'మౌలిక' నిరశన

దళితులు, ఆదివాసులు, పట్టణ పేదలు, కౌలుదార్ల సమస్యలపై హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, ఆ పార్టీకి చెందిన కార్యదర్శివర్గ సభ్యులు జి. నాగయ్య, ఎస్, వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మిడియం బాబూరావులు ఆమరణ నిరశన దీక్షను చేపట్టారు. ఐదురోజులుగా నిరశన దీక్ష చేస్తున్న వారిని శనివారం అర్ధరాత్రి అరెస్టుచేసి గాంధీ హాస్పిటల్‌కు తరలించినప్పటికీ వారు తమ దీక్షలను కొనసాగించారు.

ప్రజా సమస్యలపై నిరాహార దీక్ష చేస్తున్న వారితో ప్రభు త్వం చర్చించకుండా అరెస్టు చేసి దీక్షను భగ్నం చే సేందుకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవాప్తంగా ఆందోళనలు జరిగాయి. వివిధ జిల్లాల్లో వందలాది మందిని ప్రభుత్వం అరెస్టు చేసింది. ప్రభుత్వ వైఖరి పట్ల రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ ప్రతినిధులుగా రాష్ట్ర మంత్రులు పి.శంకరరావు, డొక్కా మాణిక్య వరప్రసాదరావులు దీక్ష చేస్తున్న నేతలను సోమవారం పరామర్శించారు. నిర్దిష్టమైన హామీలేమీ ఇవ్వకపోయినా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని మంత్రులు ప్రకటించారు.

దళిత, ఆదివాసుల సమస్యల పట్ల స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకూ దీక్షలు కొనసాగిస్తామని ప్రకటించిన సీపీఎం నేతలు రాష్ట్ర మంత్రులు పితాని, బాలరాజుతో మరో విడత చర్చించిన అనంతరం దీక్ష విరమణకు సమ్మతించారు. పెద్ద సంఖ్యలో దీక్షాస్థలికి చేరుకున్న కార్యకర్తల సమక్షంలో ఈ నిరశనోద్యమం పాక్షిక విజయం సాధించిందని ప్రకటిస్తూ రాఘవులు తదితర నేతలు దీక్షను విరమించారు.

గత కొంత కాలంగా ప్రత్యేక తెలం గాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు, పార్టీలలో తలెత్తిన అంతర్గత వివాదాల చుట్టూ దాదా పు అన్ని రాజకీయపార్టీలు ప్రదక్షిణాలు చేస్తున్నాయి. సమాజంలోని అట్టడుగు ప్రజానీకపు మౌలిక సమస్యలను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోని ఈ సమయంలో వాటి పరిష్కారానికై సీపీఎం నేతలు నిరవధిక నిరశన దీక్షకు సిద్ధపడటం హర్షించదగ్గది.

సీపీఎం నేతలు చేస్తున్న నిరశన దీక్షలకు సమాంతరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సమస్యలకు చెందిన ప్రజా సెక్షన్‌లను కదిలిస్తూ ఆ పార్టీ స్థానిక కార్యకర్తలు ఆందోళన లు చేపట్టారు. ఆ క్రమంలో మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. సీపీఎం నేతలు చేస్తున్న దీక్షలకు మద్దతుగా అనుబంధ సంఘాలు, ప్రజాసంఘాలు మహార్యాలీని నిర్వహించాయి.

అయితే దళిత, ఆదివాసుల సమస్యలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాలన్న నిరశనకారుల డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం తోసి పుచ్చింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కచ్చితంగా అమలయ్యేందుకు ప్రత్యేక చట్టం చేయాలని సోమవారం సీపీఎం సభ్యలు ఉభయసభలలో డిమాండ్ చేశారు. గత కొద్ది సమావేశాల నుంచి అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలు అధికార, ప్రతిపక్ష పార్టీల బలాబలాలను తేల్చుకునే వేదికలుగా మారిపోయాయి.

