ఆడపిల్లలను తల్లితండ్రులు సమానంగా పెంచాలి

రామన్నపేట (వి.వి): సమాజంలోని ఆడపిల్లలను అబ్బాయిలతో పాటు సమానంగా పెంచాలని నకిరేకల్‌ ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం రామన్నపేటలో ఐసిడిఎస్‌ కార్యాలయంలో బాలికల సంక్షరణ యోజన పథకం కింద మంజూరైన బాలికలకు చెక్కులు అందజేసి అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న బాలికల సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 18 సంవత్సరాల వరకు బాలికలను ఉన్నతమైన చదువులు చదివించి బాల్య వివాహాలకు ధూరంగా ఉంచాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. గ్రామాల్లో బాల్య వివాహాలపై అవగాహన పెంపొందించాలని, అందుకు ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులు, యువతి యువకులు, విద్యా వంతులు బాల్య వివాహాల నిలుపుదలకు కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపిపి నీలా దయాకర్‌, జెడ్పీటిసి నోముల పద్మామారయ్య. ఎంపిడిఓ ఇందుమతి, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధికారిణి మోతి, స్థానిక ఎంపిటిసి సాల్వేరు అశోక్‌, గర్దాసు పద్మ, ఐసిడిఎస్‌ సూఫర్‌వైజర్లు, యాదమ్మ, అంజమ్మ, పద్మావతి, అంగన్‌వాడీ కార్యకర్తలు. బాలికలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.ఈ సభలో 85 మంది బాలికలకు 30వేల రూపాయల చొప్పున, నలుగురు బాలికలకు లక్ష రూపాయల చొప్పున బాండ్లు అందజేయడం జరిగింది.
గ్రామ పంచాయితీ భవన నిర్మాణానికి చిరుమర్తి శంకుస్థాపన:
మండలంలోని సర్నేనిగూడెంలో నూతన గ్రామ పంచాయితీ భవన నిర్మాణానికి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద 10లక్షల రూపాయలు మంజూరు కాగా నిర్మాణ పనులకు శుక్రవారం నకిరేకల్‌ ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి నీలా దయాకర్‌, జెడ్పీటిసి నోముల పద్మామారయ్య, ఎంపిడిఓ ఇందుమతి, గ్రామ సర్పంచ్‌ రూపం లక్ష్మీమల్లయ్య, ఉప సర్పంచ్‌ అంజయ్య, గ్రామ కార్యదర్శి జ్యోతి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి మంత్రం - ప్రజలపై 'రణ'తంత్రం

డి.పాపారావు
సార్వజనీన ఆహార హక్కు బిల్లు నేడు మరలా అటకెక్కే ముప్పు ఏర్పడింది. ప్రధానమంత్రి తాలూకు నిపుణుల బృందం మోకాలడ్డడమే దీనికి కారణం అని తెలుస్తోంది. ఈ వార్షిక సంవత్సరంలోని తొలిదశలో ఆహార ధాన్యాలు సేకరణ మొదటిదశలో ఏర్పడిన 12 మిలియన్ల టన్నుల లోటు, తుదిదశలో ఏర్పడనుండే అవకాశం వున్న 16 మిలియన్ల టన్నుల లోటులే దీనికి కారణంగా ముందుకు వస్తున్నాయి. అంటే, రానున్న ప్రణాళికా సంవత్సరం లో ఈ లోటును భర్తీ చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోగలిగితే మినహా రెండేళ్ళ అనంతరం కూడా దేశంలోని సామాన్యుడికి ''ఆహారహక్కు'' ఏర్పడదు. కాగా, గత సంవత్సరం మొత్తం దేశీయ ధాన్యాల ఉత్పత్తిలో 32శాతాన్ని కేంద్రప్రభుత్వం సేకరణకు నిర్ణయించింది. అయితే, నేటి సంవత్సరం దీనిని కేవలం 30శాతానికి పరిమితం చేయడం వలనకూడా ఈ ధాన్యాల సేకరణ లోటు ఏర్పడింది. ఆహార హక్కు బిల్లు క్రింద, నిజానికి దేశ జనాభాలోని 72శాతం మందికి లబ్ది లభించ వలసి వుంది. మార్కెట్‌నుండి ''అతిగా'' ధాన్యం సేకరిస్తే అది మార్కెట్‌ శక్తులకు (అంటే డిమాండ్‌ - సరఫరాలకు) ఆటంకం కల్పిస్తుందనే పేరిట ప్రధాని నిపుణుల బృందం ఈ సేకరణ తగ్గింపు నిర్ణయం తీసుకుందట! అయితే, ఇదే కేంద్రప్రభుత్వం లక్షల టన్నుల ధాన్యాన్ని అదే మార్కెట్‌ శక్తుల పేరిట గోడౌన్లలో ముక్కపెట్టగలదు. అటువంటి చర్య మాత్రం దాని దృష్టిలో ఎట్టి పరిస్థితిలోనూ డిమాండ్‌ - సరఫరాల ప్రశ్నకు ఆటంకం కానేకాదు!
దిగుమతులు చేసుకోవటం ద్వారా 2011- 12లో లోటును భర్తీ చేసుకుని ఆహారభద్రతను కల్పించే అవకాశాన్ని ప్రధాని నిపుణుల బృందంతోసిపుచ్చింది. ఆ అవకాశాన్ని ''ఖరీదైనది'' గా అది భావించినట్టు కనపడుతోంది. మరో ప్రక్కన దేశంలో సామాన్య జనానికి - ఆహార గింజల లభ్యత తగ్గిపోతోంది. 2009కి ముందర బియ్యం విషయంలో ఈ లభ్యత తలసరిన 203.7 గ్రాములుగా వుంది. 2009 నాటికి ఇది 180.4 గ్రాములకు పడిపోయింది. 2009 ముందర 160 గ్రాములుగా ఉన్న గోధుమల తలసరి లభ్యత, 2009లో 154.7 గ్రాములకు పడిపోయింది. ఇదీ, అసలు నిజం. 2008, సెప్టెంబర్‌ సంక్షోభం అనంతరం, దేశాన్ని మరింతగా కమోడిటీస్‌ మార్కెట్‌ శక్తులపరం చేసిన పాలకుల పుణ్యమిది. స్వయానా ప్రభుత్వమే ధాన్యం కొరతలకు ఊతం ఇచ్చి వాటి ధరల పెరుగుదలకు కారణం అవుతోందా? అనిపించే స్థితిలో జరుగుతోన్న పరిణామాలివి! అంటే, ఈ కొరతల నీలినీడలు, నిత్యావసరాలలో భవిష్య వ్యాపారం లాభసాటిగా సాగిపోయే అవకాశం కల్పించడమే నేటి 'మన్మోహనామిక్స్‌'కు మార్గాంతరం అయిన స్థితి కల్పించకమానదు.
ప్రపంచంలో ఇతరేతర మార్కెట్లు, దేశంలో మదుపు అవకాశాలు సన్నగిల్లడంతో విదేశీ, స్వదేశీ మదుపుదారులు మన దేశీయ షేర్‌మార్కెట్లపైకి ఎగబడడం నేటి నిజం! ఈ నిజానికి ఊతాన్ని ఇస్తోంది.యుపిఎ -2 పాలకుల విధానాలు, ఫలితంగా, నేడు దేశం ఆకలిరాజ్యంగా మారిం దన్నది చేదు నిజం! కాగా, ఈ నిజాన్ని అడ్డుపెట్టుకుని ఈ దిశగా 2004 వరకూ, 'వెలిగిపోతున్న భారత్‌'ను సృష్టించడం ద్వారా బాటలు వేసినదిశగా బిజెపి పాలకులు నేడు మరలా మాటలగారడీతో గద్దెనెక్కే కృషిని చేస్తున్నారు. కాగా, 2004లో అధికారపీఠం ఎక్కిన యుపిఎ-1 తన మొదటిరౌండు పాలనలో పలు ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకం వంటి వాటిని అమలు జరిపింది. దీనికి కారణం, నాడు ప్రభుత్వానికి - వామపక్షాల మద్దతు అనివార్య ఆగత్యం కావడమే. అయితే, యుపిఎ-2 జాతీయపక్షాలు లేనిలోటు నేడు కొట్టవచ్చినట్లు కనపడుతోంది. 2009 మొదలుకొని, నాటివరకూ ప్రతీ బడ్జెట్‌లో, బడ్జెట్‌యేతర కార్యక్రమాలు కూడా ప్రజావ్యతిరేకంగానే సాగుతున్నాయి. 2011-12 బడ్జెట్‌లో ఇందుకు అతీతంగా ఏమీ వుండబోదు ! నామమాత్రపు కేటాయింపులలో కొద్దిపాటి సంక్షేమ పథకాలకే 2011-12 బడ్జెట్‌లో ఆస్కారం ఉంది. అదికూడా, 'లోతైన' పరిశీలనా, 'అధ్యయనం' అనంతరం 2012-13 అమలులోకి వచ్చేలా ఈ పథకాలు వుంటాయట ! అంటే 2012 ఏప్రిల్‌లో ఆరంభం కానున్న 12వ పంచవర్ష ప్రణాళిక వాటికి ''సుమూహూర్తంగా''గా వుండగలదన్నమాట! స్పెక్ట్రమ్‌ అమ్మకాల కుంభకోణంలో లక్షల కోట్లు కోల్పోయిన మన కేంద్రపాలకులు కొన్ని వందల కోట్ల రూపాయలతో తమకు ఓట్లు వేసి గెలిపించిన జనాలకు కనీస అవసరాలను తీర్చేందుకు వెనుకాడడం గర్హనీయం. ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం ''ఖరీదయిన'' వ్యవహారమని వారు ముక్తాయించడం వారి వర్గనీతికి, దగాకు ప్రతిబింబం మాత్రమే. సమ్మిళిత అభివృద్ధి జపం చేస్తోన్న మన యుపిఎ-2 పాలకుల తీరు నేడిది. ఈ ఉదాశీనత ప్రభావం నగర ప్రాంతాలలో ఉపాధి కల్పన పథకాలపైన పడగలదు. గ్రామీణ అభివృద్ధి, విద్యారంగాలు నష్టపోగలవు. ఫలితంగా దేశీయ నిజ అభివృద్ధి దశాబ్దాలు వెనక్కు పోగలదు. మరో హరిత విప్లవం మాట అటువుంచి, ఇప్పటికే 1960లలో అమలు జ రిగిన తొలి హరిత విప్లవం ప్రయోజనాలు హుళక్కి కాగలవు.
