చెత్త వాగుడు

బొంకరా మల్లన్న అంటే మా ఊరి మిరియాలు తాటికాయలంత అని అన్నారట వెనకటికెవడో. సువిశాల భారతదేశానికి హోంమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా అదే రీతిగా మాట్లాడడం దేశానికి పట్టిన దౌర్బాగ్యం.
దేశ అంతర్గత భద్రతకు ప్రధాన ముప్పు మావోయిస్టులని ఒకవైపు ప్రధాని చెబుతుంటే ఆయన మంత్రివర్గంలోని మమతా బెనర్జీ ఆ మావోయిస్టులతోనే చెట్టపట్టాలేసుకుని సిపిఎం నాయకులపై హత్యాకాండ కొనసాగిస్తోంది. కానీ హోంమంత్రిగా వున్న చిదంబరం మమతను నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నారు. 149 మంది ప్రయాణీకుల దుర్మరణానికి కారణమైన జ్ఞానేశ్వరి రైలు ప్రమాదం మావోయిస్టుల జేబు సంస్థయిన పిసిపిఏ కుట్రేనని సిబిఐ నిగ్గుతేల్చింది. మావోయిస్టు, తృణమూల్‌ హింసాకాండకు జంగల్‌మహల్‌ ప్రాంతంలో 161 మంది ఆదివాసీలతో సహా 265 మంది సిపిఎం, వామపక్షాల కార్యకర్తలు, సానుభూతిపరులూ ప్రాణాలు కోల్పోయారు. ఆధారాలతో సహా వివరించినా పట్టించుకోని కేంద్ర హోంమంత్రి ఎన్నికల సభల్లో అవాస్తవాలు మాట్లాడుతున్నారు. అసత్య ఆరోపణలకు దిగుతున్నారు. పశ్చిమబెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి బాగోలేదని ఆయన ఆరోపించారు. ఆయన మంత్రిత్వశాఖకే చెందిన నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో నివేదిక ప్రకారం పది లక్షలకు పైగా జనాభా గల నగరాల్లో లక్ష మందికి జరిగే నేరాల సంఖ్య కొల్‌కతాలో అతి తక్కువగా 103 వుండగా ఏలిన వారి పాలనలోని ఢిల్లీ మహానగరంలో ఆ సంఖ్య 353.7గా వుంది. అలాగే ఐపిసి నేరాల రేటు జాతీయంగా 181.4 వుండగా అది బెంగాల్లో 126 మాత్రమే. అదే విధంగా బెంగాల్‌ విపరీతంగా అప్పుల పాలైందని ఆ పెద్దమనిషి చెప్పారు. వాస్తవంలో మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు రు.2.3 లక్షల కోట్లకు పైగా అప్పులుండగా బెంగాల్‌కు రెండు లక్షల కోట్లు కూడా లేవు. రు. 35 లక్షల కోట్ల అప్పుల కుప్పపై కూర్చున్న యుపిఏ ప్రభుత్వంలో కీలక శాఖను నిర్వహిస్తున్న చిదంబరం గురువింద తనకింద వున్న నలుపెరగనన్నట్లు మాట్లాడారు.
బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మన్మోహన్‌ కూడా స్థాయి మరిచి కువిమర్శలకు పాల్పడ్డారు. విద్య, వైద్య రంగాల గురించి తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదారి పట్టించాలని చూశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సెన్సస్‌ నివేదికల ప్రకారం బెంగాల్‌ అక్షరాస్యత 77శాతం కాగా జాతీయ అక్షరాస్యత 74 శాతం మాత్రమే. మహిళల అక్షరాస్యత బెంగాల్లో 71.2 శాతం కాగా జాతీయ సగటు కేవలం 65.4 శాతం మాత్రమే. వైద్య రంగంలో కూడా దేశంలో 2105 మంది జనాభాకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక పడక చొప్పున ఉండగా బెంగాల్లో 1605 మంది జనాభాకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పడక అందుబాటులో వుంది. ఇవేవీ ప్రధానికి తెలియక మాట్లాడారని అనుకోలేము. అవినీతి బురదలో పడిదొర్లుతోంది యుపిఏ ప్రభుత్వం. ఇన్ని కుంభకోణాలు, ఇన్ని లక్షల కోట్ల బొక్కుడు ఏ ప్రభుత్వంలోనూ లేదు. తన మంత్రివర్గ సహచరుడైన రాజాను 2జి స్కామ్‌లో అరెస్టు చేశాక 'సంకీర్ణ రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులుంటాయి' అని సిగ్గు విడిచి చెప్పిన పెద్దమనిషి ఆయన. దేశంలోనే ఆదర్శవంతంగా సంకీర్ణ పాలన సాగిస్తున్న పశ్చిమ బెంగాల్‌ వామపక్ష ప్రభుత్వంలోని ఏ ఒక్క మంత్రి అవినీతి ఆరోపణలపై అరెస్టు కాదు కదా కనీసం ఆరోపణ కూడా లేదన్న విషయం జగద్విదితం. బెంగాల్‌కి లేని సంకీర్ణ సంకటం మన్మోహన్‌కు ఎందుకో? శాంతి భద్రతలపై విమర్శిస్తున్న హోంమంత్రి తన కేబినెట్‌ సహచరుడు ముకుల్‌రారు పుత్రరత్నం, తృణమూల్‌ అభ్యర్థి అయిన శుభ్రంసురారు ఎన్నికల సంఘం ప్రతినిధులపై దాడి చేసిన విషయం మరిచిపోయారా? నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యాక ఆ ప్రబుద్ధుడిని మమతా బెనర్జీ పాల్గొన్న సభలోనే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలియదా? మావోయిస్టుల మొదలు ఇలాంటి నేరస్తులందరితో జట్టుకట్టి మేరునగం లాంటి వామపక్ష కూటమిని ఎదుర్కొంటోంది. యుపిఏ కూటమిలో రెండో పెద్దపార్టీగా వున్న టిఎంసీని సంతృప్తి పరచడం కోసం కాంగ్రెస్‌ స్థాయి మరిచి దిగజారిపోతోంది. గతంలో రాజీవ్‌గాంధీ మొదలు ఇటీవల వారి 'యువరాజు' రాహుల్‌ వరకూ ఇలాంటి ప్రేలాపనలకు పోయి భంగపడిన విషయం లోకానికి తెలుసు.
దేశంలోనే ఆదర్శవంతంగా భూ సంస్కరణలను, పంచాయతీరాజ్‌ పాలనను పారిశ్రామిక శాంతిని సాధించడంలో బెంగాల్‌ వామపక్ష ప్రభుత్వం ముందుంది. దేశమంతటా పంచిన మిగులు భూమిలో 23 శాతం బెంగాల్లోనే పంపిణీ అయింది. 30.12 లక్షల కుటుంబాలు లబ్ధి పొందగా వారిలో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలే 70 శాతం మంది కావడం విశేషం. మన రాష్ట్ర వ్యవసాయ రంగంలో కీలక పాత్ర వహిస్తున్న కౌల్దార్లకు కనీసం బ్యాంకు రుణాలు పొందడానికి గుర్తింపు కార్డులను సైతం ఇక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వడం లేదు. కానీ బెంగాల్‌ ప్రభుత్వం 34 ఏళ్ల క్రిందటే కౌల్దార్లకు సాగు హక్కులను చట్టపరం చేసింది. ప్రజానుకూల పాలనలో అన్నింటా ముందున్న వామపక్ష పాలనకు మరో ప్రత్యామ్నాయం లేదు. యుపిఏ-1 ప్రభుత్వం ప్రజల నడ్డివిరిచే భారాలను వేయ ప్రయత్నిస్తే ప్రతిఘటించడం మొదలు వినాశకరమైన భారత్‌ - అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకించడం వరకూ వామపక్షాలు నికరంగా ప్రజల పక్షాన నిలిచాయి. ఇది గిట్టని భారత పాలక వర్గాల మొదలు అమెరికన్‌ సామ్రాజ్యవాదుల వరకూ వామపక్షాలపై అందునా సిపిఎంపై కత్తికట్టారు. 'మమతను మచ్చిక చేసుకోవాలని' కొల్‌కతా కాన్సలేట్‌ నుంచి వాషింగ్టన్‌కు దౌత్య నివేదికలు పంపినట్లు వికీలీక్స్‌ వెల్లడించడంతో ఇది మరింతగా నిర్ధారణయింది. అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికే ఆ దేశమంటే అపర భక్తిని ప్రదర్శించే చిదంబరం అవాకులు చెవాకులు పేలారు. ఇంతకు ముందు 'నౌ ఆర్‌ నెవ్వర్‌' అంటే బెంగాల్‌ ప్రజలు శృంగభంగం చేశారు. ఇపుడూ కాంగ్రెస్‌ నేతలు సంధి ప్రేలాపనలు చేస్తున్నారు. వాటిని విజ్ఞులైన బెంగాల్‌ ప్రజలు తిరస్కరిస్తారు.ప్రజా శక్తీ దిన పత్రిక సౌజన్యముతో 