దిగజారిపోతున్న ప్రజల జీవన ప్రమాణాలు, అధిక ధరలు, నిరుద్యోగం, ఆహార, ఆరోగ్య భద్రతలు, దారిద్య్రం లాంటి మౌలిక ప్రజా సమస్యలపై రాజకీయపక్షాలు లోతుగా, సమగ్రంగా చర్చించకుండా స్కాంలపై మాత్ర మే తీవ్రంగా స్పందిస్తున్నాయి. దాంతో ప్రజా సంక్షేమం కుప్పకూలింది. ఈ నిరశనోద్యమం విస్మృత ప్రజా సమస్యలను తిరిగి తెరపైకి తెచ్చింది.

వాస్తవానికి సీపీఎం ముందుకు తెచ్చిన 51 డిమాండ్లు ఈనాడు కొత్తగా ముందుకొచ్చినవి కావు. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు పట్టించుకోకుండా పోయినవే. వాటిలో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్, స్కెషల్ కాంపొనెంట్ అమలు డిమాండ్‌లు ఇందిరాగాంధీ పాలనా కాలంలో రూపొందినా ఇప్పటికీ అమలుకు నోచుకోని దుస్థితి.

దళిత, ఆదివాసీ ప్రజానీకం కోసం రూపొందించిన ఉప ప్రణాళిక, నోడల్ ఏజెన్సీ పనితీరు, నిధుల కేటాయింపులు, వాటి అమలు తీరుతెన్నులు వగైరాలు ఆ ప్రజలను ఓటు బ్యాంకులుగా మాత్రమే ఈ ప్రభుత్వాలు పరిగణిస్తున్నట్లు రుజువు చేస్తున్నాయి. అదే సమయంలో దళితులు, ఆదివాసులు విద్య, వైద్య సౌకర్యాలకు ఆమడ దూరంలో ఉన్నారు. 2009-10 ప్రణాళికలో కేటాయించిన నిధులలో 10 శాతాన్ని కూడా ప్రభు త్వం ఖర్చుపెట్టకపోవడం ప్రభుత్వాల చిత్తశుద్ధికి ప్రబల తార్కాణమని సీపీఎం విమర్శిస్తోంది.

జనాభాకు అనుగుణంగా, అంతకంటే అధికంగా ఎస్సీ, ఎస్టీలకు నిధులను కేటాయించాలని 1981లో ప్రణాళికా సంఘం సూచించింది. ఆ సూచ నలు రాష్ట్రంలో 2005లో ఉత్తర్వులుగా వచ్చాయి. ఈ నిధులను అమలులోకి తెచ్చే లక్ష్యంతో 2007లో ఒక నోడల్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన్పటికీ అది ఏరోజూ పనిచేసిన పాపాన పోలేదు. ఉప ప్రణాళిక ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవైఒక్క వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంది.

ఎస్సీ, ఎస్టీలకు చెందిన నోడల్ ఏజెన్సీని ప్రభుత్వం కోరలులేని పులిగా మార్చివేయడంతో వేల కోట్ల రూపాయల నిధులు మురిగిపోయిన తర్వాత వేరే రంగాలకు తరలిపోతున్నాయి. కేటాయించిన నిధులను మురగబెట్టేది, వాటిని వేరే ప్రయోజనాల కోసం వినియోగించేదీ ఈ ప్రభుత్వాలే. ఈ అంశంపై ప్రణాళికా సంఘం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపట్టింది.

దళిత, ఆదివాసుల సంక్షేమ కోసం కేటాయించిన నిధుల నిర్వహణ కోసం కేంద్రీయ ప్రణాళిక ఏదీ ప్రభుత్వం దగ్గర లేదు. ఆదివాసేతరులు అక్రమణలో ఉన్న ఆదివాసుల భూమిని విడిపించేందుకు ఉద్దేశించిన 1/70 చట్టానికే దిక్కులేదు. ఇక ఎస్టీల అనుభవంలోని 25 లక్షల హెక్టార్ల భూమికి పట్టాలిచ్చే ముచ్చట ఎక్కడిది? సమగ్రమైన, శాస్త్రీయమైన ఆదివాసీ భూముల సర్వేను చేపట్టకుండా కేవలం నాలుగు లక్షల హెక్టార్లకు మాత్రమే పట్టాలిచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది.

