు మద్దతు పలికారు! మాదిగలే కాకుండా- మాలలు తప్ప- మిగిలిన 57 కులాలు కూడా చంద్రబాబుకు మద్దతు తెలిపాయి. దీంతో అసహనానికి గురయిన మాలలు ఈ చర్యను మాల మహానాడు పేరుతో రాష్ట్ర హైకోర్టులో సవాలు చేశారు. ఎ,బి,సి,డి వర్గాలుగా ఎస్సీలను విభజించిన చంద్రబాబు ఆ దినం పార్లమెంట్‌లో బిల్లుపెట్టించి, ఆమోదింపజేసి, రాజ్యాంగ సవరణచేయించి ఉంటే, నేడు రాజకీయంగా, కులపరంగా మాల, మాదిగలు బద్ధ విరోధులుగా మారేవారు కాదు. రాజ్యాంగ సవరణ చేయించకుండా, 1999 జూన్‌లో రాష్టప్రతి అనుమతితో వర్గీకరణకు కృత్రిమ చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్సు జారీ చేయించారు.

అయినా వర్గీకరణను సవాలు చేసిన మాల మహానాడు పిటిషన్‌ను విచారణకు తీసికొన్న రాష్టహ్రైకోర్టు దానిని సమర్ధించింది. హైకోర్టు చర్యను మాల మహానాడు సుప్రీం కోర్టులో సవాలు చేయగా, 2004 నవంబరు 5న వర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలేదనీ, ఈ చర్య పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంతోనే సాధ్యమనీ ప్రకటిస్తూ జి.ఒ.ను రద్దు చేసింది. వర్గీకరణ అమలుతో 2000 నుండి 2004 నవంబరు 5 వరకూ ఎస్సీలలోని మాదిగలు, ఇతర 57 కులాలూ పొందిన లబ్ధిని బేరీజువేసుకొన్న లబ్ధిదారులు అంతకు ముందు గత 50 సంవత్సరాలు, రిజర్వే షన్ల అమలులో ఎంత నష్టపో యిందీ అవగాహన చేసుకొన్నారు. అందుకే ఉమ్మ డి ఎం. ఆర్‌.పి.ఎస్‌. ఉద్యమా న్ని ఉధృతంచేశారు. ఈ ఉద్య మం తుఫాన్‌గా మారింది.

2004 ఎన్నికలలో తెలు గుదేశం పార్టీ ఓడిపోయి, కాంగ్రెస్‌ కూటమి గెలిచి దివంగత వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఎం.ఆర్‌.పి.ఎస్‌.చీలి మందకృష్ణ, దేవయ్యతో కూడిన ఎం.ఆర్‌.పి. ఎస్‌. ఒకటి, కనకారావు, కృపాకర్‌, విల్సన్‌లతో మరొక ఎం.ఆర్‌.పి.ఎస్‌ ఏర్పడ్డాయి. కనకారావు అధ్యక్షుడుగా ఉన్న నాయకత్వం కాంగ్రెస్‌కు దగ్గర కాగా, మందకృష్ణ, దేవయ్యల నాయకత్వంలోని ఎం.ఆర్‌.పి.ఎస్‌ తెలుగుదేశానికి దగ్గరగా పనిచేస్తూ వచ్చింది. ఈ దిశలోనే డిసెంబరు 2004లో కనకారావు అధ్యక్షతన సుమారు 15 వేల మంది మాదిగలతో వర్గీకరణను కోరుతూ ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్షలు చేపడితే, వర్గీకరణను కోరుతూ ఒక ప్రతిపాదనను అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదింపచేసి వై.ఎస్‌.ఆర్‌. కేంద్రానికి పంపారు.

తరువాత ఆర్‌.డి.విల్సన్‌ను ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు అధ్యక్షుడుగా నియమించారు. వ్యూహత్మకంగా మందకృష్ణ కూడ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.ఆర్‌కు దగ్గరకాగా, కృపాకర్‌ వేరే ఎం.ఆర్‌.పి.ఎస్‌ గ్రూపు అధ్యక్షుడు కాగా, కనకారావు చిరంజీవి ప్రజారాజ్యంలో ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. కాలక్రమేణా మంద కృష్ణ ఎం.ఆర్‌.పి.ఎస్‌కూడా చీలి దేవయ్య అధ్యక్షతన ఇంకొక ఎం.ఆర్‌. పి.ఎస్‌. గ్రూపుగా ఉద్యమంలోకి వచ్చింది. ఈ విధంగా అగ్రకుల నాయకత్వ రాజ కీయ పార్టీలు బలమైన ఉమ్మడి ఎం.ఆర్‌.పి.ఎస్‌.ను చీలికలు, పేలికలుగా చించి వేశాయి. ఎస్సీలు, బీసీలు ఐక్యంగా ఉద్యమాలు చేయకుండా అనేక కుట్రలతో అగ్రకుల నాయకత్వ పార్టీలు విజయం సాధిస్తున్నాయి.

రాష్టప్రతి ఆమోదంతో ఎ,బి,సి,డిలుగా ఎస్సీల వర్గీకరణ జరిగినపుడు, సుప్రీం కోర్టు ఏవిధంగా 341 ఆర్టికల్‌ను అడ్డుపెట్టుకొని వర్గీకరణను రద్దుచేస్తుంది? అటువంటప్పుడు 1975లో రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించాలన్న రాష్టప్రతి ఉత్తర్వుల మేరకు ఆర్టికల్‌ 341లో ‘డి’ క్లాజ్‌ ఎలా ఆవిర్భవించింది? రాష్టప్రతి ఆమోదం పొందిన ఉత్తర్వులను ఎస్సీల వర్గీకరణ విషయంలోనే నీరుకార్చడం జరిగింది. ఈ దిశలోనే బి.సి.లకు ఏ వర్గానికీ లేని క్రీమీలేయర్‌ పద్ధతిని సుప్రీంకోర్టు విధించింది. అలానే రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి 50 శాతానికే కుదించింది.

paluri-ramakrishnaiahఈ చర్యలన్నీ సామాజిక న్యాయానికి వ్యతిరేక మైనవే! బీసీ,ఎస్సీ,ఎస్టీ వ్యతిరేకచర్యలను అడ్డుకోవాలంటే ముందు సుప్రీంకోర్టు, హైకోర్టులలోని జడ్జీల నియామకాల్లో కూడా రిజర్వేషన్లను అమలు చేయాల్సిన అవసరముంది. ఈ విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలను చీల్చుతూ అగ్రకులాలు రాజ్యాధికారం మీద పట్టును 63 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాయి. మాలలు ఎస్సీ వర్గీకరణను అంగీకరిస్తే, మాల, మాదిగ కులాలే కాకుండా బీసీలతో కలసి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందే అవకాశముంటుంది.
(రచయిత బీసీ యునైటెడ్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు)
(courtesy : 5-1-2011 Surya daily )

No comments: