ఎస్సీ, ఎస్టీలకు

Share  Buzz up!
శ్రీ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు
శ్రీ ఎస్సీ, ఎస్టీలను ఉద్ధరించింది మేమే : సిఎం
శ్రీ గొప్పలు చెప్పడం కాదు : చంద్రబాబు
శ్రీ ఇంకెంత కాలం దళితుల సమస్యలు చర్చిస్తాం : మల్లేష్‌
శ్రీ దీక్ష విరమించాలని రాఘవులుకు అసెంబ్లీ విజ్ఞప్తి
శ్రీ స్తంభించిన అసెంబ్లీ - నేటికి వాయిదా
హైదరాబాద్‌(వి.వి.) : ఎస్సీ, ఎస్టీల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని, స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు దాటినా ఇంకా చట్టసభల్లో దళితులు, గిరిజనుల సమస్యలు చర్చించుకోవడం సిగ్గుచేటని విపక్షాలు మండిపడ్డాయి. దళితులను ఉద్ధరించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పుకోగా గొప్పలు చెప్పుకోవడం సరికాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. దళితులు, గిరిజనుల సమస్యలు, వాటి పరిష్కారానికి సిపిఎం నేత బి.వి.రాఘవులు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షపై మంగళవారం అసెంబ్లీ స్తంభించింది. ఎస్‌సి, ఎస్‌టిల సమస్యలపై బి.వి.రాఘవులు చేపట్టిన దీక్షను విరమించుకోవాలని సభలోని అన్ని పక్షాల సభ్యులు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు. రాఘవులు ఆరోగ్యం క్షీణిస్తుండడం పట్ల సభ ఆందోళన వ్యక్తం చేసింది. రాఘవులు సమర్పించిన 50 డిమాండ్లలో
అతి ముఖ్యమైన వాటిపై ప్రభుత్వం నిర్ధిష్టమైన హామీ ఇచ్చి ఆయన దీక్షను విరమింపజేయాలని విపక్షాలు కోరగా ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు అవసరమైన కార్యక్రమాలు అమలు చేస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
సభ ఉదయం సమావేశం కాగానే ఎస్‌సి, ఎస్‌టిల ఉప ప్రణాళిక అమలు, రాఘవులు దీక్షపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఉపసభాపతి తిరస్కరించారు. సంక్షేమశాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టిల ఉప ప్రణాళిక అమలుపై చర్చించేందుకు ఈ నెల 25న సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, డిమాండ్లపై చర్చలో ఈ విషయాలను చర్చించాలని సిపిఐ, సిపిఐ(ఎం) సభ్యులకు సూచించారు. అయితే అత్యంత ముఖ్యమైన దళితుల సమస్యలపై సభలో చర్చ జరగాల్సిందేనని సిపిఐ పక్ష ఉపనాయకులు కూనంనేని సాంబశివరావు, సభ్యులు వి.యాదగిరిరావు, సిపిఐ(ఎం) సభ్యులు జూలకంటి రంగారెడ్డి వెల్‌లోకి వెళ్ళి ప్లకార్డులు ప్రదర్శించారు. ఉభయ పార్టీల సభ్యులు వ్యక్తం చేస్తున్న ఆవేదనతో సభలో అందరూ ఏకీభవిస్తున్నారని, డిమాండ్లపై చర్చలో ఈ విషయాలపై మాట్లాడాలని, సభ సజావుగా జరగడానికి సహకరించాలని ఉపసభాపతి విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ సిపిఐ, సిపిఐ(ఎం) సభ్యులు పట్టువీడకుండా పోడియం వద్ద బైఠాయించి దళితుల సమస్యలపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు స్పీకర్‌ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు.
