కాంగ్రెస్ కు భంగపాటు
- 'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బోణీ
- టిడిపికి రెండు బోనస్
- డిఎస్, సిఎం 'పోస్టుమార్టం'
- నివేదికతో నేడు ఢిల్లీకి కిరణ్
అక్కడ జగన్ గ్రూపు అభ్యర్థి గెలవడం కొసమెరుపు. చిత్తూరులో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికకు ముఖ్యమంత్రి స్వయంగా పావులు కదిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. జగన్ సొంత జిల్లా కడపలో ఆయన గ్రూపు నిలబెట్టిన అభ్యర్థి గెలుపొందినప్పటికీ ఇదేమంత గెలుపు కాదని రాజకీయ విశ్లేషకులు, ప్రత్యర్ధులు అంటున్నారు. కడప జిల్లా మొత్తం తనదేనని వైఎస్సార్ పార్టీ చెప్పుకుంటున్న తరుణంలో జగన్ గ్రూపు అభ్యర్థికి కేవలం పది ఓట్ల మెజార్టీ వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి జగన్ గ్రూపు వశమైంది. ఇక్కడ ఊహించినట్లుగానే గంగాభవానీకి చుక్కెదురైంది. ఆమె అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీలోని కొందరు వ్యతిరేకించారు. అయినా ఆమెకే టిక్కెట్ ఇవ్వడంతో జగన్ గ్రూపు గెలుపునకు మార్గం సుగమైంది.
'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలకు ఆజ్యం పోశాయి. అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డికి, మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ మధ్య బహిరంగంగా విమర్శల తూటాలు పేలుతున్నాయి. చిత్తూరు జిల్లాలో మొదటి నుండి కిరణ్‌కుమార్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారథ్యంలో ఎమ్మెల్యేలు కుతూహలమ్మ, షాజహాన్ తదితరులు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి తమ అభ్యర్థిని గెలిపించుకున్నారు. ఇది సిఎంకు చెంప పెట్టులాంటిది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చక్రం తిప్పినట్లు పేరొచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థులందరినీ గెలిపించుకోవడంతో సొంత పార్టీ నేతలు ఆకాశానికెత్తారు. ఇదే సమయంలో తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ నేరుగా సిఎంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కెసిఆర్ విమర్శలను పక్కనబెడితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించడంతో పెరిగిన ముఖ్యమంత్రి ప్రతిష్టను 'స్థానిక' ఎమ్మెల్సీ ఫలితాలు పాతాళానికి దిగజార్చాయి. 'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి రాజకీయ పార్టీలు డబ్బు మీదనే నడిచాయి. ఓటర్లను పలు రకాలుగా ప్రలోభాలకు గురి చేసినట్లు ఆరోపణ లొచ్చాయి. ప్రధానంగా కాంగ్రెస్, జగన్ గ్రూపు వేర్వేరు చోట్ల ఓటర్లకు శిబిరాలు నిర్వహించాయి. టిడిపి సైతం కొన్ని చోట్ల క్యాంప్ రాజకీయాలు చేసింది. భారీ స్థాయిలో ఓటర్ల కొనుగోళ్లు జరిగినట్లు వార్తలొచ్చాయి. తొలుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయట్లేదని, తమ మద్దతుదార్లు ఆత్మప్రబోధానుసారం ఓట్లేయాలని జగన్ ప్రకటన చేశారు. ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పొచ్చింది. జగన్ బహిరంగంగా కనబడకపోయినప్పటికీ ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలు, నేతలు 'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టారు. ఆ విధంగా కడప, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలోని ఒక స్థానంలో జగన్ గ్రూపు అభ్యర్థులు రంగంలోకి దిగగా కడప, చిత్తూరు, పశ్చిమ గోదావరిలో విజయం సాధించారు. పశ్చిమ గోదావరిలోని మరో స్థానంలో టిడిపి నెగ్గింది. తూర్పు గోదావరిలో జగన్ గ్రూపు, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఓట్ల చీలిక టిడిపికి లాభించింది. అక్కడ టిడిపి అభ్యర్థి గెలుపొందారు. అనంతపురం స్థానం మరీ విచిత్రం. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి బరిలో ఉన్నారు. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదన్న అసంతృప్తితో ఉన్న జెసి దివాకర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సత్తా చూపారు. తమ గ్రూపు ఓటర్లను ఎన్నికల్లో ఓట్లు వేయనీకుండా చేశారు. దీంతో అక్కడ ఊహించని విధంగా టిడిపి అభ్యర్థి గెలుపొందారు. పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి గతంలో వైఎస్‌కు సన్నిహితంగా ఉండేవారని పేరుంది. మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ పరోక్షంగా జగన్ గ్రూపుతో చర్చలు జరిపి వారి తరఫున అభ్యర్థి లేకుండా చూసుకున్నారని తెలుస్తోంది. అయితే మంత్రులను వ్యతిరేకిస్తున్న జెసి తనదైన శైలిలో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి లేరంటూ ఎన్నికలను బహిష్కరించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి చెందడంతో అనంతపురం జిల్లాలో మంత్రులు, జెసి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. జెసి కాంగ్రెస్ ద్రోహి అని, ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని మంత్రి రఘువీరా విమర్శించగా, మంత్రులే ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యారని జెసి గ్రూపు ఆరోపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల వల్ల అనంతపురం జిల్లా కాంగ్రెస్‌లో చిచ్చు రాజుకుంది. పార్టీ నిట్టనిలువునా చీలింది. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన సన్నిహితుడు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఆయన గెలుపు వెనుక ధర్మాన కృషి ఉందని చెప్పాలి. ఇక నెల్లూరులో జగన్ గ్రూపు అభ్యర్థి ఉన్నప్పటికీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, నేదురుమల్లి గ్రూపులు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కలిసి పని చేశారని కాంగ్రెస్ నేతలంటున్నారు. అందుకే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారంటున్నారు. కర్నూలులో ఎస్‌వి సుబ్బారెడ్డి కుమారుడు ఎస్‌వి మోహన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకిదిగి విజయం సాధించారు. ఇక్కడ జగన్ గ్రూపు ఎస్వీకి మద్దతిచ్చింది. ఎస్వీ సోదరి శోభానాగిరెడ్డి ప్రస్తుతం జగన్‌కు మద్దతిస్తున్నారు. ఆ సంబంధాలే జగన్ గ్రూపు అభ్యర్థిని నిలబెట్టకుండా చేశాయని సమాచారం.
ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలతో కంగుతిన్న ముఖ్యమంత్రి ఇప్పుడు డబ్బు ప్రభావం ఎన్నికల్లో పని చేసిందంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు మంత్రులు రంగంలోకి దిగి నానా ప్రలోభాలకు గురి చేశారన్నది బహిరంగ రహస్యం. అవేమీ తెలీనట్లు వ్యవహరిస్తున్నారు సిఎం. నిజానికి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు పంపిణీ, క్యాంపు రాజకీయాలు, మద్యం ప్రవాహం తదితర అరాచకాలు ప్రబలాయి. వీటికి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలన్నీ బాధ్యత వహించాల్సి ఉంది. తూర్పుగోదారి జిల్లాలో పలువురిపై పిసిసి అధ్యక్షుడు సస్పెన్షన్ వేటు వేసినప్పటికీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అదుపు చేయలేకపోయారు. ఫలితాలొచ్చాక ఎక్కడో తప్పు జరిగిందని, పోస్టుమార్టం చేస్తున్నామని, పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డిఎస్, సిఎం హెచ్చరికలు చేస్తున్నారు. నిజానికి మాజీ మంత్రి జెసిపై చర్య తీసుకొనే స్థితి ప్రస్తుత కాంగ్రెస్‌కు లేదనే చెప్పాలి. అలాగే చిత్తూరులో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇప్పుడు తమ అభ్యర్థి జగన్ గ్రూపు కాదు కాంగ్రెస్ అభ్యర్థి అని చెబుతున్నారు. బహిరంగంగా సిఎంకు సవాల్ విసురుతున్న పెద్దిరెడ్డిపై సైతం చర్యలు తీసుకోలేని బలహీనత కాంగ్రెస్‌కు ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ అధిష్టానానికి డిఎస్, సిఎం వేర్వేరుగా నివేదికలు తయారు చేసి పంపుతున్నారు. ముఖ్యమంత్రి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అధిష్టానానికి అన్ని విషయాలూ వివరించడానికే కిరణ్ ఢిల్లీ వెళుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.