విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్‌ కళాశాలలు

హైదరాబాద్‌(వి.వి.) : రాష్ట్రంలోని కార్పొరేట్‌ కళాశాలలు విద్యను వ్యాపారం చేస్తున్నాయని ఇబిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి ఆరోపించారు. వీటిపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తున్నాయన్నారు. ఇంటర్మీడియట్‌కు 30 నుండి లక్ష రూపాయల వరకూ అవకాశాన్నిబట్టి ఫీజులను వసూలు చేస్తున్నామని చెప్పారు. ఈ విధంగా అడ్డుఅదుపూ లేకుండా కార్పొరేట్‌ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను దోచుకుంటు న్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలు ఉన్నా, కోట్ల రూపాయలను ఖర్చుచేస్తున్నప్పటికీ ప్రభుత్వ విధానాలతో వాటికి ఆదరణ లభించడం లేదన్నారు. పేరెన్నికగ కార్పొరేట్‌ కళాశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించి అధికమొత్తం లో ఫీజులను గుంజుతున్నాయన్నారు. దీంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు మాత్రం కార్పొరేట్‌ విద్య మిద్యగా మారిందన్నారు. దీనికితగినట్లుగా అనుమతులు లేకుండానే గల్లీగల్లీలో బ్రాంచీలను ప్రారంభిస్తూ, లెక్కకుమించిన విద్యారు ్థలను చేర్చుకుంటున్నాయని చెప్పారు. కార్పొరేట్‌ కళాశాలలతో ప్రభుత్వం లాలూచీ పడడంతో వాటి అక్రమాలపై నిఘా, నియంత్రణ లేకపోతోందన్నారు.పలు కళాశాలల్లో మౌళిక వసతులు, తగినంత బోధనా సిబ్బంది, ఆటస్థలం లేకపోయినా భారీస్థాయిలో విద్యార్థుల నుండి ముక్కుపిండి మరీ ఫీజులను వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లుతెరిచి కార్పొరేట్‌కళాశాలల్లో ఫీజులను నియంత్రించి వాటి అక్రమాలు, దోపిడీలకు అడ్డుకట్ట వేయాలని రవీందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.