వ్యసాయోత్పత్తిలో అత్యధిక భాగాన్ని సమకూరుస్తున్న కౌలుదార్లకు బ్యాంకు రుణ సౌకర్యం కోసం గుర్తింపు కార్డులు, మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌ల నియామకం, చివరికి దళిత, ఆదివాసులకు స్మశాన స్థలం కేటాయింపులాంటి వివిధ డిమాండ్లపై సీపీఎం ఆందోళన చేపట్టింది.

ప్రజల మౌలిక సమస్యలపై జరుగుతున్న నిరశన ఉద్యమం అనవసరమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వివిధ ప్రతిపక్షపార్టీలు, అనేక ప్రజా సంఘాలు సీపీఎం దీక్షకు మద్దతు ప్రకటించి ప్రభుత్వ అలక్ష్యాన్ని ఆక్షేపించాయి. చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఒకవైపు రాత పూర్వకంగా అనుమతినిస్తూ మరోవైపు జిల్లాల నుంచి తరలివస్తున్న ప్రజలను అరెస్టు చేయడం, నాయకులను ముందస్తుగా నిర్బంధించడం ప్రభుత్వ అప్రజాస్వామిక స్వభావాన్ని బట్టబయలు చేసిందని సీపీఎంతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ తప్పుపట్టాయి.

ఈ నిరశన దీక్షతో ప్రజల మౌలిక సమస్యల తక్షణ పరిష్కార అవసరాన్ని, సందర్భాన్ని తిరిగి తెరపైకి తెచ్చినట్లయింది. కుల, మత, ప్రాంత, జాతి అస్తిత్వ ఉద్యమాలు, ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం కోసం సాగే ఉద్యమాలు పరస్పరం భిన్నమైనవి కావు. ఒకదానికి ఇంకొకటి అవరోధమూ కావు. అవి పరస్పరపూరకమైనవి. రాజకీయపార్టీలు, ఉద్యమ సంస్థలు ఈ రెండు రకాల ఉద్యమాలను నేర్పుగా అనుసంధానించడంలోనే ప్రజా ప్రయోజనం ఇమిడి ఉంది.andhra jyothi soujanyamutho

