పునరావాసం, పునర్నిర్మాణం పేరుతో పేదలను దూరం చేయొద్దు
                  
హైదరాబాద్, (వి.వి.) :  ప్రభుత్వం ఎటువంటి ప్రత్యామ్నాయం చూపించకుండా, పునరావసం కల్పించకుండా  నిరుపేదలు నివసించే మురికివాడలను నగరానికి దూరంగా తరలించడం నేరమవుతుందని  ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజెయు) సెక్రటరీ జనరల్  కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజల్లో లోతైన చర్చ జరగకుండా  కేంద్రప్రభుత్వం మురికివాడల పునరాభివృద్ధి, పునరావాసం, నివారణాచట్టం- 2010  (మెప్మా) పేరుతో రూపొందించిన ముసాయిదాబిల్లును రాష్ట్రప్రభుత్వం చట్టంగా  తీసుకువస్తే అది పేదప్రజల నివాసహక్కుకు తీరని నష్టాన్ని  చేకూరుస్తుందన్నారు. బుధవారం నగరంలోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో  'అందరికీ నివాసహక్కు' డిమాండ్‌పై, నివాస హక్కుల పరిరక్షణ ప్రచారసమితి  (ఛత్రి) ఆధ్వర్యంలో జరిగిన మీడియా ప్రతినిధుల ఇష్టాగోష్ఠి కార్యక్రమానికి  ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్రప్రభుత్వం 'రాజీవ్ ఆవాస్  యోజన' అమలుకోసం రూపొందించిన మురికివాడల అభివృద్ధి, పునరావాసం, నివారణ చట్టం  అనే పదాలు పేదలకు చెడుచేయకుండా ప్రభుత్వ ఉద్దేశ్యం యథావిధిగా అమలు చేస్తే  అభ్యంతరం లేదన్నారు. ఈ చట్టంలోని లొసుగులు అధికారులకు, రాజకీయవేత్తలకు చాలా  అందుబాటులో ఉండి వారికి లబ్ధిచేకూర్చేదిగా ఉంటే వ్యతిరేకించాల్సిన  అవసరముందన్నారు.నగరాలు, పట్టణాల్లో భూమి బంగారం కంటే ఎక్కువగా  పెరిగిపోతుందని, పేదలు నివాసమేర్పరచుకోవడానికి అనువుగా ఉన్న 95 శాతం  ప్రభుత్వభూమిని ల్యాండ్‌మాఫియా, కొందరు రాజకీయవేత్తలు, బ్యూరోక్రసీ ఏకమై  అక్రమించుకునేందుకు యత్నించడం శోచనీయమన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి  మహీధర్ రెడ్డి రాష్ట్రంలో రాజీవ్ ఆవాస్ యోజన అమలుకు కేంద్రాన్ని రూ.68  వేల కోట్లనిధులు కోరితే, రూ. 6,500 కోట్లు కూడా కేటాయించలేదని తెలిపారు.  2014 నాటికి రాష్ట్రంలో ఎక్కడా కూడా మురికివాడలు లేకుండా చేస్తామన్న  ప్రభుత్వఆకాంక్ష సరైనదైనప్పటికీ, ఆచరణ కష్టసాధ్యమేనన్నారు. రాష్ట్ర  ప్రభుత్వం ముసాయిదాబిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్‌కు ప్రయత్నించే అవకాశం  కూడా ఉందన్నారు.మానవ హక్కుల వేదిక అధ్యక్షులు జీవన్‌కుమార్ ప్రసంగిస్తూ  ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ సిటీ కాన్సెప్ట్ వస్తుందని అందుకు షాంఘై  నగరాన్ని ఉదహరించారు. నగరాలు చాలా అందంగా ఉండాలన్న పేరుతో పాలకులు పేదలను  నగరాలనుంచి వెళ్ళగొట్టే ఆలోచన చేయడం ఆక్షేపణీయమన్నారు. మురికివాడలను,  ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యం (పిపిపి) పేరుతో అభివృద్ధి చేయాలని  చూస్తోందన్నారు. పిపిపి చాలా ప్రమాదకరమైనదని పేర్కొన్నారు. పాలకులు  రాజకీయలబ్ది కోసమే ఎన్నికలప్పుడు పథకాలను రూపొందిస్తున్నారని, ప్రజలకు  జీవించే హక్కు ఉన్నప్పటికీ నివాసహక్కు కల్పించకపోవడం విచారకరమన్నారు. ఛత్రి  కన్వీనర్ బ్రదర్ వర్ఘీస్ తెక్నాథ్ మాట్లాడుతూ పేదప్రజలకు నివాసహక్కు  దక్కే విషయంలో మీడియా క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. పేదరికం  నిర్మూలన కోసం ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నా నేటికీ  అట్టడుగువర్గాల ప్రజలకు ఉచితంగా ఇళ్ళు నిర్మించి ఇవ్వలేకపోవడం  విచారకరమన్నారు. పేదలకు నివాసహక్కు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా  పేర్కొన్నారు. ఛత్రి కో- ఆర్డినేటర్ జె.రమణారావు అధ్యక్షతన జరిగిన ఈ  ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు,  సందేహాలకు ఛత్రి కన్వీనర్ వర్ఘీస్ సమాధానాలిచ్చారు.