ఘనంగా అంబేద్కర్‌ 121వ జయంతి

  • నివాళులర్పించిన రాజకీయ నేతలు
  • ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు వారికే ఖర్చు చేయాలని డిమాండ్‌
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 121వ జయంతి ఘనంగా జరిగింది. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని ఆయన విగ్రహనికి అన్ని రాజకీయ పార్టీల నేతలతోపాటు వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గురువారం ఉదయం 9.45 నిమిషాలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌చేసి పేదలకు పంచారు. నిరుపేద మహిళలకు చీరలను పంచిపెట్టారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పితాని సత్యనారాయణ, దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్‌, శంకర్రావు, సికింద్రాబాద్‌ ఎంపి అంజన్‌కుమార్‌ యాదవ్‌, గ్రేటర్‌హైదరాబాద్‌ మేయర్‌ బండ కార్తీకరెడ్డి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. టిడిపి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అంబేద్కర్‌కు పూలదండ వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు, తీగల కృష్ణారెడ్డి కూడా ఉన్నారు. పిసిసి అధ్యక్షులు డి శ్రీనివాస్‌ నివాళులర్పించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆర్టీసి క్రాస్‌ రోడ్‌ నుండి లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వరకు సైకిల్‌ యాత్ర నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఆయనతోపాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి మధు, వై వెంకటేశ్వరరావు నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, పార్టీ నేత రామకృష్ణ నివాళులర్పించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ సబ్‌ప్లాన్‌లో దళితులకు కేటాయించిన నిధులను వారికే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్‌లో అవినీతి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను దళిత,గిరిజనులకే ఖర్చుచేయాలంటూ ఉద్యమం చేపడతామని చెప్పారు. లోక్‌సత్తా రాష్ట్ర ప్రధానకార్యదర్శి డివిఎస్‌ వర్మ, టిఆర్‌ఎస్‌ సీనియర్‌నేత నాయిని నర్సింహరెడ్డి, ప్రజారాజ్యం అధ్యక్షులు చిరంజీవి అంబేద్కర్‌కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. బిజెపి మాజీ జాతీయ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్‌, రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి, సీనియర్‌ నేతలు బండారు దత్తాత్రేయ, బద్దంబాల్‌రెడ్డి నివాళులర్పించారు. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎంఆర్‌పిఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అంబేద్కర్‌కు నివాళులర్పించి మాట్లాడుతూ దళితులను పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయనకు దండవేసి నివాళులర్పించే నైతిక హక్కు లేదన్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్‌) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఉపాధ్యక్షులు గంగాధర్‌, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) రాష్ట్ర కార్యదర్శి బాలకాశి, ఉపాధ్యక్షులు ప్రసాద్‌, భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షులు సూర్యారావు, ఉపాధ్యక్షులు మల్లేష్‌ నివాళుర్పించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత రాజ్‌ఠాకూర్‌ అంబేద్కర్‌, ఎస్‌ శ్రీనివాస్‌, ప్రకాష్‌రాజు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్‌ అధ్యక్షులు గద్దర్‌, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, తెలంగాణ ఎన్‌జివోల సంఘం నేతలు దేవిప్రసాద్‌, కృష్ణయాదవ్‌, గెజిటెడ్‌ ఉద్యోగుల నేత శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు నివాళులర్పించారు. అనంతరం కోదంరాం మాట్లాడుతూ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ స్పూర్తితో అందరూ ముందుకు వెళ్లాలన్నారు. చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ది సాధ్యమనే విషయాన్ని ఆయన ఆనాడే చెప్పారని గుర్తు చేశారు.