ఇక, వివిధ సంక్షేమ విధానాలను అమలు జరుపుతున్న మంత్రిత్వశాఖలు వాటికి నిధుల అందుబాటు కొనసాగింపుకోసం ముందుముందు తమ పనితీరును నిరూపించుకోవాలట. దీనితో, ఏదో ఒక సాకున ప్రజలకు అందే కాస్తంత సాయం దూరం అయిపోయే ప్రమాదం ఉంది. స్పెక్ట్రమ్‌ కుంభకోణం వంటి వాటి విషయంలో సంబంధిత మంత్రిత్వశాఖలపై ఇటువంటి నియంత్రణలు వుండి వుంటే పరిస్థితి నిజానికి మెరుగ్గా ఉండేది. అంటే, ధనికులు, పాలకనేతలకు ఒకనీతి, సామాన్యుడి సంక్షేమ పథకాల విషయంలో మరోనీతి నేటి పాలకులతీరుగా వుంది. ప్రజలు గమనిస్తున్నారు.
వారు; ఈ ద్వంద్వనీతిని క్షమించరు! వారి అంతిమతీర్పు అనివార్యం. ఈ కారణం చేతనే, నిన్నమొన్నటివరకూ జననీరాజనాలతో దేశాన్ని చుట్టిన యువకులు -రాహుల్‌గాంధీ, నేడు ఎక్కడికి వెళ్ళినా నిరసలు ఎదురౌతున్నాయి. ఈ మొత్తం క్రమంలో సోనియా పాత్రపైన నీలినీడలు ముసురుతున్నాయి. ఈ నిరసనలూ, ప్రజల విమర్శలూ ఒక హెచ్చరిక కావాలి !!! విశాలాంధ్ర దిన పత్రిక సౌజన్యముతో

మళ్లీ కన్యాశుల్కం రోజులు!

2011 జనాభా గణన కొన్ని ఆసక్తికరమైన, మరికొన్ని ఆందోళనకరమైన ధోరణులను వెలుగులోకి తెచ్చింది. 2001 జనాభా లెక్కలతో పోల్చితే మనదేశ జనాభా 18.1 కోట్లు పెరిగింది. అంటే దశాబ్ద వృద్ధిరేటు 17.64 శాతం. దేశ జనగణన తొలిసారి 1872లో ప్రారంభమైంది. ప్రతిపదేళ్లకొకసారి నిర్వహించే ఈ ప్రక్రియలో 2011 జనగణన 15వది. గత ఏడాది ఏప్రిల్‌లో మొదలిడి రెండుదశల్లో పూర్తిచేసిన ఈ మహాక్రతువు తాత్కాలిక లెక్కలను రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సెస్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా సి.చంద్రమౌళి గురువారంనాడు ఢిల్లీలో హోంశాఖ కార్యదర్శి జి.కె.పిళ్లరు సమక్షంలో విడుదల చేశారు. ఇప్పుడు జనాభా, స్త్రీ-పురుష నిష్పత్తి, జనసాంద్రత, 6 సంవత్సరాలలోపు పిల్లలెందరు, అక్షరాస్యత వంటి సమాచారాన్ని జిల్లాలవారీ విడుదల చేయగా, కనీస వసతులవారీ, తరగతులవారీ లెక్కలు మరో ఏడాదిలోగా వెల్లడిస్తారు. ప్రణాళికలు, సంక్షేమ పథకాల రచనకు ప్రణాళికావేత్తలకు, ప్రభుత్వాలకు ఈ లెక్కలే మార్గదర్శకాలు. మొత్తం 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 640 జిల్లాలు (5924 ఉప జిల్లాలు, 7936 పట్టణాలు సహా), 6.41 లక్షల గ్రామాల్లో ఈ మహాకార్యక్రమం నిర్వహించారు. ఇందుకైన వ్యయం రు.2200 కోట్లు. 1931 తదుపరి కులాలవారీ జనగణన జరగనందున, జనాభాలెక్కల్లో భాగంగా వాటిని చేపట్టాలన్న అనేక రాజకీయ పార్టీల డిమాండ్‌ను తిరస్కరించిన ప్రభుత్వం వచ్చే జూన్‌-సెప్టెంబర్‌ మధ్యలో ప్రత్యేకంగా కులాలవారీ జనగణన చేపట్టాలని నిర్ణయించింది. అదలావుంచితే తాజా లెక్కల ప్రకారం మనదేశ జనాభా 121,01,93,422. వారిలో పురుషులు 62,37,24,248, స్త్రీలు 58,64,69,174. చైనా తదుపరి స్థానంలో ఉన్న మనదేశ జనసంఖ్య అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, జపాన్‌ జనాభాకు సమానం. ప్రపంచ జనాభాలో 19.4శాతం చైనాలో వుండగా, 17.5శాతం మనదేశంలో ఉన్నారు. చైనా ఏకసంతాన నియమాన్ని అమలు చేస్తున్నది. మనదేశం తన జనాభా వృద్ధిరేటును గణనీయంగా తగ్గించుకోలేకపోతే మరో 20 ఏళ్లలో చైనాను మించుతుందని అంచనా. 2001 జనాభాలెక్కల్లో 21.54శాతంగా ఉన్న జనాభా వృద్ధిరేటు 2001-11 దశాబ్దకాలంలో 17.64శాతానికి తగ్గటం జనాభా నియంత్రణ కృషి సత్ఫలితాలిస్తున్నట్లు సూచిస్తున్నది. 1911-1921 దశాబ్దాన్ని మినహాయిస్తే అతి తక్కువ వృద్ధిరేటు నమోదైన దశాబ్దం ఇదే. అందులో పురుషుల వృద్ధిరేటు 17.19శాతం కాగా స్త్రీల వృద్ధిరేటు 18.12 శాతం. దీంతో లింగ దామాషా (ప్రతి వెయ్యిమంది పురుషులకు స్త్రీలు) 2001లోని 933 నుండి 940కి పెరిగింది.
