శ్రీలంక అంతర్యుద్ధానికి అక్షర రూపం శోభా శక్తి ‘గొరిల్లా’

శ్రీలంక అంతర్యుద్ధానికి అక్షర రూపం శోభా శక్తి ‘గొరిల్లా’
ramthertha-phoపదిహేనేళ్ళకే చేత తుపాకి ధరించి, ఇరవై ఏళ్ళకే శరణార్ధిగా తన మాతృదేశం విడిచిపెట్టి, తర్వాతి జీవనాన్ని భిన్న భిన్న దేశాలలో కాందిశీకుడుగా కూలి పనులు చేసుకుంటూ, తన మాతృభాష తప్ప మరే భాషా రాని ఒక వ్యక్తిని ఊహించండి. ఇటువంటి వ్యక్తి రచయిత అయ్యే అవకాశం ఉందని ఊహించడం దాదాపు అసాధ్యం. కానీ వర్తమాన జీవన సంక్షోభం ఎంతటిదీ అంటే అది రాళ్ళనుంచి రత్నాలను తయారు చేస్తుంది. అంతర్యుద్ధం బారిన పడి దశాబ్దాలుగా కకావికలైపోయిన ఉత్తర శ్రీలంక ప్రాంతం, అక్కడి ఇటీవలి జీవితం కథావస్తువుగా వచ్చిందీ నవలిక. అసలు శ్రీలంక కవి ఎల్‌.టి.టి.ఇ. ఉద్యమ సంబంధిత సాహిత్యం, కొంత కవిత్వం మినహాయిస్తే దాదాపుగా తక్కువనే చెప్పాలి. దీనికి కారణం అత్యధిక శాతం ఉత్తర శ్రీలంకలో నివసించే తమిళులు (జాఫ్నా), తమ భాష తప్ప వేరే భాషలేవీ తెలిసినవారు, చదువుకున్నవారు కాకపోవడం.

ఈ నవలిక రచయిత- రాసిన కాలానికి 32 ఏళ్ళ వయస్కుడు. ఏంథోనీ జేసుదాస్‌గా పుట్టి, రాకీ రాజ్‌గా తన కథ చెప్పి, శోభాశక్తి పేరిట రచయితగా గుర్తింపు పొందినవాడు. ప్రస్తుతం నలభై ఏళ్ళ వయసు. ‘గొరిల్లా’ పేరిట శోభాశక్తి తమిళంలో రాసిన నవలను 2008లో అనసూయా శివనారాయణ్‌ ఆంగ్లంలోకి అనువదించడా భారతీయ ప్రచురణ సంస్థ రాండమ్‌ హౌస్‌ దీని ప్రచురించింది. ఈ నవల కథా ప్రాంతం ఉత్తర శ్రీలంకలో, జాఫ్నాకు దూరంగా ఉండే ఒక మారు మూల బెసత్త పల్లె. వేర్పాటు వాద సాయుధోద్యమ ప్రకంపనల ధాటికి ఇక్కడి దళిత ప్రజలు అస్తవ్యస్తమవుతుంటారు.

నవలిక ఆరంభం ఫ్రాన్స్‌ దేశంలో. అక్కడ ఒకప్పటి బాల సైనికుడయిన రాకీ రాజ్‌, ఫ్రాన్స్‌ దేశపు హోం శాఖ అధికారులతో ఫ్రాన్స్‌ దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో వారి పరిశీలనకు- ప్రశ్నలకు జవాబులు చెప్తూ తన సైనిక జీవిత వివరాలను దాచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శ్రీలంకకు చెందిన తమిళ సాయుధ పోరాట నేపథ్యం గలవారికి యూరప్‌ దేశాల పౌరసత్వం లభించడం కష్టం. సర్వర్‌గా, అంట్లు తోమేవాడిగా, తోటమాలిగా చిన్నా చితకా పనులు చేస్తూ, దేశం కాని దేశంలో వారి వివక్షను ఎదుర్కొంటూ జీవించాల్సిన దురవస్థ ఎంతో మంది సాధారణ శ్రీలంక తమిళులకు ప్రాప్తించింది. ఈ పేద కుటుంబాలు అంతర్యుద్ధంలోని ఇరు వర్గాల మధ్య చిక్కుకుని ఎలా కడగండ్ల పాలయ్యాయో - శోభాశక్తి తన కుటుంబం గురించి చెప్పిన మాటల్లో తెలుసుకోగలం.

‘మా అమ్మా, నాన్నా భారత దేశంలో శరణార్ధులుగా ఉన్నారు. మా గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు అదొక నావికా స్థావరంగా మారిపోయింది. ఏమీ మిగల్లేదక్కడ. మా సోదరుడు, సోదరి యూరప్‌లో ఉన్నారు. నేను మా సోదరితో కలిసి జీవిస్తున్నాను’ అని ఈ యువ రచయిత చెప్పిన జీవన విషాదం ఒక తరం శ్రీలంక తమిళ ప్రజల్ని చిందర వందర చేసిన జాతి అస్తిత్వ విద్వేష సర్ప విషం.

gorillaఇంతకీ గొరిల్లా అని పిలిచే దురుసువాడు ఈ రచయిత తండ్రే. నవలిక ఎటువంటి నాజూకుదనాలు, సాహిత్య మర్యాదలు, సౌందర్య దృక్పథాలు పాటించదు. ఇదొక పదిహేనేళ్ళ పిల్లవాడి మాటల్లో చిత్రితమైన కథ. ఆత్మకథ (ఆటో బయోగ్రఫీ) అనుకుంటే కొద్ది పాటిగా వేరు పేర్లూ, స్థలాలూ వాడిన శోభా శక్తి ఈ రచనా ధోరణిని ‘ఆటో ఫిక్షన్‌’ అని అన్నాడు. ‘స్వీయ కల్పన’ అనవచ్చునేమో తెలుగులో.

నవలిక అంతటా అలుముకుని ఉంటుంది అకారణ క్రౌర్యం. రాకీ రాజ్‌ (కథలో శోభా శక్తి) తండ్రి తన కుటుంబం వారితో, ఇరుగు పొరుగు వారితో క్రూరంగా ప్రవర్తిస్తుంటాడు. తన సైనికులుగా చేర్చుకున్న తరుణ వయస్కుల పట్ల ఎల్‌.టి.టి.ఇ. ఈ క్రూర నియమావళిని అమలు పరుస్తుంటుంది. శ్రీలంక సైన్యం, వారి తమిళ మద్దతుదారులు తీవ్రవాద సైనికోద్యమం పట్ల క్రూరంగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. చట్ట వ్యతిరేక శరణార్ధులుగా తమ దేశంలో నివాసం ఏర్పరచుకో చూస్తున్న శ్రీలంక తమిళుల పట్ల ఫ్రాన్స్‌ దేశ ప్రభుత్వ సంస్థలు నిర్దయతో వ్యవహరిస్తుంటాయి. ఈ నవలిక ఒక క్రూరత్వ వర్తులంలో, కటువైన వాతావరణాన్ని ఉన్నది ఉన్నట్టుగా చిత్రించడంలో కృతకృత్యత సాధిస్తుంది.

‘గొరిల్లా’ నవలికలో ప్రతి అయిదారు పేజీలకు అధో సూచికల్లో కొన్ని పేర్లు శోభా శక్తి ప్రస్తావిస్తాడు. వీరంతా సాయుధ సైనికోద్యమ క్యాడర్‌గా అంతర్యుద్ధంలో ఆహుతైపోయిన పేద, దళిత తమిళ యువకులే. గొరిల్లా నవల ఒక బతుకు గాయాల మూట. పట్టు తప్పిన సామాజిక కార్యాచరణ వలన నెత్తురోడిన ఉదంతపు విషాద వివరణ. ఎల్‌.టి.టి.ఇ. వర్గాలు తమకు ఎదురు తిరిగిన వారిని, వ్యతిరేకించిన వారిని ఎటువంటి శిక్షలకు గురిచేస్తాయో వాటిని శోభా శక్తి సైతం, తన యువ మిత్రులతో బాటుగా ఒక నిర్బంధ శిబిరంలో అనుభవించాల్సి వస్తుంది. తను ఏ తప్పూ చేయకుండానే ఇటుంటి వికృత, విపరీత అనుభవానికి గురి కావడం శోభ శక్తి కళ్ళు తెరిపిస్తుంది.

