జన గణన సంపాదకీయం

జన గణన
సంపాదకీయం

భారతదేశ జనాభా 121 కోట్లకు చేరుకున్నది. ఆంధ్రప్రదేశ్ జనాభా సుమారు ఎనిమిదిన్నర కోట్లకు చేరింది. దేశవ్యాప్తంగా జనాభా 17.64 శాతం పెరిగినమాట నిజ మే, పెరుగుదల రేటులో మొదటిసారిగా క్షీణత కనిపించడం శుభసూచకం. పదేళ్ళకొకసారి ప్రభుత్వం చేపట్టే జనాభా సేకరణ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న జనగణనకు సంబంధించిన తొలివిడత 2011 జనాభా లెక్కలను కేంద్ర హోంశాఖ గురువారం ప్రకటించింది. దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక విధాన రూపకల్పనకు జనగణన అత్యంత కీలకమైనది.

ఇప్పటికే సేకరించిన ఇతర సమాచారంతో పాటు, కులాలవారీ జనాభా లెక్క లు కూడా తరువాయి విడత లెక్కల్లో బయటపడవచ్చు. విద్య-అక్షరాస్యత, వైద్య-ఆరో గ్యం, జాతి, మత, కుల, లింగపరమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల కు చెందిన గణాంకాల ఆధారంగా రూపొందే వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల, విధానాల రూపకల్పనకు జనగణనే ఆధారం. దేశంలోని వివిధ సాంఘిక వర్గాల స్థితిగతులను, మార్పులను, ఒక జాతిగా మన గమనాన్ని అది తెలియజేస్తుంది. దేశ జనాభా చరిత్రలోనే తొలిసారిగా జనాభా వృద్ధిరేటు గత దశాబ్ద కాలంలో మూడున్నర శాతం తగ్గిం ది. ఇది మన దేశం చేపట్టిన కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఫలితాలను సాధిస్తున్నట్టు సూచిస్తోంది. కుటుంబ నియంత్రణ విజయవంతం కావడమంటే, ప్రజల సామాజికార్థిక స్థితిగతుల్లో, చైతన్యంలో పురోగతి కనిపిస్తున్నట్టు లెక్క.

జనాభా పెరుగుదల రేటులో క్షీణత 90 సంవత్సరాల కిందట 1921 జనాభా లెక్కల్లో కనిపించింది. ఆ తరవాత జరిగిన అన్ని జనగణనల్లోనూ పెరుగుదల రేటు పెరుగుతూవచ్చింది. నాటి క్షీణత కు కారణాలు వేరు. 1913-14 భారత దేశంలో తలెత్తిన కరవు, విషజ్వరాలు, ప్లేగు వ్యాధి పీడిత మరణాల కారణంగా నాడు జనాభా వృద్ధిరేటు క్షీణించింది. నేడు దేశ సామాజికార్థికాభివృద్ధికి సంబంధించిన పురోగతి కారణంగా జనాభాపెరుగుదల రేటు తగ్గుముఖం పట్టింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో ప్రపం చ ఆర్థిక వ్యవస్థ వికాసం కారణంగా ప్రపంచ జనాభా వేగంగా పెరిగింది.

వైద్యరంగంలో సాధించిన గణనీయమైన ఆవిష్కరణలు, ప్రజారోగ్యాన్ని సంరక్షించేందుకు ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలు- ఆయుర్దాయాన్ని పెంచడంతో పాటు, శిశుమరణాలను అరికట్టా యి. గతంలో జనసంఖ్యను అరికట్టిన ప్రాకృతిక ఉపద్రవాలు, యుద్ధాలు తగ్గినందున జనన-మరణాల నిష్పత్తిలో మార్పు వచ్చింది. ప్రజలు స్వచ్ఛందంగా సంతానాన్ని కట్టడి చేసుకోవడమొక్కటే జనాభావిస్ఫోటనాన్ని నిరోధించగలిగే సాధనమైంది. ఐక్య రాజ్య సమితి సూచించిన కుటుంబ నియంత్రణ కార్యక్రమాలతో ప్రజల్ని చైతన్యవంతం చేసి అమలు చేస్తున్న కారణంగా మన దేశం ఇంతకాలానికి సానుకూల ఫలితాలను సాధించ డం మొదలుపెట్టింది.

కుటుంబాన్ని పరిమితం చేసుకోవడానికి సమాజాల చైతన్యస్థాయికి, జీవన స్థితిగతుల కు సంబంధం ఉంటుంది. అందువల్లనే వెనుకబడిన ప్రాంతాల్లో, సమాజాల్లో అధిక సంతానం ఉన్న కుటుంబాలు కనిపిస్తాయి. విశ్వాసపరమైన కారణాలు, ఆర్థిక కారణాలు కూడా పెద్దకుటుంబాలకు కారణమవుతాయి. కాబట్టి, ప్రభుత్వాలు చేసే ప్రచారకార్యక్రమాల వల్ల అభిప్రాయాలు మార్చుకుని చిన్నకుటుంబాలవైపు మొగ్గేవారి సంఖ్య తక్కువే. సానుకూల పరిస్థితులు నెలకొన్నప్పుడు మాత్రమే, ప్రభుత్వ ప్రచారం, ప్రోత్సాహకాలు ఫలితాలను చూపిస్తాయి. కుటుంబ పరిమాణాన్ని నియంత్రించుకుని, ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని కోరుకునేవారి సంఖ్య పెరగడం-కుటుంబ నియంత్రణ కార్యక్రమాల సానుకూ ల పార్శ్వం అయితే, పేదరికం నిరుపేదరికంగా పరిమణించడంతో తప్పనిసరి పరిస్థితు ల్లో సంతాన నిరోధాన్ని అనుసరించవలసి రావడం మరో కోణం. గ్రామాలలో మనుగడ కష్టతరంకావడం, వలసలు పెరిగిపోవడం, ధరలు పెరిగిపోయి వాస్తవ ఆదాయాలు క్షీణించిపోవడం- మెజారిటీ ప్రజలు సంతాన నిరోధంవైపు మొగ్గేందుకు కారణమవుతున్నాయి.

