అసలు మానవత్వం అంటే ఏమిటి? సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడాన్ని మానవత్వం అంటాం. ఒకరిని మరొకరు ఇబ్బంది పెట్టకుండా సఖ్యతగా సామరస్యంగా సహకరించు కుంటూ సంఘజీవనం సాగించడాన్ని విలువలు అంటున్నాం. ఇటువంటి మానవత్వం విలువలు తల్లిదండ్రులకు కరువయ్యాయనే చెప్పాలి. తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుండి పిల్లలను క్రెష్‌ల్లోనూ, హాస్టల్స్‌లోనూ, రెసిడెన్షియల్స్ లోనూ చేర్పించేస్తున్నారు. అందువలన వాళ్ళకి తల్లిదండ్రుల విలువ తెలియడం లేదు. సాధారణంగా పదవ తరగతి వరకైనా పిల్లలు తల్లిదండ్రుల వద్ద వుంటే అమ్మానాన్నల విలువ వాళ్ళకి తెలుస్తుంది. పిల్లల మనస్తత్వం కూడా ఎటువైపు వెళుతుందో తల్లిదండ్రులు కూడా గుర్తిస్తారు. వృద్ధాప్యంలో పిల్లలు తల్లిదండ్రులను విడిచి పెట్టకుండా వుండటానికి అవకాశ ముంది. ఏది ఏమైనా సరే, బంధుత్వాలు, అనుబంధాలు నేడు నామమాత్రాలైనాయి. కష్టకాలంలో కూడా ఒకరినొకరు ఆదుకునే పరిస్థితికి కూడా దూరమైపోయాము. సెల్‌ఫోన్‌ల లోను, ఈ మెయిల్స్‌లోనూ మెసేజ్‌లు ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రుల విషయంలో కూడా ఇందుకు మినహాయింపు ఉండటంలేదు. ఒకరు లేదా ఇద్దరు పిల్లల్ని కని అల్లారుముద్దుగా పెంచి, పెద్దచేసి విద్యాబుద్ధులు నేర్పించి వారి కాళ్ళపై వారు నిలబడే వరకు ఆసరాగా తల్లిదండ్రులు తమ బాధ్యతను నేటికీ సక్రమంగానే నిర్వర్తిస్తున్నారు. అటువంటప్పుడు వారికి వయస్సు మళ్లినకాలంలో పిల్లలు ఆలంబనగా వుండి ఆదుకోవాలనుకోవడం అత్యాశేమీ కాదుకదా. ఇది వరకు రెక్కలొచ్చేసరికి అంటే ఉద్యోగమొచ్చేసరికి ఎగిరిపోయారు. ఇప్పుడు మరీ అడ్వాన్సుగా చదువు పూర్తయ్యే సరికి ఎగిరిపోతున్నారు. ఇటువంటి వారు కొంతమందైతే మరి కొంతమందిపెళ్ళాల మోజులో పడి తల్లిదండ్రులను గాలికి వదిలేస్తున్నారు. పెళ్ళానికి డబ్బు లేదా ఆదాయం ఎక్కువ ఉంటే ఆమె కొండెక్కి కూర్చొంటే వీళ్ళు వారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వుంటారు. తల్లిదండ్రులు ఉన్నారనే ధ్యాసే వుండదు. ఒక వృద్ధుడు కొడుకు చూడటం లేదని ఆత్మహత్య చేసుకున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. ఏదీఏమైనా నష్టపోతున్నదీ కష్టాలు పడుతున్నదీ మాత్రం తల్లిదండ్రులే. దీనికి కారణం నేటియువకులే. దీనివలనే రోజురోజుకీ వృద్ధాశ్రమాలు పెరుగు తున్నాయి. పిల్లలు వారి కాళ్ళమీద వారు నిలబడే వరకు తల్లిదండ్రులు పెంచు తున్నారంటే దానికి కారణం వాళ్ళ మమకారం, పేగుబంధం. దీని వెనుక వారి త్యాగమెంతో వుంది. బాల్యం నుండి వాళ్ళు ఎదిగే వరకు కూడా ఒక్కొక్కదశలో ఒక్కోసారి వారి అత్యవసరాలను ప్రక్కకు పెట్టి పిల్లల బాగోగులే ముఖ్యమని భావిస్తారు . అటువంటి త్యాగమూర్తులు వృద్ధాప్యంలో పిల్లల అనాదరణ వల్ల కష్టాలు ఎదుర్కొవాల్సిందేనా, ఒంటరిగా బ్రతకవలసిందేనా? ఈ పరిస్థితి మారా లంటే ఒక్కటే మార్గం ''చేతికి అందివచ్చిన పిల్లలు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ, ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా వారి వారి ఆదాయంలో కొంత భాగం తప్పనిసరిగా తల్లిదండ్రులకు చేరే విధంగా చట్టాలు తయారుచేస్తే బాగుం టుందని నా అభిప్రాయం. ఎవరైతే వాళ్ళకు ఈ విధంగా జీతం కానీ వేతనం గానీ చెల్లిస్తారో వారికి మాత్రమే తల్లిదండ్రుల వాటాను మినహాయించి వారికి నేరుగా అందేటట్లు చూడాలి'' పిల్లలు ఎదుగుదల కోసం ఏ విధంగా తల్లిదండ్రులు వారి అవసరాలను త్యాగం చేశారో సంపా దిస్తున్న పిల్లలుకూడా వృద్ధులైన తల్లిదండ్రుల కోసం వారి అవసరాలను త్యాగం చేయక తప్పదు. తల్లిదండ్రులు వాటాపోగా మిగిలిన ఆదాయంతోనే వారు సరిపెట్టుకొనేలా చేస్తే బాగుంటుంది. ఈ విధంగా చేయడం వలన వృద్ధాశ్రమాల శాతాన్ని తగ్గించ వచ్చు. బిడ్డలు తల్లిదండ్రు లకు దగ్గరగా వుంటారు.
-పి. హారిక విశాలాంధ్ర దిన పత్రిక సౌజన్యముతో