ఇంతకీ వారు చేసిన నేరమల్లా ఏమిటంటే, ఎల్‌.టి.టి.ఇ. సాయుధ క్యేడర్‌గా ఉంటూ, తమ గ్రామ శివార్లలోని నది ఇసుక దొంగిలించి పట్టుకుపోయి లాభసాటి వ్యాపారం చేస్తున్న ఒక ఎల్‌.టి.టి.ఇ. ఛోటా నాయకుణ్ణి అడ్డుకోవడం. ఈ శిక్షలు ఇంతటితో ఆగక, వీరు తమిళుల తీవ్రవాద ఉద్యమం గురించి, శ్రీలంక సైన్యానికి వివరాలు అందజేస్తున్నారన్న అనుమానంతో పదే పదే నిర్బంధించడం, నిఘాలో ఉంచడం, వెన్నాడి పట్టుకోవడం వంటి గొలుసు చర్యలకు కొంతకాలం గురయ్యాక, ఇక మిగిలిన మార్గం దేశాంతరం వెళ్ళిపోవడమే అని రహస్యంగా పడవలపై, హెచ్చు డబ్బు చెల్లించి భారత దేశ తీరం చేరడంతో ఒక ముఖ్య ఘట్టం ముగుస్తుంది.

ఫ్రాన్స్‌ ఎలా చేరిందీ కథ అంత వివరాలివ్వదు కానీ, అక్కడ అధికారులు వీరి పౌరసత్వపు దరఖాస్తులను నిశితంగా, తీవ్రంగా పరిశీలిస్తుంటారు. ఎలాగయినా తిరస్కరించాలన్నది వారి లక్ష్యం. సాధారణ పౌరులా, లేక ఎల్‌.టి.టి.ఇ.తో సంబంధం గలవారా అన్నది కీలకాంశం. వీరి తగువులు యూరప్‌ దేశాలలోనూ కొనసాగుతుంటాయి. గొరిల్లా నవల ఆరంభపేజీల్లోనే ఇందిరా గాంధీ హత్య ప్రస్తావితం అవుతుంద. సాక్షాత్తూ దుర్గ అవతారం వంటి ఇందిరా గాంధీ బతికి ఉంటే శ్రీలంక తమిళులకు సత్వర న్యాయం జరిగి ఉండేది అన్నది ఆ శ్రీలంకలోని తమిళ ప్రజల మనోగతం. చరిత్ర ఎటువంటి విరుద్ధ అంశాలతో నిండి ఉంటుందంటే, అది తమిళుల తీవ్రవాద సంస్థ.

