జన గణన సంపాదకీయం

జన గణన
సంపాదకీయం

భారతదేశ జనాభా 121 కోట్లకు చేరుకున్నది. ఆంధ్రప్రదేశ్ జనాభా సుమారు ఎనిమిదిన్నర కోట్లకు చేరింది. దేశవ్యాప్తంగా జనాభా 17.64 శాతం పెరిగినమాట నిజ మే, పెరుగుదల రేటులో మొదటిసారిగా క్షీణత కనిపించడం శుభసూచకం. పదేళ్ళకొకసారి ప్రభుత్వం చేపట్టే జనాభా సేకరణ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న జనగణనకు సంబంధించిన తొలివిడత 2011 జనాభా లెక్కలను కేంద్ర హోంశాఖ గురువారం ప్రకటించింది. దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక విధాన రూపకల్పనకు జనగణన అత్యంత కీలకమైనది.

ఇప్పటికే సేకరించిన ఇతర సమాచారంతో పాటు, కులాలవారీ జనాభా లెక్క లు కూడా తరువాయి విడత లెక్కల్లో బయటపడవచ్చు. విద్య-అక్షరాస్యత, వైద్య-ఆరో గ్యం, జాతి, మత, కుల, లింగపరమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల కు చెందిన గణాంకాల ఆధారంగా రూపొందే వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల, విధానాల రూపకల్పనకు జనగణనే ఆధారం. దేశంలోని వివిధ సాంఘిక వర్గాల స్థితిగతులను, మార్పులను, ఒక జాతిగా మన గమనాన్ని అది తెలియజేస్తుంది. దేశ జనాభా చరిత్రలోనే తొలిసారిగా జనాభా వృద్ధిరేటు గత దశాబ్ద కాలంలో మూడున్నర శాతం తగ్గిం ది. ఇది మన దేశం చేపట్టిన కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఫలితాలను సాధిస్తున్నట్టు సూచిస్తోంది. కుటుంబ నియంత్రణ విజయవంతం కావడమంటే, ప్రజల సామాజికార్థిక స్థితిగతుల్లో, చైతన్యంలో పురోగతి కనిపిస్తున్నట్టు లెక్క.

జనాభా పెరుగుదల రేటులో క్షీణత 90 సంవత్సరాల కిందట 1921 జనాభా లెక్కల్లో కనిపించింది. ఆ తరవాత జరిగిన అన్ని జనగణనల్లోనూ పెరుగుదల రేటు పెరుగుతూవచ్చింది. నాటి క్షీణత కు కారణాలు వేరు. 1913-14 భారత దేశంలో తలెత్తిన కరవు, విషజ్వరాలు, ప్లేగు వ్యాధి పీడిత మరణాల కారణంగా నాడు జనాభా వృద్ధిరేటు క్షీణించింది. నేడు దేశ సామాజికార్థికాభివృద్ధికి సంబంధించిన పురోగతి కారణంగా జనాభాపెరుగుదల రేటు తగ్గుముఖం పట్టింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో ప్రపం చ ఆర్థిక వ్యవస్థ వికాసం కారణంగా ప్రపంచ జనాభా వేగంగా పెరిగింది.

వైద్యరంగంలో సాధించిన గణనీయమైన ఆవిష్కరణలు, ప్రజారోగ్యాన్ని సంరక్షించేందుకు ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలు- ఆయుర్దాయాన్ని పెంచడంతో పాటు, శిశుమరణాలను అరికట్టా యి. గతంలో జనసంఖ్యను అరికట్టిన ప్రాకృతిక ఉపద్రవాలు, యుద్ధాలు తగ్గినందున జనన-మరణాల నిష్పత్తిలో మార్పు వచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా సంతానాన్ని కట్టడి చేసుకోవడమొక్కటే జనాభావిస్ఫోటనాన్ని నిరోధించగలిగే సాధనమైంది. ఐక్య రాజ్య సమితి సూచించిన కుటుంబ నియంత్రణ కార్యక్రమాలతో ప్రజల్ని చైతన్యవంతం చేసి అమలు చేస్తున్న కారణంగా మన దేశం ఇంతకాలానికి సానుకూల ఫలితాలను సాధించ డం మొదలుపెట్టింది.