అత్యధిక జనాభాగల రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఐదవ స్థానంలో ఉంది. మన రాష్ట్ర జనాభా దాదాపు ఎనిమిదిన్నర కోట్లకు చేరుకున్నప్పటికీ 11 శాతం అతి తక్కు వ పెరుగుదల రేటును నమోదు చేసుకున్నది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు జరిగిన వలసల దృష్ట్యా రంగారెడ్డి జిల్లా అతి ఎక్కువ జనాభాగల జిల్లాగా నమోదయింది. రాష్ట్రంలో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు సగటున 308 మంది ఉండగా హైదరాబాద్‌లో పద్ధెనిమిదిన్నర వేల మంది ఉండ డం పట్టణీకరణ తీవ్రతను తెలియజేస్తోంది.

గత పదేళ్ళలో రాష్ట్రంలో అక్షరాస్యత ఏడు శాతానికి పెరగడం విశేషం. వ్యవసాయం నుంచి వివిధ ఉత్ప త్తి కార్యకలాపాలు ఆధునీకరణకు గురవుతున్న నేపథ్యంలో పెరిగిన సామాజిక అవసరా ల కారణంగా, ప్రజలు కనీసమాత్రం చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాంతో అక్షరాస్యత శాతంలో గణనీయమైన అభివృద్ధిని సాధించగలిగాము. వెనుకబడిన తెలంగాణ జిల్లాల్లో అక్షరాస్యత పెరుగుదలరేటు రాష్ట్రంలోని సగటు కంటే అధికంగా ఉన్నది. ఈ ప్రాంతంలో వేగంగా జరుగుతున్న సామాజిక పరిణామానికి ఇది సూచిక.

అభివృద్ధి, ఆధునికతలను నాగరికత చిహ్నాలుగా భావించడం కద్దు. దేశవ్యాప్తంగా పురుషులు స్త్రీల దామాషా గతంతో పోలిస్తే మెరుగయింది. ఇది మహిళల పట్ల మన దేశ ప్రజల వైఖరిలో జరిగిన మార్పును సూచిస్తుంది. అయితే విచిత్రమేమంటే అభివృద్ధి చెంది న పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే బాగా వెనకబడిన రాష్ట్రాల్లో పురుష, మహిళల దామాషా చాలా ఎక్కువ గా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మన రాష్ట్రంలో ఉత్తరాం ధ్ర ప్రాంతం, తెలంగాణా జిల్లాలో ఆదిలాబాద్, కరీంనగర్ వెనుకబడిన జిల్లాల్లో పురుషు ల కంటే మహిళలే అధిక సంఖ్యలో ఉండడం విశేషం. అభివృద్ధి బాగా జరిగిందని చెప్పుకునే చోట్ల మహిళల సంఖ్య తక్కువ ఉండడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియదు.

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మినహా ఇతర కులాలవారీగా వివరాలను సేకరించడం 1931 జనగణనతో ఆగిపోయింది. కులాల వారీగా వివరాలను కూడా సేకరించాలని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో ప్రభుత్వం ఈసారి అందుకు పూనుకోవడం హర్షణీయం. దాంతో దేశ రాజకీయ, సంక్షేమ రంగాలతోపాటు రిజర్వేషన్ విధానాలను జనా భా ప్రాతిపదికన శాస్త్రీయంగా రూపొందించేందుకు అవకాశం కలుగుతుంది.

జూన్ నుంచి కుల గణన ప్రారంభమవుతుంది. కులాల లెక్కలు అక్టోబర్ నాటికి విడుదలవుతాయి. పూర్తిస్థాయి జనాభా లెక్కలు తయారయ్యేందుకు ఒక ఏడాది కాలం పట్టవచ్చున ని అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా 24కోట్లకు పై చిలుకు యువత ఉన్న భారతదేశం సరైన రాజకీయార్థిక విధానాన్ని రూపొందించుకో గలిగితే మానవీయమైన సామాజికార్థికాభివృద్ధిలో ప్రపంచానికి తలమానికంగా నిలుస్తుంది.

