న్యూఢిల్లీ : విద్యా హక్కు చట్టం పరిధిలో అంగవైకల్యం కలిగిన పిల్లలను అననుకూల బృందాలుగా పరిగణించాలని పేర్కొంటూ ప్రవేశ పెట్టిన బిల్లును శుక్రవారం రాజ్యసభ ఆమోదం పొందక పోవడంతో మానవ హక్కుల శాఖమంత్రి కపిల్ సిబల్ నిరుత్సాహానికి గురైనట్లు కనిపిస్తున్నది. పిల్లలకు సంబంధించిన ఉచిత, నిర్బంధ విద్యాహక్కు(సవరణ) 2010 బిల్లు శుక్రవారం చర్చించాల్సిన అంశాల జాబితాలో ఉన్నందున కపిల్ సిబల్ దానికి సిద్ధమై వచ్చారు. అయితే సభ ప్రారంభం కావడానికి కొన్ని నిముషాల ముందు ఈ బిల్లును సభలో చర్చించడం లేదని తెలుసుకున్న సిబాల్ నిరుత్సాహానికి గురయ్యారు. కాగా బిల్లు ఆమోదానికి సంబంధించి వామపక్ష సభ్యులు అనుకూలంగా ఉన్నప్పటికీ దీనిపై చర్చించడానికి తగినంత సమయం కావాలని బిజెపి కోరింది. ఈ బిల్లుపై కనీసం నాలుగు గంటలపాటు చర్చ జరగాలని బిజెపి పేర్కొంది. ఆ తరువాత ఈ విషయమై బృందాకారత్ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపిలను తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ నిర్వాహకులు, బిజెపి మొండితనం వలన బిల్లు ఆమోదం పొందలేకపోయిందని ఆమె అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పి.కె. బన్సాల్ సరైన ప్రయత్నం చేయలేదన్నారు. పెన్షన్ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రభుత్వానికి సహకరించిన బిజెపి ఈ విద్యా బిల్లు ఆమోదం పొందడంలో సహకరించలేదన్నారు.