దేశ జనాభాలో 85శాతం కలిగివున్న 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వార్షిక జనాభా వృద్ధిరేటు 2 శాతంలోపు వుండటం విశేషం. అత్యధిక జనాభాగల ఆరు రాష్ట్రాల్లో వృద్ధిరేటు తగ్గుదల ఇందుకు దోహదం చేసింది. గత దశాబ్ద కాలంలో జనాభా వృద్ధిరేటు ఉత్తరప్రదేశ్‌లో 25.85 నుండి 20.09 శాతానికి, మహారాష్ట్రలో 22.73 నుండి 15.99 శాతానికి, బీహార్‌లో 28.62 నుండి 25.07శాతానికి, పశ్చిమ బెంగాల్‌లో 17.77 నుండి 13.93శాతానికి, ఆంధ్రప్రదేశ్‌లో 14.59 నుండి 11.10శాతానికి, మధ్యప్రదేశ్‌లో 24.28 నుండి 20.30 శాతానికి తగ్గింది. ఇదేకాలంలో జాతీయ అక్షరాస్యత 64.83 నుండి 74.04 శాతానికి పెరిగింది. పురుషుల్లో అక్షరాస్యత 82.14శాతంకాగా మహిళల్లో 65.46శాతం. 91.98శాతం అక్షరాస్యతతో కేరళ అగ్రస్థానంలో ఉండగా, 52.66 శాతంతో రాజస్థాన్‌ కడపటిస్థానంలో ఉంది.
ప్రభుత్వ కుటుంబ సంక్షేమ ప్రచారం, అక్షరాస్యత, చైతన్యం, ఆర్థిక పరిస్థితులు, భార్యాభర్తల ఉద్యోగిత వంటి కారణాలవల్ల పరిమిత కుటుంబాల సంఖ్య పెరుగుతున్నది. అయినా అభివృద్ధి, నాగరికత గూర్చి గొప్పలు చెప్పుకుంటున్నా ఆడశిశువుల పట్ల అమానుషం భవిష్యత్‌కు ప్రమాదసంకేతంగా పరిణమిస్తున్నది. భ్రూణహత్యలు, శిశుహత్యల వంటి ఘోరాలతో ఆడపిల్లల సంఖ్య తగ్గుతోంది. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాల్లోనే ఈ దారుణాలు ఎక్కువగా ఉన్నట్లు జనాభా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం జనాభాలో 0-6 వయోపరిమితిలోని బాలలసంఖ్య 2001లో 15.9 శాతం కాగా 2011లో అది 13.1 శాతానికి తగ్గింది. జనాభా వృద్ధిరేటు తగ్గుదలకు ఇది దోహదం చేసిందని సంతోషించవచ్చు. కాని ఆందోళనకరమైనది ఏమంటే, మగపిల్లల వృద్ధిరేటు 2.42 శాతం తగ్గగా, ఆడపిల్లల వృద్ధిరేటు 3.80శాతం తగ్గింది. మొత్తం జనాభాలో స్త్రీల నిష్పత్తి ప్రతి వెయ్యిమంది పురుషులకు 940గా ఉన్నప్పటికీ, 0-6 వయోగ్రూపులో ఇది 914కు పడిపోయింది. అత్యంత అభివృద్ధిచెందిన రాష్ట్రాలైన పంజాబ్‌, హర్యానాల్లో ఈ దామాషా వరుసగా 846; 830కు దిగజారింది. విద్యావంతులైన అబ్బాయిలు సరిజోడీని వెదుక్కోవటం ఇప్పటికే కష్టంగా ఉంది. బాలల లింగ నిష్పత్తిలో వ్యత్యాసం ఇలాగే కొనసాగితే పాతిక, ముప్పయి ఏళ్ళ తర్వాత వరకట్నం అడగటం మాని కన్యాశుల్కం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సామాజిక చైతన్యం ద్వారా నిర్మూలన కావాల్సిన వరకట్నం అమ్మాయిల కొరతవల్ల రూపుమాసినా మంచిదే! అయితే జనాభాలో స్త్రీ-పురుష వ్యత్యాసం అనేక సామాజిక పర్యవసానాలకు దారితీస్తుంది.మగసంతుపట్ల మోజును తగ్గించలేకపోయినా ఆడగుడ్డును గర్భంలోనే చిదిమేసే కిరాతకానికి వ్యతిరేకంగా ఆడైనా, మగైనా ఒకటేనన్న భావన కలిగించటానికి ప్రభుత్వం, ప్రజాసంఘాలు విశేషంగా కృషి చేయాల్సి వుంటుంది .ఆడపిల్లభారం అనే కాలంచెల్లిన ఆలోచనను మనిషి మస్థిష్కం నుండి తొలగించటానికై ప్రభుత్వం ఆడపిల్లలకు ఇతోధిక ప్రోత్సాహకాలు కల్పించటం ఇందుకోక మార్గం
మన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలను జనాభాలెక్కలు వెలుగులోకి తెచ్చాయి. జాతీయ జనాభా వృద్ధిరేటు (2001-2011) 17.64శాతం కాగా ఆంధ్రప్రదేశ్‌ వృద్ధిరేటు 11.10శాతం. 8,46,65,543 జనాభాతో ఐదవ స్థానంలో వున్న ఆంధ్రప్రదేశ్‌లో పురుషులు 4,25,09,881 కాగా స్త్రీలు 4,21,55,662. లింగ నిష్పత్తి 2001లో 978 కాగా ఇప్పుడు 992. జనాభా వృద్ధిరేటు రాష్ట్ర సగటుకన్నా 16 జిల్లాల్లో తక్కువ వుండటం విశేషం. అయితే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 48.15శాతం, మహబూబ్‌నగర్‌జిల్లాలో 15.03శాతం, కర్నూలుజిల్లాలో 14.65శాతం, మెదక్‌జిల్లాలో 13.55శాతం జనాభా వృద్ధిచెందింది. ఉపాధిని వెదుక్కుంటూ ఆంధ్ర, తెలంగాణా జిల్లాలనుండి ప్రజలు వలసరావటమే రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో అసాధారణంగా జనాభా వృద్ధిరేటుకు మూలం. అతి తక్కువ వృద్ధిరేటు పశ్చిమగోదావరిలో 3.45శాతం, విజయనగరంలో 4.16శాతం, హైదరాబాద్‌ రెవిన్యూజిల్లాలో 4.71శాతం నమోదైంది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో 11.89శాతం వృద్ధి నమోదుకాగా దక్షిణకోస్తాలోని నెల్లూరులో 11.5శాతం నమోదైంది. ఈ రెండు జిల్లాలు పారిశ్రామికంగా వృద్ధిచెందుతున్నందున వలసలవల్లనే జనాభా పెరిగింది.