తిరిగి సమావేశమైన సభలో ముఖ్యమంత్రి యన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అందులో భాగంగా వచ్చే మూడేళ్ళలో సుమారు రూ.9 వేల కోట్లతో ఎస్‌సి, ఎస్‌టిలకు చెందిన దాదాపు 25 లక్షల ఎకరాల భూమిని అభివృద్ది చేస్తామని, ఎస్‌సి, ఎస్‌టి కమిషన్లకు త్వరలో ఛైర్‌పర్సన్లను నియమిస్తామని, నోడల్‌ వ్యవస్థ, అపెక్స్‌ కమిటీలను మరింత సమర్ధవంతంగా పనిచేయిస్తామని, కౌలుదారుల చట్టాన్ని ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. సమాజంలో ఎస్సీ, ఎస్టీల గౌరవం, ఆత్మాభిమానం, విద్యాభ్యాసం, రాజకీయ తదితర రంగాల్లో వారిని ముందుకు తీసుకుపోయింది కాంగ్రెసేనని, అందుకే ఎస్సీ, ఎస్టీలంటే కాంగ్రెస్‌ కుటుంబంలో సభ్యులుగా భావిస్తారని చెప్పారు. తాను సిఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ విషయంపై మేథావులిచ్చిన సూచనలను ప్రభుత్వం పరిశీలిస్తుందని, నోడల్‌ వ్యవస్థ, అపెక్స్‌ కమిటీల పనితీరులో ఏమైనా లొసుగులుంటే గుర్తించి మరింత సమర్ధవంతంగా పనిచేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరివద్ద తాము పాఠాలు నేర్చుకోవలసిన అవసరం లేదని, పేదలకు మేలుచేసే అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా గత ఐదారు సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీలకు సుమారు 5 లక్షల ఎకరాలను ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టం కింద, గిరిజన ప్రాంతాల్లో మరో 12 లక్షల ఎకరాలను పంపిణీ చేశామని, ఇందిర ప్రభ పథకం కింద రూ.418 కోట్లతో 3.60 లక్షల ఎకరాల భూమిని అభివృద్ధి చేశామని వివరించారు. పేదలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తేలేదని, వాటి అమలుకోసం అందరి సూచనలు, సలహాలు తీసుకుంటామన్నారు.
అందుకు చంద్రబాబునాయుడు స్పందిస్తూ ఎస్‌సి, ఎస్‌టిల ఉప ప్రణాళిక కింద కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖర్చు చేసింది 3 శాతం నిధులేనని, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళయినా ఎస్‌సి, ఎస్‌టి, మహిళా కమిషన్లకు ఛైర్‌పర్సన్లను నియమించలేదని, ఎస్‌సి, ఎస్‌టిల కోసమే పుట్టినట్లు ముఖ్యమంత్రి మాట్లాడడం సరైంది కాదని అన్నారు. సిఎంగా బాధ్యతలు చేపట్టి 4 నెలలే అయినందున తాము సిఎంను తప్పుబట్టడంలేదని, అయితే మొత్తం కాంగ్రెస్‌ను సమర్ధించే విధంగా ఆయన మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఎవరివద్ద పాఠాలు నేర్చుకోవలసిన అవసరం లేదని సిఎం వ్యాఖ్యానించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇక్కడ ఎవరూ పాఠాలు చెప్పడానికి రాలేదని, సభకు ప్రభుత్వం జవాబుదారీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబునాయుడు అన్నారు. గత ఏడు సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద ఎన్ని నిధులు ఖర్చుపెట్టారని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో ఒక్కపైసా లేదని, ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని, విద్యార్ధుల హాస్టళ్ళలో కనీస వసతులు లేవని, మొత్తంగా ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీల నిధులన్నీ పులివెందులలో ఖర్చుపెట్టినట్లు రికార్డులున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల నిధుల ఖర్చు తదితర కార్యక్రమాలను సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తన ఆరోగ్యం దృష్ట్యా రాఘవులు దీక్ష విరమించాలని, ప్రభుత్వం తరపున మంత్రులను పంపించి నిర్దిష్టమైన హామీని ఇచ్చి ఆయన దీక్షను విరమింపజేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
సిపిఐ శాసనసభాపక్ష నాయకులు జి.మల్లేష్‌ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు దాటినా నేటికీ దళితులకు భద్రత కల్పించే విషయంపై చట్టసభల్లో చర్చించుకోవడం దురదృష్టకరమన్నారు. 1980 కాలంలో ఏర్పడిన ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక సంపూర్ణంగా అమలైన దాఖలాలు నేటికీ లేవన్నారు. బడ్జెట్‌లో జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించడం లేదని, కేటాయించిన అరకొర నిధులను కూడా పూర్తిగా ఖర్చుచేయడం లేదని విమర్శించారు. నోడల్‌ వ్యవస్థ చెప్పుకోవడానికే తప్ప దానికి చట్టబద్ధత లేదని అన్నారు. దళితులకు భూములు పంపిణీ చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పిన విషయం వాస్తవమే అయినప్పటికీ, దళితుల పేరుతో వున్న భూములన్నీ కబ్జాకు గురయ్యాయని ఆయన చెప్పారు. గిరిజనులకు భూములు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం గొప్పగా చెబుతున్నప్పటికీ అటవీ హక్కుల చట్టం కింద ప్రభుత్వం పంచిన భూమి 14శాతం కూడా లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు హాస్టళ్ళలో పప్పుచారు కూడా లేకుండా పసుపునీళ్ళతో కాలం వెల్లబుచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ దళితుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయని, దేశంలో, రాష్ట్రంలో ఎక్కువకాలం అధికారంలో వున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తే ఇప్పటికి ఇప్పుడు దళితులకు సమస్యలే వుండేవి కావని అన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల కోసం కమిటీ వేయడం లేదా ఏమి చేయాలనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాలని ఆయన సూచించారు.