సంసారం ఓ సంగీతం

ఆఫీసునుండి వచ్చి రాధను చూడగానే సుధీర్‌కు చిరాకెత్తుకొచ్చింది. ఎదురొచ్చి మంచినీళ్లిచ్చి లోపలికెళ్లింది రాధ. వచ్చి టిఫిన్‌, టీ ఇచ్చింది. అయినా అతని మొహంలో పేలాలు పేలుతూనే ఉన్నాయి. కారణమేంటో అర్థంకాని రాధ ఆఫీసులో ఏదైనా గొడవైందేమో అనుకుంది. అడిగితే సమాధానం చెప్పే స్థితిలో భర్త ఉండకపోవడంతో తన పని తాను చేసుకుంటూ పోతోంది. కానీ భర్త కోపానికి తానే కారణమని ఆమె అనుకోలేదు. భోజనాల సమయంలోనూ అదే చిరాకు చూపించేసరికి ఇక ఉండబట్టలేని రాధ భర్తను కారణమడిగింది. అతను చెప్పిన కారణం విన్న రాధకు నవ్వొచ్చింది. కానీ నవ్వితే సుధీర్‌కు మరింత కోపం వస్తుందని ఊరుకుంది. అతను అన్నదేంటంటే, ''ఆఫీసులో పడ్డ శ్రమంతా నిన్ను చూసి మర్చిపోదామని నేననుకుంటాను. కానీ నేను వచ్చేసరికి ఎప్పుడూ నువ్వు జిడ్డు మొహంతో కనిపిస్తుంటావు. ఎదురింటి శ్యామల చూడు ఎప్పుడు చూసినా మడత నలగని కాటన్‌ చీరలు కట్టుకుని కడిగిన ముత్యంలా ఉంటుంది. నువ్వు కూడా అలాగే ఉండొచ్చుగా'' అంటున్న భర్తవంక నిశితంగా చూసింది రాధ.

''ఇద్దరు చంటిపిల్లలు, వచ్చే పోయే బంధువులు. పనమ్మాయి ఒకరోజు వస్తే రెండ్రోజులు రాదు. వాషింగ్‌మిషన్‌ కొందామని అనుకుంటున్నా బడ్జెట్‌లోటువల్ల కుదరడంలేదని మీకూ తెలుసు. మీకా పొద్దున్న వండిన కూరలు రాత్రి తినడం ఇష్టముండదు. సాయంత్రం వచ్చేసరికి టిఫిన్‌ కంపల్సరీ. వీటన్నింటిమధ్యా నేను మీరొచ్చేసరికి సింగారించుకుని ఎదురుచూడటం ఎంతవరకూ సాధ్యమో ఓసారి ఆలోచించండి. అయినా మీ చీవాట్లు నేను భరిస్తాను. కానీ మీకు ఇతరులతో పోల్చడం మాత్రం ఒప్పుకోను. ఎదురింటి శ్యామలకు ఇంకా పిల్లలు లేరు. ఈ ఊళ్లో బంధువులే లేరు. అన్నీ చేయడానికి వాళ్లాయన ఓ అమ్మాయిని ఇంట్లోనే ఉంచాడు. వారాంతాలు థియేటర్లో సినిమా, హోటల్‌ భోజనం తప్ప ఇంట్లోనే అసలు వుండరు. ఇక శ్యామల ఎప్పుడు చూసినా తాజా పువ్వులా ఉంటుందంటే ఉంటుంది మరి! అయినా తన విషయం నాకు అనవసరం.