కుటుంబాన్ని పరిమితం చేసుకోవడానికి సమాజాల చైతన్యస్థాయికి, జీవన స్థితిగతుల కు సంబంధం ఉంటుంది. అందువల్లనే వెనుకబడిన ప్రాంతాల్లో, సమాజాల్లో అధిక సంతానం ఉన్న కుటుంబాలు కనిపిస్తాయి. విశ్వాసపరమైన కారణాలు, ఆర్థిక కారణాలు కూడా పెద్దకుటుంబాలకు కారణమవుతాయి. కాబట్టి, ప్రభుత్వాలు చేసే ప్రచారకార్యక్రమాల వల్ల అభిప్రాయాలు మార్చుకుని చిన్నకుటుంబాలవైపు మొగ్గేవారి సంఖ్య తక్కువే. సానుకూల పరిస్థితులు నెలకొన్నప్పుడు మాత్రమే, ప్రభుత్వ ప్రచారం, ప్రోత్సాహకాలు ఫలితాలను చూపిస్తాయి. కుటుంబ పరిమాణాన్ని నియంత్రించుకుని, ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని కోరుకునేవారి సంఖ్య పెరగడం-కుటుంబ నియంత్రణ కార్యక్రమాల సానుకూ ల పార్శ్వం అయితే, పేదరికం నిరుపేదరికంగా పరిమణించడంతో తప్పనిసరి పరిస్థితు ల్లో సంతాన నిరోధాన్ని అనుసరించవలసి రావడం మరో కోణం. గ్రామాలలో మనుగడ కష్టతరంకావడం, వలసలు పెరిగిపోవడం, ధరలు పెరిగిపోయి వాస్తవ ఆదాయాలు క్షీణించిపోవడం- మెజారిటీ ప్రజలు సంతాన నిరోధంవైపు మొగ్గేందుకు కారణమవుతున్నాయి.

అత్యధిక జనాభాగల రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఐదవ స్థానంలో ఉంది. మన రాష్ట్ర జనాభా దాదాపు ఎనిమిదిన్నర కోట్లకు చేరుకున్నప్పటికీ 11 శాతం అతి తక్కు వ పెరుగుదల రేటును నమోదు చేసుకున్నది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు జరిగిన వలసల దృష్ట్యా రంగారెడ్డి జిల్లా అతి ఎక్కువ జనాభాగల జిల్లాగా నమోదయింది. రాష్ట్రంలో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు సగటున 308 మంది ఉండగా హైదరాబాద్‌లో పద్ధెనిమిదిన్నర వేల మంది ఉండ డం పట్టణీకరణ తీవ్రతను తెలియజేస్తోంది.

గత పదేళ్ళలో రాష్ట్రంలో అక్షరాస్యత ఏడు శాతానికి పెరగడం విశేషం. వ్యవసాయం నుంచి వివిధ ఉత్ప త్తి కార్యకలాపాలు ఆధునీకరణకు గురవుతున్న నేపథ్యంలో పెరిగిన సామాజిక అవసరా ల కారణంగా, ప్రజలు కనీసమాత్రం చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాంతో అక్షరాస్యత శాతంలో గణనీయమైన అభివృద్ధిని సాధించగలిగాము. వెనుకబడిన తెలంగాణ జిల్లాల్లో అక్షరాస్యత పెరుగుదలరేటు రాష్ట్రంలోని సగటు కంటే అధికంగా ఉన్నది. ఈ ప్రాంతంలో వేగంగా జరుగుతున్న సామాజిక పరిణామానికి ఇది సూచిక.

అభివృద్ధి, ఆధునికతలను నాగరికత చిహ్నాలుగా భావించడం కద్దు. దేశవ్యాప్తంగా పురుషులు స్త్రీల దామాషా గతంతో పోలిస్తే మెరుగయింది. ఇది మహిళల పట్ల మన దేశ ప్రజల వైఖరిలో జరిగిన మార్పును సూచిస్తుంది. అయితే విచిత్రమేమంటే అభివృద్ధి చెంది న పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే బాగా వెనకబడిన రాష్ట్రాల్లో పురుష, మహిళల దామాషా చాలా ఎక్కువ గా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మన రాష్ట్రంలో ఉత్తరాం ధ్ర ప్రాంతం, తెలంగాణా జిల్లాలో ఆదిలాబాద్, కరీంనగర్ వెనుకబడిన జిల్లాల్లో పురుషు ల కంటే మహిళలే అధిక సంఖ్యలో ఉండడం విశేషం. అభివృద్ధి బాగా జరిగిందని చెప్పుకునే చోట్ల మహిళల సంఖ్య తక్కువ ఉండడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియదు.

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మినహా ఇతర కులాలవారీగా వివరాలను సేకరించడం 1931 జనగణనతో ఆగిపోయింది. కులాల వారీగా వివరాలను కూడా సేకరించాలని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో ప్రభుత్వం ఈసారి అందుకు పూనుకోవడం హర్షణీయం. దాంతో దేశ రాజకీయ, సంక్షేమ రంగాలతోపాటు రిజర్వేషన్ విధానాలను జనా భా ప్రాతిపదికన శాస్త్రీయంగా రూపొందించేందుకు అవకాశం కలుగుతుంది.

జూన్ నుంచి కుల గణన ప్రారంభమవుతుంది. కులాల లెక్కలు అక్టోబర్ నాటికి విడుదలవుతాయి. పూర్తిస్థాయి జనాభా లెక్కలు తయారయ్యేందుకు ఒక ఏడాది కాలం పట్టవచ్చున ని అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా 24కోట్లకు పై చిలుకు యువత ఉన్న భారతదేశం సరైన రాజకీయార్థిక విధానాన్ని రూపొందించుకో గలిగితే మానవీయమైన సామాజికార్థికాభివృద్ధిలో ప్రపంచానికి తలమానికంగా నిలుస్తుంది.