దళిత మహాప్రస్థానం

దళిత మహాప్రస్థానం
-చుక్కా రామయ్య

ఇప్పటివరకు గడిచిన చరిత్రంతా అగ్రకులాల కిందనే నలుగు తూ వచ్చింది. కులం గోడలు కూలగొడతూ కులస్వామ్యా న్ని కూలదోయడానికి నూతన శక్తులు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ జిల్లాల్లో దొర గడీలను కూల్చిన చేతులతోనే కులం గోడలు కూల్చటానికి సన్నధమై సాగుతున్నారు. ఊరుబైట వాడ ల మూలుగుల్ని వినని చరిత్ర చరిత్రేనా? వెలివాడల్ని పట్టించుకోని సమాజం ఏదైనా అది అగ్రవర్ణ ఆధిపత్య కుల సమాజమే అవుతుంది. అగ్రకుల భావజలం పోవాలి. శరీరాన్ని నాలుగు ముక్కలు చేసిన మను వ్యవస్థ మసైపోవాలి.

దళితులు మరో ముందడుగు వేశారు. చరిత్ర రచనను ఆధిపత్యం ఆక్రమించుకుంటే ఎవరి చరిత్రను వారే లిఖించుకుంటా రు. ప్రజా ఉద్యమాలు లేకుండా ఇతరుల లిబరల్ ఔట్‌లుక్‌తో రాజ్యాంగంలో ఎన్నో అ«ధికరణలు వచ్చాయి.14వ అధికరణ అన గా చట్టం ముందు అందరూ సమానులే. 17 వ అధికరణ సకల వివక్షల పైన నిషేధం. 16వ అధికరణ ప్రభుత్వోద్యోగాల్లో సమానావకాశాలు. 17వ అధికరణ అంటరానితనంపై నిషేధం.

18వ అధికరణ భావప్రకటనా స్వేచ్ఛ. 21వ అధికరణ వ్యక్తిగత స్వేచ్ఛ. 23 వ అధికరణ బలవంతపు చాకిరీ రద్దు. 24వ అధికరణ 14 ఏళ్ళలోపు పిల్లలను ప్రమాదకరమైన పను ల్లో నియమించడంపై ఆంక్షలు. 39 వ అధికరణ స్త్రీ పురుషులకు సమాన వేతనం, ఆస్తిపై హక్కు. 49వ అధికరణ గౌరవ ప్రదమైన జీవితం. 45వ అధికరణ పిల్లలందరికీ ఉచిత విద్య. 46 వ అధికరణ ప్రత్యేక కమిషన్‌ను నియమించటం. 243 (డి) ద్వారా తరతరాలుగా అణచివేతకు గురైన వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి.

330, 332 అధికరణలు చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించటం. 345 అధికరణం ద్వారా ప్రభుత్వ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఇచ్చిన హామీలు 60 సంవత్సరాలు గడిచినా అమలుకు నోచుకోకపోవటం ఈ దేశంలో అతిపెద్ద విషాదం. రాజకీయమైన సంకల్పం ఉంటేనే సరిపోదు. దానికి కావల్సిన రాజకీయ కల్చర్ కూడా ఉండాలి. ప్రజాస్వామిక సంస్కృతి లేకుంటే ఏళ్ళ తరబడి ఉన్న ఆధిపత్య సంస్కృతే అధికారం చెలాయిస్తుంది. అదే జరిగింది. ఏళ్ల తరబడి ఎదురుచూసీ చూసీ కళ్లు కాయలు కాసినాయి.

తమ కోసం తామే ఉద్యమించక తప్పదని దళితులు ఉద్యమించారు. పాలకుల కళ్ళు తెరిపించారు. కానీ కుల వ్యవస్థ ఆధిపత్యం చాపకింద నీరులాగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం చుట్టూ ఉద్యమకంప మాదిరిగా సమాజం చుట్టూ కులం చుట్టబడింది. నడిచేందుకు సిమెంట్ రోడ్ కనిపిస్తుంది కానీ నడవలేని బాటగా అది మారుతుంది. ఆ విధంగా ఏళ్ళు గడిచాయి.

ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు చెందిన విద్యార్థులే చైతన్యంతో ప్రశ్నించడమే కాదు, ఉద్యమాలు నిర్మించుకున్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. అర్ధ పెట్టుబడిదారీ సమాజంలో ఉద్యమాలు నిర్మించటంలో పేద వర్గాలు ఎన్ని వ్యయప్రయాసలకు గురౌతున్నారో కళ్లారా చూస్తున్నారు. లాకప్‌లో చిత్రహింసలు, ఎన్‌కౌంటర్లకు గురయ్యారు. ఉపవాస దీక్షలు చేశారు. కానీ ప్రభుత్వ చక్రాలకు ఎదురు తిరిగి అడ్డుపడ్డ వారిని అణచటమే తెలుసు కానీ కదలటం మాత్రం ఈ మొద్దు పాలకులకు తెలియదు.