ఉచిత పంపిణీ

రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికలంటే సామాజిక పరివర్తనకు, అభివృద్ధికి పార్టీలు (అధికారంలోకి వస్తే) అనుసరించే విధానాలు పొందుపరిచిన పత్రం అనేది సర్వసాధారణ భావన. అధికారంలోకి వచ్చిన పార్టీ ఎన్నికల వాగ్దానాల అమలులో సాఫల్య వైఫల్యాలు తదుపరి ఎన్నికల్లో చర్చనీయాంశాలయ్యేవి. అది ఒకప్పటి మాట. ఇప్పుడంతా మారిపోయింది. ముఖ్యంగా నయా ఉదారవాద మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థను బూర్జువా పార్టీలన్నీ ఆలింగనం చేసుకున్నాక విధానాలపరంగా భేదాలు అంతర్ధానమయ్యాయి. అధికారం కొరకు పోటీలో అధికార-ప్రతిపక్ష స్థానాలను బట్టి పరస్పరం దుమ్మెత్తిపోసుకోవటం, ఓటర్లకు గాలమేసేందుకు ఉదార లేక ఉచిత పంపిణీ వాగ్దానాలు పెరిగాయి. ఎన్నికల అవినీతి కిందకు రాని రాచబాట ఇది. ప్రజలు అధికారమిస్తే ప్రజలు పన్నుల రూపంలో ఖజానాకు చెల్లించిన సొమ్ముతో ఉభయ తారకంగా వాటిని అలవోకగా అమలు చేయవచ్చు. డి.ఎం.కె. ఇందులో ఆరితేరింది. 1967లో డి.ఎం.కె. తొలిసారి అధికారంలోకి రావటానికి కాంగ్రెస్‌ వ్యతిరేక పవనాలతో పాటు రూపాయికి పడి (మూడుసేర్లు) బియ్యం బ్రహ్మాస్త్రంగా పనిచేసింది. 2006 ఎన్నికల్లో కరుణానిధి నాయకత్వంలోని డి.ఎం.కె. రూపాయికి కిలోబియ్యం, కలర్‌ టెలివిజన్‌ల ఉచిత పంపిణీని వాగ్దానం చేసింది. ఈ పంపిణీ ఇంకా పూర్తికాలేదు. ఎన్నికలు ప్రకటించగానే ఎన్నికల సంఘం టి.వి.ల పంపిణీని నిలుపుచేసింది. వచ్చే నెలలో జరిగే ఎన్నికలకు డి.ఎం.కె. ఉచిత పంపిణీల జాబితాను విస్తరించింది. విద్యార్ధులకు లాప్‌ట్యాప్‌, గృహిణులకు గ్రైండర్‌ లేదా మిక్సీ, పేద కుటుంబాలకు నెలకు 35 కిలోల ఉచిత బియ్యం, వృద్ధులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, గర్భిణులకు నగదు సహాయం పెంపుదల, మత్స్యకారులకు సబ్సిడీలు పెంపు వగైరా కొత్తగా చేరాయి. కుటుంబపాలనపై అసంతృప్తిని, 2జి స్పెక్ట్రం అవినీతిని ఈ 'ఉచితాలు' పరిహరిస్తాయని, ప్రజలు తిరిగి తమకే అధికారం కట్టబెడతారన్నది కరుణానిధి ఆశ! ప్రతిపక్షం ఇంతకు మించి ఏమివ్వగలుగుతుంది!
సినీ నటజీవితమంతా మద్రాసులో (ఇప్పుడు చెన్నై) గడిపిన ఎన్‌.టి.రామారావు 1982లో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అడుగిడి ఆ ప్రభావంతో రెండ్రూపాయలకు కిలో బియ్యం ప్రకటించారు. కాంగ్రెస్‌ దుష్పరిపాలన పట్ల ప్రజల్లో వున్న అసంతృప్తికి ఇది తోడైంది. 1983 జనవరిలో ఆయన టిడిపి అధికారంలోకి వచ్చింది. బి.జె.పి. ముఖ్య మంత్రు లు-మధ్య ప్రదేశ్‌లో శివరాజ్‌ చౌహాన్‌,చత్తీస్‌ ఘర్‌లో రమణ్‌ సింగ్‌, కర్నాటకలో ఎడ్యూరప్ప, గుజరాత్‌లో నరేంద్ర మోడీ ఇదే ధాన్యం రాజకీయం నుండి లబ్దిపొం దారు. పంజాబ్‌లో అకాలీదళ్‌ ఉచిత విద్యుత్‌ వాగ్దానంతో అధికారంలోకి వచ్చింది. 2004 లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ దశాబ్దం తర్వాత తిరిగి అది óకారం లోకి రావటంలో వ్యవసా యానికి ఉచిత విద్యుత్‌ వాగ్దానం ప్రభావం తక్కువేమీకాదు. ప్రతిపక్ష టిడిపి 'నగదు బదిలీ' పథకం ప్రకటించినా ఫలితం లేకపోయింది. ఉచిత పంపిణీలు పేదలకు తాత్కాలిక ఊరట, వెసులుబాటు కల్పించే చర్యలే అయినప్పటికీ, ఎన్నికల్లో చేసే అటువంటి వాగ్దానాలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు లంచంతో సమానం. కాని వాటిని నిరోధించే శక్తి ఎన్నికల చట్టాలకు, వాటిని అమలు జరిపే ఎన్నికల కమిషన్‌కు లేకపోవటం వల్ల రాజకీయ పార్టీలు పోటీపడి ఇటువంటి వాగ్దానాలు చేస్తున్నాయి.
బూర్జువావర్గ పార్టీలు పేదల గూర్చి మొసలి కన్నీరు పెడుతూ ప్రలోభాలతో (వెచ్చించే ధనానికివి అదనం) వారి ఓట్లు పొందటంలో ఆరితేరాయిగాని భూపంపిణీ, శాశ్వత ఉపాధికి చర్యలు తీసుకోవటం ద్వారా వారి కాళ్ళపై వారిని నిలబెట్టేందుకు కృషి చేయవు. వారలా పేదరికంలో వుండటంలోనే వాటికి స్వార్ధం వుంది. అయితే అన్నివేళలా 'ఉచిత' వాగ్దానాలు రాజకీయపార్టీలను గట్టెక్కించలేవు. ఎన్నికల సమయానికున్న రాజకీయ వాతావరణం, పాలకపార్టీ పట్ల ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలు ఫలితాలు నిర్ణయించటంలో ప్రధానపాత్ర వహిస్తాయి. పేదలు కూడా 'ఉచిత' వాగ్దానాల భ్రమల్లో కొట్టుకుపోకుండా రాజకీయంగా మంచి చెడులు ఆలోచించాలి. రాజకీయ పార్టీలు 'ఉచిత' వాగ్దానాలతో తాత్కాలికంగా పబ్బంగడుపుకునే అవకాశవాద రాజకీయాన్ని పక్కనపెట్టి పేదల జీవనాన్ని మెరుగుపరిచే శాశ్వత లాభ చర్యలు చేపట్టిన ప్పుడే నిజమైన ప్రగతి సాధ్యం. ఉచితంగా ఇస్తే అది ఆ రోజుతో సరి. కాని ఆహారం సంపాదించుకునే మార్గం చూపితే అది శాశ్వతం.

