- బహిరంగ సభలో రాఘవులు
- విశాల వేదిక నిర్మాణానికి కృషి
- సర్కారు అప్రజాస్వామిక ధోరణులకు నిరసన
భవిష్యత్తులో మరిన్ని అడుగులు ముందుకేయాల్సి ఉంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలకు రూపకల్పన చేయాలని చెప్పారు. ఈ సమస్యలపై ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాబోయే రోజులో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, సంస్థలు, శక్తులు, వ్యక్తులతో కలిపి ఒక విశాల వేదికను నిర్మించడానికి కృషి చేస్తామని చెప్పారు.
రాజకీయ సుడిగుండంలో పార్టీలు
ప్రస్తుతం రాష్ట్ర విభజన, సమైక్యత అనే అంశాల చుట్టూనే రాజకీయ పార్టీలు గిర్రున తిరుగుతున్నాయని చెప్పారు. రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న పార్టీలు రాష్ట్ర విభజన, సమైక్యత అనే సమస్య ఒక్కటే రాష్ట్రంలో ఉన్నట్లు, మిగతా సమస్యలేవీ లేనట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఆ సమస్య పరిష్కారమైతే ప్రజల కడుపులు నిండినట్లు, వారి పిల్లలకు చదువు, వైద్యం, తదితర సౌకర్యాలు అందుతాయన్నట్లు, అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయన్నట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రం ఒక్కటిగా ఉండాలా? లేక విడిపోవాలా? అనే డిమాండ్లపై ప్రతి పార్టీ తన రాజకీయ విధానానికి అనుగుణంగా పోరాడుతూనే ప్రజా సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు తదితర ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఆ విధంగా చేస్తే తమ పార్టీ, ప్రజా సంఘాల తరపున వారికి పూర్తి సంఘీభావం తెలుపుతామని అన్నారు.ప్రజా సమస్యలపై విస్తృత పోరాటాలు సాగాలన్నారు.
అప్రజాస్వామిక ధోరణులు ప్రమాదకరం
ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తున్న ధర్నాలు, ప్రదర్శనలు, బహిరంగ సభల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు పద్ధతుల్లో, పొరపాటు వైఖరితో వ్యవహరిస్తోందని రాఘవులు విమర్శించారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వివిధ సమస్యలపై ధర్నాలు, ఆందోళనలు నిర్వహించిందని గుర్తుచేశారు. అంగన్‌వాడీల చలో హైదరాబాద్ సందర్భంగా పోలీసులు జిల్లాల్లో ఎక్కడికక్కడ కార్యకర్తలు, నాయకులను అరెస్టు చేశారని అన్నారు. వారేమైనా రౌడీలా? ఉగ్రవాదులా? సిఎం కుర్చీని ఊడబెరకడానికి వస్తున్నారా? లేక అసెంబ్లీని కూల్చేసేందుకు వస్తున్నారా? అని ప్రశ్నించారు. మహిళలని కూడా చూడకుండా ఈ విధంగా అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం వ్యవహరించడం అమానుషమన్నారు. కెవిపిఎస్, గిరిజన సంఘం, వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యాన నిర్వహించతలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం విషయంలోనూ ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరించిందని విమర్శించారు. ప్రజా సంఘాల వారెప్పుడైనా, ఎక్కడైనా దౌర్జన్యం చేశారా? అధికారులు, పోలీసుల మీద దాడులేమైనా చేశారా? ఆస్తులేమైనా ధ్వంసం చేశారా? అని ప్రశ్నించారు. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతుల్లో, అపహాస్యం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమన్నారు.ఇది ప్రజాతంత్ర ఉద్యమాలకు తీవ్ర హాని కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం ఈ విధంగా ప్రజాస్వామ్యం మీద దాడిచేస్తే సహించబోమంటూ ప్రజలు గళమెత్తాలని పిలుపునిచ్చారు. ప్రజాతంత్ర వాదులంతా ముక్త కంఠంతో నిరసించాలని కోరారు. ప్రజా ఉద్యమాలను అణచివేస్తే అవి తారాజువ్వలా ఎగిరిపడతాయని రాఘవులు హెచ్చరించారు. జిల్లాల్లో పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, సర్వేలు, అధ్యయనాలు సాగించిన ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, పేదల పట్టుదల, కృషి వల్లనే ఈ పోరాటం విజయవంతమైందని అన్నారు. ఈ సందర్భంగా వారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. దీక్షకు సంఘీభావం తెలిపిన పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులందరికీ ధన్యవాదాలు తెలిపారు