సంక్షేమంపై చిన్నచూపు

  • అందుకే మానవ వనరుల అభివృద్ధిలో రాష్ట్రం వెనుకబాటు
  • మరింత పేదరికంలోకి దళితులు, గిరిజనులు
  • వెల్లడించిన ప్రణాళికా సంఘం
గత రెండు దశాబ్దాలలో సామాజిక రంగానికి ప్రభుత్వం చేస్తున్న వ్యయం స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జిఎస్‌డిపి)లో, మొత్తం వ్యయంలో శాతంగా తగ్గిపోవటంతో ప్రధాన రాష్ట్రాలలో మానవ అభివృద్ధి సూచిలో రాష్ట్ర ర్యాంకు పడిపోవటానికి దారితీసింది. సామాజిక అభివృద్ధిపై ప్రభుత్వ ప్రకటనలకు ఈ పరిస్థితి విరుద్ధంగా ఉందని ప్రణాళికా సంఘం వ్యాఖ్యానించింది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లని చెబుతున్న పాలకుల మాటల్లోని డొల్లతనాన్ని ప్రణాళికా సంఘం బట్టబయలు చేసింది. గత రెండు దశాబ్దాలలో జిఎస్‌డిపిలో కేవలం 6 నుంచి 10 శాతం మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్లు ప్రణాళికా సంఘం ముఖ్యమంత్రికి పంపిన పత్రంలో పేర్కొంది. సామాజిక సేవలకు చేసిన వ్యయం 1980 దశకంలో 6.59 శాతం కాగా, అది 1990 దశకంలో 5.61 శాతానికి, 2000-07లో 5.55 శాతానికి పడిపోయింది. ఈ కాలాలలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రంగంపై చేసిన మొత్తం వ్యయం శాతం వరుసగా 46, 42, 35.6గా ఉన్నాయి. 2000-07 కాలంలో విద్య నిమిత్తం చేసిన వ్యయం వాటాలో పెరుగుదల లేకపోగా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమాల నిమిత్తం చేసిన వ్యయం తగ్గుదల ధోరణులతో ఉంది. ప్రభుత్వ ఆర్థిక, లక్ష్యాల ప్రాధాన్యతలలో సామాజిక రంగం ప్రాముఖ్యత ఎలా ఉందో ఈ పరిస్థితి సూచిస్తున్నదని ప్రణాళికా సంఘం వ్యాఖ్యానించింది.

