తల్లి బాధ్యత కొడుకులదే....

తల్లి బాధ్యత కొడుకులదే....సూర్య దిన పత్రిక సౌజన్యముతో 
నాకు నలుగురు కుమారులు. నలుగురు కుమార్తెలు. నా వయస్సు 65 సంలు. నా భర్త మరణించాడు. కొడుకులు, కూతుళ్ళు అందరి పెళ్ళిళ్ళూ అయిపోయాయి. అందరూ నా భర్త సంపాదన మొత్తం పంచుకోవాలని వేరు పడిపోయారు. ఇప్పుడు నా బాధ్యత ఎవరూ తీసుకోవడం లేదు. ఊళ్ళో పెద్దలు ఏమీ చెప్పడం లేదు. ఇప్పుడు నేను ఎలా బతకాలో తెలియడం లేదు. దీనికి పరిష్కారం చెప్పండి?
- జయమ్మ, వనపర్తి

law-img అమ్మా! నీకు నీ కొడుకుల సంపాదనలో కొంత మనోవర్తి అడిగే అధికారం ఉంది. కనుక దగ్గరలోని ఒక న్యాయవాదిని కలిసి నీ కొడుకుల (నలుగురు) మీద మనోవర్తి కింద ఐపిసి 125 ప్రకారం గాని లేదా గృహ హింస మహిళల రక్షణ చట్టం 2005 కింద గాని కేసు పెట్టవచ్చు. ఇది నలుగురి మీద గాని లేక ఏ ఒక్కరి పైన గాని పెట్టవచ్చు. నీకు తిండి, బట్ట, నివాస గృహం, వైద్య సౌకర్యాలు తప్పనిసరిగా కోర్టు ద్వారా రాబట్టుకొనే అధికారం చట్ట ప్రకారం ఉంది.
***
నాకు 1989లో వివాహం అయింది. నాకు ముగ్గురు కొడుకులు కలిగారు. 2008లో నా భార్య పక్కింటివానితో పరిచయమేర్పరచుకుంది. నాటి నుండి నన్ను, నా పిల్లలను మానసికంగా, ఆర్థికంగా, అన్ని విధాలా ఇబ్బందులు పెడుతోంది. తర్వాత నా భార్య గర్భవతి అయింది. తాను పక్కింటి అబ్బాయిని ప్రేమించానని, అతన్ని వివాహం చేసుకున్నానని బంధువులకు చెప్పింది. ఒక గుళ్ళో పూజారి సమక్షంలో పెళ్ళి జరిగిందని చెప్తోంది. తర్వాత చెప్పకుండా పక్కింటి అతనితో వెళ్ళిపోయింది. పిల్లలను నా దగ్గరే వదిలిపోయారు. తర్వాత ఆయనకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇప్పుడు నా పై వరకట్న కేసు, గృహ హింస కేసు, మనోవర్తి కోసం కేసులు పెట్టింది. దీనికి పరిష్కారం చెప్పండి.
- కృష్ణారావు, హైదరాబాద్‌

నీ భార్యకు పక్కింటి అబ్బాయితో వివాహేతర సంబంధం ఉన్నట్టు చెప్తున్నారు. కానీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? వివాహేతర సంబంధం ఉన్నట్టు చట్టానికి ఆధారాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవి లేకపోతే నీవు ఏమీ చేయలేవు. కనుక వెంటనే ఒక పోలీసు కేసు పెట్టండి. అప్పుడు పోలీసు వారు విచారణ జరిపి సాక్షాలతో విచారణ రిపోర్టు తయారు చేస్తారు. దీని ఆధారంతో నీ బార్యపై చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నీ భార్య పక్కింటి అబ్బాయిని గుళ్ళో వివాహం చేసుకుంది అన్నందున ఆ ఆలయ కమిటీ నుంచి లేఖ తీసుకోండి. అంతేకాక పక్కింటి అబ్బాయితో వివాహేతర సంబంధం కారణంగా కన్న పిల్లల పుట్టిన సర్టిఫికెట్‌ తీసుకోగలరు. అదే విధంగా మీ భార్య‚ పక్కింటి అతనితో దిగిన ఫోటోల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తూ మీ దగ్గరలోని న్యాయవాది ద్వారా కేసు పెట్టగలరు. వీటి ఆధారాలతో నీపై పెట్టిన కేసులు నిర్వీర్యం అయ్యి నీకు న్యాయం జరుగుతుంది.
***
నేను 1998వ సంలో ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను. నాది ఎస్సీ కులం, నా భర్త బ్రాహ్మణుడు. నాతో వివాహా న్ని నా భర్త తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఇందువల్ల మేమిద్దరం ఇంతకాలం పక్కనే కలదిండిలో నివాసం ఉంటూ ప్రైవేటు పనులు చేసుకొని బతుకుతున్నాము. మాకు ముగ్గురు పిల్లలు కలిగారు. ఇప్పుడు మా అత్తమామలు తమకు గల ఎనిమిది ఎకరాల పొలాన్ని అమ్ముతున్నారు. ఆ విషయంలో తన వాటా గురించి నా భర్త ప్రశ్నించగా, నీ భార్య ను, పిల్లలను వదిలి వస్తేనే భాగం ఇస్తాము లేకపోతే ఒక్క పైసా కూడా ఇవ్వం అని భయపెడుతున్నారు. దీనికి పరిష్కారం చెప్పండి.
- శ్రీదేవి, కృష్ణాజిల్లా

నీకు కులాంతర వివాహం చేసుకున్నంత మా త్రాన ఆస్తి మీకు రాకుండా పోదు. మీరిద్దరూ రిజిస్టర్డ్‌ వివాహం చేసుకున్నారా లేక గుళ్ళోనా అనే విషయం చెప్పలేదు. ఏది ఏమైనా నీవు నీ భర్త కలిసి దిగిన ఫోటోలు, పెళ్ళి కార్డు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇవి మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి. అవి మాత్రమే ఆధారాలు కాగలవు. లేకపోతే సమస్యలు వస్తాయి. వాటి ఆధారంతో నీ భర్త ద్వారా నీకు దగ్గరలో గల న్యాయవాదిని కలిసి పార్టీషన్‌ కోసం కోర్టులో కేసు వేయగలరు. తప్పక మీకు న్యాయం జరుగుతుంది.
bala-bhramachari