ప్రతి రాజకీయ పార్టీ దళిత గిరిజనులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఉపన్యాసాలు ఇస్తారు. వాగ్దానాలు చేస్తారు. కానీ తరతరాలుగా అనుభవిస్తున్న రాజకీయ తాత్త్విక సాంస్కృతిక ఆధిపత్యం వదులుకోవటానికి మాత్రం సిద్ధపడరు. ఈ రథ చక్రాలను కదిలించటానికై తామే పూనుకుని దళిత శక్తులు ముందుకొచ్చాయి. ఇది ఏ రాజకీయ పార్టీ తలపెట్టలేదు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యం లో రంగారెడ్డి జిల్లాలో బృహత్తర కార్యక్రమం తీసుకుంది. దేవాలయాల్లోకి దళితుల ప్రవేశం కోసం పెనుగులాట జరిగింది. బి.వి.రాఘవులు నేతృత్వంలో సైకిల్ యాత్ర చేయటం జరిగింది. ఆ జిల్లాలో రెండు గ్లాసుల పద్ధతిపై ఉద్యమించటం జరిగింది.

అదే కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో 30 మంది సైకిల్ యాత్ర చేయటం జరిగింది. మా సమస్యలపై మీరు ముందుకు రావాలని దళితులు అన్ని రాజకీయ పార్టీలను కోరారు. ఇందుకు నేనే నాయకత్వం వహిస్తానని తమ్మినేని వీరభద్రం ముందుకు వచ్చారు. 76 రోజులు ఖమ్మం జిల్లాలో సైకిల్‌యాత్ర నిర్వహించా రు.

దళితులకు అండగా నిలిచినా ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు ఈ సైకిల్ యాత్రను సమర్థించారు. ఆయనే ప్రారంభ జెండా వూపారు. జిల్లాలో మొత్తంగా 2291 కిలో మీట ర్లు, 30 మండలాలు, 8 పట్టణాలను సైకిల్ యాత్రలో చుట్టి వచ్చారు. 628 దళిత వాడల గుండా తమ్మినేని దళిత సైకిల్ యాత్ర కొనసాగింది. ఇది మార్పుకు సంకేతం. ఇది కొత్త సంకే తం.

అన్యాయాలు ఇక సాగవని, మా దళిత వాటా మాకిస్తారా? మా వాటాను మేం గుంజుకోమంటారా? అని పెత్తందారీ సమాజాన్ని తమ చైతన్యపు పలుగులతో పొడిచారు. ఇది మహా ఉద్యమమే. అగ్రకుల ఆధిపత్య సమాజం ఇకనైనా మెట్టుదిగి వచ్చి ఆ దళిత చైతన్యాన్ని కౌగిలించుకోవాలి. మాటలు, చేతలు కావాలంటే వేలాది చేతులు కలవాలి. అదే ఆరంభమైంది.

ఈ దళిత ప్రస్థానం కొనసాగాలి. ఆధిపత్య సంస్కృతి కూలిపోవాలి. దళితులు అమాయకులు అనుకుని వారికి కేటాయించిన నిధులను ఇతరత్రాలకు మళ్ళిస్తే వూరుకోమని రాజకీయ నాయకులకు, పాలకులకు ఈ సైకిల్ యాత్ర ఓ హెచ్చరిక చేసింది. దిక్కుమొక్కులేని దళిత జనం ఒక్కసారి గర్జిస్తే ఆధిపత్య కోటలు కూలిపోతాయని చెప్పారు.

దొర గడీలను కూలగొట్టాం. గడీల ముందు పోరుకేకలు పెట్టాం. ఆక్రమించుకున్న దొర గడీలు పగిలి అవి దళితులకు అందుతాయని అనుకున్నాం. ఊరి వెలుపల మూలుగులే మిగిలాయి. ఇప్పుడు దొర గడీలు ఆధునిక ఆధిపత్య కోటలుగా మారిపోయాయి.

దళితులకు కోటా ప్రకారం బియ్యమే మిగిల్చారు. దళితుల వాటా దళితులకు ఇచ్చేంతవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరికగా ఆ దళిత సైకిల్ యాత్ర ముందుకు సాగింది. అదే మరో దళిత మహాప్రస్థానం. అందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు , అది నా నల్గొండ నియోజకవర్గం నుంచే బయలుదేరినందుకు గర్విస్తున్నాను. మనిషి జీవితాలు ఉద్యమాలతో పవిత్రమౌతాయి. మనమందరం పవిత్రులవుదాం రండి. ప్రజా ఉద్యమాలలో పాలు పంచుకుందాం. పదండి ముందుకు....

-చుక్కా రామయ్య
శాసన మండలి సభ్యులు