లోక్‌పాల్ కమిటీ కో-చైర్మన్‌గా ఉన్న శాంతి భూషణ్, సభ్యుడిగా ఉన్న ఆయన కుమారుడు ప్రశాంత్ భూషణ్‌లపై అవినీతి ఆరోపణలు రేపిన దుమారం మధ్య నూతన లోక్‌పాల్ బిల్లు ముసాయిదా రూపకల్పనా కమిటీ తొలి సమావేశం నిర్వహించింది. మురార్జీ దేశారు ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసి, ఆ తరువాత బిజెపిలో చేరి, అటు పిమ్మట అవినీతిపై పోరాట యోధుల అవతారమెత్తిన శాంతి భూషణ్, ఆయన తనయుడు ఇప్పుడు తామే అవినీతి ఆరోపణల రొచ్చులో కూరుకుపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. కోర్టులో దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విషయమై సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌తో శాంతి భూషణ్ ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ కేసు నుంచి ఒక ఎస్పి నాయకుణ్ణి గట్టెక్కించేందుకు న్యాయమూర్తికి లంచమివ్వాలని సూచించినట్లు, ఈ విషయంలో తన కుమారుడు ప్రశాంత్ భూషణ్ సహకరిస్తాడని కూడా చెప్పినట్లు ఆ సీడీలు వెల్లడించాయి. సమర్థవంతమైన లోక్‌పాల్ బిల్లును అడ్డుకునేందుకే ఎవరో ఈ సీడీలు విడుదల చేశారని, ఇవి బోగస్ సీడీలని శాంతి భూషణ్ ఖండించినా, ములాయంతో మాట్లాడమని శాంతి భూషణ్‌కు ఫోన్ కలిపి ఇచ్చిన అమర్ సింగ్ మాత్రం దీనిని ఖండించేందుకు నిరాకరించారు. ఈ సీడీల వివాదానికి తోడు లోక్‌పాల్ బిల్లు ప్యానల్లోని ఇతర సభ్యులతోపాటు శాంతి భూషణ్ వెల్లడించిన ఆస్తుల వివరాలపై కూడా వివాదం రాజుకుంది. ఆయన తన ఆస్తుల విలువను తగ్గించి చూపారని కొందరు బాహాటంగానే విమర్శలకు చేస్తున్నారు. ఈ అవినీతి ఆరోపణల పరంపరతో శాంతి, ప్రశాంత్ భూషణ్‌ల ద్వయం ఆత్మ రక్షణలో పడింది. దీంట్లో నిజాల నిగ్గు తేలే వరకైనా ప్యానల్ నుంచి తప్పుకుంటే మంచిదని వారిపై ఒత్తిడి పెరుగుతోంది. అసలు ఈ తండ్రీ కొడుకులిద్దరినీ లోక్‌పాల్ బిల్లు ప్యానల్లోకి తీసుకోవాలని అన్నా హజారే సిఫారసు చేసినప్పటి నుంచే వివాదాలు కూడా మొదలయ్యాయి. ప్యానల్లోకి తండ్రీ కొడుకులను ఇద్దరినీ తీసుకోవడమేమిటని సొంత శిబిరం వారే కొందరు హజారేను ప్రశ్నించారు. ప్యానల్ ఎంపికలో పారదర్శకతకు పాతరేశారని విమర్శించారు. దీనిని తిప్పికొట్టేందుకు వారిద్దరూ నీతి నిజాయితీలకు మారు పేరని అన్నా హజారే స్వయంగా కితాబిచ్చాడు. అంతకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఇలాగే పొగిడారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి శాసన నిర్మాణ ప్రక్రియలో భాగస్వామి కావచ్చు కదా అని అడిగితే ఓటర్లు వంద రూపాయల నోటుకి, మద్యం సీసాకు అమ్ముడు పోతున్నారని జనంపై నింద మోపారు. ప్రజలెన్నుకున్న పార్లమెంటు, ప్రభుత్వాలు ఇన్ని ఉండగా, తాము సూచించిన విధంగానే చట్టం చేయాలని పట్టుబట్టడం, ఆ చట్టం ఎప్పట్లోగా తేవాలో కూడా గడువు నిర్దేశించడం ద్వారా హజారే ప్రజాస్వామ్య ప్రక్రియను హైజాక్ చేస్తున్నారని హరీష్ సాల్వే వంటి న్యాయకోవిదులు వ్యాఖ్యానించడం గమనార్హం. హజారే ఆశయం మంచిదే కావచ్చు, మార్గం కూడా ఉన్నతమైనదిగా వుండాలి. ఆ స్పృహే ఇక్కడ లోపించింది.