మరో అడుగు ముందుకేశాం

  • బహిరంగ సభలో రాఘవులు
  • విశాల వేదిక నిర్మాణానికి కృషి
  • సర్కారు అప్రజాస్వామిక ధోరణులకు నిరసన
దళితులు, గిరిజనులు,కౌలుదార్లు,అసంఘటిత కార్మికులు, పట్టణ పేదలకు సంబంధించి ప్రజా సంఘాలు ప్రస్తుతం సాధించిన పాక్షిక విజయంతో ఒక అడుగు ముందుకేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. 'ప్రభుత్వం అనేక ఆటంకాలు పెట్టినా అశేషంగా తరలి వచ్చిన మీ అందరి స్ఫూర్తితో మున్ముందు మరిన్ని ఉద్యమాలను చేపడతామని' చలో హైదరాబాద్‌ సభకు హాజరైన ప్రజలనుద్దేశించి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, పట్టణ పేదలు, కౌలు రైతులు, కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో సిపిఎం నేతలు బివి రాఘవులు,జి నాగయ్య, ఎస్‌ వీరయ్య,మిడియం బాబూరావు ఆరు రోజులుగా సాగిస్తున్న నిరవధిక నిరాహారదీక్షను ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన బహిరంగ సభ వేదికపై విరమించారు. ఐద్వా అఖిల భారత ఉపాధ్యక్షురాలు బృందాకరత్‌ నాయకులకు నిమ్మ రసమివ్వడంతో దీక్ష ముగిసింది. అనంతరం రాఘవులు మాట్లాడుతూ ప్రజా సంఘాలు ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లలో కొన్నింటిపై స్పష్టమైన హామీ ఇచ్చిం దన్నారు. మరికొన్నింటిని అమలు చేసేందుకు ప్రక్రియను పూర్తి చేస్తున్నామంటూ చర్చలకు వచ్చిన మంత్రులు తెలిపారని చెప్పారు. ఇంకొన్నింటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీగానీ, నిర్ణయంగానీ వెలువడలేదని తెలిపారు. ఇది పాక్షిక విజయమని అన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమం ఒక అడుగు ముందుకేసిందని చెప్పారు.