ఏ రోజు కేసులు ఆ రోజే పరిష్కరిస్తున్నాం

ఏ రోజు కేసులు ఆ రోజే పరిష్కరిస్తున్నాం
మార్గదర్శకాల ప్రకారం పని చేస్తాం

సంబంధం లేని ఫిర్యాదుల వల్లే కాలయాపన
ఏడునెలల్లో 4,682 కేసులు పరిష్కరించాం
హెచ్చార్సీ తాత్కాలిక చైర్మన్ పెదపేరిరెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 1 : జనవరి మాసం నుంచి ఏ రోజు కేసులను ఆ రోజే పరిష్కరిస్తున్నామని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తాత్కాలిక చైర్మన్ కాకుమాను పెదపేరిరెడ్డి తెలిపారు. పదవీ బాధ్యతలు చేపట్టి ఏడు నెలలు పూర్తయిన సందర్భంగా హెచ్చార్సీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితులకు సత్వర న్యాయం అందించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. హెచ్చార్సీకి సంబం దం లేని పిటిషన్లే దాదాపు 70% వరకూ వస్తున్నాయని, వాటివల్లనే కాలయాపన జరుగుతోందన్నారు.

కేసు నేపథ్యాలను బట్టి రకరకాల ఫోరాలున్నా, ఎక్కువ మంది పనిలో పనిగా ఒక కాపీని హెచ్చార్సీకి పంపుతున్నారని చెప్పారు. ఈ ఏడు నెలల కాలంలో 4,682 కేసులను పరిష్కరించామన్నారు. దాఖలైన ప్రతి పిటిషన్‌పై తుదితీర్పును ఏడాది లోపుగా ఇవ్వాలనే లక్ష్యంతో శ్రమిస్తున్నామని, అందుకు తోటి సభ్యులు, సిబ్బంది చక్కగా సహకరిస్తున్నారని తెలిపారు. మరో ఇరవై మంది సిబ్బందిని ఇవ్వడంతో పాటు, ప్రస్తుత బడ్జెట్‌ను మరికొంత పెంచితే ఇంకా సమర్థంగా సేవలందించగలమన్నారు.

దరఖాస్తుదారులు 3 నుంచి 5 వాయిదాలకు హాజరు కాకపోతే నోటీసులిచ్చి కేసులను మూసేస్తున్నామని చెప్పారు. నేరుగా ఫిర్యాదుదారుల వాదనలనే విని సమస్యలను పరిష్కరిస్తున్నామని, అవసరమనుకునే వారు న్యాయవాదుల సాయం తీసుకోవచ్చని, అయితే అది తప్పనిసరి కాదని పెదపేరిరెడ్డి తెలిపారు.

పిటిషనర్ స్వయంగా రాలేని సందర్భాల్లో అధికార పత్రాలు అందజేయడానికి న్యాయవాదుల వకాలత్ స్వీకరిస్తున్నట్టు చెప్పారు. గృహహింస, వృద్ధుల నిరాదరణ, పెన్షన్లు-ప్రావిడెంట్ ఫండ్ల చెల్లింపులో జాప్యం, పిల్లల హక్కులు, పోలీసుల నిష్క్రియలపై ఫిర్యాదులను స్వీకరిస్తున్నామన్నారు. తగిన ఫోరం ఉన్న కేసులను మాత్రం తిరస్కరిస్తున్నట్టు ఆయన చెప్పారు.

విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం తగదు

ఎమ్మెల్యే అమరనాధరెడ్డి
పలమనేరు(వి.వి): విద్యార్ధుల జీవితాలతో ఈప్రభుత్వం ఆడుకోవడం తగదని ఎమ్మెల్యే అమరనాధరెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పలమనేరు పట్టణం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భరగా ఆయన మాట్లాడుతూ ఈప్రభుత్వం ఇచ్చిన మాటలను నిలబెట్టుకోకపోవడంతో వేలాది మంది విద్యార్ధుల జీవితాలు నాశనమయ్యే పరిస్ధితి ఏర్పడిందని దుయ్యబట్టారు.చిత్తూరు జిల్లాలో మాత్రమే 59 వేలా 700 మంది విద్యార్ధులు ఉండగా వారికి ఉపకారవేతనాలు ఈవిద్యా సంవత్సరానికి అందలేదన్నారు. 184 కోట్లు పెండింగ్‌ పెడితే విద్యార్ధుల భవిష్యత్‌ ఏమికావాలని ప్రశ్నించారు. అదేవిధంగా జిల్లాలో 20 వేల మంది ఇబిసి విద్యార్ధులు ఉండగా వారికి ట్యూషన్‌ ఫీజు రీయంబర్స్‌ మెంట్‌ సుమారు 116 కోట్లు ఇవ్వవలసి ఉందన్నారు. ఇది ఇలాఉంటే విద్యార్ధుల భవిష్యత్‌ ఏమవుతుందని ప్రశ్నించారు.2008-09 విద్యా సరవత్సరానికి సంబంధించి 29.600 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఈఆర్ధిక సంవత్సరంలో ముగియడంతో విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ఇచ్చేవారిలాగే మాట్లాడుతున్నారు కానీ ఇవ్వలేదన్నారు. ఎల్‌ఓసిలు క్లియర్‌ చేసిన తర్వాత అర్ధగంటకే సర్వర్‌డౌన్‌ అయిందని చెప్పడం హాశ్యాస్పదం గా ఉందన్నారు. ఇలాంటి కాకమ్మ కబుర్లు వినేపరిస్ధితిలో ప్రజలు లేరన్నారు. రోశయ్య మార్పు రాజకీయాన్ని మ్యూజిక్‌తో చేస్తే చూస్తూఉండరని విమర్శించారు. విద్యార్ధులు తిరగబడితే రోశయ్యకు ఏంజరుగుతుంతో త్వరలో తెలుస్తుందన్నారు. ఈకార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఆడపిల్లలను తల్లితండ్రులు సమానంగా పెంచాలి