హజారే పేర్కొన్నట్లుగా ఓటర్లు అంత అజ్ఞానులే అయితే దేశ లౌకికవాదాన్ని మంటగలిపేందుకు మతతత్వ శక్తులు యత్నించినప్పుడు ఆ శక్తులకు వ్యతిరేకంగా తిరుగులేని తీర్పు ఎలా ఇవ్వగలిగారు? ఇందిరాగాంధీ ఎమర్జన్సీ పెట్టినందుకు ఆమె పార్టీని చిత్తుగా ఓడించింది ఈ ప్రజలు కాదా? 2004 ఎన్నికల్లో భారత్ వెలిగిపోతోందంటూ ఊదరగొట్టిన బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేకు ఎలాంటి పరాభవం జరిగిందో తెలీదా? ఆధునిక భారత దేశానికి పరీక్ష ఎదురైన ప్రతి సందర్భంలోనూ ప్రజలు లౌకికవాదం, ప్రజాస్వామ్యంవైపే నిలిచారు. ఇవన్నీ హజారే మరచిపోతే ఎలా? లోక్‌పాల్ బిల్లు ముసాయిదాను జూన్30 కల్లా ఖరారు చేయాలని, జులైలో జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చట్టంగా ఆమోదించాలని గడువు పెట్టడం ఏ తరహా ప్రజాస్వామ్యమో ఆయనే సెలవివ్వాలి. అదే సమయంలో హజారే ప్రతిపాదించిన జన లోక్‌పాల్ బిల్లులో తీసుకోదగిన కొన్ని ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిని తీసుకుంటూనే దీనిపై ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలి. ఇందుకు కొంత సమయం పట్టవచ్చు. అంతవరకు ఓపిక పట్టాలి. 1969లో మొరార్జీదేశారు నేతృత్వంలోని పాలనా సంస్కరణల కమిటీ తొలిసారి లోక్‌పాల్ బిల్లును తెచ్చింది మొదలు ఇప్పటివరకు తొమ్మిది సార్లు ఈ బిల్లు పార్లమెంటు చుట్టు ప్రదక్షిణలు చేస్తూనే ఉంది. వామపక్షాలు పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు కోసం మొదటి నుంచి పట్టుబడుతున్నాయి. 1996లో దేవెగౌడ సారథ్యంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు పెట్టిన షరతుల్లో లోక్‌పాల్ చట్టం ఒకటి. ఆ సందర్భంగా లోక్‌పాల్ పరిధిలోకి ప్రధాన మంత్రిని చేర్చాలా వద్దా అన్న చర్చ వచ్చినప్పుడు ప్రధానిని కచ్చితంగా చేర్చాల్సిందేనని వామపక్షాలు తేల్చి చెప్పాయి. అయితే ఆ ప్రభుత్వం అంతర్గత బలహీనతల కారణంగా ఎక్కువ కాలం కొనసాగలేకపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. మళ్లీ 2004లో తొలి యుపిఏ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రాతిపదిక అయిన కనీస ఉమ్మడి కార్యక్రమంలో వామపక్షాల ఒత్తిడి మేరకు లోక్‌పాల్ తెస్తామని హామీ ఇచ్చింది. ఆమేరకు ఒక బిల్లును పార్లమెంటులో పెట్టింది. దానిని పరీశీలన నిమిత్తం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించారు. స్థాయీ సంఘం కొన్ని సిఫారసులు చేసింది. అయినా, అప్పటికీ అవి సంతృప్తికరంగా లేకపోవడంతో తగు మార్పులు చేర్పులు చేసి అర్థవంతమైన బిల్లు తేవాలని నిర్ణయించారు. ఈలోగా ఆ లోక్‌సభ రద్దయింది. లోక్‌పాల్ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు దీనిపై సమగ్రమైన చర్చ జరగాలి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం చట్టం తెచ్చే అధికారం పార్లమెంటుకే వుంది. కాబట్టి రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు, ఇలా అన్ని తరగతులతోనూ చర్చించి, అన్ని కోణాల నుంచి పరిశీలించి పటిష్టమైన బిల్లు తేవాలి.