అక్షరాస్యత గత దశాబ్ద కాలంలో 7.30శాతంపెరిగి 67.77శాతానికి చేరింది.జాతీయ సగటు 74శాతం కన్నా రాష్ట్రం ఎంతో వెనుకబడి ఉంది. అక్షరాస్యతవృద్ధిలో దశాబ్ద రాష్ట్ర సగటును మించిన జిల్లాలు సీమాంధ్రలో విజయనగరం (8.42శాతం), అనంతపురం (8.15), కర్నూలు (7.91), విశాఖపట్నం (7.74) మాత్రమేకాగా, తెలంగాణాలో అత్యధికంఉన్నాయి. అయితే రాష్ట్ర సగటు అక్షరాస్యత రేటు (67.77)ను చేరుకోని జిల్లాలు శ్రీకాకుళం (62.30), విజయనగరం (59.49), ప్రకాశం (63.53), కర్నూలు (61.13), అనంతపురం (64.28), అదిలాబాద్‌ (61.55), నిజామాబాద్‌ (62.25), కరీంనగర్‌ (64.87), మెదక్‌ (62.53), మహబూబ్‌నర్‌ (56.06), ఖమ్మం (65.46). రాష్ట్రం మొత్తం మీద పురుషుల్లో అక్షరాస్యత 75.56 కాగా స్త్రీలలో 59.74శాతం.
0-6 వయస్సుగల పిల్లల (జాతీయ) వృద్ధిశాతం 2001లోని 15.9శాతంనుండి 2011లో 13.1 శాతానికి తగ్గగా, మన రాష్ట్రంలో ఇదేకాలంలో 13.35 నుండి 10.21కి తగ్గింది. 2001లో ఈ వయోగ్రూపులో మగపిల్లల శాతం 13.46, ఆడపిల్లల శాతం 13.23 కాగా ఆ సంఖ్యలు 2011లో వరుసగా 10.46కు, 9.95కు తగ్గిపోయాయి.2001 సంఖ్యలతో పోల్చిచూస్తే మొత్తం జనాభాలో పిల్లలశాతం ఏ ఒక్క జిల్లాలోను పెరగకపోవటం గమనార్హం. కుటుంబ నియంత్రణలో ఎంతో పురోగతి సాధించిన ఆంధ్రప్రదేశ్‌ అక్షరాస్యతలో వెనుకబడివుందని జనాభాలెక్కలు తేల్చాయి.విశాలాంద్ర దిన పత్రిక సౌజన్యముతో 

దళితులను దగా చేస్తున్నారు

దళితులను దగా చేస్తున్నారు

  • జాన్‌వెస్లీ
  • రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
  • కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం
ఈ సంవత్సరం మొత్తం బడ్జెట్‌ లక్షా 28 వేల 542 కోట్లలో దళితుల సంక్షేమానికి కేవలం 2,352 కోట్లు (1.82 శాతం) మాత్రమే కేటాయించారు. మొత్తం ప్రణాళిక బడ్జెట్‌ 47,558 కోట్లలో ఎస్‌సి సబ్‌ప్లాన్‌ ప్రకారం దళితులకు 7,704.40 కోట్లు క్రోడీకరించి ఎస్‌సి నోడల్‌ ఏజెన్సీకి కేటాయించాలన్న దళితుల డిమాండ్‌ను పెడచెవిన పెట్టారు. దళితులకు ప్రయోజనం లేని రంగాలకు ఈ నిధులు కేటాయించి దళితులను దగా చేస్తున్నారు. బడ్జెట్‌ను సవరించి ఎస్‌సి సబ్‌ ప్లాన్‌ దళితులకు ఖర్చు చేయాల్సిన నిధులు 7,704 కోట్లు ఎస్‌సి నోడల్‌ ఏజెన్సీకి కేటాయించాలి. దళితవాడల అభివృద్ధికి 10 వేల కోట్లు అదనంగా కేటాయించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీి డిమాండ్‌ చేస్తోంది.ఉపాధి హామీ పథకానికి కేటాయించిన రూ.600 కోట్లలో ఎస్సీ, ఎస్టీల భూముల అభివృద్ధికి, కమ్యూనిటీ హాల్స్‌ నిర్మాణానికి రూ.300 కోట్లు, జలయజ్ఞానికి కేటాయించిన రూ.15,010 కోట్లలో ఎస్‌సి సబ్‌ప్లాన్‌ ప్రకారం రావల్సిన రూ.2,400 కోట్లు, చిన్న నీటి పారుదల ద్వారా దళితుల భూములకు సాగునీరు అందించేందుకు కేటాయించాలి. గ్రామీణాభివృద్ధికి కేటాయించిన రూ.3,341 కోట్లలో దళితవాడల అభివృద్ధికి వెయ్యి కోట్లు, గ్రామీణ రోడ్లకు కేటాయించిన రూ.672 కోట్లలో దళిత వాడల్లో రోడ్ల నిర్మాణానికి రూ.300 కోట్లు, గ్రామీణ నీటి సౌకర్యానికి కేటాయించిన రూ.773 కోట్లలో దళితవాడలకు మంచినీటి సౌకర్యానికి రూ.200 కోట్లు కేటాయించాలి.

