మళ్లీ కన్యాశుల్కం రోజులు!

2011 జనాభా గణన కొన్ని ఆసక్తికరమైన, మరికొన్ని ఆందోళనకరమైన ధోరణులను వెలుగులోకి తెచ్చింది. 2001 జనాభా లెక్కలతో పోల్చితే మనదేశ జనాభా 18.1 కోట్లు పెరిగింది. అంటే దశాబ్ద వృద్ధిరేటు 17.64 శాతం. దేశ జనగణన తొలిసారి 1872లో ప్రారంభమైంది. ప్రతిపదేళ్లకొకసారి నిర్వహించే ఈ ప్రక్రియలో 2011 జనగణన 15వది. గత ఏడాది ఏప్రిల్‌లో మొదలిడి రెండుదశల్లో పూర్తిచేసిన ఈ మహాక్రతువు తాత్కాలిక లెక్కలను రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సెస్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా సి.చంద్రమౌళి గురువారంనాడు ఢిల్లీలో హోంశాఖ కార్యదర్శి జి.కె.పిళ్లరు సమక్షంలో విడుదల చేశారు. ఇప్పుడు జనాభా, స్త్రీ-పురుష నిష్పత్తి, జనసాంద్రత, 6 సంవత్సరాలలోపు పిల్లలెందరు, అక్షరాస్యత వంటి సమాచారాన్ని జిల్లాలవారీ విడుదల చేయగా, కనీస వసతులవారీ, తరగతులవారీ లెక్కలు మరో ఏడాదిలోగా వెల్లడిస్తారు. ప్రణాళికలు, సంక్షేమ పథకాల రచనకు ప్రణాళికావేత్తలకు, ప్రభుత్వాలకు ఈ లెక్కలే మార్గదర్శకాలు. మొత్తం 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 640 జిల్లాలు (5924 ఉప జిల్లాలు, 7936 పట్టణాలు సహా), 6.41 లక్షల గ్రామాల్లో ఈ మహాకార్యక్రమం నిర్వహించారు. ఇందుకైన వ్యయం రు.2200 కోట్లు. 1931 తదుపరి కులాలవారీ జనగణన జరగనందున, జనాభాలెక్కల్లో భాగంగా వాటిని చేపట్టాలన్న అనేక రాజకీయ పార్టీల డిమాండ్‌ను తిరస్కరించిన ప్రభుత్వం వచ్చే జూన్‌-సెప్టెంబర్‌ మధ్యలో ప్రత్యేకంగా కులాలవారీ జనగణన చేపట్టాలని నిర్ణయించింది. అదలావుంచితే తాజా లెక్కల ప్రకారం మనదేశ జనాభా 121,01,93,422. వారిలో పురుషులు 62,37,24,248, స్త్రీలు 58,64,69,174. చైనా తదుపరి స్థానంలో ఉన్న మనదేశ జనసంఖ్య అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, జపాన్‌ జనాభాకు సమానం. ప్రపంచ జనాభాలో 19.4శాతం చైనాలో వుండగా, 17.5శాతం మనదేశంలో ఉన్నారు. చైనా ఏకసంతాన నియమాన్ని అమలు చేస్తున్నది. మనదేశం తన జనాభా వృద్ధిరేటును గణనీయంగా తగ్గించుకోలేకపోతే మరో 20 ఏళ్లలో చైనాను మించుతుందని అంచనా. 2001 జనాభాలెక్కల్లో 21.54శాతంగా ఉన్న జనాభా వృద్ధిరేటు 2001-11 దశాబ్దకాలంలో 17.64శాతానికి తగ్గటం జనాభా నియంత్రణ కృషి సత్ఫలితాలిస్తున్నట్లు సూచిస్తున్నది. 1911-1921 దశాబ్దాన్ని మినహాయిస్తే అతి తక్కువ వృద్ధిరేటు నమోదైన దశాబ్దం ఇదే. అందులో పురుషుల వృద్ధిరేటు 17.19శాతం కాగా స్త్రీల వృద్ధిరేటు 18.12 శాతం. దీంతో లింగ దామాషా (ప్రతి వెయ్యిమంది పురుషులకు స్త్రీలు) 2001లోని 933 నుండి 940కి పెరిగింది.
దేశ జనాభాలో 85శాతం కలిగివున్న 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వార్షిక జనాభా వృద్ధిరేటు 2 శాతంలోపు వుండటం విశేషం. అత్యధిక జనాభాగల ఆరు రాష్ట్రాల్లో వృద్ధిరేటు తగ్గుదల ఇందుకు దోహదం చేసింది. గత దశాబ్ద కాలంలో జనాభా వృద్ధిరేటు ఉత్తరప్రదేశ్‌లో 25.85 నుండి 20.09 శాతానికి, మహారాష్ట్రలో 22.73 నుండి 15.99 శాతానికి, బీహార్‌లో 28.62 నుండి 25.07శాతానికి, పశ్చిమ బెంగాల్‌లో 17.77 నుండి 13.93శాతానికి, ఆంధ్రప్రదేశ్‌లో 14.59 నుండి 11.10శాతానికి, మధ్యప్రదేశ్‌లో 24.28 నుండి 20.30 శాతానికి తగ్గింది. ఇదేకాలంలో జాతీయ అక్షరాస్యత 64.83 నుండి 74.04 శాతానికి పెరిగింది. పురుషుల్లో అక్షరాస్యత 82.14శాతంకాగా మహిళల్లో 65.46శాతం. 91.98శాతం అక్షరాస్యతతో కేరళ అగ్రస్థానంలో ఉండగా, 52.66 శాతంతో రాజస్థాన్‌ కడపటిస్థానంలో ఉంది.
ప్రభుత్వ కుటుంబ సంక్షేమ ప్రచారం, అక్షరాస్యత, చైతన్యం, ఆర్థిక పరిస్థితులు, భార్యాభర్తల ఉద్యోగిత వంటి కారణాలవల్ల పరిమిత కుటుంబాల సంఖ్య పెరుగుతున్నది. అయినా అభివృద్ధి, నాగరికత గూర్చి గొప్పలు చెప్పుకుంటున్నా ఆడశిశువుల పట్ల అమానుషం భవిష్యత్‌కు ప్రమాదసంకేతంగా పరిణమిస్తున్నది. భ్రూణహత్యలు, శిశుహత్యల వంటి ఘోరాలతో ఆడపిల్లల సంఖ్య తగ్గుతోంది. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాల్లోనే ఈ దారుణాలు ఎక్కువగా ఉన్నట్లు జనాభా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం జనాభాలో 0-6 వయోపరిమితిలోని బాలలసంఖ్య 2001లో 15.9 శాతం కాగా 2011లో అది 13.1 శాతానికి తగ్గింది. జనాభా వృద్ధిరేటు తగ్గుదలకు ఇది దోహదం చేసిందని సంతోషించవచ్చు. కాని ఆందోళనకరమైనది ఏమంటే, మగపిల్లల వృద్ధిరేటు 2.42 శాతం తగ్గగా, ఆడపిల్లల వృద్ధిరేటు 3.80శాతం తగ్గింది. మొత్తం జనాభాలో స్త్రీల నిష్పత్తి ప్రతి వెయ్యిమంది పురుషులకు 940గా ఉన్నప్పటికీ, 0-6 వయోగ్రూపులో ఇది 914కు పడిపోయింది. అత్యంత అభివృద్ధిచెందిన రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యానాల్లో ఈ దామాషా వరుసగా 846; 830కు దిగజారింది. విద్యావంతులైన అబ్బాయిలు సరిజోడీని వెదుక్కోవటం ఇప్పటికే కష్టంగా ఉంది. బాలల లింగ నిష్పత్తిలో వ్యత్యాసం ఇలాగే కొనసాగితే పాతిక, ముప్పయి ఏళ్ళ తర్వాత వరకట్నం అడగటం మాని కన్యాశుల్కం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సామాజిక చైతన్యం ద్వారా నిర్మూలన కావాల్సిన వరకట్నం అమ్మాయిల కొరతవల్ల రూపుమాసినా మంచిదే! అయితే జనాభాలో స్త్రీ-పురుష వ్యత్యాసం అనేక సామాజిక పర్యవసానాలకు దారితీస్తుంది.మగసంతుపట్ల మోజును తగ్గించలేకపోయినా ఆడగుడ్డును గర్భంలోనే చిదిమేసే కిరాతకానికి వ్యతిరేకంగా ఆడైనా, మగైనా ఒకటేనన్న భావన కలిగించటానికి ప్రభుత్వం, ప్రజాసంఘాలు విశేషంగా కృషి చేయాల్సి వుంటుంది .ఆడపిల్లభారం అనే కాలంచెల్లిన ఆలోచనను మనిషి మస్థిష్కం నుండి తొలగించటానికై ప్రభుత్వం ఆడపిల్లలకు ఇతోధిక ప్రోత్సాహకాలు కల్పించటం ఇందుకోక మార్గం
మన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలను జనాభాలెక్కలు వెలుగులోకి తెచ్చాయి. జాతీయ జనాభా వృద్ధిరేటు (2001-2011) 17.64శాతం కాగా ఆంధ్రప్రదేశ్‌ వృద్ధిరేటు 11.10శాతం. 8,46,65,543 జనాభాతో ఐదవ స్థానంలో వున్న ఆంధ్రప్రదేశ్‌లో పురుషులు 4,25,09,881 కాగా స్త్రీలు 4,21,55,662. లింగ నిష్పత్తి 2001లో 978 కాగా ఇప్పుడు 992. జనాభా వృద్ధిరేటు రాష్ట్ర సగటుకన్నా 16 జిల్లాల్లో తక్కువ వుండటం విశేషం. అయితే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 48.15శాతం, మహబూబ్‌నగర్‌జిల్లాలో 15.03శాతం, కర్నూలుజిల్లాలో 14.65శాతం, మెదక్‌జిల్లాలో 13.55శాతం జనాభా వృద్ధిచెందింది. ఉపాధిని వెదుక్కుంటూ ఆంధ్ర, తెలంగాణా జిల్లాలనుండి ప్రజలు వలసరావటమే రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో అసాధారణంగా జనాభా వృద్ధిరేటుకు మూలం. అతి తక్కువ వృద్ధిరేటు పశ్చిమగోదావరిలో 3.45శాతం, విజయనగరంలో 4.16శాతం, హైదరాబాద్‌ రెవిన్యూజిల్లాలో 4.71శాతం నమోదైంది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో 11.89శాతం వృద్ధి నమోదుకాగా దక్షిణకోస్తాలోని నెల్లూరులో 11.5శాతం నమోదైంది. ఈ రెండు జిల్లాలు పారిశ్రామికంగా వృద్ధిచెందుతున్నందున వలసలవల్లనే జనాభా పెరిగింది.
అక్షరాస్యత గత దశాబ్ద కాలంలో 7.30శాతంపెరిగి 67.77శాతానికి చేరింది.జాతీయ సగటు 74శాతం కన్నా రాష్ట్రం ఎంతో వెనుకబడి ఉంది. అక్షరాస్యతవృద్ధిలో దశాబ్ద రాష్ట్ర సగటును మించిన జిల్లాలు సీమాంధ్రలో విజయనగరం (8.42శాతం), అనంతపురం (8.15), కర్నూలు (7.91), విశాఖపట్నం (7.74) మాత్రమేకాగా, తెలంగాణాలో అత్యధికంఉన్నాయి. అయితే రాష్ట్ర సగటు అక్షరాస్యత రేటు (67.77)ను చేరుకోని జిల్లాలు శ్రీకాకుళం (62.30), విజయనగరం (59.49), ప్రకాశం (63.53), కర్నూలు (61.13), అనంతపురం (64.28), అదిలాబాద్‌ (61.55), నిజామాబాద్‌ (62.25), కరీంనగర్‌ (64.87), మెదక్‌ (62.53), మహబూబ్‌నర్‌ (56.06), ఖమ్మం (65.46). రాష్ట్రం మొత్తం మీద పురుషుల్లో అక్షరాస్యత 75.56 కాగా స్త్రీలలో 59.74శాతం.
0-6 వయస్సుగల పిల్లల (జాతీయ) వృద్ధిశాతం 2001లోని 15.9శాతంనుండి 2011లో 13.1 శాతానికి తగ్గగా, మన రాష్ట్రంలో ఇదేకాలంలో 13.35 నుండి 10.21కి తగ్గింది. 2001లో ఈ వయోగ్రూపులో మగపిల్లల శాతం 13.46, ఆడపిల్లల శాతం 13.23 కాగా ఆ సంఖ్యలు 2011లో వరుసగా 10.46కు, 9.95కు తగ్గిపోయాయి.2001 సంఖ్యలతో పోల్చిచూస్తే మొత్తం జనాభాలో పిల్లలశాతం ఏ ఒక్క జిల్లాలోను పెరగకపోవటం గమనార్హం. కుటుంబ నియంత్రణలో ఎంతో పురోగతి సాధించిన ఆంధ్రప్రదేశ్‌ అక్షరాస్యతలో వెనుకబడివుందని జనాభాలెక్కలు తేల్చాయి.విశాలాంద్ర దిన పత్రిక సౌజన్యముతో