ధర్మభిక్షం కన్నుమూత

  • నేడు సూర్యాపేటలో అంత్యక్రియలు
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సిపిఐ మాజీ ఎంపి బొమ్మగాని ధర్మభిక్షం(90) శనివారం కన్నుమూశారు. అవిశ్రాంత పోరాటయోధునిగా, నిత్యం నిరుపేదల గురించి తపించేవ్యక్తిగా ఆయన మన్ననలందారు. గత నెల రోజులుగా నగరంలోని కామినేని ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారు. కుడికాలి తుంటికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. చికిత్స పొందుతున్న సమయంలో శ్వాసకోశంలో నీరు చేరడంతో ఆరోగ్యం క్షీణించిందని, సమయం గడిస్తేగానీ తామేమీ చెప్పలేమని వైద్యబృందం అప్పుడే తెలిపింది. ఆసుపత్రిలోనే వైద్యం పొందుతూ, ఆ తరువాత కొంత కోలుకున్నట్లు అనిపించినా, శనివారం ఆరోగ్యం క్షీణించడంతో పరిస్థితి చేయిదాటినట్లు డాక్టర్లు వెల్లడించారు. 2008లో ఇలాగే జారిపడడంతో ఎడమకాలి తుంటికి అపరేషన్‌ జరిగింది. ధర్మభిక్షం మరణవార్త తెలిసిన వెంటనే ఆయన బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. బంధువులతో పాటు సిపిఐ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు,అభిమానులు కామినేని ఆసుపత్రికి వందలాదిగా తరలివచ్చారు. కష్ట జీవుల కోసం పనిచేశారు
సిపిఎం రాష్ట్ర కమిటీ సంతాపం
సిపిఐ నాయకులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, మాజీ పార్లమెంటు సభ్యులు బొమ్మగాని ధర్మభిక్షం మృతిపట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. కష్ట జీవుల కోసం పనిచేసిన ఆయనకు జోహార్లర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండే అభ్యుదయ సాహిత్యం పట్ల ఆకర్షితులైన ధర్మభిక్షం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. ఆంధ్ర మహాసభ కార్యకర్తగా పనిచేస్తూ రహస్య జీవితాన్ని, జైలు జీవితాన్ని అనుభవించారని వివరించారు. నల్లగొండ జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు.
సిపిఐ జాతీయ సమితి సంతాపం
తెలంగాణ సాయుధ పోరాట యోధులు, స్వాతంత్య్ర సమరయోధులు బొమ్మగాని ధర్మభిక్షం మరణం పట్ల సిపిఐ జాతీయ సమితి తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దాలకు వ్యతిరేకంగా ధర్మభిక్షం పోరాడారని తెలిపింది. వెట్టి చాకిరీ నిర్మూలనకు ఆయన ఎంతగానో కృషి చేశారని పేర్కొంది. గీత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ఆయన అనేక పోరాటాలు నిర్వహించారని సిపిఐ జాతీయ సమితి తెలిపింది. పార్లమెంటు సభ్యునిగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పార్లమెంటు లోపల,వెలుపలా అనేక పోరాటాలు నిర్వహించారని సిపిఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పేర్కొన్నారు.
ప్రముఖుల నివాళి
ధర్మభిక్షం మరణవార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.రామకృష్ణ, పల్లా వెంకటరెడ్డి, సిపిఎం శాసనసభాపక్ష మాజీ నేత నోముల నర్సింహయ్య, విశాలాంధ్ర రెసిడెంట్‌ ఎడిటర్‌ కె.శ్రీనివాసరెడ్డి తదితరులు ధర్మభిక్షం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.