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి 2007-08లో 600 కోట్లు కేటాయించి ఈ సంవత్సరం 60 కోట్లకు తగ్గించారు. 13 లక్షల ఇళ్ళ నిర్మాణానికి 13000 కోట్లు కేటాయించాల్సి వుండగా, ఇళ్ళ స్థలాల కొనుగోలు, దళితుల సాగుభూమి కొనుగోలు పథకాలను ఎత్తేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించిన 385 కోట్లు అదనపు అభివృద్ధికి కేటాయించిన 400 కోట్లు మొత్తం ఎస్‌సి, ఎస్‌టివాడల అభివృద్ధికి ఖర్చు చేయాలి. దళితవాడల సమగ్రాభివృద్ధికి గతంలో కోత విధించిన నిధుల్లో 10 వేల కోట్లు ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నాం. సాంఘిక సంక్షేమ శాఖకు 3,500 కోట్లు అవసరం కాగా 2,352 కోట్లు మాత్రమే కేటాయిం చారు. ఎస్‌సి కార్పోరేషన్‌కు గత సంవత్సరం 88 కోట్ల నుండి 10 కోట్లు కోత విధించారు. దళితులకు నిధులను దళితులకు ప్రయోజనం లేని రంగాలకు ధార పోశారు. ఈ బడ్జెట్‌ను సవరించి దళితులకు రావసిన 7704 కోట్లు, గతంలో కోత విధించిన 10 వేల కోట్లు దళితవాడల అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నాము.

మంటగలుస్తున్న శేష ప్రతిష్ట

ప్రజాస్వామ్యం పరిఢవిల్లాల్సిన రాష్ట్ర శాసనసభ దౌర్జన్యాలకు, భౌతిక దాడులకు, దొమ్మీలకు వేదిక కావడం ఆందోళనకరం. సంయుక్త అసెంబ్లీలో గవర్నర్‌కు అవమానం, శాసనసభ ఆవరణలో ఎమ్మెల్యేపై దాడి ఘటనలు మరవక ముందే సోమవారం ఒక మంత్రి నిండు శాసనసభలో ప్రతిపక్ష సభ్యులపై చేయి చేసుకోవడం గర్హనీయం. ఈ దుర్మార్గాన్ని ఖండించడానికి మాటలు చాలవు. వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి అమాంతం టిడిపి సభ్యుల వద్దకు దూసుకెళ్లి వారి చేతుల్లోని ప్లకార్డులను చించిపారేసి ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి చేశారు. మీసం మెలేసి తొడగొట్టారు. టిడిపి సభ్యులపై తిట్ల దండకం ఎత్తుకున్నారు. పరుష పదజాలంతో వీరంగం వేశారు. సభలో రౌడీయిజం చేసిన వివేకాను మంత్రి, ఎమ్మెల్సీ పదవుల నుండి బర్తరఫ్‌ చేయాలంటూ ప్రతిపక్షాల నుండి నిరసనలు మిన్నంటడంతో విధిలేక ప్రభుత్వం దిగొచ్చింది. నా ఆవేశానికి మన్నించండి అంటూ రాతపూర్వక ప్రకటనను వివేకా చదవాల్సి వచ్చింది. మంత్రే దౌర్జన్యం చేయడంతో విధిలేక ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం క్షమాపణ చెప్పారు. వివేకా 'ప్రాయశ్చిత్త' ప్రకటనపై టిడిపి అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఉపసభాపతి సమక్షంలో జరిగిన ఫ్లోర్‌ లీడర్ల సమావేశంలో అధికార, ప్రతిపక్షాల మధ్య పరస్పర అంగీకారం మేరకు వివేకా ప్రకటనతో సమస్య సద్దుమణిగింది. ఇప్పటికి సమస్య సమసిపోయినట్లు కనబడినా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న, చట్టసభలను తమ దౌర్జన్యాలకు వేదికలుగా చేసుకుంటున్న ప్రజా ప్రతినిధుల ప్రవర్తనను చూసి ప్రతి ప్రజాతంత్ర వాదీ తలదించుకోవాల్సి వస్తోంది. ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చలు, ప్రజోపయోగ శాసనాలు చేయాల్సిన సభలో ఇలాంటి వికృత చేష్టలకు అధికార పక్షమే దిగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. చట్ట సభలంటే ప్రజల్లో విశ్వాసం క్రమంగా అంతరించిపోతోంది. సభల పరువు అడుగంటుతోంది.
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుండి ఏ రోజు ఏం జరుగుతుందో గుండెలదిమి పట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇప్పటికే చట్టసభలన్నా, నేతలన్నా, ప్రజాస్వామ్యమన్నా, ఎన్నికలన్నా ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఏహ్యాభావం అలముకుంటోంది. తమ గురించి ఆలోచించని వారికి ఓట్లెందుకు వేయాలన్న ప్రశ్నలు ప్రజల నుండి వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో చట్ట సభల్లో జరుగుతున్న విపత్కర సంఘటనలు వారిని మరింతగా అసహ్యం కలిగిస్తున్నాయి. ఫిబ్రవరి 17న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్‌కు జరిగిన అమర్యాద, జెపిపై ఎమ్మెల్యేల దాడిని అన్ని పార్టీలూ, అందరు సభ్యులూ ఖండించారు. అంతలోనే శాసనసభలో మంత్రి వివేకా వీరంగం చోటు చేసుకుంది. వివేకానందరెడ్డికి చట్టసభలు, సంప్రదాయాలు కొత్త కాదు. గత పాతిక ముప్పై ఏళ్లుగా ఎమ్మెల్యే, ఎంపి, ఎమ్మెల్సీ పదవులను వెలగబెట్టారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర కేబినెట్‌ మంత్రి. అంతేకాదు శాసనమండలిలో అధికార పక్షానికి ఫ్లోర్‌లీడర్‌. శానసభలో ముఖ్యమంత్రి ఎలాగో మండలిలో వివేకా హోదా అలాంటిది. తన స్థాయిని ఆయన మర్చిపోయి ప్రవర్తించారు. శాసనసభ విలువలకు నిలువెత్తు పాతరేశారు. ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాల్జేశారు. మంత్రులు అసెంబ్లీలో ఇంత ఇలా ప్రవర్తిస్తారా అని ప్రజలు విస్తుపోయేటట్లు చేశారు. ఎక్కడో సీమ సందుల్లో ఫ్యాక్షనిస్టులు తొడలు గొట్టడం తెలుగు సినిమాల్లో చూస్తున్నార. ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో మంత్రే అందుకు పూనుకోవడం చూపడం ప్రజాస్వామిక వాదులు జీర్ణించుకోలేని వైపరీత్యం. పదేళ్లకో పదిహేనళ్లకో ఒక రోజు ప్రజాస్వామ్యానికి బ్లాక్‌డే, చీకటి దినం, గొడ్డలిపెట్టు వంటి పదాలు వినేవాళ్లం. ప్రస్తుతం ప్రతి రోజూ దాదాపు బ్లాక్‌డేలే అవుతుంటే తెలుగు నిఘంటువులో కొత్త పదాలు వెతకాల్సి ఉంది.
సభలో దొమ్మీకి పాల్పడిన మంత్రి వివేకా తన పశ్చాత్తాప ప్రకటనలోనూ రాజకీయం చేశారు. తన అన్న వైఎస్సార్‌ను అనరాని మాటలంటే ఆవేశం వచ్చిందని, టిడిపి మొదటి నుండి ప్రతి పథకాన్నీ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. కొందరు కాంగ్రెస్‌ నేతలు, మంత్రులు వైఎస్‌ను అదే పనిగా తిడుతుండగా రాని కోపం టిడిపి వాళ్లు ప్లకార్డులు చూపిస్తే ఎందుకొచ్చిందో వివేకా సమాధానం చెపాల్సి ఉంది. ప్రతిపక్షాలు ఏ సమస్య లేవనెత్తినా ప్రభుత్వం అసహనానికి లోనవుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ప్రభుత్వ పక్ష సభ్యులు ప్రతిపక్షాలపై కాలు దువ్వడం రివాజైంది. సంయమనం పాటించాల్సిన ప్రభుత్వ పక్షం ఎదురుదాడి చేయడం, ప్లకార్డులతో గోల చేయడం కొత్త తరహా వ్యూహం. సభను సజావుగా నడిపించాల్సిన అధికారపక్షం ప్రజా సమస్యలపై చర్చలను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అసెంబ్లీ సంప్రదాయాలను, విలువలను మంటగలుపుతున్న ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. జయప్రకాశ్‌ నారాయణ్‌పై జరిగిన దాడిపట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో తెలిసి పోతూనే ఉంది. ప్రజా సమస్యలపై సభల్లోని సభ్యులందరూ దృష్టి పెడితే తమను ఎన్నుకున్నవారికి న్యాయం చేసినవారవుతారు. లేదంటే చట్ట సభల శేష ప్రతిష్ట కూడా మంటగలుస్తుంది.