రామన్నపేట (వి.వి): సమాజంలోని ఆడపిల్లలను అబ్బాయిలతో పాటు సమానంగా పెంచాలని నకిరేకల్‌ ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం రామన్నపేటలో ఐసిడిఎస్‌ కార్యాలయంలో బాలికల సంక్షరణ యోజన పథకం కింద మంజూరైన బాలికలకు చెక్కులు అందజేసి అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న బాలికల సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 18 సంవత్సరాల వరకు బాలికలను ఉన్నతమైన చదువులు చదివించి బాల్య వివాహాలకు ధూరంగా ఉంచాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. గ్రామాల్లో బాల్య వివాహాలపై అవగాహన పెంపొందించాలని, అందుకు ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులు, యువతి యువకులు, విద్యా వంతులు బాల్య వివాహాల నిలుపుదలకు కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపిపి నీలా దయాకర్‌, జెడ్పీటిసి నోముల పద్మామారయ్య. ఎంపిడిఓ ఇందుమతి, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధికారిణి మోతి, స్థానిక ఎంపిటిసి సాల్వేరు అశోక్‌, గర్దాసు పద్మ, ఐసిడిఎస్‌ సూఫర్‌వైజర్లు, యాదమ్మ, అంజమ్మ, పద్మావతి, అంగన్‌వాడీ కార్యకర్తలు. బాలికలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.ఈ సభలో 85 మంది బాలికలకు 30వేల రూపాయల చొప్పున, నలుగురు బాలికలకు లక్ష రూపాయల చొప్పున బాండ్లు అందజేయడం జరిగింది.
గ్రామ పంచాయితీ భవన నిర్మాణానికి చిరుమర్తి శంకుస్థాపన:
మండలంలోని సర్నేనిగూడెంలో నూతన గ్రామ పంచాయితీ భవన నిర్మాణానికి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద 10లక్షల రూపాయలు మంజూరు కాగా నిర్మాణ పనులకు శుక్రవారం నకిరేకల్‌ ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి నీలా దయాకర్‌, జెడ్పీటిసి నోముల పద్మామారయ్య, ఎంపిడిఓ ఇందుమతి, గ్రామ సర్పంచ్‌ రూపం లక్ష్మీమల్లయ్య, ఉప సర్పంచ్‌ అంజయ్య, గ్రామ కార్యదర్శి జ్యోతి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి మంత్రం - ప్రజలపై 'రణ'తంత్రం

