ప్రతి కార్మికునికీ

ప్రతి కార్మికునికీ రూ.10 వేల జీతం ఇవ్వాలి

Thu, 24 Mar 2011, IST    vv Share  Buzz up!
కార్మిక సంఘాల ఐక్య ధర్నా
హైదరాబాద్‌ (వి.వి.) : రాష్ట్రంలో ప్రతి కార్మికునికి కనీస వేతనం రూ.10 వేలకు పెంచి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న 5 లక్షలపైగా ఉన్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులను వెంటనే క్రమబద్ధీకరించే వరకు ఐక్య ఉద్యమాలను కొనసాగిస్తామని పలు కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికుల న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పి.జె చంద్రశేఖరరావు హాజరుకాగా, ఎఐటియుసి కార్యదర్శి నరసింహన్‌, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాభాస్కర్‌, టిఎన్‌టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రాంబాబు, ఐఎఫ్‌టియు నాయకులు ఎస్‌.వెంకటే శ్వరరావు, హెచ్‌ఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు నాయిని నర్సింహారెడ్డి, నాయకులు ఆర్‌.రాంబాబు, ఎఐయుటియుసి నాయకులు సుధీర్‌, సిసిఇడబ్య్లూడబ్య్లూ నాయకులు వి.నాగేశ్వరరావు, ఎఐడిడిఇఎఫ్‌ నాయకులు చంద్రయ్యలు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కార్మిక సంఘాల నాయకులు మహమ్మద్‌ యూసుఫ్‌ (ఎఐటియుసి), జె.వెంకటేశ్‌ (సిఐటియు), వెంకటేశ్‌ (హెచ్‌ఎంఎస్‌), ఎస్‌.ఎల్‌.పద్మ (ఐఎఫ్‌టియు), అశోక్‌ (టిఎన్‌టియుసి) అధ్యక్షవర్గంగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా పి.జె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, శాశ్వత స్వభావం గల పనులలో శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్లు మారినాఅప్పటికే అక్కడ పని చేస్తున్న కార్మికులను తొలగించడమో, మార్చడమో చేయరాద న్నారు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్న కార్మికులకు పెరిగిన ధరలకు అనుగు ణంగా కనీస వేతనం 10 వేలకు పెంచాలని గత రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నో ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
నరసింహన్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు ఇప్పటికే రూ.40 వేల వరకువున్న వేతనాలను రెట్టింపు చేయాలని అడిగిన వెంటనే జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో అమలు చేయడానికి సిద్ధమైన ముఖ్యమంత్రికి కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదని ధ్వజమెత్తారు. కార్మికులకు ఇచ్చే నాలుగు, ఐదు వేల రూపాయలు జీతం ఈ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇస్తే ఇంట్లో వారికి తిండి పెడతారో, లేక వాత పెడతారో తెలుస్తుందన్నారు. సుధాభాస్కర్‌ మాట్లాడుతూ కనీస వేతనానికి సంబంధించి జీవో విడుదల చేసినా అమలు చేయడం లేదని విమర్శించారు. అమలు అయ్యేలా ముఖ్యమంత్రిచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జి.రాంబాబు మాట్లాడుతూ, కనీస వేతన జీవో విడుదల కోసం పోరు తప్పడం లేదని, మరోవైపు వచ్చిన జీవో అమలుకు కూడా ఉద్యమిస్తే తప్ప ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేెటన్నారు. ఎస్‌.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సమానపనికి సమాన వేతనం చెల్లించాలని జీవో నెం.6 క్లాజ్‌ (7)ను విధిగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆర్‌.రాంబాబు, సుధీర్‌లు మాట్లాడుతూ, కార్మికుల చట్టం ప్రకారం పర్మినెంట్‌, కాంట్రాక్ట్‌ కార్మికులన్న తేడా లేకుండా సంవత్సరంలో 30 రోజులు పని చేస్తే బోనస్‌ ఇవ్వాలని ఉన్నా, కార్మికులకు మాత్రం ఏళ్ళకు ఏళ్ళుగా పనిచేస్తున్నా బోనస్‌ ఇవ్వడం లేదన్నారు. వి.నాగేశ్వరరావు, చంద్రయ్య మాట్లాడుతూ 1957వ సంవత్సరంలో జరిగిన ఇండియన్‌ లేబర్‌ కాన్ఫ్‌రెన్స్‌ సూచనల మేరకు కనీస వేతనం అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా ప్రతి కార్మికునికి పిఎఫ్‌, ఇఎస్‌ఐ, బోనస్‌ తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.