లోక్‌సత్తా సభ్యులు డా|| జయప్రకాశ్‌నారాయణ మాట్లాడుతూ బడ్జెట్‌ పేరుతో ఎన్నికోట్లు ఖర్చుపెడుతున్నా, ఎస్సీ, ఎస్టీ రంగాలు అధ్వాన్నమైన పరిస్థితి అలాగే వుందన్నారు. చట్టసభల్లో చర్చలు, అవగాహన ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారమవుతాయని, రాస్తారోకోలు, ధర్నాలు దీక్షల వల్ల సమస్యలకు పరిష్కారం లభించబోదని ఆయన వ్యాఖ్యానించారు. పిఆర్‌పి సభ్యులు వంగ గీత మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల సంక్షేమ పథకాల అమలులో లోపాలు చోటుచేసుకుంటున్నాయని, వాటిని సవరించాలని విజ్ఞప్తి చేశారు.
అంతకు ముందు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలోని అట్టడుగు వర్గాలైన దళితులను ఆదుకోవాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని, రాఘవులు ధర్నా చేస్తున్నారనే ఉద్దేశ్యంతో తాము ఈ కార్యక్రమాలు చేపట్టడం లేదని స్పష్టం చేశారు. నోడల్‌ ఏజెన్సీ సమావేశం ఈనెల 25న నిర్వహించాలని గత నెలలోనే నిర్ణయించినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద నిధుల ఖర్చు తదితర అంశాలను ఆ సమావేశంలో చర్చిస్తామని ఆయన తెలిపారు.
ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు ప్రస్తావించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి సమాధానమిస్తూ దళితుల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమీ చేయలేదని మాట్లాడటం సమంజసం కాదన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళిక కింద 1999-2000లో 3.45 శాతం, 2000-2001లో 4.18 శాతం, 2001-2002లో 2.7శాతం నిధులు ఖర్చుచేయగా, 2007-2008లో 14శాతం, 2008-09లో 11.63 శాతం, 2009-10లో 9.7 శాతం 2010-11లో 12.26 శాతం ఖర్చుచేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతోందని, 2011-12 ఆర్థిక సంవత్సరంలో దానిని 16.23 శాతానికి తీసుకువెళ్ళేందుకు తమవంతు కృషి చేస్తామని ఆయన హామీనిచ్చారు. రాష్ట్రంలో 67 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలుండగా, కాంగ్రెస్‌లో 47 మంది వున్నారని, వారి సంక్షేమాన్ని చూసే బాధ్యత కాంగ్రెస్‌పై వుందన్నారు.
ముఖ్యమంత్రి సమాధానం అనంతరం టిడిపి ఎమ్మెల్యే పివి రత్నం ఒక్కసారిగా వెల్‌లోకి దూసుకువచ్చి ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసన తెలిపారు. కొద్దిసేపు అక్కడే నిలబడి సభా కార్యక్రమాలకు అడ్డుతగలగా, టిడిపి సభ్యులు నచ్చజెప్పి తన స్థానంలోకి తీసుకువెళ్ళారు.
అనంతరం భారీ పరిశ్రమల శాఖమంత్రి డా|| జె.గీతారెడ్డి భూమి కేటాయింపులపై ప్రకటన చేసేందుకు ఉపక్రమిస్తుండగా టిడిపి సభ్యులు ఒక్కసారిగా ఉపసభాపతి పోడియం వద్దకు దూసుకువచ్చి జెఎల్‌సి వేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఒకవైపు మంత్రి ప్రకటన చేస్తుండగా మరోవైపు టిడిపి సభ్యులు నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మంత్రి ప్రకటనపై చర్చించిన అనంతరం అభిప్రాయాలు చెప్పవచ్చని, ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలని చేసిన విజ్ఞప్తిని టిడిపి సభ్యులు ఖాతరు చేయకపోవడంతో ఉపసభాపతి సభను బుధవారం ఉదయానికి వాయిదా వేశారు. ఉదయం 9 గంటలకు సమావేశమైన సభ 9.20 గంటలకు వాయిదా పడి, తిరిగి 11.05 గంటలకు సమావేశమైంది.