డి.పాపారావు
సార్వజనీన ఆహార హక్కు బిల్లు నేడు మరలా అటకెక్కే ముప్పు ఏర్పడింది. ప్రధానమంత్రి తాలూకు నిపుణుల బృందం మోకాలడ్డడమే దీనికి కారణం అని తెలుస్తోంది. ఈ వార్షిక సంవత్సరంలోని తొలిదశలో ఆహార ధాన్యాలు సేకరణ మొదటిదశలో ఏర్పడిన 12 మిలియన్ల టన్నుల లోటు, తుదిదశలో ఏర్పడనుండే అవకాశం వున్న 16 మిలియన్ల టన్నుల లోటులే దీనికి కారణంగా ముందుకు వస్తున్నాయి. అంటే, రానున్న ప్రణాళికా సంవత్సరం లో ఈ లోటును భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోగలిగితే మినహా రెండేళ్ళ అనంతరం కూడా దేశంలోని సామాన్యుడికి ''ఆహారహక్కు'' ఏర్పడదు. కాగా, గత సంవత్సరం మొత్తం దేశీయ ధాన్యాల ఉత్పత్తిలో 32శాతాన్ని కేంద్రప్రభుత్వం సేకరణకు నిర్ణయించింది. అయితే, నేటి సంవత్సరం దీనిని కేవలం 30శాతానికి పరిమితం చేయడం వలనకూడా ఈ ధాన్యాల సేకరణ లోటు ఏర్పడింది. ఆహార హక్కు బిల్లు క్రింద, నిజానికి దేశ జనాభాలోని 72శాతం మందికి లబ్ది లభించ వలసి వుంది. మార్కెట్‌నుండి ''అతిగా'' ధాన్యం సేకరిస్తే అది మార్కెట్‌ శక్తులకు (అంటే డిమాండ్‌ - సరఫరాలకు) ఆటంకం కల్పిస్తుందనే పేరిట ప్రధాని నిపుణుల బృందం ఈ సేకరణ తగ్గింపు నిర్ణయం తీసుకుందట! అయితే, ఇదే కేంద్రప్రభుత్వం లక్షల టన్నుల ధాన్యాన్ని అదే మార్కెట్‌ శక్తుల పేరిట గోడౌన్లలో ముక్కపెట్టగలదు. అటువంటి చర్య మాత్రం దాని దృష్టిలో ఎట్టి పరిస్థితిలోనూ డిమాండ్‌ - సరఫరాల ప్రశ్నకు ఆటంకం కానేకాదు!
దిగుమతులు చేసుకోవటం ద్వారా 2011- 12లో లోటును భర్తీ చేసుకుని ఆహారభద్రతను కల్పించే అవకాశాన్ని ప్రధాని నిపుణుల బృందంతోసిపుచ్చింది. ఆ అవకాశాన్ని ''ఖరీదైనది'' గా అది భావించినట్టు కనపడుతోంది. మరో ప్రక్కన దేశంలో సామాన్య జనానికి - ఆహార గింజల లభ్యత తగ్గిపోతోంది. 2009కి ముందర బియ్యం విషయంలో ఈ లభ్యత తలసరిన 203.7 గ్రాములుగా వుంది. 2009 నాటికి ఇది 180.4 గ్రాములకు పడిపోయింది. 2009 ముందర 160 గ్రాములుగా ఉన్న గోధుమల తలసరి లభ్యత, 2009లో 154.7 గ్రాములకు పడిపోయింది. ఇదీ, అసలు నిజం. 2008, సెప్టెంబర్‌ సంక్షోభం అనంతరం, దేశాన్ని మరింతగా కమోడిటీస్‌ మార్కెట్‌ శక్తులపరం చేసిన పాలకుల పుణ్యమిది. స్వయానా ప్రభుత్వమే ధాన్యం కొరతలకు ఊతం ఇచ్చి వాటి ధరల పెరుగుదలకు కారణం అవుతోందా? అనిపించే స్థితిలో జరుగుతోన్న పరిణామాలివి! అంటే, ఈ కొరతల నీలినీడలు, నిత్యావసరాలలో భవిష్య వ్యాపారం లాభసాటిగా సాగిపోయే అవకాశం కల్పించడమే నేటి 'మన్మోహనామిక్స్‌'కు మార్గాంతరం అయిన స్థితి కల్పించకమానదు.