కానీ, మీరు నన్ను ఆమెతో పోల్చడమేంటి? వాళ్లాయన తన భార్యకు కల్పిస్తున్న సౌకర్యాలన్నీ నాకూ కావాలని నేనెన్నడైనా మిమ్మల్ని అడిగానా? మీకంటే ఆయన గొప్పవాడని నేనెప్పుడైనా చెప్పానా? ఎవరి ఆర్థిక స్థోమత, ఓపికలను బట్టి వారి స్థితిగతులుంటాయి. అంతేగానీ, ఎదుటివాళ్లతో పోల్చుకోవడమేంటీ అసహ్యంగా!'' అంటూ భర్తను కడిగేసింది రాధ. ఎప్పుడూ మౌనంగా పనిచేసుకుపోయే తన భార్యలో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని సుధీర్‌ ఏమాత్రం ఊహించలేదు. ఇప్పుడు ఒక్కసారి లావా పెల్లుబికినట్లు మాట్లాడేస్తున్న రాధను చూసి ఒక్కసారిగా బిత్తరపోయాడు సుధీర్‌. తర్వాత రాధ మాట్లాడిన మాటల్లో సత్యంపాళ్లే ఎక్కువని గ్రహించుకున్నాడు.

''అయాం సారీరా! ఈ కోణంలో నేనెన్నడూ ఆలోచించలేదు. ఇప్పుడర్థం అవుతోంది నేనెంత తెలివితక్కువగా ఆలోచించానో. ఇప్పట్నించి నావంతు సాయం నేను నీకందిస్తాను. తప్పితే ఇంటి భారమంతా నీపైనే వేయను. ఇంకా ఏమేం సర్దుబాట్లు చేసుకోవాలో చెప్పు. మరో ఆలోచనలేకుండా పాటిస్తాను'' అంటున్న భర్తను చూసి నిండుగా నవ్వింది రాధ. ఆ నవ్వులు సుధీర్‌ గుండెల్లో పువ్వులు పూయించాయని వేరే చెప్పాలా?!ప్రజా శక్తీ సౌజన్యముతో 

శ్రీలంక అంతర్యుద్ధానికి అక్షర రూపం శోభా శక్తి ‘గొరిల్లా’

శ్రీలంక అంతర్యుద్ధానికి అక్షర రూపం శోభా శక్తి ‘గొరిల్లా’
ramthertha-phoపదిహేనేళ్ళకే చేత తుపాకి ధరించి, ఇరవై ఏళ్ళకే శరణార్ధిగా తన మాతృదేశం విడిచిపెట్టి, తర్వాతి జీవనాన్ని భిన్న భిన్న దేశాలలో కాందిశీకుడుగా కూలి పనులు చేసుకుంటూ, తన మాతృభాష తప్ప మరే భాషా రాని ఒక వ్యక్తిని ఊహించండి. ఇటువంటి వ్యక్తి రచయిత అయ్యే అవకాశం ఉందని ఊహించడం దాదాపు అసాధ్యం. కానీ వర్తమాన జీవన సంక్షోభం ఎంతటిదీ అంటే అది రాళ్ళనుంచి రత్నాలను తయారు చేస్తుంది. అంతర్యుద్ధం బారిన పడి దశాబ్దాలుగా కకావికలైపోయిన ఉత్తర శ్రీలంక ప్రాంతం, అక్కడి ఇటీవలి జీవితం కథావస్తువుగా వచ్చిందీ నవలిక. అసలు శ్రీలంక కవి ఎల్‌.టి.టి.ఇ. ఉద్యమ సంబంధిత సాహిత్యం, కొంత కవిత్వం మినహాయిస్తే దాదాపుగా తక్కువనే చెప్పాలి. దీనికి కారణం అత్యధిక శాతం ఉత్తర శ్రీలంకలో నివసించే తమిళులు (జాఫ్నా), తమ భాష తప్ప వేరే భాషలేవీ తెలిసినవారు, చదువుకున్నవారు కాకపోవడం.

ఈ నవలిక రచయిత- రాసిన కాలానికి 32 ఏళ్ళ వయస్కుడు. ఏంథోనీ జేసుదాస్‌గా పుట్టి, రాకీ రాజ్‌గా తన కథ చెప్పి, శోభాశక్తి పేరిట రచయితగా గుర్తింపు పొందినవాడు. ప్రస్తుతం నలభై ఏళ్ళ వయసు. ‘గొరిల్లా’ పేరిట శోభాశక్తి తమిళంలో రాసిన నవలను 2008లో అనసూయా శివనారాయణ్‌ ఆంగ్లంలోకి అనువదించడా భారతీయ ప్రచురణ సంస్థ రాండమ్‌ హౌస్‌ దీని ప్రచురించింది. ఈ నవల కథా ప్రాంతం ఉత్తర శ్రీలంకలో, జాఫ్నాకు దూరంగా ఉండే ఒక మారు మూల బెసత్త పల్లె. వేర్పాటు వాద సాయుధోద్యమ ప్రకంపనల ధాటికి ఇక్కడి దళిత ప్రజలు అస్తవ్యస్తమవుతుంటారు.

నవలిక ఆరంభం ఫ్రాన్స్‌ దేశంలో. అక్కడ ఒకప్పటి బాల సైనికుడయిన రాకీ రాజ్‌, ఫ్రాన్స్‌ దేశపు హోం శాఖ అధికారులతో ఫ్రాన్స్‌ దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో వారి పరిశీలనకు- ప్రశ్నలకు జవాబులు చెప్తూ తన సైనిక జీవిత వివరాలను దాచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శ్రీలంకకు చెందిన తమిళ సాయుధ పోరాట నేపథ్యం గలవారికి యూరప్‌ దేశాల పౌరసత్వం లభించడం కష్టం. సర్వర్‌గా, అంట్లు తోమేవాడిగా, తోటమాలిగా చిన్నా చితకా పనులు చేస్తూ, దేశం కాని దేశంలో వారి వివక్షను ఎదుర్కొంటూ జీవించాల్సిన దురవస్థ ఎంతో మంది సాధారణ శ్రీలంక తమిళులకు ప్రాప్తించింది. ఈ పేద కుటుంబాలు అంతర్యుద్ధంలోని ఇరు వర్గాల మధ్య చిక్కుకుని ఎలా కడగండ్ల పాలయ్యాయో - శోభాశక్తి తన కుటుంబం గురించి చెప్పిన మాటల్లో తెలుసుకోగలం.

