ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతికి చట్టం అవసరం

హైదరాబాద్‌ (వివి) : షెడ్యూల్డు కులాలు,షెడ్యూల్డు తెగల ఉప ప్రణాళిక (ఎస్‌సిఎస్‌పి) బిల్లును చట్టంగా రూపొందించి ఆ వర్గాలకు నాణ్యమైన ఉన్నతవిద్య అందించాలని, ఆర్థిక సాధికారతకై జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి, అవి దారి మళ్లకుండా పర్యవేక్షక కమిటీలను గ్రామస్థాయిలో పనిచేసేలా చూడాలని వక్తలు ముక్తకంఠంతో ఉద్ఘాటించారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ ఏర్పాటు చేసిన చర్చలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి, ఎస్‌సి, ఎస్‌టి, బిసిల సబ్‌ కమిటీ చైర్మన్‌, జస్టిస్‌ కె.రామస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించారు. దీనికై అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు కలిసి రావాలని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్‌సిఎస్‌పి కేటాయించిన నిధులలో రూ.21వేల కోట్లు ఇతర శాఖలకు దారి మళ్లాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఎస్‌సి సబ్‌ప్లాన్‌ పేర తాను ముసాయిదా బిల్లును రూపొందించి యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీకి అందించానని, ఆమె సూచించినా కేంద్రప్రభుత్వం దానిపై చర్యలు తీసుకోలేదని జస్టిస్‌ రామస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌సిఎస్‌పికి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని, జాతీయ అభివృద్ధి మండలి ఈ వర్గాల అభ్యున్నతినే సూచించినట్లు తెలిపారు. ఈ నిధులను గ్రామస్థాయిలో సద్వినియోగంకై వేసే పర్యవేక్షక కమిటీలో ఎన్‌జిఒలు, స్థానిక నాయకులు అర్హత గల ఇతరులను సభ్యులుగా చేయాలని కోరారు. నిధులు దారిమళ్లినా, సద్వినియోగం కాకపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించి సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఫలితంగా సంబంధిత అధికారులు జవాబుదారీతనంతో పనిచేస్తారని పేర్కొన్నారు. లేకుంటే ప్రభుత్వం బాధ్యత వహించి వారిపై కఠినశిక్ష తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీస్‌ పేర అధికారులపై చర్యలు తీసుకునే వీలుంది తప్ప మంత్రులపై చర్యలు తీసుకోలేమని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంనర్సింహారావు మాట్లాడుతూ, ముసాయిదా బిల్లుకు చట్టబద్ధత కల్పించి నిమ్నవర్గాల అభ్యున్నతికి, ఆర్థిక సాధికారతకు కృషి చేయాలని సూచించారు. రాజ్యాంగపు 21, 46 అధికరణల ప్రకారం ఎస్‌సి, ఎస్‌టిలకు నాణ్యమైన విద్య అందించాలని పేర్కొన్నారని చెప్పారు. సామాజిక న్యాయం జరగాలని చెబుతూ, జస్టిస్‌ రామస్వామి రూపొందించిన ముసాయిదా బిల్లుకు పూర్తి మద్దతు పలికారు. ఎస్‌సిఎస్‌పి నిధుల సద్వినియోగం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి పనిచేయాల్సి ఉందని సూచించారు. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వై.వి.రావు మాట్లాడుతూ, ఉప ప్రణాళిక బిల్లును చట్టం చేయాలని, నోడల్‌ వ్యవస్థ ద్వారా దానిని అమలు చేయాలని కోరారు. దళిత వర్గాల అభివృద్ధికి తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు. ఇదే విషయమై తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు నిరాహారదీక్ష చేశారని గుర్తు చేశారు. దీనికై చేసిన 50 డిమాండ్లలో తొలి డిమాండ్‌ ఎస్‌సిల అభివృద్ధి, ఆర్థిక సాధికారత, సమాజంలో అభివృద్ధే అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ మాట్లాడుతూ, బిల్లుకు రాష్ట్రస్థాయిలో చట్టబద్ధత కల్పిస్తే సరిపోదని కేంద్రస్థాయిలో చట్టబద్ధత అవసరమన్నారు. అన్ని పార్టీల నాయకులు అసెంబ్లీ, పార్లమెంట్‌లో దీనిపై గట్టిగా స్వరాన్ని వినిపించాలని, కొందరు అధికారుల నిర్లక్ష్యంవల్ల నిధుల మళ్లింపు జరుగుతోందన్నారు. బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, దీనిపై ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సామాజిక దోపిడీ, అసమానతలు పోవాలంటే బిల్లుకు చట్టబద్ధత అవసరమన్నారు. ఎస్‌సిల జనాభా 15 నుంచి 18 శాతం, ఎస్‌టిల జనాభా 7 నుంచి 9 శాతానికి పెరిగిందని, దీనికి అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలన్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి కో-కన్వీనర్‌ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ, బిల్లుకు చట్టబద్ధత కల్పించడం ద్వారా నిధుల మళ్లింపు ఆపవచ్చన్నారు. ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతికి కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. సిడిఎస్‌ చైర్మన్‌ డా.సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం మాని సమాజంలో దళితుల అభివృద్ధి, సాధికారతకు తోడ్పడాలని సూచించారు. సిడిఎస్‌కు చెందిన ఆంజనేయులు తదితరులు మాట్లాడారు