భవిష్యత్తులో మరిన్ని అడుగులు ముందుకేయాల్సి ఉంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలకు రూపకల్పన చేయాలని చెప్పారు. ఈ సమస్యలపై ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాబోయే రోజులో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, సంస్థలు, శక్తులు, వ్యక్తులతో కలిపి ఒక విశాల వేదికను నిర్మించడానికి కృషి చేస్తామని చెప్పారు.
రాజకీయ సుడిగుండంలో పార్టీలు
ప్రస్తుతం రాష్ట్ర విభజన, సమైక్యత అనే అంశాల చుట్టూనే రాజకీయ పార్టీలు గిర్రున తిరుగుతున్నాయని చెప్పారు. రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న పార్టీలు రాష్ట్ర విభజన, సమైక్యత అనే సమస్య ఒక్కటే రాష్ట్రంలో ఉన్నట్లు, మిగతా సమస్యలేవీ లేనట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఆ సమస్య పరిష్కారమైతే ప్రజల కడుపులు నిండినట్లు, వారి పిల్లలకు చదువు, వైద్యం, తదితర సౌకర్యాలు అందుతాయన్నట్లు, అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయన్నట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రం ఒక్కటిగా ఉండాలా? లేక విడిపోవాలా? అనే డిమాండ్లపై ప్రతి పార్టీ తన రాజకీయ విధానానికి అనుగుణంగా పోరాడుతూనే ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు తదితర ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఆ విధంగా చేస్తే తమ పార్టీ, ప్రజా సంఘాల తరపున వారికి పూర్తి సంఘీభావం తెలుపుతామని అన్నారు.ప్రజా సమస్యలపై విస్తృత పోరాటాలు సాగాలన్నారు.
అప్రజాస్వామిక ధోరణులు ప్రమాదకరం
ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తున్న ధర్నాలు, ప్రదర్శనలు, బహిరంగ సభల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు పద్ధతుల్లో, పొరపాటు వైఖరితో వ్యవహరిస్తోందని రాఘవులు విమర్శించారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కూడా వివిధ సమస్యలపై ధర్నాలు, ఆందోళనలు నిర్వహించిందని గుర్తుచేశారు. అంగన్‌వాడీల చలో హైదరాబాద్‌ సందర్భంగా పోలీసులు జిల్లాల్లో ఎక్కడికక్కడ కార్యకర్తలు, నాయకులను అరెస్టు చేశారని అన్నారు. వారేమైనా రౌడీలా? ఉగ్రవాదులా? సిఎం కుర్చీని ఊడబెరకడానికి వస్తున్నారా? లేక అసెంబ్లీని కూల్చేసేందుకు వస్తున్నారా? అని ప్రశ్నించారు. మహిళలని కూడా చూడకుండా ఈ విధంగా అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం వ్యవహరించడం అమానుషమన్నారు. కెవిపిఎస్‌, గిరిజన సంఘం, వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యాన నిర్వహించతలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమం విషయంలోనూ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరించిందని విమర్శించారు. ప్రజా సంఘాల వారెప్పుడైనా, ఎక్కడైనా దౌర్జన్యం చేశారా? అధికారులు, పోలీసుల మీద దాడులేమైనా చేశారా? ఆస్తులేమైనా ధ్వంసం చేశారా? అని ప్రశ్నించారు. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతుల్లో, అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమన్నారు.ఇది ప్రజాతంత్ర ఉద్యమాలకు తీవ్ర హాని కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం ఈ విధంగా ప్రజాస్వామ్యం మీద దాడిచేస్తే సహించబోమంటూ ప్రజలు గళమెత్తాలని పిలుపునిచ్చారు. ప్రజాతంత్ర వాదులంతా ముక్త కంఠంతో నిరసించాలని కోరారు. ప్రజా ఉద్యమాలను అణచివేస్తే అవి తారాజువ్వలా ఎగిరిపడతాయని రాఘవులు హెచ్చరించారు. జిల్లాల్లో పాదయాత్రలు, సైకిల్‌ యాత్రలు, సర్వేలు, అధ్యయనాలు సాగించిన ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, పేదల పట్టుదల, కృషి వల్లనే ఈ పోరాటం విజయవంతమైందని అన్నారు. ఈ సందర్భంగా వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. దీక్షకు సంఘీభావం తెలిపిన పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులందరికీ ధన్యవాదాలు తెలిపారు