‘మా అమ్మా, నాన్నా భారత దేశంలో శరణార్ధులుగా ఉన్నారు. మా గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు అదొక నావికా స్థావరంగా మారిపోయింది. ఏమీ మిగల్లేదక్కడ. మా సోదరుడు, సోదరి యూరప్‌లో ఉన్నారు. నేను మా సోదరితో కలిసి జీవిస్తున్నాను’ అని ఈ యువ రచయిత చెప్పిన జీవన విషాదం ఒక తరం శ్రీలంక తమిళ ప్రజల్ని చిందర వందర చేసిన జాతి అస్తిత్వ విద్వేష సర్ప విషం.

gorillaఇంతకీ గొరిల్లా అని పిలిచే దురుసువాడు ఈ రచయిత తండ్రే. నవలిక ఎటువంటి నాజూకుదనాలు, సాహిత్య మర్యాదలు, సౌందర్య దృక్పథాలు పాటించదు. ఇదొక పదిహేనేళ్ళ పిల్లవాడి మాటల్లో చిత్రితమైన కథ. ఆత్మకథ (ఆటో బయోగ్రఫీ) అనుకుంటే కొద్ది పాటిగా వేరు పేర్లూ, స్థలాలూ వాడిన శోభా శక్తి ఈ రచనా ధోరణిని ‘ఆటో ఫిక్షన్‌’ అని అన్నాడు. ‘స్వీయ కల్పన’ అనవచ్చునేమో తెలుగులో.

నవలిక అంతటా అలుముకుని ఉంటుంది అకారణ క్రౌర్యం. రాకీ రాజ్‌ (కథలో శోభా శక్తి) తండ్రి తన కుటుంబం వారితో, ఇరుగు పొరుగు వారితో క్రూరంగా ప్రవర్తిస్తుంటాడు. తన సైనికులుగా చేర్చుకున్న తరుణ వయస్కుల పట్ల ఎల్‌.టి.టి.ఇ. ఈ క్రూర నియమావళిని అమలు పరుస్తుంటుంది. శ్రీలంక సైన్యం, వారి తమిళ మద్దతుదారులు తీవ్రవాద సైనికోద్యమం పట్ల క్రూరంగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. చట్ట వ్యతిరేక శరణార్ధులుగా తమ దేశంలో నివాసం ఏర్పరచుకో చూస్తున్న శ్రీలంక తమిళుల పట్ల ఫ్రాన్స్‌ దేశ ప్రభుత్వ సంస్థలు నిర్దయతో వ్యవహరిస్తుంటాయి. ఈ నవలిక ఒక క్రూరత్వ వర్తులంలో, కటువైన వాతావరణాన్ని ఉన్నది ఉన్నట్టుగా చిత్రించడంలో కృతకృత్యత సాధిస్తుంది.

‘గొరిల్లా’ నవలికలో ప్రతి అయిదారు పేజీలకు అధో సూచికల్లో కొన్ని పేర్లు శోభా శక్తి ప్రస్తావిస్తాడు. వీరంతా సాయుధ సైనికోద్యమ క్యాడర్‌గా అంతర్యుద్ధంలో ఆహుతైపోయిన పేద, దళిత తమిళ యువకులే. గొరిల్లా నవల ఒక బతుకు గాయాల మూట. పట్టు తప్పిన సామాజిక కార్యాచరణ వలన నెత్తురోడిన ఉదంతపు విషాద వివరణ. ఎల్‌.టి.టి.ఇ. వర్గాలు తమకు ఎదురు తిరిగిన వారిని, వ్యతిరేకించిన వారిని ఎటువంటి శిక్షలకు గురిచేస్తాయో వాటిని శోభా శక్తి సైతం, తన యువ మిత్రులతో బాటుగా ఒక నిర్బంధ శిబిరంలో అనుభవించాల్సి వస్తుంది. తను ఏ తప్పూ చేయకుండానే ఇటుంటి వికృత, విపరీత అనుభవానికి గురి కావడం శోభ శక్తి కళ్ళు తెరిపిస్తుంది.

ఇంతకీ వారు చేసిన నేరమల్లా ఏమిటంటే, ఎల్‌.టి.టి.ఇ. సాయుధ క్యేడర్‌గా ఉంటూ, తమ గ్రామ శివార్లలోని నది ఇసుక దొంగిలించి పట్టుకుపోయి లాభసాటి వ్యాపారం చేస్తున్న ఒక ఎల్‌.టి.టి.ఇ. ఛోటా నాయకుణ్ణి అడ్డుకోవడం. ఈ శిక్షలు ఇంతటితో ఆగక, వీరు తమిళుల తీవ్రవాద ఉద్యమం గురించి, శ్రీలంక సైన్యానికి వివరాలు అందజేస్తున్నారన్న అనుమానంతో పదే పదే నిర్బంధించడం, నిఘాలో ఉంచడం, వెన్నాడి పట్టుకోవడం వంటి గొలుసు చర్యలకు కొంతకాలం గురయ్యాక, ఇక మిగిలిన మార్గం దేశాంతరం వెళ్ళిపోవడమే అని రహస్యంగా పడవలపై, హెచ్చు డబ్బు చెల్లించి భారత దేశ తీరం చేరడంతో ఒక ముఖ్య ఘట్టం ముగుస్తుంది.

ఫ్రాన్స్‌ ఎలా చేరిందీ కథ అంత వివరాలివ్వదు కానీ, అక్కడ అధికారులు వీరి పౌరసత్వపు దరఖాస్తులను నిశితంగా, తీవ్రంగా పరిశీలిస్తుంటారు. ఎలాగయినా తిరస్కరించాలన్నది వారి లక్ష్యం. సాధారణ పౌరులా, లేక ఎల్‌.టి.టి.ఇ.తో సంబంధం గలవారా అన్నది కీలకాంశం. వీరి తగువులు యూరప్‌ దేశాలలోనూ కొనసాగుతుంటాయి. గొరిల్లా నవల ఆరంభపేజీల్లోనే ఇందిరా గాంధీ హత్య ప్రస్తావితం అవుతుంద. సాక్షాత్తూ దుర్గ అవతారం వంటి ఇందిరా గాంధీ బతికి ఉంటే శ్రీలంక తమిళులకు సత్వర న్యాయం జరిగి ఉండేది అన్నది ఆ శ్రీలంకలోని తమిళ ప్రజల మనోగతం. చరిత్ర ఎటువంటి విరుద్ధ అంశాలతో నిండి ఉంటుందంటే, అది తమిళుల తీవ్రవాద సంస్థ.