దళితులపై దాడి కేసు

దళితులపై దాడి ఘటనకు సంబంధించి తమిళనాడులోని రామనాథపురం పార్లమెంటు సభ్యుడు జెకె రితీష్‌ (డిఎంకె)ను సెంట్రల్‌ జైలుకు పంపారు. తిరువాడనై నియోజకవర్గంలో డిఎంకె అభ్యర్థిగా పోటీచేస్తున్న రాష్ట్ర మంత్రి శుభా తంగవేలన్‌ సోలాందూర్‌ గ్రామంలోని దళితవాడలో సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ గ్రామ పరిధిలోని కలవాకుడి గ్రామానికి వెళ్లే దారి సరిగాలేదని, ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోయిందని కాలనీ వాసులు మంత్రికి విన్నవించారు. తమ సమస్య పరిష్కారం కాలేదని, అందువల్ల తమ కాలనీలో ప్రచారం నిర్వహించరాదంటూ అభ్యంతరం తెలిపారు. ఇది డిఎంకె అభ్యర్థి కోసం ప్రచారానికి వచ్చిన రామనాథపురం ఎంపీ రితీష్‌కు ఆగ్రహం తెప్పించింది. తన వెంట వచ్చిన రౌడీ మూకతో కాలనీపై దాడి చేయించారు. ఆ దాడిలో కాలనీకి చెందిన ఒక వ్యక్తి తీవ్ర
గాయాలపాలై ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కాలనీకి చెందినవారి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసిన పోలీసులు సోమవారం తెల్లవారు ఝామున రితీష్‌తో పాటు మరో ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. వారిని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా రితీష్‌ను 15 రోజుల రిమాండ్‌కు, మిగిలిన వారిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు. పోలీసులు రితీష్‌ను మదురై సెంట్రల్‌ జైలుకు తరలించారు. దీంతో జైలులో ఉన్న డిఎంకె పార్లమెంటు సభ్యుల సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటికే 2జి స్పెక్ట్రమ్‌ అవినీతి కేసులో డిఎంకె పెరంబలూర్‌ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి ఎ రాజా తీహార్‌ జైలులో ఉన్న విషయం విదితమే.

దళితుల అభివృద్ధికి ప్రత్యేక చట్టం తేవాలి

ప్రజాశక్తి - యంత్రాంగం   Mon, 28 Mar 2011, IST  
  • సమస్యలు పరిష్కరించకుంటే మరో దఫా ఉద్యమం
  • రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో వక్తల హెచ్చరిక
దళిత, గిరిజనవాడల అభివృద్ధికి ప్రత్యేక చట్టం తేవాలని వ్యవసాయ కార్మిక, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. దళిత, గిరిజనుల అభివృద్ధి కోరుతూ 44 సూచనలతో ప్రభుత్వం ముందు డిమాండ్లు ఉంచాయి. వీటిని తక్షణం పరిష్కరించకుంటే రెండో దఫా పోరాటం తప్పదనీ హెచ్చరించాయి. విజయవాడ, విశాఖ, కర్నూలు, అనంతపురాల్లో ఆదివారం జరిగిన ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలను కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నిర్వహించాయి. 'దళిత, గిరిజన గ్రామాల అభివృద్ధికై ఉద్యమాలు-అనుభవాలు-భవిష్యత్తు పోరాటాలు' అంశంపై విశాఖ ద్వారకానగర్‌లోని పౌర గ్రంథాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి.శేషారత్నం అధ్యక్షతన జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆర్థికశాస్త్ర విభాగం ఆచార్యులు ఎం.ప్రసాదరావు మాట్లాడుతూ, దళితులు చదువుకొని చైతన్యవంతులై పోరాడితే తప్ప సమస్యలు పరిష్కారం కావని స్పష్టం చేశారు. కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు కె.లోకనాధం మాట్లాడుతూ దళితుల సంక్షేమం పట్ల నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారికి కేటాయించిన రూ.21 వేల కోట్లను ఎందుకు దారి మళ్లించిందని ప్రశ్నించారు. పాలకవర్గాలు దళితులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్నారు. కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగరాజు, కెవిపిఎస్‌ నగర ఉపాధ్యక్షులు వై.రాజు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, ఉత్తరాంధ్ర దళిత ఐక్యవేదిక నాయకులు బి.గోపాలరావు, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్‌ నాయకులు బి.కల్యాణరావు తదితరులు మాట్లాడారు.
విజయవాడలోని యుటిఎఫ్‌ కార్యాలయంలో 'దళితపేటల అభివృద్ధి' అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. రక్షిత మంచినీటి వసతి కల్పించడానికి ప్రతి దళితవాడకూ రెండు లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు ప్రభుత్వాధికారులూ, పోలీసులు వారంలో ఒక రోజు దళితవాడల్లో పర్యటించాలని కోరారు. సమావేశంలో కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అన్నవరపు నాగేశ్వరరావు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నీలం పుల్లయ్య, చౌటపల్లి రవి, నగర అధ్యక్ష కార్యదర్శులు పి.కోటేశ్వరరావు, జి.నటరాజు, నాయకులు పి.రాజేష్‌ పాల్గొన్నారు.
అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో 'దళిత, గిరిజన వాడల అభివృద్ధి - ప్రభుత్వ హామీలు' అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జి.వీరన్న, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు ఎం.కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు జి.ఓబుళకొండారెడ్డి మాట్లాడారు. అనంతపురం జిల్లాలో దళితులు, గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారన్నారు. కార్యక్రమంలో బిసి కులాల ఐక్య వేదిక నాయకుడు నాగరాజు, మాలమహానాడు నాయకుడు పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూల్లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం బాలఉశెని అధ్యక్షత వహించారు.
కెవిపిఎస్‌ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్‌ బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ఏడి ఆశోక్‌ రత్నం, డివైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి నారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సిపి నాయుడు దళితులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. 44 సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ముందు డిమాండ్లు ఉంచారు. వాటిని పరిష్కరించకుంటే రెండో దఫా పోరాటాన్ని చేపడతామని వారు తెలిపారు.