హైదరాబాద్ : తెలంగాణ సాధన కోసం కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు జూపల్లి కృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి తన రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడారు. అవ
సరం అయితే తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ దీక్షకు సైతం సిద్ధమన్నారు.
ఆత్మసాక్షిగానే రాజీనామా లేఖను రాసినట్ల్లు జూపల్లి తెలిపారు. గవర్నర్ ఫార్మాట్ ప్రకారమే రాజీనామాను పంపామన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్న నాటి మాటలకు కట్టుబడే నేడు రాజీనామా చేసినట్లు జూపల్లి తెలిపారు. ఓయూలో విద్యార్థులకు సమక్షంలో తెలంగాణ కోసం రాజీనామా చేస్తానని ఆనాడే చెప్పానన్నారు. చనిపోయేటప్పడు పదవులతో పోమని జూపల్లి అన్నారు.
శాసనసభలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు లేకుండా మంత్రులుగా తాము ఉండటం తగదన్నారు. త్యాగాలకు మారుపేరు తెలంగాణ ప్రజలన్నారు. నోరుపారేసుకునేవారికి ఉద్యమాలు చేసి ఉంటే పోరాట పటిమ తెలుసుండేదన్నారు. తెలంగాణ వాదాన్ని అణగదొక్కేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. |