తమ కార్యాచరణకు గండి కొట్టేలా ఎక్కడ తిరిగి మళ్ళా ఐ.పి.కె.ఎఫ్‌.ను ప్రయోగించే నిర్ణయం తీసుకుంటారో అన్న భయంతో, ఏ ఇందిరా గాంధీ అయితే బతికి ఉంటే బాగుండును అని తలిచారో, అదే ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్‌ గాంధీని హత్య చేసి, ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కరడు కట్టిన టెర్రరిస్టు సంస్థగా పేరు తెచ్చుకుంది. సామరస్య ధోరణి, మితవాదం మొదట్నుంచీ తమిళ వేర్పాటు ఉద్యమంతో అంతర్భాగాలుగానే ఉన్నా, అటువంటి సామరస్య భావజాలం గల నాయకుల్నీ, రాజకీయ పక్షాల్నీ పూర్తిగా నిర్మూలించి తానే ఏకైక శ్రీలంక తమిళుల ప్రజల ప్రతినిధి సంస్థగా పెద్ద ఎత్తున హింసకు దారితీసింది ఎల్‌.టి.టి.ఇ. ఒక పల్లెటూరి జీవితం ప్రమాణంగా, తొలుత సింహళీయుల వివక్ష కొద్ది మేరకు ఉన్నా, ఇప్పుడీ తీవ్రవాద చర్యల వల్ల మొత్తం ఉత్తర శ్రీలంక తమిళులందరూ ఎలా శ్రీలంక సైన్యం, ప్రపంచవ్యాప్త తీవ్రవాద వ్యతిరేక సంస్థల నిఘా నేత్రంలో చిక్కుకున్నారో, ఎలా మద గజాల మధ్య చిక్కిన మేకపిల్లలైపోయారో కొంతైనా చెప్పే ప్రయత్నం చేశాడు శోభా శక్తి ఈ నవలికలో.

ప్రజాస్వామిక పద్ధతులపై విశ్వాసం ఒక ప్రాపంచిక సంస్కృతి. జులుం, అణచివేత, హింసాత్మక ప్రతిఘటన- తమ ప్రభావాన్ని ఆ మేరకు తప్పనిసరిగా సమాజంపై కలిగిస్తాయి. శాంతియుత పద్ధతులపై నమ్మకం గల పాత్ర ‘లొక్కా’ రాకీ రాజ్‌కు ఫ్రాన్స్‌లో తారసపడుతుంది. ఆయనా శ్రీలంక తమిళుడే. నవలలో గాంధీ, మండేలా పంథా కార్యాచరణ సైతం చర్చకు వస్తుంది. ‘లొక్కా’ అంటాడొక చోట ‘మనం అభిప్రాయాల్ని అభిప్రాయాలతో ఎదుర్కోవాలి తప్ప, పిడి గుద్దులతో కాదు’.

తన శాంతియుత పద్ధతుల సమర్ధనకు, దేశం కాని దేశంలో, తోటి తమిళుల చేతిలో లొక్కా హత్యకు గురికావడం కథలో చివరి ఘట్టం. ఈ నవలిక రాస్తున్న కాలంలో తాను ఎంతో ప్రాణభయంతో ఉన్నానని తెలిపాడు శోభా శక్తి. తమిళంలో ఈ నవల చదివి, అనువాదకురాలు తాను ఆంగ్లంలోకి అనువదిస్తానని ఇంగ్లీష్‌లో ఇ-మెయిల్‌ పంపుతే అందుకు శోభా శక్తి జవాబుగా- ఇంగ్లీష్‌ రాదు, కేవలం తమిళం’ అని తన ఫోన్‌ నెంబర్‌ ఇచ్చాడు.

rama-therthaశ్రీలంకలోని కుంజన్‌ ఫీల్డ్స్‌ గ్రామం, పరిసరాలు, జాఫ్నా నగరం, అంతర్యుద్ధ కాలపు ఆందోళనలు, ఒక అనధికార యుద్ధ కాలపు అస్తవ్యస్థ సమాజం, బాంబుల బెల్టులు కట్టుకున్న యువతులు, చదువులేని యువతరం, దొంగ సారా వ్యాపారులు, నయవంచక పోలీసులు, హంతకులు, వేశ్యలు, రైతులు, అమాయకులు- ఇందర్నీ గాఢమైన నైరూప్య ఛాయల్లో చూపే అక్షర వర్ణ చిత్రం- గొరిల్లా నవలిక. దీని పఠనానుభవం ఇవాల్టి జీవితాల సూటి పరిచయాన్ని పాఠకులకు అందిస్తుంది. హింసాత్మక వర్తులంలో చిక్కుకునే ఏ సమాజానికైనా- ఉద్యమ లక్ష్యాలు ఎంతటివైనా- ఏం జరుగుతుందో అన్నదానికి ‘గొరిల్లా’ ఒక అనివార్యమైన, కరకు ఉదాహరణ.

బడుగుల చదువులకు వయో పరిమితా ?

studentsహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: వయోజన పాఠ శాలలు పెట్టి వృద్ధులను సైతం విద్యావంతులను చేసిన ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థులకు వయోఃపరి మితి విధించే దిశగా అడుగులు వేయడంపట్లు బడుగులు మండిపడుతున్నారు. ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’... అంటూ గోడ మీదరాతలు రాయించి గ్రామీణ మహిళలను విద్యావంతులను చేసేందుకు కృషి చేసిన ప్రభుత్వం ఇప్పుడు చదువుకునేందుకు ముందుకు వస్తున్న బడుగులపై ఎందుకు బండలు వేస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు.

బడుగు విద్యార్థులకు వయోఃపరిమితి నిర్ణయిం చి ఆ వయస్సు దాటిన వారికి ఫీజులు, ఉపకార వేతనాలు చెల్లించేది లేదనే నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోంటే, ఇటు బడుగు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఎపిపిఎస్సీ విధి విధానాల ప్రకారం ఉద్యోగ అర్హత కు వయోఃపరిమితిలో ఏ విధమైన నిబంధనల ఉన్నాయో వాటిని విద్యా సంస్థల్లో కూడా అనుసరిం చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది. ఈ నేపథ్యంలో ఓసీ, బీసీ తదితరుల వయోః పరిమితి 34 సంవత్సరాలుగాను, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో ఐదు సంవత్సరాలు రిలాక్సెషన్‌ ఇవ్వనుంది. ఈ విధానం వచ్చే విద్యా సంవత్సరం నుండి అమ లు చేయాలని ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది.

table-ageఇదే జరిగితే రాష్ర్ట వ్యాప్తంగా 62 వేలమంది విద్యార్థులకు పైగా వేటుపడే అవకాశం ఉంది. అయితే ఫీజుల విషయంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థు లతో సమానంగా చెల్లింపులు చేస్తున్న ప్రభుత్వం వయోఃపరిమితి విషయానికి వచ్చేసరికి ఎందుకు తేడా చూపుతున్నారని బడుగు విద్యార్థులు ప్రశ్నిస్తు న్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మాదిరిగానే తమకూ 39సంవత్సరాల వయోఃపరిమితిని కొనసాగించా లని కోరుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ దుర్వి నియోగం అవుతున్న కారణంగానే ఈ నిర్ణయం చేయాల్సి వస్తోందని ప్రభ్తుత్వం సమర్ధించుకోవ టాన్ని బడుగు విద్యార్థులు తప్పుపడుతున్నారు. ఉన్నతవిద్య అభ్యసించడం ద్వారా ప్రైవేటు సంస్థల్లో కూడా ఉపాథి పొందే అవకాశం ఉంది కనుక ఎసీసీ ఎస్సీ నిబంధనలతో ఏవిధంగా లింకు పెడతారని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఉపాథి చూపట్లే దనీ కనీసం ఉపాథి చూపై కంపెనీలలో చేరే అవకా శాలకు ఎందుకు గండికొడతారని ప్రశ్నిస్తున్నారు.

