కొల్లి నిర్మలా కుమారి, ‘తూర్పు’ మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు

వాగ్దానాలు నమ్మి దారుణంగా మోసపోయాం
అందుకే జగన్‌కు జై కొడుతున్నాం
జగన్ పార్టీలో చేరిన నేతల మనోగతం

రాజమండ్రి,(తూర్పుగోదావరి) న్యూస్‌లైన్: ప్రజల సంక్షేమాన్ని పట్టించుకుంటామని, సామాజిక న్యాయం తెస్తామన్న వాగ్దానాలను నమ్మి దారుణంగా మోసపోయామని, పదవుల కోసం నీచాతి నీచానికి దిగజారుతుంటే చూడలేక బయటకు వచ్చామని ప్రజారాజ్యం పార్టీ నుంచి జగన్ పార్టీలో చేరిన నాయకులు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట జాతీయ రహదారిని ఆనుకుని శుక్రవారం జరిగిన బహిరంగ సభలో వారు తమ అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టారు. వారితోపాటు పలువురు జగన్ మద్దతుదారులు ఈ సభలో మాట్లాడారు. ఆ వివరాలివీ..

ఠాగూర్, ఇంద్రసేనారెడ్డి అనుకున్నాం..

ఒకపక్క ప్రభుత్వం లేదు. మరో పక్క ప్రతిపక్షం లేదు. మార్పు తెస్తుందనుకున్న పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోయింది. రాష్ట్రాన్ని రక్షించడానికి ఎవరో వస్తారని 1983లో ప్రజలు ఎదురు చూశారు. అప్పుడు కూడు, గుడ్డ, నీడ నినాదంతో ఎన్టీ రామారావు వచ్చారు. ఆ తరువాత ఆయన స్థాపించిన టీడీపీ మారిపోయింది. అధికారాన్ని దుర్వినియోగం చేసేవారు తయారయ్యారు. మళ్లీ రెండేళ్ల క్రితం ఓ మహనీయుడు వస్తే.. ఠాగూర్ వచ్చాడు.. అవినీతిని నిర్మూలిస్తాడు.. ఇంద్రసేనారెడ్డి వచ్చాడు.. మెట్టను సస్యశ్యామలం చేస్తాడు అనునుకున్నాం. ఎదురు చూశాం. కాని దారుణంగా మోసపోయాం. జగన్ ప్రతి అడుగునూ పరిశీలించాం. ఓదార్పు యాత్ర ద్వారా ఇంటింటికీవెళ్లి కష్టంలో ఉన్న వారిని ఆదుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. మెట్ట ప్రాం తంలో ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించుకోవాలన్న ఆశయంతో రాజకీయంలోకి వచ్చిన మెట్ట ప్రాంత రైతు బిడ్డను నేను. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది మంది రైతులు బాగుపడతారు.

కానీ కొందరు వైఎస్‌కు ఎక్కడ పేరు వచ్చేస్తుందేమోనన్న దురుద్దేశ పూరిత ఆలోచనలతో పోలవరం పనులను జరగనివ్వడం లేదు. జలయజ్ఞం ద్వారా వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసే విధంగా త్వరలో పోరాటం మొదలుపెడతాం. అది ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తుంది. పదవుల కోసం జగన్ పార్టీ పెట్టడం లేదనే విశ్వాసం నాకుం ది. పోరాటం ద్వారానే పార్టీలు ప్రజాభిమానం పొందగలవు. నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్‌తోనేఉండి పనిచేస్తాను.
- జ్యోతుల నెహ్రూ, పీఆర్‌పీ తూర్పుగోదావరి అధ్యక్షుడు

సోనియాకే తల బొప్పి కట్టింది..

ఢిల్లీలో సోనియా గాంధీ అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశమై వాళ్లను తీసెయ్, వీళ్లను తీసై అంటూ నిర్ణయం చేస్తుంది. ఇక్కడిముసలి నేతలు కమిటీలో కూర్చుని ఈ కుర్రాణ్ణి తట్టుకోలేకపోతున్నామని మేడంతో చెబితే ఆమె ముఖం పక్కకు తిప్పి నేనెవరికి చెప్పుకోనంటూ బొప్పి చూపిస్తున్నారు. పోలవరం వద్దని ఆనాడు చంద్రబాబు అన్నారు. దానికి సాక్ష్యం నాదగ్గర ఉంది. జగన్ గురించి ఆలోచిస్తూ గోక్కోవడం వల్ల ఆయన జుట్టు ఊడిపోతోంది. వరిచేను కోస్తారని, వేరుశనగ పీకుతారని కూడా తెలియని వ్యక్తి మన సీఎం.

- తోట గోపాలకృష్ణ , మాజీ ఎంపీ

నాయకుడు లేని అనాథలా రాష్ట్రం

ఈ రోజు నాయకుడు లేని అనాథలా రాష్ట్రం రోదిస్తోంది. రాజశేఖరరెడ్డి మరణం తరువాత రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేది జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే. కళ్లు కానక జగన్‌ను ఒంటరి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రకు రాష్ట్ర ప్రజలు సమాధానం ఇస్తున్నారు. ఓ సోదరుడి ప్రేమ కిందకు మేమంతా వచ్చాం. జగన్ నాయకత్వంలో రాష్ట్రాన్ని ముం దుకు తీసుకుపోతాం. చిరంజీవి నాయకత్వంపై నమ్మకం లేక, కాంగ్రెస్‌లో ఇమడలేక బయటకొచ్చి జగన్‌కు మద్దతు పలుకుతున్నాం.
- వాసిరెడ్డి పద్మ, పీఆర్‌పీ అధికార ప్రతినిధి

జగన్‌కు తోడుగా నిలుద్దాం

ఆ రోజున బీజేపీ నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికైన నాకు వైఎస్‌ఆర్ పూర్తి సహకారం అందించి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడ్డారు. పార్టీతో సంబంధం లేకుండా ప్రజాసంక్షేమాన్ని కాంక్షించిన ఆ మహానేత తనయుడికి మనం తోడుగా ఉండాలి. గ్రామాల స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా శ్రమిద్దాం. జగన్ సీఎం అయ్యేంతవరకు పోరాడదాం.
- పెండెం దొరబాబు, మాజీ ఎమ్మెల్యే


చిరంజీవికి సిగ్గు లేదు...
కుల, మతాలకు అతీతంగా ఓట్లు వేసి గెలిపించిన జనాన్ని చిరంజీవి బంగాళాఖాతంలో కలిపేశారు. ఢిల్లీ, సోనియా, కిరణ్ చుట్టూ తిరుగుతూ సిగ్గులేకుండా నమ్ముకున్న వారిని చిరంజీవి విడిచిపెట్టారు. ఓట్లు వేసిన చేతులతోనే ఈ నాయకులను మహిళలు త్వరలో చీపుర్లతో తరిమి కొడతారు. వారు తలుపులేసుకుని ఇంటిలో కూర్చుని ఏడ్చే రోజు వస్తుంది.

- కొల్లి నిర్మలా కుమారి, ‘తూర్పు’ మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు