వికీలీక్స్‌

యుపిఏ ప్రభుత్వాన్నే కాదు బిజెపీని కూడా సత్యపీఠం ఎక్కించింది వికీలీక్స్‌. అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన కేబుళ్లను అది బయటపెట్టడంతో మన్మోహన్‌ ప్రభుత్వానికి గుక్క తిప్ప్పుకోలేకుండా అయింది. ఇదంతా వచ్చే ఎన్నికల్లో తనకు కలిసివస్తుందనుకున్న బిజెపి నెత్తిన కూడా తాటికాయ పడినంత పనైయింది. ప్రముఖ రాజకీయ నాయకులతో అమెరికా దౌత్యవేత్తలు జరిపిన సంభాషణల కేబుళ్లను కూడా వికీలీక్స్‌ బయట పెట్టింది. కాంగ్రెస్‌తోపాటు బిజెపీనీ ఫిక్స్‌ చేసింది. ఇలాంటి తప్పుడు పద్ధతులకు, రెండు నాల్కల విధానానికి సిపిఎం అతీతమని వికీలీక్స్‌ కేబుళ్లు వెల్లడించాయి. అమెరికా నుంచి అణుఒప్పందాల వరకు బయటేమి చెబుతున్నారో అమెరికా అధికారులు భేటీ అయినపుడు అంతరంగికంగా అదే చెప్పారని ప్రకాష్‌ కరత్‌తో చేసిన సంభాషణల గురించి వెల్లడించిన వికీలీక్స్‌ పత్రాలు సుస్పష్టం చేశాయి. ఇంతవరకు వెల్లడైన అంశాలు మన దేశ పాలకవర్గ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌, బిజెపిలకు ఏ మాత్రం విశ్వసనీయత లేదన్నది వెల్లడించాయి. అధికారం నిలుపుకోవటం సంతలో పశువుల్లా పార్లమెంట్‌ సభ్యులనే కొనుగోలు చేయటానికి కాంగ్రెస్‌ వెనుకాడదు. ఓటుకు నోటు ఉదంతంపై వికీలీక్స్‌ వెల్లడించిన సమాచారంతో గుక్కతిప్పుకోలేకపోయిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అదంతా అయిపోయిందని, దానిపై చర్చ తరువాత ఓటర్లు ఇచ్చిన తీర్పు తమకు అనుకూలంగా ఉందని చెప్పుకున్నతీరు పెద్దమనిషిగా పేరున్న వ్యక్తి స్థాయిని దిగజార్చేదే తప్ప పెంచేదికాదు. అదే ప్రాతిపదిక అయితే బాబ్రీ మసీదును కూల్చిన బిజెపి ఆ తరువాతే ఎన్నికలలో గెల్చింది కనుక జనం మసీదును కూల్చేందుకు అంగీకరించారంటే కుదురుతుందా? ఓట్లు తద్వారా సీట్లతో అధికారం కోసం బిజెపి కుహనా హిందూ జాతీయవాదాన్ని నిరంతరం రెచ్చగొడుతుంది. ఆ ముసుగులో హిందూ ముస్లిం విభేదాలను పురికొల్పుతుంది. జనాన్ని మభ్యపెట్టటం కోసమే కాంగ్రెస్‌ అనుసరించిన విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు ఫోజు పెడుతుంది. భారత్‌లో అమెరికా అనుకూల వాతావరణాన్ని, రాజకీయ పునాదిని కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆ పార్టీ నాయకులు సలహాలు ఇస్తారని వెల్లడైంది. బిజెపి అంతరంగాన్ని వెల్లడించిన వారు చిన్నా చితకా నాయకులు కాదు. అద్వానీ తరువాత అగ్రపీఠం కోసం పోటీపడుతున్నవారిలో ఒకరైన అరుణ్‌ జైట్లీ హిందూత్వం ఓట్ల కోసం ముందుకు తెచ్చిన ఒక అవకాశవాదం అని, దానిపై బిజెపి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుందని జైట్లీ తనతో చెప్పారన్నది అమెరికా దౌత్యవేత్త రాబర్ట్‌బ్లేక్‌ నివేదిక సారాంశం. పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి, బంగ్లాదేశ్‌ నుంచి వలసల వంటి ఉదంతాలలో హిందూత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు పోగేసుకొనేందుకు బిజెపి