డి.పాపారావు
దిగుమతులు చేసుకోవటం ద్వారా 2011- 12లో లోటును భర్తీ చేసుకుని ఆహారభద్రతను కల్పించే అవకాశాన్ని ప్రధాని నిపుణుల బృందంతోసిపుచ్చింది. ఆ అవకాశాన్ని ''ఖరీదైనది'' గా అది భావించినట్టు కనపడుతోంది. మరో ప్రక్కన దేశంలో సామాన్య జనానికి - ఆహార గింజల లభ్యత తగ్గిపోతోంది. 2009కి ముందర బియ్యం విషయంలో ఈ లభ్యత తలసరిన 203.7 గ్రాములుగా వుంది. 2009 నాటికి ఇది 180.4 గ్రాములకు పడిపోయింది. 2009 ముందర 160 గ్రాములుగా ఉన్న గోధుమల తలసరి లభ్యత, 2009లో 154.7 గ్రాములకు పడిపోయింది. ఇదీ, అసలు నిజం. 2008, సెప్టెంబర్ సంక్షోభం అనంతరం, దేశాన్ని మరింతగా కమోడిటీస్ మార్కెట్ శక్తులపరం చేసిన పాలకుల పుణ్యమిది. స్వయానా ప్రభుత్వమే ధాన్యం కొరతలకు ఊతం ఇచ్చి వాటి ధరల పెరుగుదలకు కారణం అవుతోందా? అనిపించే స్థితిలో జరుగుతోన్న పరిణామాలివి! అంటే, ఈ కొరతల నీలినీడలు, నిత్యావసరాలలో భవిష్య వ్యాపారం లాభసాటిగా సాగిపోయే అవకాశం కల్పించడమే నేటి 'మన్మోహనామిక్స్'కు మార్గాంతరం అయిన స్థితి కల్పించకమానదు.
ప్రపంచంలో ఇతరేతర మార్కెట్లు, దేశంలో మదుపు అవకాశాలు సన్నగిల్లడంతో విదేశీ, స్వదేశీ మదుపుదారులు మన దేశీయ షేర్‌మార్కెట్లపైకి ఎగబడడం నేటి నిజం! ఈ నిజానికి ఊతాన్ని ఇస్తోంది.యుపిఎ -2 పాలకుల విధానాలు, ఫలితంగా, నేడు దేశం ఆకలిరాజ్యంగా మారిం దన్నది చేదు నిజం! కాగా, ఈ నిజాన్ని అడ్డుపెట్టుకుని ఈ దిశగా 2004 వరకూ, 'వెలిగిపోతున్న భారత్'ను సృష్టించడం ద్వారా బాటలు వేసినదిశగా బిజెపి పాలకులు నేడు మరలా మాటలగారడీతో గద్దెనెక్కే కృషిని చేస్తున్నారు. కాగా, 2004లో అధికారపీఠం ఎక్కిన యుపిఎ-1 తన మొదటిరౌండు పాలనలో పలు ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకం వంటి వాటిని అమలు జరిపింది. దీనికి కారణం, నాడు ప్రభుత్వానికి - వామపక్షాల మద్దతు అనివార్య ఆగత్యం కావడమే. అయితే, యుపిఎ-2 జాతీయపక్షాలు లేనిలోటు నేడు కొట్టవచ్చినట్లు కనపడుతోంది. 2009 మొదలుకొని, నాటివరకూ ప్రతీ బడ్జెట్‌లో, బడ్జెట్‌యేతర కార్యక్రమాలు కూడా ప్రజావ్యతిరేకంగానే సాగుతున్నాయి. 2011-12 బడ్జెట్‌లో ఇందుకు అతీతంగా ఏమీ వుండబోదు ! నామమాత్రపు కేటాయింపులలో కొద్దిపాటి సంక్షేమ పథకాలకే 2011-12 బడ్జెట్‌లో ఆస్కారం ఉంది. అదికూడా, 'లోతైన' పరిశీలనా, 'అధ్యయనం' అనంతరం 2012-13 అమలులోకి వచ్చేలా ఈ పథకాలు వుంటాయట ! అంటే 2012 ఏప్రిల్‌లో ఆరంభం కానున్న 12వ పంచవర్ష ప్రణాళిక వాటికి ''సుమూహూర్తంగా''గా వుండగలదన్నమాట! స్పెక్ట్రమ్ అమ్మకాల కుంభకోణంలో లక్షల కోట్లు కోల్పోయిన మన కేంద్రపాలకులు కొన్ని వందల కోట్ల రూపాయలతో తమకు ఓట్లు వేసి గెలిపించిన జనాలకు కనీస అవసరాలను తీర్చేందుకు వెనుకాడడం గర్హనీయం. ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం ''ఖరీదయిన'' వ్యవహారమని వారు ముక్తాయించడం వారి వర్గనీతికి, దగాకు ప్రతిబింబం మాత్రమే. సమ్మిళిత అభివృద్ధి జపం చేస్తోన్న మన యుపిఎ-2 పాలకుల తీరు నేడిది. ఈ ఉదాశీనత ప్రభావం నగర ప్రాంతాలలో ఉపాధి కల్పన పథకాలపైన పడగలదు. గ్రామీణ అభివృద్ధి, విద్యారంగాలు నష్టపోగలవు. ఫలితంగా దేశీయ నిజ అభివృద్ధి దశాబ్దాలు వెనక్కు పోగలదు. మరో హరిత విప్లవం మాట అటువుంచి, ఇప్పటికే 1960లలో అమలు జ రిగిన తొలి హరిత విప్లవం ప్రయోజనాలు హుళక్కి కాగలవు.
ఇక, వివిధ సంక్షేమ విధానాలను అమలు జరుపుతున్న మంత్రిత్వశాఖలు వాటికి నిధుల అందుబాటు కొనసాగింపుకోసం ముందుముందు తమ పనితీరును నిరూపించుకోవాలట. దీనితో, ఏదో ఒక సాకున ప్రజలకు అందే కాస్తంత సాయం దూరం అయిపోయే ప్రమాదం ఉంది. స్పెక్ట్రమ్ కుంభకోణం వంటి వాటి విషయంలో సంబంధిత మంత్రిత్వశాఖలపై ఇటువంటి నియంత్రణలు వుండి వుంటే పరిస్థితి నిజానికి మెరుగ్గా ఉండేది. అంటే, ధనికులు, పాలకనేతలకు ఒకనీతి, సామాన్యుడి సంక్షేమ పథకాల విషయంలో మరోనీతి నేటి పాలకులతీరుగా వుంది. ప్రజలు గమనిస్తున్నారు.
వారు; ఈ ద్వంద్వనీతిని క్షమించరు! వారి అంతిమతీర్పు అనివార్యం. ఈ కారణం చేతనే, నిన్నమొన్నటివరకూ జననీరాజనాలతో దేశాన్ని చుట్టిన యువకులు -రాహుల్‌గాంధీ, నేడు ఎక్కడికి వెళ్ళినా నిరసలు ఎదురౌతున్నాయి. ఈ మొత్తం క్రమంలో సోనియా పాత్రపైన నీలినీడలు ముసురుతున్నాయి. ఈ నిరసనలూ, ప్రజల విమర్శలూ ఒక హెచ్చరిక కావాలి !!! విశాలాంధ్ర దిన పత్రిక సౌజన్యముతో