- జీవో నెం 177పై రౌండ్‌టేబుల్‌లో వక్తలు
- వెంటనే ఉపసంహరించాలని డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 177 జీఓ కార్మిక, ఉద్యోగ వర్గాలకు ఉరితాడు వంటిదని పలు కార్మిక సంఘాల నాయకులు విమర్శించారు. ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్న ఈ జీఓను తక్షణం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 11 నుంచి సమ్మె చేస్తున్న ఫీల్డు అసిస్టెంట్ల డిమాండ్లను ఆమోదించి, సమ్మెను నివారించాలని డిమాండ్ చేశారు. 'జీఓ నెంబర్ 177ను వెంటనే ఉపసంహరించుకోవాలి' అని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిఐటియు, ఎఐటియుసి రాష్ట్ర కమిటీల సంయుక్త ఆధ్వర్యాన వివిధ కార్మిక సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ సుధాభాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిజె చంద్రశేఖరరావు, కె విజయకుమార్ (బిఎమ్‌ఎస్), కె పోలారి (ఐఎఫ్‌టియు), కె సుధీర్ (ఎఐయుటియుసి), షమీమ్ బేగం (ఐఎన్‌టియుసి), వి గోపాల్‌రెడ్డి (ఛైర్మన్, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జెఎసి), ఎమ్ జనార్థన్‌రెడ్డి (చైర్మన్, ఎపి పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్), టి సత్యనారాయణ (అధ్యక్షులు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్), ఎన్ ఆనందరావు (అధ్యక్షులు, ఎపి రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్), ఆర్ లకëయ్య (ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్), డి మురళీమోహన్ (కార్యదర్శి, ఎపి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్), ఎస్ నిర్మలాదేవి (ఎఎన్‌ఎమ్‌ల అసోసియేషన్), సత్యనారాయణ (ఎపిఎన్జీవోస్ నాయకులు, హైదరాబాద్ సిటీ), సామినేని రామారావు (ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం), టి రామకృష్ణ (ఉపాధ్యక్షులు, ఎపి రైతుసంఘం), ప్రసాద్ (డివైఎఫ్‌ఐ), ఎవి నాగేశ్వరరావు, భూపాల్, పాలడుగు భాస్కర్ (సిఐటియు), తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధాభాస్కర్ మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఉద్యోగులు, కార్మికులు విజ్ఞాపన పత్రాలు సమర్పించినా వాటిని పట్టించుకోకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వం, దీనికి నిరసనగా వారు చేపట్టే ఆందోళనలు, పోరాటాలను అణగదొక్కేందుకే 177 జీఓను విడుదల చేసినట్లు విమర్శించారు. ఈ జీఓ కేవలం ప్రభుత్వశాఖల్లో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులకే పరిమితం కాదని చెప్పారు. ఈ జీఓను ఆసరాగా చేసుకొని ఆయా శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతోపాటు ఫిక్స్‌డ్ వేతనం, గౌరవ వేతనం, పారితోషికాలతో పనిచేసే వారిపై కూడా దాడి పెరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కూడా సమ్మె హక్కులేదంటూ ఈ జీఓలో పేర్కొనడం దారుణమని వ్యాఖ్యానించారు. పిజె చంద్రశేఖరరావు మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు ముందు వినయవిధేయతలు ప్రదర్శించే పనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీఓను తీసుకొచ్చిందని విమర్శించారు. నయా ఉదారవాద విధానాలను అమలుపరచడంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పూనుకుంటోందని విమర్శించారు. గోపాలరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులను కట్టు బానిసలుగా చేసుకునేందుకే ప్రభుత్వం ఈ జీఓను విడుదల చేసిందని అన్నారు. జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల ఆందోళనలు, పోరాటాలను అణచివేసేందుకు, వారిని ప్రజల నుంచి, ప్రజా ఉద్యమాల నుంచి వేరు చేసేందుకే ప్రభుత్వం 177 జీఓను విడుదల చేసిందన్నారు. రాజకీయంగా, పరిపాలనాపరంగా విఫలమైన ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ విధమైన చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఆర్ లకëయ్య మాట్లాడుతూ ఉద్యోగులు క్రమశిక్షణగా ఉండేందుకే ఈ జీఓను తెచ్చామంటూ ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న ప్రభుత్వానికి క్రమశిక్షణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఉద్యోగులను తన కాళ్ల కింద చెప్పుల్లాగా ఉంచేందుకే ఇలాంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటోందని చెప్పారు. 177 జీఓను ఉపసంహరించాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని కార్మిక సంఘాలూ కలిసి త్వరలోనే పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకుంటాయని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. రాష్ట్ర సదస్సు నిర్వహించాలని, అందులో తదుపరి ఆందోళనా కార్యక్రమాన్ని ప్రకటించాలను కూడా ఈ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్ణయించింది.