ప్రయత్నించినట్లు జైెట్లీ మాటల తీరుతెన్నులు స్పష్టం చేశాయి. భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు శేషాద్రిచారి మేము చేసే తీర్మానాలు ముఖ్యంగా విదేశాంగ విధానం, అదీ అమెరికా గురించి అంత తీవ్రంగా పట్టించుకోవద్దు యుపిఏపై రాజకీయంగా పైచేయి సాధించటానికి అలాంటివి చేస్తుంటామని చెప్పినట్లు ఒక పత్రం వెల్లడించింది. తాము అధికారంలోకి వస్తే విదేశాంగ విధానం, అణుఒప్పందాల గురించి సమీక్షిస్తామని బిజెపి చెప్పింది. అయితే అలాంటిదేమీ ఉండదు, అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తాం, మరింత పటిష్ట పరుస్తాం అని ఉక్కుమనిషిగా భుజకీర్తులు తొడిగిన అద్వానీ సైతం అమెరికన్‌ దౌత్యవేత్తల ముందు వివరణిచ్చుకున్నాడంటే ఆ పార్టీ విశ్వసనీయత గురించి ఇంక చెప్పాల్సిందేముంది? బిజెపి నాయకుడు నరేంద్రమోడీకి అమెరికా వీసా నివారించటమేమిటో తనకు అంతుబట్టడం లేదని అరుణ్‌ జైెట్లీ బ్లేక్‌ వద్ద వాపోయాడు. ఇక్కడ మోడీ వీసా సమస్య కంటే తాము ఎంత విధేయులుగా ఉన్నా ఇలా వ్యవహరించటం ఏమిటని అమెరికాతో సంబంధాల కోసం బిజెపి పడిన ఆందోళనను అర్ధం చేసుకోవటం ముఖ్యం. ఒక్క విదేశాంగ విధానమే కాదు ఆర్థిక విధానాలపై దాని వ్యతిరేకత కూడా ఒక నాటకమే. వ్యాట్‌పై బిజెపి పాలిత రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేయటం కూడా సంకుచిత రాజకీయ లాభనష్టాలలో భాగమే అని, న్యాయసేవల రంగాన్ని కూడా విదేశీ పోటీకి అనుమతించాలని జైట్లీ స్పష్టం చేశాడు.మరో ముఖ్యనాయకుడు జస్వంత్‌ సింగ్‌ కూడా అమెరికా దౌత్యవేత్త స్ట్రాబ్‌ టాల్బోట్‌, బర్న్‌తో అనేక విషయాలు చెప్పాడు. తాము అమెరికాతో సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నప్పటికీ అందుకోసం దేశంలో రాజకీయ లబ్దిని పోగొట్టుకోలేమని, దానికే తొలి ప్రాధాన్యత ఇస్తామని పూసగుచ్చినట్లు వివరించాడని మరో పత్రం వెల్లడించింది. అంతేకాదు కమ్యూనిస్టుల మద్దతుపై యుపిఏ ఆధారపడినంత కాలం యుపిఏ ఏమీ చేయలేదని,తిరిగి ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చేంతవరకు దేశంలో నాటకీయ పరిణామాలేవీ జరగవన్నాడు.(ఈ సంభాషణలు 2005లో జరిగాయి) అంతేకాదు అణుసమస్యపై తొందరపాటుతో వ్యవహరించకుండా ముందు బలమైన రాజకీయ పునాదిని ఏర్పాటు చేసుకొనే వరకు ఆగాలని కూడా అమెరికాకు సలహా ఇచ్చాడు. ఈ పూర్వరంగంలో అమెరికాతో ఒప్పందం కోసమే కమ్యూనిస్టుల మద్దతును వదులుకొని నోట్లతో సహా అనేక ప్రలోభాలతో చిన్నా చితకా పార్టీలను కూడగట్టుకొని మన్మోహన్‌సింగ్‌ సర్కార్‌ వ్యవహరించిందన్నది స్పష్టం. మరోసారి దేశంలో కమ్యూనిస్టుల ప్రమేయంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడకుండా ఉండాలంటే అసలు కమ్యూనిస్టులనే ఓడిస్తే పోతుందనే ఆలోచనతోనే పశ్చిమ బెంగాల్‌, కేరళల్లో సిపిఎంను దెబ్బతీసేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అన్నిరకాల సిపిఎం వ్యతిరేకశక్తులను ఏకం చేసేందుకు అది పూనుకుందన్నది గమనించాలి.