2010-11 విద్యా సంవత్సరానికి సంబంధించి 70 సంవత్సనాలకు పైబడిన వారు 51మంది పీజీ కోర్సులు చేస్తున్నారనీ, 60నుండి 70 మధ్య వయ స్కులు 20మంది ఉన్నారనీ... గణాంకాలు చూపి అందరిపై వేటు వేసే ప్రయత్నం సరైన నిర్ణయం కాదని బడుగులు ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా ఎదుగుతలలేని బడుగులు ఉన్నత చదువులు చదవాలంటే కచ్చితంగా ఫీజులు, ఉపకారవేతనాలు చెల్లిస్తున్న విధంగానే వయోపరిమితి విధించడం సరికాదంటున్నారు. అయితే ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోని పక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.

అన్ని కోణాల్లోంచి పరిశీలించాలి

లోక్‌పాల్‌ కమిటీ కో-చైర్మన్‌గా ఉన్న శాంతి భూషణ్‌, సభ్యుడిగా ఉన్న ఆయన కుమారుడు ప్రశాంత్‌ భూషణ్‌లపై అవినీతి ఆరోపణలు రేపిన దుమారం మధ్య నూతన లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదా రూపకల్పనా కమిటీ తొలి సమావేశం నిర్వహించింది. మురార్జీ దేశారు ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసి, ఆ తరువాత బిజెపిలో చేరి, అటు పిమ్మట అవినీతిపై పోరాట యోధుల అవతారమెత్తిన శాంతి భూషణ్‌, ఆయన తనయుడు ఇప్పుడు తామే అవినీతి ఆరోపణల రొచ్చులో కూరుకుపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. కోర్టులో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విషయమై సమాజ్‌ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌తో శాంతి భూషణ్‌ ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఈ కేసు నుంచి ఒక ఎస్‌పి నాయకుణ్ణి గట్టెక్కించేందుకు న్యాయమూర్తికి లంచమివ్వాలని సూచించినట్లు, ఈ విషయంలో తన కుమారుడు ప్రశాంత్‌ భూషణ్‌ సహకరిస్తాడని కూడా చెప్పినట్లు ఆ సీడీలు వెల్లడించాయి. సమర్థవంతమైన లోక్‌పాల్‌ బిల్లును అడ్డుకునేందుకే ఎవరో ఈ సీడీలు విడుదల చేశారని, ఇవి బోగస్‌ సీడీలని శాంతి భూషణ్‌ ఖండించినా, ములాయంతో మాట్లాడమని శాంతి భూషణ్‌కు ఫోన్‌ కలిపి ఇచ్చిన అమర్‌ సింగ్‌ మాత్రం దీనిని ఖండించేందుకు నిరాకరించారు. ఈ సీడీల వివాదానికి తోడు లోక్‌పాల్‌ బిల్లు ప్యానల్‌లోని ఇతర సభ్యులతోపాటు శాంతి భూషణ్‌ వెల్లడించిన ఆస్తుల వివరాలపై కూడా వివాదం రాజుకుంది. ఆయన తన ఆస్తుల విలువను తగ్గించి చూపారని కొందరు బాహాటంగానే విమర్శలకు చేస్తున్నారు. ఈ అవినీతి ఆరోపణల పరంపరతో శాంతి, ప్రశాంత్‌ భూషణ్‌ల ద్వయం ఆత్మ రక్షణలో పడింది. దీంట్లో నిజాల నిగ్గు తేలే వరకైనా ప్యానల్‌ నుంచి తప్పుకుంటే మంచిదని వారిపై ఒత్తిడి పెరుగుతోంది. అసలు ఈ తండ్రీ కొడుకులిద్దరినీ లోక్‌పాల్‌ బిల్లు ప్యానల్‌లోకి తీసుకోవాలని అన్నా హజారే సిఫారసు చేసినప్పటి నుంచే వివాదాలు కూడా మొదలయ్యాయి. ప్యానల్‌లోకి తండ్రీ కొడుకులను ఇద్దరినీ తీసుకోవడమేమిటని సొంత శిబిరం వారే కొందరు హజారేను ప్రశ్నించారు. ప్యానల్‌ ఎంపికలో పారదర్శకతకు పాతరేశారని విమర్శించారు. దీనిని తిప్పికొట్టేందుకు వారిద్దరూ నీతి నిజాయితీలకు మారు పేరని అన్నా హజారే స్వయంగా కితాబిచ్చాడు. అంతకు ముందు గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఇలాగే పొగిడారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి శాసన నిర్మాణ ప్రక్రియలో భాగస్వామి కావచ్చు కదా అని అడిగితే ఓటర్లు వంద రూపాయల నోటుకి, మద్యం సీసాకు అమ్ముడు పోతున్నారని జనంపై నింద మోపారు. ప్రజలెన్నుకున్న పార్లమెంటు, ప్రభుత్వాలు ఇన్ని ఉండగా, తాము సూచించిన విధంగానే చట్టం చేయాలని పట్టుబట్టడం, ఆ చట్టం ఎప్పట్లోగా తేవాలో కూడా గడువు నిర్దేశించడం ద్వారా హజారే ప్రజాస్వామ్య ప్రక్రియను హైజాక్‌ చేస్తున్నారని హరీష్‌ సాల్వే వంటి న్యాయకోవిదులు వ్యాఖ్యానించడం గమనార్హం. హజారే ఆశయం మంచిదే కావచ్చు, మార్గం కూడా ఉన్నతమైనదిగా వుండాలి. ఆ స్పృహే ఇక్కడ లోపించింది.
