రామాయణ పారాయణం
ఫిబ్రవరి 24, 2011 ద్వారా రవి చంద్ర అభిప్రాయములు
ఒకసారి ఓ పల్లెటూరి వ్యక్తి ఒకాయన రైల్వేస్టేషన్ లో కూర్చుని తను ఎక్కాల్సిన రైలు కోసం ఎదురు చూస్తూ రామాయణం చదువుకుంటూ కూర్చున్నాడు.
ఓ యువకుడు భార్యతో సహా వచ్చి పక్కనే నిల్చుని ఇలా అంటున్నాడు.
“మీ పెద్దవాళ్ళెప్పుడూ ఇంతే చదవడానికి ఇంకే పుస్తకం లేనట్టు ఎప్పుడు జూసినా రామాయణం పట్టుకుని చదువుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎన్నో పుస్తకాలుండగా మీరింకా రామాయణమే చదువుతున్నారు. అసలేంటి దాని గొప్ప?” అని అడిగాడు.
ఆ వ్యక్తి ఏమీ సమాధానం ఇవ్వకుండా చిరునవ్వు నవ్వుకుంటూ చదవడంలోనే లీనమైపోయాడు. రైలు రావడం మరో అర్ధగంట ఆలస్యం కావడంతో ఆ యువకుడు అలా బయటకి వెళ్ళొచ్చాడు. అతను తిరిగొచ్చేసరికి ఆయన ఇంకా రామాయణం చదువుతూనే కనిపించాడు. అతనికింకేమీ తోచక ఆ పల్లెటూరి వ్యక్తిని ఇంకా విమర్శించడం మొదలుపెట్టాడు.
కొద్ది సేపటి తర్వాత రైలు రానే వచ్చింది. సీటు కోసం అందరూ తోసుకుంటూ ముందుకు చొరబడిపోతున్నారు. లోపలికెళ్ళేసరికి ఆ యువకుడు, పల్లెటూరాయన పక్క పక్క సీట్లలోనే కూర్చుని ఉన్నారు. ఆయన మాత్రం రామాయణం చదవడం మానలేదు.
ఉన్నట్టుండి ఆ యువకుడు భార్య కోసం వెతకడం ప్రారంభించాడు. ఎక్కడా కనపడ లేదు. అప్పటికే బయల్దేరిన రైలు ఆపడానికి గొలుసు లాగాడు. ఇంకా ప్లాట్‌ఫారం మీదనే ఉందేమోనని ఆతృతగా వెతుకుతున్నాడు.
అప్పుడా పల్లెటూరాయన “నువ్వు రామాయణం చదువుంటే నువ్వు ఈ పొరబాటు చేసుండేవాడివి కావు” అన్నాడు.
“ఏంటీ?” అతను ఆశ్చర్యంగా చూశాడు.
అప్పుడాయన ఇలా అన్నాడు.
“రామాయణంలో రాముడు, సీతాలక్ష్మణ సమేతుడై గంగా తీరాన నిలిచి ఉన్నాడు. అప్పుడే పడవ వచ్చి ఆగింది. రాముడి ముందు సీతని అందులో ఎక్కమని తర్వాత తను ఎక్కాడు”
నువ్వు నన్ను ఇంతకుముందు అడిగావు కదా? రామాయణం ఎందుకు చదువుతూ ఉంటావనీ… ఇందుకే చూశావా ఇలాంటి చిన్న సందిగ్ధాలకు కూడా రామాయణంలో సమాధానం దొరుకుతుంది. అన్నాడు.