వివిధ రంగాలకు చేసిన ప్రణాళికా కేటాయింపులలో సామాజిక రంగానికి చేసిన కేటాయింపులను తక్కువగా వ్యయం చేసినట్లు, గత ఏడాది ఏప్రిల్‌ మొదటి తేదీ నాటికి మూడేళ్ళ కాలానికి రూ.8,447 కోట్ల మేరకు చెల్లింపులు పెండింగులో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వమే తెలిపిందని ప్రణాళికా సంఘం వివరించింది.
మరింత పేదరికంలో ఎస్‌సిలు, ఎస్‌టిలు
రాష్ట్రంలో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికి, ప్రాంతీయ వ్యత్యాసాలు, గ్రామీణ-పట్టణ వ్యత్యాసాలు, చాలా అధికంగా సామాజిక వ్యత్యాసాలు ఉన్నాయని వివరిస్తూ, ఈ వ్యత్యాసాలను పూడ్చటం ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటి కావాలని ప్రణాళికా సంఘం పేర్కొంది. జిల్లా స్థూల ఉత్పత్తి గణాంకాల ప్రకారం తలసరి జిడిపి రూ.15 వేలకు తక్కువగా ఉండి, రాష్ట్ర సగటుకన్నా పెరుగుదల రేటు చాలా తక్కువగా ఉన్న కర్నూలు, నిజామాబాద్‌, అనంతపురం జిల్లాల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రణాళికా సంఘం సూచించింది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతులలో పేదరికం పెరుగుతుం డటం ఈ వ్యత్యాసాలలో మరొక పార్శ్యం. దారిద్య్రంలో ఉన్నవారిలో ఎస్‌సిల శాతం 1993లో 26 శాతం నుంచి ఇప్పటికి 30 శాతానికి పెరిగింది. అదే విధంగా, పేదలలో ఎస్‌టిల శాతం 1983-2005 కాలంలో 9 శాతం నుంచి 23 శాతానికి పెరిగింది. పట్టణ పేదలలో ఎస్‌సిల శాతం 12 నుంచి 20 శాతానికి పెరిగింది.
ప్రణాళికా పెట్టుబడి లక్ష్యాన్ని రాష్ట్రం సాధిస్తుందా?
వచ్చే మార్చి నాటికి ముగియనున్న 11వ పంచవర్ష ప్రణాళికా కాలంలో రూ.1,47,395 కోట్ల మేరకు (2006-07 నాటి ధరల ప్రకారం) ప్రణాళికా పెట్టుబడిని ఖర్చు చేయాలన్న లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ గట్టి కృషి చేయాల్సి ఉన్నదని ప్రణాళికా సంఘం వ్యాఖ్యానించింది. 11వ ప్రణాళిక మొదటి నాలుగేళ్ళలో రాష్ట్రం చేసిన ప్రణాళికా పెట్టుబడి వ్యయం రూ.1,10,439 కోట్లు (70.78 శాతం). 11వ ప్రణాళికా కాలంలో జిఎస్‌డిపిలో 9.5 శాతం పెరుగుదలను సాధించాలన్నది లక్ష్యం. కేంద్ర గణాంక సంస్థ గణాంకాల ప్రకారం జిఎస్‌డిపిలో రాష్ట్రం 2007-08లో 10.75 శాతం పెరుగుదలను సాధించగా, 2008-09లో అది 5.04 శాతానికి, 2009-10లో 5.45 శాతానికి తగ్గిపోయింది. 11వ ప్రణాళికా కాలంలో సాధించగలదని అంచనా వేసిన 8.1 శాతం ఆర్ధిక పెరుగుదల రేటు లక్ష్యాన్ని 12వ ప్రణాళికలో 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రణాళికా దృక్పధం పత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రణాళికా సంఘం తెలిపింది.
వనరుల సేకరణకు సంబంధించి, 11వ ప్రణాళిక మొదటి నాలుగేళ్ళలో ప్రణాళికా వనరుల నిమిత్తం జిఎస్‌డిపిలో 4 శాతం మేరకు రాష్ట్ర స్వంత వనరుల నుంచి లభించటంతో ప్రస్తుత ఆదాయ మిగులు (బిసిఆర్‌) జిఎస్‌డిపిలో దాదాపు 3 శాతంగా సానుకూలంగా ఉందని ప్రణాళికా సంఘం పేర్కొంది. జిఎస్‌డిపిలో పన్నుల ఆదాయం 2008లో దాదాపు 8.8 శాతం నుండి 2009-10లో దాదాపు 9.9 శాతానికి పెరిగింది. 2009-10లో జాతీయ సగటు 7.5 శాతం కన్నా ఇది ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వ అప్పు జిఎస్‌డిపిలో దాదాపు 31 శాతంగా జాతీయ సగటు 32 శాతం కన్నా తక్కువగా ఉంది. మొత్తం మీద రాష్ట్ర ద్రవ్య నిర్వహణ స్థిరంగా ఉందని, ప్రభుత్వ పెట్టుబడిని మెరుగుపర్చేందుకు వనరులను సమకూర్చేందుకు, కీలక రంగాలలో ఉత్పాదకతకు దోహదం చేయగలదని ప్రణాళికా సంఘం అభిప్రాయపడింది. నిర్ణీత లక్ష్యాల మేరకు ప్రణాళికా పెట్టుబడిని ఖర్చు చేయలేక, పన్నుల భారం పెరచుతూ, మానవ అభివృద్ధి సూచికలో దిగజారుతున్న స్థితిలో రాష్ట్ర ప్రభుత్వ ద్రవ్య నిర్వహణపై ప్రణాళికా సంఘం ఇచ్చిన కితాబు నయా ఉదారవాద సంస్కరణలతో కూడిన దాని అమానవీయ దృక్పథాన్ని వెల్లడిస్తున్నది.

1980 1990 2000-07
దశకం (%) దశకం (%) (%)
సామాజిక సేవలకు
చేసిన వ్యయం 6.59 5.61 5.51
సామాజిక రంగంపై
మొత్తం వ్యయం 46 42 35.6