ప్రపంచంలో ఇతరేతర మార్కెట్లు, దేశంలో మదుపు అవకాశాలు సన్నగిల్లడంతో విదేశీ, స్వదేశీ మదుపుదారులు మన దేశీయ షేర్‌మార్కెట్లపైకి ఎగబడడం నేటి నిజం! ఈ నిజానికి ఊతాన్ని ఇస్తోంది.యుపిఎ -2 పాలకుల విధానాలు, ఫలితంగా, నేడు దేశం ఆకలిరాజ్యంగా మారిం దన్నది చేదు నిజం! కాగా, ఈ నిజాన్ని అడ్డుపెట్టుకుని ఈ దిశగా 2004 వరకూ, 'వెలిగిపోతున్న భారత్‌'ను సృష్టించడం ద్వారా బాటలు వేసినదిశగా బిజెపి పాలకులు నేడు మరలా మాటలగారడీతో గద్దెనెక్కే కృషిని చేస్తున్నారు. కాగా, 2004లో అధికారపీఠం ఎక్కిన యుపిఎ-1 తన మొదటిరౌండు పాలనలో పలు ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకం వంటి వాటిని అమలు జరిపింది. దీనికి కారణం, నాడు ప్రభుత్వానికి - వామపక్షాల మద్దతు అనివార్య ఆగత్యం కావడమే. అయితే, యుపిఎ-2 జాతీయపక్షాలు లేనిలోటు నేడు కొట్టవచ్చినట్లు కనపడుతోంది. 2009 మొదలుకొని, నాటివరకూ ప్రతీ బడ్జెట్‌లో, బడ్జెట్‌యేతర కార్యక్రమాలు కూడా ప్రజావ్యతిరేకంగానే సాగుతున్నాయి. 2011-12 బడ్జెట్‌లో ఇందుకు అతీతంగా ఏమీ వుండబోదు ! నామమాత్రపు కేటాయింపులలో కొద్దిపాటి సంక్షేమ పథకాలకే 2011-12 బడ్జెట్‌లో ఆస్కారం ఉంది. అదికూడా, 'లోతైన' పరిశీలనా, 'అధ్యయనం' అనంతరం 2012-13 అమలులోకి వచ్చేలా ఈ పథకాలు వుంటాయట ! అంటే 2012 ఏప్రిల్‌లో ఆరంభం కానున్న 12వ పంచవర్ష ప్రణాళిక వాటికి ''సుమూహూర్తంగా''గా వుండగలదన్నమాట! స్పెక్ట్రమ్‌ అమ్మకాల కుంభకోణంలో లక్షల కోట్లు కోల్పోయిన మన కేంద్రపాలకులు కొన్ని వందల కోట్ల రూపాయలతో తమకు ఓట్లు వేసి గెలిపించిన జనాలకు కనీస అవసరాలను తీర్చేందుకు వెనుకాడడం గర్హనీయం. ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం ''ఖరీదయిన'' వ్యవహారమని వారు ముక్తాయించడం వారి వర్గనీతికి, దగాకు ప్రతిబింబం మాత్రమే. సమ్మిళిత అభివృద్ధి జపం చేస్తోన్న మన యుపిఎ-2 పాలకుల తీరు నేడిది. ఈ ఉదాశీనత ప్రభావం నగర ప్రాంతాలలో ఉపాధి కల్పన పథకాలపైన పడగలదు. గ్రామీణ అభివృద్ధి, విద్యారంగాలు నష్టపోగలవు. ఫలితంగా దేశీయ నిజ అభివృద్ధి దశాబ్దాలు వెనక్కు పోగలదు. మరో హరిత విప్లవం మాట అటువుంచి, ఇప్పటికే 1960లలో అమలు జ రిగిన తొలి హరిత విప్లవం ప్రయోజనాలు హుళక్కి కాగలవు.
ఇక, వివిధ సంక్షేమ విధానాలను అమలు జరుపుతున్న మంత్రిత్వశాఖలు వాటికి నిధుల అందుబాటు కొనసాగింపుకోసం ముందుముందు తమ పనితీరును నిరూపించుకోవాలట. దీనితో, ఏదో ఒక సాకున ప్రజలకు అందే కాస్తంత సాయం దూరం అయిపోయే ప్రమాదం ఉంది. స్పెక్ట్రమ్‌ కుంభకోణం వంటి వాటి విషయంలో సంబంధిత మంత్రిత్వశాఖలపై ఇటువంటి నియంత్రణలు వుండి వుంటే పరిస్థితి నిజానికి మెరుగ్గా ఉండేది. అంటే, ధనికులు, పాలకనేతలకు ఒకనీతి, సామాన్యుడి సంక్షేమ పథకాల విషయంలో మరోనీతి నేటి పాలకులతీరుగా వుంది. ప్రజలు గమనిస్తున్నారు.
వారు; ఈ ద్వంద్వనీతిని క్షమించరు! వారి అంతిమతీర్పు అనివార్యం. ఈ కారణం చేతనే, నిన్నమొన్నటివరకూ జననీరాజనాలతో దేశాన్ని చుట్టిన యువకులు -రాహుల్‌గాంధీ, నేడు ఎక్కడికి వెళ్ళినా నిరసలు ఎదురౌతున్నాయి. ఈ మొత్తం క్రమంలో సోనియా పాత్రపైన నీలినీడలు ముసురుతున్నాయి. ఈ నిరసనలూ, ప్రజల విమర్శలూ ఒక హెచ్చరిక కావాలి !!! విశాలాంధ్ర దిన పత్రిక సౌజన్యముతో

