గ్రామాల్లోనూ సభలు నిర్వహిస్తే సమస్యలు పరిష్కారం : మాణిక్యవరప్రసాద్

హైదరాబాద్, మార్చి 26 : అసెంబ్లీ సమావేశాలు ఆరునెలలు హైదరాబాద్‌లోనూ, మరో ఆరునె లలు గ్రామీణ ప్రాంతాల్లోను నిర్వహించాలని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తన సరికొత్త ఆలోచనలతో ముందుకువచ్చారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించవచ్చనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈసందర్భంగా శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఒకసారి తెలంగాణలోని మారుమూల పల్లెల్లో నిర్వహిస్తే, మరోసారి ఆంధ్రా ప్రాంతంలోని ఓ గ్రామంలో, ఇంకోసారి రాయలసీమలోని ఇలా సభలు నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తే బాగుంటదనే తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

దీనిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చిస్తామని, ప్రతిపక్షానికి , ప్రభుత్వానికి లేఖ రాస్తానని మంత్రి పేర్కొన్నారు. సభ నిర్వహణకి పెద్ద భవనాలే అవసరం లేదని, టెంట్ల కింద కూడా నిర్వహించవచ్చని అన్నారు. స్పీకర్, ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయా గ్రామాలకు చేరుకుని ప్రజా సమస్యలను స్వయంగా అడిగి త్వరగా పరిష్కరించ వచ్చని మాణిక్యవరప్రసాద్ అభిప్రాయ పడ్డారు.