హజారే పేర్కొన్నట్లుగా ఓటర్లు అంత అజ్ఞానులే అయితే దేశ లౌకికవాదాన్ని మంటగలిపేందుకు మతతత్వ శక్తులు యత్నించినప్పుడు ఆ శక్తులకు వ్యతిరేకంగా తిరుగులేని తీర్పు ఎలా ఇవ్వగలిగారు? ఇందిరాగాంధీ ఎమర్జన్సీ పెట్టినందుకు ఆమె పార్టీని చిత్తుగా ఓడించింది ఈ ప్రజలు కాదా? 2004 ఎన్నికల్లో భారత్‌ వెలిగిపోతోందంటూ ఊదరగొట్టిన బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేకు ఎలాంటి పరాభవం జరిగిందో తెలీదా? ఆధునిక భారత దేశానికి పరీక్ష ఎదురైన ప్రతి సందర్భంలోనూ ప్రజలు లౌకికవాదం, ప్రజాస్వామ్యంవైపే నిలిచారు. ఇవన్నీ హజారే మరచిపోతే ఎలా? లోక్‌పాల్‌ బిల్లు ముసాయిదాను జూన్‌30 కల్లా ఖరారు చేయాలని, జులైలో జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చట్టంగా ఆమోదించాలని గడువు పెట్టడం ఏ తరహా ప్రజాస్వామ్యమో ఆయనే సెలవివ్వాలి. అదే సమయంలో హజారే ప్రతిపాదించిన జన లోక్‌పాల్‌ బిల్లులో తీసుకోదగిన కొన్ని ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిని తీసుకుంటూనే దీనిపై ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలి. ఇందుకు కొంత సమయం పట్టవచ్చు. అంతవరకు ఓపిక పట్టాలి. 1969లో మొరార్జీదేశారు నేతృత్వంలోని పాలనా సంస్కరణల కమిటీ తొలిసారి లోక్‌పాల్‌ బిల్లును తెచ్చింది మొదలు ఇప్పటివరకు తొమ్మిది సార్లు ఈ బిల్లు పార్లమెంటు చుట్టు ప్రదక్షిణలు చేస్తూనే ఉంది. వామపక్షాలు పటిష్టమైన లోక్‌పాల్‌ బిల్లు కోసం మొదటి నుంచి పట్టుబడుతున్నాయి. 1996లో దేవెగౌడ సారథ్యంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు పెట్టిన షరతుల్లో లోక్‌పాల్‌ చట్టం ఒకటి. ఆ సందర్భంగా లోక్‌పాల్‌ పరిధిలోకి ప్రధాన మంత్రిని చేర్చాలా వద్దా అన్న చర్చ వచ్చినప్పుడు ప్రధానిని కచ్చితంగా చేర్చాల్సిందేనని వామపక్షాలు తేల్చి చెప్పాయి. అయితే ఆ ప్రభుత్వం అంతర్గత బలహీనతల కారణంగా ఎక్కువ కాలం కొనసాగలేకపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. మళ్లీ 2004లో తొలి యుపిఏ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రాతిపదిక అయిన కనీస ఉమ్మడి కార్యక్రమంలో వామపక్షాల ఒత్తిడి మేరకు లోక్‌పాల్‌ తెస్తామని హామీ ఇచ్చింది. ఆమేరకు ఒక బిల్లును పార్లమెంటులో పెట్టింది. దానిని పరీశీలన నిమిత్తం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించారు. స్థాయీ సంఘం కొన్ని సిఫారసులు చేసింది. అయినా, అప్పటికీ అవి సంతృప్తికరంగా లేకపోవడంతో తగు మార్పులు చేర్పులు చేసి అర్థవంతమైన బిల్లు తేవాలని నిర్ణయించారు. ఈలోగా ఆ లోక్‌సభ రద్దయింది. లోక్‌పాల్‌ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు దీనిపై సమగ్రమైన చర్చ జరగాలి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం చట్టం తెచ్చే అధికారం పార్లమెంటుకే వుంది. కాబట్టి రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు, ఇలా అన్ని తరగతులతోనూ చర్చించి, అన్ని కోణాల నుంచి పరిశీలించి పటిష్టమైన బిల్లు తేవాలి.

ఉద్యోగులు, కార్మికులకు ఉరితాడు

  • జీవో నెం 177పై రౌండ్‌టేబుల్‌లో వక్తలు
  • వెంటనే ఉపసంహరించాలని డిమాండ్‌
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 177 జీఓ కార్మిక, ఉద్యోగ వర్గాలకు ఉరితాడు వంటిదని పలు కార్మిక సంఘాల నాయకులు విమర్శించారు. ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్న ఈ జీఓను తక్షణం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 11 నుంచి సమ్మె చేస్తున్న ఫీల్డు అసిస్టెంట్ల డిమాండ్లను ఆమోదించి, సమ్మెను నివారించాలని డిమాండ్‌ చేశారు. 'జీఓ నెంబర్‌ 177ను వెంటనే ఉపసంహరించుకోవాలి' అని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిఐటియు, ఎఐటియుసి రాష్ట్ర కమిటీల సంయుక్త ఆధ్వర్యాన వివిధ కార్మిక సంఘాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ సుధాభాస్కర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిజె చంద్రశేఖరరావు, కె విజయకుమార్‌ (బిఎమ్‌ఎస్‌), కె పోలారి (ఐఎఫ్‌టియు), కె సుధీర్‌ (ఎఐయుటియుసి), షమీమ్‌ బేగం (ఐఎన్‌టియుసి), వి గోపాల్‌రెడ్డి (ఛైర్మన్‌, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జెఎసి), ఎమ్‌ జనార్థన్‌రెడ్డి (చైర్మన్‌, ఎపి పబ్లిక్‌ సెక్టార్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌), టి సత్యనారాయణ (అధ్యక్షులు, సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ కాన్ఫెడరేషన్‌), ఎన్‌ ఆనందరావు (అధ్యక్షులు, ఎపి రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్‌), ఆర్‌ లకëయ్య (ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌), డి మురళీమోహన్‌ (కార్యదర్శి, ఎపి సెక్రటేరియట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌), ఎస్‌ నిర్మలాదేవి (ఎఎన్‌ఎమ్‌ల అసోసియేషన్‌), సత్యనారాయణ (ఎపిఎన్జీవోస్‌ నాయకులు, హైదరాబాద్‌ సిటీ), సామినేని రామారావు (ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం), టి రామకృష్ణ (ఉపాధ్యక్షులు, ఎపి రైతుసంఘం), ప్రసాద్‌ (డివైఎఫ్‌ఐ), ఎవి నాగేశ్వరరావు, భూపాల్‌, పాలడుగు భాస్కర్‌ (సిఐటియు), తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుధాభాస్కర్‌ మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఉద్యోగులు, కార్మికులు విజ్ఞాపన పత్రాలు సమర్పించినా వాటిని పట్టించుకోకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వం, దీనికి నిరసనగా వారు చేపట్టే ఆందోళనలు, పోరాటాలను అణగదొక్కేందుకే 177 జీఓను విడుదల చేసినట్లు విమర్శించారు. ఈ జీఓ కేవలం ప్రభుత్వశాఖల్లో పనిచేసే రెగ్యులర్‌ ఉద్యోగులకే పరిమితం కాదని చెప్పారు. ఈ జీఓను ఆసరాగా చేసుకొని ఆయా శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతోపాటు ఫిక్స్‌డ్‌ వేతనం, గౌరవ వేతనం, పారితోషికాలతో పనిచేసే వారిపై కూడా దాడి పెరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కూడా సమ్మె హక్కులేదంటూ ఈ జీఓలో పేర్కొనడం దారుణమని వ్యాఖ్యానించారు. పిజె చంద్రశేఖరరావు మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు ముందు వినయవిధేయతలు ప్రదర్శించే పనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీఓను తీసుకొచ్చిందని విమర్శించారు. నయా ఉదారవాద విధానాలను అమలుపరచడంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పూనుకుంటోందని విమర్శించారు. గోపాలరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులను కట్టు బానిసలుగా చేసుకునేందుకే ప్రభుత్వం ఈ జీఓను విడుదల చేసిందని అన్నారు. జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల ఆందోళనలు, పోరాటాలను అణచివేసేందుకు, వారిని ప్రజల నుంచి, ప్రజా ఉద్యమాల నుంచి వేరు చేసేందుకే ప్రభుత్వం 177 జీఓను విడుదల చేసిందన్నారు. రాజకీయంగా, పరిపాలనాపరంగా విఫలమైన ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ విధమైన చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఆర్‌ లకëయ్య మాట్లాడుతూ ఉద్యోగులు క్రమశిక్షణగా ఉండేందుకే ఈ జీఓను తెచ్చామంటూ ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న ప్రభుత్వానికి క్రమశిక్షణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఉద్యోగులను తన కాళ్ల కింద చెప్పుల్లాగా ఉంచేందుకే ఇలాంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటోందని చెప్పారు. 177 జీఓను ఉపసంహరించాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని కార్మిక సంఘాలూ కలిసి త్వరలోనే పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకుంటాయని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. రాష్ట్ర సదస్సు నిర్వహించాలని, అందులో తదుపరి ఆందోళనా కార్యక్రమాన్ని ప్రకటించాలను కూడా ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్ణయించింది.

ఘనంగా అంబేద్కర్‌ 121వ జయంతి

  • నివాళులర్పించిన రాజకీయ నేతలు
  • ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు వారికే ఖర్చు చేయాలని డిమాండ్‌
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 121వ జయంతి ఘనంగా జరిగింది. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని ఆయన విగ్రహనికి అన్ని రాజకీయ పార్టీల నేతలతోపాటు వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గురువారం ఉదయం 9.45 నిమిషాలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌చేసి పేదలకు పంచారు. నిరుపేద మహిళలకు చీరలను పంచిపెట్టారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పితాని సత్యనారాయణ, దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్‌, శంకర్రావు, సికింద్రాబాద్‌ ఎంపి అంజన్‌కుమార్‌ యాదవ్‌, గ్రేటర్‌హైదరాబాద్‌ మేయర్‌ బండ కార్తీకరెడ్డి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. టిడిపి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అంబేద్కర్‌కు పూలదండ వేసి నివాళులర్పించారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు, తీగల కృష్ణారెడ్డి కూడా ఉన్నారు. పిసిసి అధ్యక్షులు డి శ్రీనివాస్‌ నివాళులర్పించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆర్టీసి క్రాస్‌ రోడ్‌ నుండి లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వరకు సైకిల్‌ యాత్ర నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఆయనతోపాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి మధు, వై వెంకటేశ్వరరావు నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, పార్టీ నేత రామకృష్ణ నివాళులర్పించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ సబ్‌ప్లాన్‌లో దళితులకు కేటాయించిన నిధులను వారికే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్‌లో అవినీతి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను దళిత,గిరిజనులకే ఖర్చుచేయాలంటూ ఉద్యమం చేపడతామని చెప్పారు. లోక్‌సత్తా రాష్ట్ర ప్రధానకార్యదర్శి డివిఎస్‌ వర్మ, టిఆర్‌ఎస్‌ సీనియర్‌నేత నాయిని నర్సింహరెడ్డి, ప్రజారాజ్యం అధ్యక్షులు చిరంజీవి అంబేద్కర్‌కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. బిజెపి మాజీ జాతీయ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్‌, రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి, సీనియర్‌ నేతలు బండారు దత్తాత్రేయ, బద్దంబాల్‌రెడ్డి నివాళులర్పించారు. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎంఆర్‌పిఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అంబేద్కర్‌కు నివాళులర్పించి మాట్లాడుతూ దళితులను పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయనకు దండవేసి నివాళులర్పించే నైతిక హక్కు లేదన్నారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్‌) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఉపాధ్యక్షులు గంగాధర్‌, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) రాష్ట్ర కార్యదర్శి బాలకాశి, ఉపాధ్యక్షులు ప్రసాద్‌, భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షులు సూర్యారావు, ఉపాధ్యక్షులు మల్లేష్‌ నివాళుర్పించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత రాజ్‌ఠాకూర్‌ అంబేద్కర్‌, ఎస్‌ శ్రీనివాస్‌, ప్రకాష్‌రాజు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్‌ అధ్యక్షులు గద్దర్‌, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, తెలంగాణ ఎన్‌జివోల సంఘం నేతలు దేవిప్రసాద్‌, కృష్ణయాదవ్‌, గెజిటెడ్‌ ఉద్యోగుల నేత శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు నివాళులర్పించారు. అనంతరం కోదంరాం మాట్లాడుతూ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ స్పూర్తితో అందరూ ముందుకు వెళ్లాలన్నారు. చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ది సాధ్యమనే విషయాన్ని ఆయన ఆనాడే చెప్పారని గుర్తు చేశారు.