తమ కార్యాచరణకు గండి కొట్టేలా ఎక్కడ తిరిగి మళ్ళా ఐ.పి.కె.ఎఫ్‌.ను ప్రయోగించే నిర్ణయం తీసుకుంటారో అన్న భయంతో, ఏ ఇందిరా గాంధీ అయితే బతికి ఉంటే బాగుండును అని తలిచారో, అదే ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్‌ గాంధీని హత్య చేసి, ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కరడు కట్టిన టెర్రరిస్టు సంస్థగా పేరు తెచ్చుకుంది. సామరస్య ధోరణి, మితవాదం మొదట్నుంచీ తమిళ వేర్పాటు ఉద్యమంతో అంతర్భాగాలుగానే ఉన్నా, అటువంటి సామరస్య భావజాలం గల నాయకుల్నీ, రాజకీయ పక్షాల్నీ పూర్తిగా నిర్మూలించి తానే ఏకైక శ్రీలంక తమిళుల ప్రజల ప్రతినిధి సంస్థగా పెద్ద ఎత్తున హింసకు దారితీసింది ఎల్‌.టి.టి.ఇ. ఒక పల్లెటూరి జీవితం ప్రమాణంగా, తొలుత సింహళీయుల వివక్ష కొద్ది మేరకు ఉన్నా, ఇప్పుడీ తీవ్రవాద చర్యల వల్ల మొత్తం ఉత్తర శ్రీలంక తమిళులందరూ ఎలా శ్రీలంక సైన్యం, ప్రపంచవ్యాప్త తీవ్రవాద వ్యతిరేక సంస్థల నిఘా నేత్రంలో చిక్కుకున్నారో, ఎలా మద గజాల మధ్య చిక్కిన మేకపిల్లలైపోయారో కొంతైనా చెప్పే ప్రయత్నం చేశాడు శోభా శక్తి ఈ నవలికలో.

ప్రజాస్వామిక పద్ధతులపై విశ్వాసం ఒక ప్రాపంచిక సంస్కృతి. జులుం, అణచివేత, హింసాత్మక ప్రతిఘటన- తమ ప్రభావాన్ని ఆ మేరకు తప్పనిసరిగా సమాజంపై కలిగిస్తాయి. శాంతియుత పద్ధతులపై నమ్మకం గల పాత్ర ‘లొక్కా’ రాకీ రాజ్‌కు ఫ్రాన్స్‌లో తారసపడుతుంది. ఆయనా శ్రీలంక తమిళుడే. నవలలో గాంధీ, మండేలా పంథా కార్యాచరణ సైతం చర్చకు వస్తుంది. ‘లొక్కా’ అంటాడొక చోట ‘మనం అభిప్రాయాల్ని అభిప్రాయాలతో ఎదుర్కోవాలి తప్ప, పిడి గుద్దులతో కాదు’.

తన శాంతియుత పద్ధతుల సమర్ధనకు, దేశం కాని దేశంలో, తోటి తమిళుల చేతిలో లొక్కా హత్యకు గురికావడం కథలో చివరి ఘట్టం. ఈ నవలిక రాస్తున్న కాలంలో తాను ఎంతో ప్రాణభయంతో ఉన్నానని తెలిపాడు శోభా శక్తి. తమిళంలో ఈ నవల చదివి, అనువాదకురాలు తాను ఆంగ్లంలోకి అనువదిస్తానని ఇంగ్లీష్‌లో ఇ-మెయిల్‌ పంపుతే అందుకు శోభా శక్తి జవాబుగా- ఇంగ్లీష్‌ రాదు, కేవలం తమిళం’ అని తన ఫోన్‌ నెంబర్‌ ఇచ్చాడు.

rama-therthaశ్రీలంకలోని కుంజన్‌ ఫీల్డ్స్‌ గ్రామం, పరిసరాలు, జాఫ్నా నగరం, అంతర్యుద్ధ కాలపు ఆందోళనలు, ఒక అనధికార యుద్ధ కాలపు అస్తవ్యస్థ సమాజం, బాంబుల బెల్టులు కట్టుకున్న యువతులు, చదువులేని యువతరం, దొంగ సారా వ్యాపారులు, నయవంచక పోలీసులు, హంతకులు, వేశ్యలు, రైతులు, అమాయకులు- ఇందర్నీ గాఢమైన నైరూప్య ఛాయల్లో చూపే అక్షర వర్ణ చిత్రం- గొరిల్లా నవలిక. దీని పఠనానుభవం ఇవాల్టి జీవితాల సూటి పరిచయాన్ని పాఠకులకు అందిస్తుంది. హింసాత్మక వర్తులంలో చిక్కుకునే ఏ సమాజానికైనా- ఉద్యమ లక్ష్యాలు ఎంతటివైనా- ఏం జరుగుతుందో అన్నదానికి ‘గొరిల్లా’ ఒక అనివార్యమైన, కరకు ఉదాహరణ.