ఇక ఏ గ్యారెంటీ లేదు.

సరిహద్దులు దాటిన ప్రాణానికి
ఇక ఏ గ్యారెంటీ లేదు.
అకాల మరణాల వసంతంలో
ఆయువొక సుడిగాలి దీపం.

వీసాలు, పాస్-పోర్టులు
నిస్సిగ్గుగా …. ప్రాణాలను ప్రమోట్ చేస్తున్నాయి.
డాలర్లు పాడే థండర్ మ్యూజిక్ లో
వలసబోయిన జిందగీలన్ని
పచ్చి నెత్తురు ముద్దలవుతున్నాయి.
నాలుగు రాళ్ళ కోసం ఖండాలు దాటితే
పగబట్టిన పరదేశి సాయుధమై పలకరిస్తున్నడు.
అక్కడ గ్రేవ్ యార్డులో ఆర్కెస్ట్రా సంగీతం
ఇక్కడ నా తల్లుల గుండెల్లో మరణమృదంగం.
మనుషులను ఎక్స్ పోర్ట్ చేస్తూ
చావులను ఇంపోర్ట్ చేసుకుంటున్న
నా దేశమా నీకో సలామ్ !
బతకనివ్వని ఏలికల ప్రేమ
శవపేటికల్ని ఉచితంగా అందిస్తున్నందుకు
తలా కొంచెం సిగ్గుపడదాం!
చిగురించే ఆశలకి ఆలోచనలకి
చరమగీతం పాడిన చేతులు
అబ్రాడ్ లో మరణశయ్యలను సిద్దం చేస్తున్నాయి.
బ్రతకడానికి లేకున్న
చావడానికైనా ఇక్కడ బోలెడు ఫ్రీడం వుంది.
భూబకాసురులు ఎంత మేసినా
అక్కున చేర్చుకోవడానికి ఇక్కడ లెక్కలేనన్ని స్మశానాలున్నయ్.
చావడానికి… అమెరికాలో ఆస్ట్రేలియాలో ఎందుకు?
ఇక్కడే బతుకుదెరువు మేతకోసం
అటోఇటో తేల్సుకుందాం వలసపక్షులారా…..!
కత్తుల రెక్కలు కట్టుకొని రండి.
(పరాయి దేశాల్లో ప్రాణాలను అరచేతులో పెట్టుకొని బతుకీడుస్తున్న దోస్తులను యాది చేసుకొని…..)

ఒక్క అభిప్రాయం