కష్టజీవులను పట్టించుకోవాలి

వివిధ రంగాలకు చెందిన కాంట్రాక్టు, క్యాజువల్‌ ఉద్యోగులు , కార్మికులు ఈ బండ చాకిరీ మేము చేయలేమంటూ తెగించి సమ్మెలు కడుతున్నారు. సమస్యలతో సతమతమవుతున్న మున్సిపల్‌ కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు ఈ నెల ఒకటి నుంచి సమ్మెకు ఉపక్రమించారు. ఇంకోవైపు ఐకెపి పరిధిలోని కమ్యూనిటీ వలంటీర్స్‌, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (రేగా) క్షేత్ర స్థాయి సహాయకులు, ఐకెపి యానిమేటర్స్‌, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్టు ఉద్యోగులు , గ్రామ సేవకులు , వ్యవసాయ మార్కెట్‌ సెక్యూరిటీ గార్డులు, కంప్యూటర్‌ టీచర్స్‌, యూనివర్సీటీల కాంట్రాక్టు ఉద్యోగులు ఈ నెల మూడవ వారంలో ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, చలో అసెంబ్లీకి సమాయత్తమవుతున్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్దనున్న ధర్నా చౌక్‌ ఇప్పటికే వివిధ రంగాల ఉద్యోగుల, కార్మికులు, విద్యార్థుల ఆందోళనలతో హోరెత్తుతోంది.

కాని ప్రపంచ బ్యాంకు సంస్కరణల మత్తు బాగా తలకెక్కిన ప్రభుత్వం కష్టజీవుల కడగండ్ల పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. మున్సిపల్‌ కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు పన్నెండు డిమాండ్లతో ఫిబ్రవరి7 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని జనవరిలోనే సంబంధిత యాజమాన్యాలకు నోటీసు ఇస్తే చర్చలు, సంప్రదింపుల పేరుతో ఫిబ్రవరి7న సమ్మెను ప్రభుత్వం వాయిదా వేయించింది. ఈ వ్యవధిని మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోకుండా నాన్పుడు ధోరణిని అనుసరించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కార్మికుల సహనానికి పరీక్ష పెట్టింది. నిజానికి వారు పెట్టిన డిమాండ్లలో గొంతెమ్మ కోర్కెలేమీ లేవు. వీటిలో చాలా వరకు ప్రభుత్వం ఇంతకుముందు అంగీకరించినవి, ఇప్పటికే జారీ చేసిన జీవోల అమలుకు సంబంధించినవే. కాంట్రాక్టు కార్మికుల వేతనాల్లో మినహాయిస్తున్న పిఎఫ్‌ మొత్తాలను వారి ఖాతాల్లో జమచేయకుండా కాంట్రాక్టర్లు నొక్కేస్తున్నారు. దీనిని అరికట్టేందుకు కార్మికుల పేరున పిఎఫ్‌ ఖాతాలు తెరచి, అందులో జమ చేయడం ప్రభుత్వ కనీస బాధ్యత. దీనిని అమలు చేస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఇంతవరకు అది నెరవేరలేదు. అలాగే జిఓ నెం.3 లేదా కార్మిక గెజిట్‌ నెం.67 ప్రకారం మున్సిపల్‌ కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయమంటే ప్రభుత్వం నీళ్లు నములుతోంది. ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాల ఫలితంగా విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, మరీ ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చూడటం లేదు. మూడు వేలతోనే సరిపెట్టుకోమని ప్రభుత్వం చెప్పడం అమానుషం. అంతేకాదు, 15-20 ఏళ్లుగా బండచాకిరీ చేస్తున్న వీరిని పర్మినెంటు ఉద్యోగాల్లోకి తీసుకోమంటే అదేదో చట్ట విరుద్ధమన్నట్లుగా ప్రభుత్వం మాట్లాడుతోంది. ఒకే పనిలో 240 రోజులు వరుసగా పని చేస్తే సదరు తాత్కాలిక ఉద్యోగి సర్వీసును రెగ్యులరైజ్‌ చేయవచ్చని ప్రభుత్వ నిబంధనలే చెబుతున్నాయి కదా అంటే దీనిపై మాట్లాడదు. కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులకు చదువు, నైపుణ్యం తక్కువ కాబట్టి వీరిని తీసుకోలేమని మరో వాదనను తీసుకొస్తున్నది. వారితో ఇంతకాలం చాకిరీ చేయించుకున్నప్పుడు గుర్తుకు రాని అర్హతలు ఇప్పుడే గుర్తుకొచ్చాయా? ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ వాదనలు ముందుకు తెస్తున్నదో సుస్షష్టమే. ప్రభుత్వ వైఖరి వల్ల లాభపడేది కాంట్రాక్టర్లు, ఆయా రంగాల యాజమాన్యాలే. ఏ రాజకీయ నాయకుని ఇంట్లో విందు జరిగినా, ఏ ముఖ్య నాయకుడు పర్యటనకు వచ్చినా రెక్కలు ముక్కలు చేసుకుని ఆ ప్రాంతాన్ని శుభ్రంగా తీర్చిదిద్దేది వీరు. అలాగే నీటి సరఫరా, వీధి దీపాలు, మురుగు కాల్వలు, మరుగు దొడ్లు పరిశుభ్రం ఇలా అన్ని రకాల చాకిరీకి వీరి సేవలు కావాలి. కానీ, వారి శ్రమకు తగిన గుర్తింపు కాదు గదా బతకడానికి అవసరమైన కనీస వేతనం కూడా ఇవ్వకుండా ఏవేవో కుంటిసాకులు చెబుతోంది. ఒకే పనికి సమాన వేతనం, కనీస వేతనాల అమలు, వారాంతపు సెలవులు, ఇఎస్‌ఐ వర్తింపు, థర్డ్‌ పార్టీ కాంట్రాక్టు విధానం రద్దు వంటి డిమాండ్లు చాలా సముచితమైనవి. వీటిని అంగీకరించి అమలులో పెట్టడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో అక్కడి వామపక్ష ప్రభుత్వాలు తాత్కాలిక కార్మికులకు కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, ఇతర సామాజిక భద్రతా పథకాలను వర్తింపజేస్తున్నాయి. థర్డ్‌ పార్టీ కాంట్రాక్టు పద్ధతి అక్కడ లేదు. అక్కడ సాధ్యమైనవి ఇక్కడ ఎందుకు సాధ్యం కావు? ఇందుకు కావాల్సింది కష్టజీవుల పట్ల చిత్తశుద్ధి. ఈ ప్రభుత్వానికి అదే కొరవడింది.