మళ్లీ కన్యాశుల్కం రోజులు!

2011 జనాభా గణన కొన్ని ఆసక్తికరమైన, మరికొన్ని ఆందోళనకరమైన ధోరణులను వెలుగులోకి తెచ్చింది. 2001 జనాభా లెక్కలతో పోల్చితే మనదేశ జనాభా 18.1 కోట్లు పెరిగింది. అంటే దశాబ్ద వృద్ధిరేటు 17.64 శాతం. దేశ జనగణన తొలిసారి 1872లో ప్రారంభమైంది. ప్రతిపదేళ్లకొకసారి నిర్వహించే ఈ ప్రక్రియలో 2011 జనగణన 15వది. గత ఏడాది ఏప్రిల్‌లో మొదలిడి రెండుదశల్లో పూర్తిచేసిన ఈ మహాక్రతువు తాత్కాలిక లెక్కలను రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సెస్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా సి.చంద్రమౌళి గురువారంనాడు ఢిల్లీలో హోంశాఖ కార్యదర్శి జి.కె.పిళ్లరు సమక్షంలో విడుదల చేశారు. ఇప్పుడు జనాభా, స్త్రీ-పురుష నిష్పత్తి, జనసాంద్రత, 6 సంవత్సరాలలోపు పిల్లలెందరు, అక్షరాస్యత వంటి సమాచారాన్ని జిల్లాలవారీ విడుదల చేయగా, కనీస వసతులవారీ, తరగతులవారీ లెక్కలు మరో ఏడాదిలోగా వెల్లడిస్తారు. ప్రణాళికలు, సంక్షేమ పథకాల రచనకు ప్రణాళికావేత్తలకు, ప్రభుత్వాలకు ఈ లెక్కలే మార్గదర్శకాలు. మొత్తం 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 640 జిల్లాలు (5924 ఉప జిల్లాలు, 7936 పట్టణాలు సహా), 6.41 లక్షల గ్రామాల్లో ఈ మహాకార్యక్రమం నిర్వహించారు. ఇందుకైన వ్యయం రు.2200 కోట్లు. 1931 తదుపరి కులాలవారీ జనగణన జరగనందున, జనాభాలెక్కల్లో భాగంగా వాటిని చేపట్టాలన్న అనేక రాజకీయ పార్టీల డిమాండ్‌ను తిరస్కరించిన ప్రభుత్వం వచ్చే జూన్‌-సెప్టెంబర్‌ మధ్యలో ప్రత్యేకంగా కులాలవారీ జనగణన చేపట్టాలని నిర్ణయించింది. అదలావుంచితే తాజా లెక్కల ప్రకారం మనదేశ జనాభా 121,01,93,422. వారిలో పురుషులు 62,37,24,248, స్త్రీలు 58,64,69,174. చైనా తదుపరి స్థానంలో ఉన్న మనదేశ జనసంఖ్య అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, జపాన్‌ జనాభాకు సమానం. ప్రపంచ జనాభాలో 19.4శాతం చైనాలో వుండగా, 17.5శాతం మనదేశంలో ఉన్నారు. చైనా ఏకసంతాన నియమాన్ని అమలు చేస్తున్నది. మనదేశం తన జనాభా వృద్ధిరేటును గణనీయంగా తగ్గించుకోలేకపోతే మరో 20 ఏళ్లలో చైనాను మించుతుందని అంచనా. 2001 జనాభాలెక్కల్లో 21.54శాతంగా ఉన్న జనాభా వృద్ధిరేటు 2001-11 దశాబ్దకాలంలో 17.64శాతానికి తగ్గటం జనాభా నియంత్రణ కృషి సత్ఫలితాలిస్తున్నట్లు సూచిస్తున్నది. 1911-1921 దశాబ్దాన్ని మినహాయిస్తే అతి తక్కువ వృద్ధిరేటు నమోదైన దశాబ్దం ఇదే. అందులో పురుషుల వృద్ధిరేటు 17.19శాతం కాగా స్త్రీల వృద్ధిరేటు 18.12 శాతం. దీంతో లింగ దామాషా (ప్రతి వెయ్యిమంది పురుషులకు స్త్రీలు) 2001లోని 933 నుండి 940కి పెరిగింది.
దేశ జనాభాలో 85శాతం కలిగివున్న 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వార్షిక జనాభా వృద్ధిరేటు 2 శాతంలోపు వుండటం విశేషం. అత్యధిక జనాభాగల ఆరు రాష్ట్రాల్లో వృద్ధిరేటు తగ్గుదల ఇందుకు దోహదం చేసింది. గత దశాబ్ద కాలంలో జనాభా వృద్ధిరేటు ఉత్తరప్రదేశ్‌లో 25.85 నుండి 20.09 శాతానికి, మహారాష్ట్రలో 22.73 నుండి 15.99 శాతానికి, బీహార్‌లో 28.62 నుండి 25.07శాతానికి, పశ్చిమ బెంగాల్‌లో 17.77 నుండి 13.93శాతానికి, ఆంధ్రప్రదేశ్‌లో 14.59 నుండి 11.10శాతానికి, మధ్యప్రదేశ్‌లో 24.28 నుండి 20.30 శాతానికి తగ్గింది. ఇదేకాలంలో జాతీయ అక్షరాస్యత 64.83 నుండి 74.04 శాతానికి పెరిగింది. పురుషుల్లో అక్షరాస్యత 82.14శాతంకాగా మహిళల్లో 65.46శాతం. 91.98శాతం అక్షరాస్యతతో కేరళ అగ్రస్థానంలో ఉండగా, 52.66 శాతంతో రాజస్థాన్‌ కడపటిస్థానంలో ఉంది.
ప్రభుత్వ కుటుంబ సంక్షేమ ప్రచారం, అక్షరాస్యత, చైతన్యం, ఆర్థిక పరిస్థితులు, భార్యాభర్తల ఉద్యోగిత వంటి కారణాలవల్ల పరిమిత కుటుంబాల సంఖ్య పెరుగుతున్నది. అయినా అభివృద్ధి, నాగరికత గూర్చి గొప్పలు చెప్పుకుంటున్నా ఆడశిశువుల పట్ల అమానుషం భవిష్యత్‌కు ప్రమాదసంకేతంగా పరిణమిస్తున్నది. భ్రూణహత్యలు, శిశుహత్యల వంటి ఘోరాలతో ఆడపిల్లల సంఖ్య తగ్గుతోంది. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాల్లోనే ఈ దారుణాలు ఎక్కువగా ఉన్నట్లు జనాభా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం జనాభాలో 0-6 వయోపరిమితిలోని బాలలసంఖ్య 2001లో 15.9 శాతం కాగా 2011లో అది 13.1 శాతానికి తగ్గింది. జనాభా వృద్ధిరేటు తగ్గుదలకు ఇది దోహదం చేసిందని సంతోషించవచ్చు. కాని ఆందోళనకరమైనది ఏమంటే, మగపిల్లల వృద్ధిరేటు 2.42 శాతం తగ్గగా, ఆడపిల్లల వృద్ధిరేటు 3.80శాతం తగ్గింది. మొత్తం జనాభాలో స్త్రీల నిష్పత్తి ప్రతి వెయ్యిమంది పురుషులకు 940గా ఉన్నప్పటికీ, 0-6 వయోగ్రూపులో ఇది 914కు పడిపోయింది. అత్యంత అభివృద్ధిచెందిన రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యానాల్లో ఈ దామాషా వరుసగా 846; 830కు దిగజారింది. విద్యావంతులైన అబ్బాయిలు సరిజోడీని వెదుక్కోవటం ఇప్పటికే కష్టంగా ఉంది. బాలల లింగ నిష్పత్తిలో వ్యత్యాసం ఇలాగే కొనసాగితే పాతిక, ముప్పయి ఏళ్ళ తర్వాత వరకట్నం అడగటం మాని కన్యాశుల్కం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సామాజిక చైతన్యం ద్వారా నిర్మూలన కావాల్సిన వరకట్నం అమ్మాయిల కొరతవల్ల రూపుమాసినా మంచిదే! అయితే జనాభాలో స్త్రీ-పురుష వ్యత్యాసం అనేక సామాజిక పర్యవసానాలకు దారితీస్తుంది.మగసంతుపట్ల మోజును తగ్గించలేకపోయినా ఆడగుడ్డును గర్భంలోనే చిదిమేసే కిరాతకానికి వ్యతిరేకంగా ఆడైనా, మగైనా ఒకటేనన్న భావన కలిగించటానికి ప్రభుత్వం, ప్రజాసంఘాలు విశేషంగా కృషి చేయాల్సి వుంటుంది .ఆడపిల్లభారం అనే కాలంచెల్లిన ఆలోచనను మనిషి మస్థిష్కం నుండి తొలగించటానికై ప్రభుత్వం ఆడపిల్లలకు ఇతోధిక ప్రోత్సాహకాలు కల్పించటం ఇందుకోక మార్గం
మన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలను జనాభాలెక్కలు వెలుగులోకి తెచ్చాయి. జాతీయ జనాభా వృద్ధిరేటు (2001-2011) 17.64శాతం కాగా ఆంధ్రప్రదేశ్‌ వృద్ధిరేటు 11.10శాతం. 8,46,65,543 జనాభాతో ఐదవ స్థానంలో వున్న ఆంధ్రప్రదేశ్‌లో పురుషులు 4,25,09,881 కాగా స్త్రీలు 4,21,55,662. లింగ నిష్పత్తి 2001లో 978 కాగా ఇప్పుడు 992. జనాభా వృద్ధిరేటు రాష్ట్ర సగటుకన్నా 16 జిల్లాల్లో తక్కువ వుండటం విశేషం. అయితే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 48.15శాతం, మహబూబ్‌నగర్‌జిల్లాలో 15.03శాతం, కర్నూలుజిల్లాలో 14.65శాతం, మెదక్‌జిల్లాలో 13.55శాతం జనాభా వృద్ధిచెందింది. ఉపాధిని వెదుక్కుంటూ ఆంధ్ర, తెలంగాణా జిల్లాలనుండి ప్రజలు వలసరావటమే రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో అసాధారణంగా జనాభా వృద్ధిరేటుకు మూలం. అతి తక్కువ వృద్ధిరేటు పశ్చిమగోదావరిలో 3.45శాతం, విజయనగరంలో 4.16శాతం, హైదరాబాద్‌ రెవిన్యూజిల్లాలో 4.71శాతం నమోదైంది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో 11.89శాతం వృద్ధి నమోదుకాగా దక్షిణకోస్తాలోని నెల్లూరులో 11.5శాతం నమోదైంది. ఈ రెండు జిల్లాలు పారిశ్రామికంగా వృద్ధిచెందుతున్నందున వలసలవల్లనే జనాభా పెరిగింది.
అక్షరాస్యత గత దశాబ్ద కాలంలో 7.30శాతంపెరిగి 67.77శాతానికి చేరింది.జాతీయ సగటు 74శాతం కన్నా రాష్ట్రం ఎంతో వెనుకబడి ఉంది. అక్షరాస్యతవృద్ధిలో దశాబ్ద రాష్ట్ర సగటును మించిన జిల్లాలు సీమాంధ్రలో విజయనగరం (8.42శాతం), అనంతపురం (8.15), కర్నూలు (7.91), విశాఖపట్నం (7.74) మాత్రమేకాగా, తెలంగాణాలో అత్యధికంఉన్నాయి. అయితే రాష్ట్ర సగటు అక్షరాస్యత రేటు (67.77)ను చేరుకోని జిల్లాలు శ్రీకాకుళం (62.30), విజయనగరం (59.49), ప్రకాశం (63.53), కర్నూలు (61.13), అనంతపురం (64.28), అదిలాబాద్‌ (61.55), నిజామాబాద్‌ (62.25), కరీంనగర్‌ (64.87), మెదక్‌ (62.53), మహబూబ్‌నర్‌ (56.06), ఖమ్మం (65.46). రాష్ట్రం మొత్తం మీద పురుషుల్లో అక్షరాస్యత 75.56 కాగా స్త్రీలలో 59.74శాతం.
0-6 వయస్సుగల పిల్లల (జాతీయ) వృద్ధిశాతం 2001లోని 15.9శాతంనుండి 2011లో 13.1 శాతానికి తగ్గగా, మన రాష్ట్రంలో ఇదేకాలంలో 13.35 నుండి 10.21కి తగ్గింది. 2001లో ఈ వయోగ్రూపులో మగపిల్లల శాతం 13.46, ఆడపిల్లల శాతం 13.23 కాగా ఆ సంఖ్యలు 2011లో వరుసగా 10.46కు, 9.95కు తగ్గిపోయాయి.2001 సంఖ్యలతో పోల్చిచూస్తే మొత్తం జనాభాలో పిల్లలశాతం ఏ ఒక్క జిల్లాలోను పెరగకపోవటం గమనార్హం. కుటుంబ నియంత్రణలో ఎంతో పురోగతి సాధించిన ఆంధ్రప్రదేశ్‌ అక్షరాస్యతలో వెనుకబడివుందని జనాభాలెక్కలు తేల్చాయి.విశాలాంద్ర దిన పత్రిక సౌజన్యముతో