ప్రపంచబ్యాంకు సంస్కరణలకు తలొగ్గి ప్రతిదీ ప్రయివేటు పరం చేయడంపై చూపే శ్రద్ధ, సమాజంలో తీవ్ర దోపిడీకి గురవుతున్న ఈ కష్టజీవుల పట్ల లేకపోవడం శోచనీయం. సెజ్‌లు, పరిశ్రమల అభివృద్ధి పేరుతో కాంట్రాక్టర్లకు, ప్రైవేటు వ్యక్తులకు పెద్దయెత్తున రాయితీలను ఉదారంగా ఇచ్చే ప్రభుత్వం సమాజానికి ఎంతో విలువైన సేవలందిస్తున్న కష్టజీవుల పట్ల చాలా నిర్దయగా వ్యవహరిస్తున్నది. దీనిని బట్టే పాలకుల వర్గ నైజమేమిటో తెలుస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. మున్సిపల్‌ కార్మికుల సమ్మెను విరమింపజేసేందుకు ఉద్యోగ సంఘాలతో వెంటనే చర్చలు జరపాలి. అలాగే గ్రామ సేవకులు, ఐకెపి యానిమేటర్స్‌, కంప్యూటర్‌ టీచర్స్‌, సెక్యూరిటీ గార్డులు తదితర కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. కార్మికులు కూడా తమ న్యాయసమ్మత్తమైన డిమాండ్లపై ప్రభుత్వం దిగివచ్చేంతవరకు పోరాటం కొనసాగించాలి.
praja shakti sampadhakiyamu